• facebook
  • whatsapp
  • telegram

కాస్త దృష్టి పెడితే కానిస్టేబుల్ కొలువు ఖాయం!

తెలంగాణ‌లో 19,449 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

జులైలో నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం


రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దాదాపు 19,858 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో 19,449 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. వీటిలో 7,700 సివిల్, 6,680 ఏఆర్, తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం (టి.ఎస్.ఎస్.పి.)లో 3,850, 15వ బెటాలియన్లో 560, కమ్యూనికేషన్స్ విభాగంలో 250 ఖాళీల‌ భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్రంలోని ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 

స‌మాజంలో నేరాల నియంత్రణ ప్రభుత్వాల నిరంతర బాధ్యత. ఇందుకోసం ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి నియామకాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల పోలీసు పరిశోధన అభివృద్ధి మండలి వెల్లడించిన నివేదిక ప్రకారం తెలంగాణలో సుమారు 29 వేల ఖాళీలు పోలీస్ శాఖలో ఉన్నాయి. వాటిలో 23 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులు. అయితే తాజాగా 19,449 కానిస్టేబుళ్ల భ‌ర్తీకి జులైలో ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. అభ్యర్థులు సంబంధిత పరీక్ష తీరు, సిలబస్, ప్రిపరేషన్ విధానంపై అవగాహన పెంచుకొని ఇప్పటి నుంచే సిద్ధం అయితే విజయాన్ని సులువగా చేజిక్కించుకోవచ్చు. ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పరీక్ష విధానం, ఇతర వివరాలను  తెలుసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పూర్తి వివరాలను మరోసారి పరిశీలించుకొని ప్రణాళికలో తగిన మార్పులు చేసుకోవాలి. 

ఎలాంటి అర్హతలు ఉండాలి?

కానిస్టేబుల్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఇంట‌ర్మీడియ‌ట్ / త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించాలి. వ‌య‌సు 18 నుంచి 22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. కొన్ని పోస్టుల‌కు 18 నుంచి 30 ఏళ్ల వ‌య‌సు ఉంది. రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా వ‌యసు పరిమితి స‌డ‌లింపు ఉంటుంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎత్తు, బ‌రువుతో పాటు కంటి చూపు మెరుగ్గా ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగంలో సివిల్‌, ఆర్ముడ్ రిజ‌ర్వు, ఎస్ఏఆర్ సీపీఎల్‌, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్‌, తదితర కేట‌గిరీలున్నాయి. వీటిని బ‌ట్టి నిబంధ‌న‌ల్లో మార్పులుంటాయి. అన్ని కేట‌గిరీల్లోనూ మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్లు ఉన్నాయి. 

పరీక్ష విధానం ఏమిటి?

అభ్య‌ర్థులను ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత‌ప‌రీక్షల‌‌తో పాటు, శ‌రీర కొల‌త‌లు, దేహ‌దారుఢ్య‌‌, వైద్య ప‌రీక్ష‌ల ద్వారా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులంద‌రికీ మొద‌ట 200 మార్కుల‌కు ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష ఉంటుంది. ప‌రీక్షా స‌మ‌యం మూడు గంట‌లు ఇస్తారు. ఓసీ అభ్య‌ర్థులు 40, బీసీలు 35, ఎస్సీ/ ఎస్టీ/ మాజీ ఉద్యోగులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇందులో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులకు శ‌రీర‌ కొలత‌ల ప‌రీక్ష‌లు ఉంటాయి. ఇక్క‌డ ‌అభ్యర్థుల ఎత్తు, బరువు, శ్వాస పీల్చినప్పుడు ఛాతి వైశాల్యం పెంపు వంటివి ప్రమాణాల ప్రకారం ఉన్నాయా? లేదా అనేది పరీక్షిస్తారు. అనంత‌రం అర్హులైన వారికే దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ మార్కుల‌తో పాటు వీటిని తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. వీటిలో అర్హ‌త సాధించిన వారికి మెయిన్స్ ప‌రీక్ష ఉంటుంది. దీన్ని ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టును బ‌ట్టి 100, 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత‌ప‌రీక్ష‌ల‌కు సిల‌బ‌స్ ఒకే విధంగా ఉంటుంది.

ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉండాలి?

నోటిఫికేష‌న్ ఎప్పుడు విడుద‌లైనా ప‌రీక్ష‌లో విజ‌యం సాధించేలా ఉండాలి. ఇది ప్ర‌ణాళిక ప్ర‌కారం ప్రిపేర‌యితేనే సాధ్య‌మ‌వుతుంది. రాత‌ప‌రీక్ష‌, దేహ‌దార్ఢ్య ప‌రీక్ష‌ల రెండింటిలోనూ అల‌స‌త్వం వ‌హించ‌కూడదు. శారీరక సామర్థ్య పరీక్షల తర్వాత మెయిన్స్‌పరీక్షకు సమయం తక్కువగా ఉంటుంది. అందువ‌ల్ల రాత పరీక్షకు నోటిఫికేష‌న్ రాక‌ముందు నుంచే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్ప‌టి నుంచే సిల‌బ‌స్ ప్ర‌కారం స‌బ్జెక్టుల వారీగా పూర్తి అవ‌గాహ‌న పెంచుకుంటే మంచిది. దీంతో నోటిఫికేష‌న్ వ‌చ్చాక ప్రిప‌రేష‌న్ సులువ‌వుతుంది. గ‌త ప‌రీక్ష‌ల న‌మూనా, మాదిరి ప్ర‌శ్న‌ప‌త్రాలను ప్రాక్టీస్ చేయ‌డం ద్వారా ప్ర‌శ్న‌ల స‌ర‌ళిపై అవ‌గాహ‌న వ‌స్తుంది.    

పోటీపై ముందస్తు అంచనా

తెలంగాణ ప్ర‌భుత్వం 2016, 2018 సంవ‌త్స‌రాల్లో సుమారు 26,500 కానిస్టేబుళ్ల ఖాళీల‌ను స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భ‌ర్తీ చేసింది. ఈ పోస్టుల‌కు ల‌క్ష‌ల్లో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఒక పోస్టుకు వేల సంఖ్య‌లో అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. దీన్నిబ‌ట్టి చూస్తే పోటీ ఎలా ఉందో మీకు అర్థ‌మ‌వుతుంది. ఈసారి ఆ పోటీ ఇంకా ఎక్కువగా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. ఈకాలంలో మొక్కుబ‌డిగా చ‌దివి ప్ర‌భుత్వ‌ ఉద్యోగం సాధించ‌డం చాలా క‌ష్టం. అది ఎప్ప‌టికీ నెర‌వేరని క‌ల‌గానే మిగిలిపోతుంది. శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల‌తో ఇప్పటి నుంచి కృషి చేస్తేనే ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లుగుతారు.

దేహ‌దారుఢ్య‌పరీక్షకు సంసిద్ధత ఎలా?

దేహ‌దారుఢ్య ప‌రీక్ష‌లో 100 మీట‌ర్ల ప‌రుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, 800 మీట‌ర్ల ప‌రుగు పోటీలు ఉంటాయి. ఈ ఐదింటిలో అభ్య‌ర్థులు నిర్ణీత స‌మ‌యంలో 800 మీట‌ర్ల ప‌రుగుతోపాటు ఏమైనా రెండు నెగ్గాలి. ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టులు, పురుషులు, మ‌హిళ‌లు, మాజీ సైనికుల‌కు దేహ‌దార్ఢ్య ‌ప‌రీక్ష‌లు వేరుగా ఉంటాయి. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో నెగ్గిన వెంట‌నే శారీర‌క సామ‌ర్థ్య ప‌రీక్ష‌ల‌కు కొంచెం స‌మ‌యం ఎక్కువ కేటాయించాలి. రోజూ ఉద‌యం, సాయం‌త్రం ప్రాక్టీస్ చేయాలి. ప‌రీక్ష‌లో కేటాయించే స‌మయం కంటే త‌క్కువ స‌మ‌యంలో వీటిని పూర్తి చేసేలా స‌న్న‌ద్ధం అయితేనే తుది ద‌శ‌లో ల‌క్ష్యాన్ని సులువుగా చేరుకోగ‌ల‌రు.

ఎలా ప్రిపేర్ అవ్వాలి?

ప్రిలిమ్స్, మెయిన్స్ రాత‌ప‌రీక్ష‌ల్లో సిల‌బ‌స్ ఒక‌టే ఉంటుంది. ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయికి సంబంధించిన అబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఇంగ్లిష్‌, అర్థ‌మెటిక్‌, జ‌న‌ర‌ల్ సైన్స్‌, భార‌త‌దేశ చ‌రిత్ర‌, సంస్కృతి, స్వాతంత్య్ర‌సంగ్రామం, భార‌త భౌగోళిక శాస్త్రం, పాలిటీ, ఆర్థిక వ్య‌వ‌స్థ‌, జాతీయ‌, అంత‌ర్జాతీయ వ‌ర్త‌మానాంశాలు, రీజ‌నింగ్, మెంట‌ల్ ఎబిలిటీ స‌బ్జెక్టుల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి. అర్థ‌మెటిక్‌, రీజ‌నింగ్‌, మెంట‌ల్ ఎబిలిటీపై ఏకాగ్ర‌త చాలా అవ‌స‌రం. త‌క్కువ స‌మ‌యంలో స‌మాధానం రాబ‌ట్ట‌గ‌ల‌గాలి. నిరంత‌ర సాధ‌న‌తోనే అది సాధ్య‌మ‌వుతుంది. ఇంగ్లిష్ స‌బ్జెక్టులో మార్కుల రాబ‌ట్టాలంటే రోజూ ఇంగ్లిష్ దిన‌ప‌త్రిక‌ను చ‌దివి వాక్యాల‌ను అర్థం చేసుకోవాలి. మిగ‌తా స‌బ్జెక్టుల‌ను ప్ర‌ణాళిక ప్ర‌కారం అధ్య‌య‌నం చేయాలి. నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌ర్వాత అంత‌కు ముందు ఆరు నెల‌ల వ‌ర్త‌మానాంశాల‌పై ప‌ట్టు సాధించాలి. 

నోటిఫికేష‌న్‌కు సంబంధించిన వివ‌రాలు, అప్‌డేట్ల కోసం www.eenadupratibha.net, https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ను ప‌రిశీలిస్తూ ఉండాలి.  2018లో తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో వివిధ పోస్టుల‌కు చెందిన క‌టాఫ్ మార్కుల‌ను కింద ఇచ్చిన లింకుల ద్వారా చూడ‌వ‌చ్చు. 

సివిల్‌

ఆర్ముడ్ రిజ‌ర్వుడ్‌

టీఎస్ఎస్పీ

ఫైర్‌మెన్ కానిస్టేబుల్ 

వార్డ‌ర్స్ (పురుషులు)

Posted Date : 16-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌