• facebook
  • whatsapp
  • telegram

త‌క్కువ విద్యార్హతతో మెరుగైన‌ కొలువు

త‌క్కువ‌ విద్యార్హతలతో కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో కుదురుకునే అరుదైన అవకాశం ఇది. ప్రశ్నపత్రం తీరుతెన్నులను మూలాల నుంచి అవగాహన చేసుకొని, తగిన ప్రణాళికతో సన్నద్ధమైతేనే పోటీని దాటి గమ్యం చేరుకోగలుగుతారు.

రైల్వే బడ్జెట్‌లో భద్రతకే తొలి ప్రాధాన్యం. రోజూ దేశం నలుమూలలకు ప్రయాణించే రెండున్నర కోట్లమంది ప్రయాణికుల భద్రతకు అన్ని రైళ్లలో సీసీ కెమెరాలు, రైలు భద్రత, ప్రమాద హెచ్చరిక వ్యవస్థతోపాటు 18 వేల కి.మీ. మేర రెండు, మూడు, నాలుగు లైన్లు కొత్తగా వేయడం, సిబ్బంది లేని దాదాపు నాలుగు వేల రైల్వే క్రాసింగ్‌ గేట్లను తొలగించడం, 12 వేల కొత్త వేగన్లు (సరకు రవాణాకు), 5 వేల కొత్త కోచ్‌లు, 700 నూతన రైలు ఇంజిన్లు రాబోవటం తదితర పరిణామాల నేపథ్యంలో రైల్వే శాఖకు పెద్దఎత్తున మానవ వనరులు అవసరమయ్యాయి. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద నియామక ప్రక్రియకు తెర తీశారు.

ఉద్యోగ విధులే ప్రశ్నపత్రానికి మూలం 
ఉద్యోగం వేరూ, దాని ఎంపిక పరీక్ష వేరూ కాదు. చేసే ఉద్యోగ బాధ్యతల రీత్యానే సిలబస్‌ రూపకల్పన ఉంటుంది. కొందరు అభ్యర్థులు పరీక్ష పాసైతేనే కదా చేసే ఉద్యోగం గురించి తెలుసుకోవాల్సింది అనుకుంటారు. చురుకైన ఇంకొందరు ఉద్యోగ బాధ్యతలను ముందే తెలుసుకుంటారు. ఆ కోణం నుంచే సిలబస్‌ను వీక్షిస్తారు. దీనివల్ల పరీక్షకు సన్నద్ధత సులభతరం అవుతుంది. విజయావకాశాలు మెరుగవుతాయి. అందుకే రైల్వే శాఖ ప్రకటించిన పోస్టుల గురించి కొంతైనా తెలుసుకోవాలి.

అసిస్టెంట్‌ లోకోపైలట్‌ ఉద్యోగం అంటే రైలు ఇంజిన్‌ చోదకుని (డ్రైవర్‌) కొలువు. తొలుత రైలు ఇంజిన్‌ డ్రైవర్‌కు సహాయకుడిగా విధులు నిర్వర్తించాలి. ఎంపికైన తరువాత వరంగల్‌ సమీపంలోని కాజీపేటలోనూ ఆపై హైదరాబాద్‌ సమీపంలోని మౌలాలిలో థియరీ, ప్రాక్టికల్‌ శిక్షణ ఇస్తారు. ఆపై సరకు రవాణా చేసే గూడ్స్‌ ఇంజిన్‌పై అసిస్టెంట్‌ డ్రైవర్‌గా నియమిస్తారు. ఎప్పటికప్పుడు పనితీరును పరిశీలిస్తూ ప్రయాణికులను చేరవేసే రైలు, ఆపై సూపర్‌ఫాస్ట్‌ రైళ్లపై అవకాశం కల్పిస్తారు. దీనికి అనుగుణంగానే అసిస్టెంట్‌ లోకోపైలట్‌ నుంచి చీఫ్‌ లోకోపైలట్‌ వరకు అంచెలంచెలుగా ఎదగవచ్చు. అసిస్టెంట్‌ లోకోపైలట్‌గా చేరగానే ప్రారంభవేతనం, జీతభత్యాలు కలుపుకుని చేతికి రూ.40,000 వరకు అందుతుంది. రైలు ఇంజిన్‌ చోదకుడిగా సిగ్నలింగ్‌ వ్యవస్థను అర్థం చేసుకోవడం, దానిని అప్రమత్తంగా అనుసరిస్తుండటం, రైలు వేగ నియంత్రణ.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ రైలును సురక్షితంగా గమ్యానికి చేర్చడమే ఈ ఉద్యోగి ప్రధాన విధి.

గ్రూప్‌-సి ఉద్యోగాలన్నింటినీ సహాయకులు (హెల్పర్స్‌) అని పేర్కొంటూ వారు ఏయే విభాగాల్లో పనిచేయాలో నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. ఉదాహరణకు- పాయింట్‌మన్‌ అన్న పోస్టుకి ఎంపికైతే స్టేషన్‌లో రైలు బయలుదేరడానికి ముందు చక్రాల స్థితి, రెండు కోచ్‌ల మధ్య అనుసంధానం పరీక్షించి ఆపై ప్లాట్‌ఫారంపై నిలబడి పచ్చజెండా ఊపడం వీరి విధి. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే పదోన్నతులు పొందుతూ అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ వరకు ఎదగవచ్చు. ఇందుకు శాఖాపరమైన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గ్రూప్‌-సిలో అన్ని పోస్టులకు మూల వేతనం రూ.18,000.

మరో ఉద్యోగం ట్రాక్‌మన్‌. పేరులోనే సూచిస్తున్నట్లు ఒక్కో ఉద్యోగికి 6 కి.మీ. మేర రైలు పట్టాల పర్యవేక్షణ బాధ్యత ఇస్తారు. పాతిక కిలోల టూల్‌కిట్‌ బ్యాగ్‌తోసహా రైలు పట్టాల వెంట పరిశీలిస్తూ ఏదైనా అవాంతరం గుర్తిస్తే చీఫ్‌ పర్మనెంట్‌ వే ఇన్‌స్పెక్టర్‌కు తక్షణం సమాచారం ఇవ్వాలి. ఇలా ట్రాక్‌ మెయింటనర్‌ ఉద్యోగంలో చేరి పనితీరు, అంతర్గత పరీక్షలు రాసుకుంటూ జూనియర్‌ ఇంజినీర్‌ (పర్మినెంట్‌ వే ఇన్‌స్పెక్టర్‌) స్థాయి వరకూ చేరుకోవచ్చు. ప్రారంభ వేతనం రూ.20,000. ఇలా వీటితోపాటు ప్రకటించిన పోస్టులు హెల్పర్‌ ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, టెలికాం, సిగ్నలింగ్‌ విభాగాల్లో సహాయక విధులు నిర్వర్తించాలి. పోస్టులన్నింటికీ పదోన్నతులు, వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు సమానంగానే ఉంటాయి. గ్రూప్‌-సిలోని పోస్టులను పరిశీలిస్తే దాదాపు అన్ని మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ సంబంధితమై ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుంటే పరీక్ష సన్నద్ధతకు ఇదే మార్గదర్శి అవుతుంది.

సిలబస్‌ విశ్లేషణ 

ఉద్యోగ బాధ్యతల కోణం నుంచి ఎంపిక ప్రక్రియ, సిలబస్‌లను పరిశీలిస్తే ప్రశ్నపత్ర మూలాలను తెలుసుకోవచ్చు. ఉద్యోగి విధులను సమర్థంగా నిర్వహించగలిగే ప్రతిభను పరీక్షించే విధంగా ఆయా కేటగిరీ పోస్టులకు తగిన ఎంపిక ప్రక్రియను రైల్వే సిద్ధం చేసింది.

అసిస్టెంట్‌ లోకోపైలట్‌ పోస్టుకు మూడు దశల ఎంపిక ఉంటుంది. వాటిలో మొదటి రెండు దశలు రాతపరీక్షలే. సిలబస్‌ దాదాపుగా ఒక్కటే. రెండో దశలో కఠినత్వ స్థాయి ఎక్కువ. మూడో దశ పూర్తిగా మానసిక స్థాయిని పరీక్షించే పరీక్ష.

గ్రూప్‌-సి పోస్టులకు కేవలం రాతపరీక్ష ఒక దశలోనే ముగుస్తుంది. అయితే ఈ పోస్టులకు ఎంపికయ్యేవారు చేయాల్సిన విధుల రీత్యా ట్రాక్‌మన్‌ అయితే పది, పన్నెండు కి.మీ. ‘కిట్‌’తోసహా నడవాలి. కాబట్టి శారీరక దార్ఢ్య పరీక్షను తుదిదశగా నిర్వహిస్తారు. రాతపరీక్షలో నెగ్గినవారే ఈ పరీక్షలో పాల్గొంటారు.

నాలుగు అంశాలు 

అసిస్టెంట్‌ లోకోపైలట్‌ లేదా గ్రూప్‌-సి రాతపరీక్షలో ప్రధానంగా నాలుగు అంశాలు పరిశీలిస్తారు. అవి:

1) జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌

2) మేథమేటిక్స్‌

3) జనరల్‌ సైన్స్‌

4) జనరల్‌ అవేర్‌నెస్‌

ఆర్‌ఆర్‌బీ పాత ప్రశ్నపత్రాల్లోని కొన్ని ప్రశ్నలను చూసి అభ్యర్థులు లోకోపైలట్‌ లేదా గ్రూప్‌-సిని తేలికగా తీసుకుంటే మాత్రం ఈసారి చిక్కుల్లో పడతారు. ఎందుకంటే ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-సి వంటి పాపులర్‌ కేటగిరీ నియామకాలు జరిపి మూడు, నాలుగేళ్లైంది. ఈ మధ్యకాలంలో నియామక సంస్థల విధానాల్లో మార్పులు వచ్చాయి. మునుపు దరఖాస్తు చేసినవారిలో ఎక్కువ ప్రతిభ చూపినవారిని ఎంపిక చేసుకోవాలన్న దృక్పథంతో ప్రశ్నపత్రాలుండేవి. అయితే ఇటీవలి కాలంలో ఉద్యోగ బాధ్యతలకు న్యాయం చేయగలిగే తెలివిగల వారికోసం అన్వేషణ జరుగుతోంది. ఇందుకోసం ప్రశ్నపత్రాలతోనే వడగట్టేస్తున్నారు. సమర్థులను ఎంచుకోడానికి దీన్ని ఒక ప్రయోగవేదికలా వినియోగించుకుంటున్నారు.

మేధమేటిక్స్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా అభ్యర్థిలోని ఆలోచనల వేగం, కచ్చితత్వం, వేగంగా స్పందించే స్వభావం, విషయాలను సాధారణీకరించే ఊహాశక్తి తదితర గుణాలను వివిధ సమస్యల రూపంలో పరిశీలించే అవకాశం ఉంది.

ఉదాహరణకు-  ‘9 2 5 8 1 4 7 3’ ఈ అంకెలను ఆరోహణ క్రమంలో రాస్తే వచ్చే అమరికలోని కుడివైపు నుంచి నాలుగో అంకె, ఎడమవైపు నుంచి మూడో అంకెల మధ్య తేడా ఎంత? 

1) 1 2) 2 3) 3 4) 4 

* జవాబు: 2 

ఈ ప్రశ్నకు తగిన సమయం తీసుకుని ఎవరైనా సమాధానం గుర్తించవచ్చు. కానీ అత్యంత వేగంగా ఆలోచించి జవాబును గుర్తించగలగడం సమయ నిర్వహణలో కీలకం. ఇలాగే గ్రూప్‌-సి గత పరీక్షలో గణిత విభాగంలో అడిగిన ప్రశ్న. 

10.01 × 100.001 ÷ 1001 = ? 

1) 1.00001 2) 10.001 

3) 100.001 4) 1000.01 

* జవాబు: 1 

గుణిస్తూ జవాబు రాబట్టడం ఏ అభ్యర్థి అయినా చేయగలుగుతాడు. కానీ ఇటువంటి సమస్యలకు వేగంగా జవాబు గుర్తించడం ద్వారానే ఇచ్చిన వ్యవధిలో గరిష్ఠంగా జవాబులు రాయవచ్చు. ఈ ప్రశ్నలు ఉద్యోగార్థిలో ఆలోచనల వేగాన్ని సూచిస్తాయి. లోకోపైలట్‌ లేదా గ్రూప్‌-సి ఉద్యోగ బాధ్యతల్లో వేగంగా ఆలోచించడం, తగిన నిర్ణయం త్వరితగతిన తీసుకోవడం అలవాటుగా ఉన్న అభ్యర్థులు రాణించగలుగుతారు.

సన్నద్ధత ఎలా?

ఆర్‌ఆర్‌బీ నిర్వహించే గ్రూప్‌-సి, అసిస్టెంట్‌ లోకోపైలట్‌ పరీక్షల్లో... జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, మేధమేటిక్స్‌ విభాగాల్లో ఎక్కువ ప్రశ్నలు; జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో కనీసం 15 శాతం ప్రశ్నలు అభ్యర్థుల ఆలోచనల వేగాన్ని, తగిన నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యాన్ని పరీక్షించేవిగా ఉండి జయాపజయాలను నిర్దేశిస్తున్నాయి. సన్నద్ధత సమయంలోనే ఈ తరహా అంశాలకు ప్రాధాన్యమిస్తూ చదవాలి. 

జనరల్‌ సైన్స్‌ను సాధారణంగా గతంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో జనరల్‌ అవేర్‌నెస్‌లో భాగంగా అడిగేవారు. అయితే అసిస్టెంట్‌ లోకోపైలట్‌, గ్రూప్‌-సి ఉద్యోగ బాధ్యతల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై అవగాహన ఉండాల్సిన అవసరం రీత్యా ఈ విభాగాన్ని ప్రత్యేకంగా సిలబస్‌లో ఇస్తున్నారు.

రైలు ఇంజిన్‌లో డ్రైవరుగా పనిచేసే అభ్యర్థి లేదా రైలు ట్రాక్‌ను పర్యవేక్షించే అభ్యర్థికి భౌతికశాస్త్రంలోని ధ్వని, కాంతి, విద్యుత్‌, అయస్కాంతత్వం తదితర అంశాలు, రసాయన, జీవశాస్త్రాలపై అవగాహనతో వృత్తిలో రాణించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగంలో ప్రశ్నలు ఉండనున్నాయి.

జనరల్‌ సైన్స్‌లో భౌతిక, రసాయన శాస్త్రాల్లో అనువర్తన అంశాలకు సన్నద్ధతలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు- చలించే వాహనం, ప్రవహించే నీటిలో గతిశక్తి, నడిచే వాహనానికి బ్రేకులు వేస్తే ఒకవైపునకు ఎందుకు వంగుతుంది? అయస్కాంతం ఇనుప వస్తువులనే ఎందుకు ఆకర్షిస్తుంది? రబ్బరు పట్టీలో ఇమిడి ఉన్న భౌతికశాస్త్ర సూత్రం. విమానాల్లో వాడే భూమ్యాకర్షణ సాధనం, వజ్రాలు ఎందుకు మెరుస్తాయి? వంటి అనువర్తన శాస్త్ర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రాథమిక అంశాలతోపాటు అనువర్తన విషయాలపై దృష్టి పెట్టడం వల్ల పోటీలో ముందుండే అవకాశముంది.

జనరల్‌ అవేర్‌నెస్‌ను ఈసారి సిలబస్‌లో పొందుపరిచేటపుడు చిన్న మార్పు చేశారు. ‘వర్తమానాంశాలపై సాధారణ అవగాహన’ (జనరల్‌ అవేర్‌నెస్‌ ఆన్‌ కరెంట్‌ అఫైర్స్‌) అని పేర్కొన్నారు. ఇదే సమయంలో వర్తమానాంశాల్లో రాజకీయ పరిణామాలు, ఆర్థికశాస్త్ర- సాంకేతిక రంగాలు, క్రీడారంగం, వార్తల్లో వ్యక్తులు.. అంశాలను పేర్కొన్నారు. ఈ రంగాల్లో పరీక్షకు ఆరు నెలల ముందు పరిణామాలను పరిశీలించాలి.

రెండు కేటగిరీల రాతపరీక్షలు ఏప్రిల్‌, మే నెలల్లో జరిగే అవకాశముందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు గడువు పొడిగించినందువల్ల దేశంలోని భారీ నియామక ప్రక్రియలో అత్యధికమంది పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో నిర్వహణ సుదీర్ఘమై మరింత సమయం లభించవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక ప్రకారం తగిన కృషి చేస్తే విజయం మీదే!

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌