• facebook
  • whatsapp
  • telegram

మాతృభాషలో పరీక్ష

మాతృభాషలో పరీక్ష రాయడం అంటే ఎవరికైనా ఆనందమే. ప్రశ్నపత్రాన్ని సులభంగా అర్థం చేసుకునే వీలుండటమే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఏది సంపాదించాలన్నా ఇంగ్లిష్ లేదా హిందీలోనే రాయాల్సి వస్తోంది. దీనివల్ల ప్రధానంగా తెలుగు మీడియం విద్యార్థులు రెండు విధాలా కష్టపడాలి. మొదటిది ఆంగ్లం లేదా హిందీలో ఉన్న ప్రశ్నలను చదివి భాషాపరమైన ఇబ్బందులను దాటి అర్థం చేసుకోవడం కష్టసాధ్యమవుతోంది. ఈ సమస్య వల్ల చాలామంది విద్యార్థులు సమయం సరిపోక అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాతృభాషలోనే పరీక్షలు రాసే విధంగా రైల్వే ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడటం నిరుద్యోగులకు వరమనే చెప్పాలి. రైల్వేల్లో నాన్ టెక్నికల్ కేటగిరీలో నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.  
                    వీటికి సంబంధించిన రాత పరీక్షలను ఆర్.ఆర్.బి. ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తోంది. దీనివల్ల రాష్ట్ర అభ్యర్థులకు విజయావకాశాలు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు శుభవార్త. దీంతోపాటు దేశమంతటా ఒకేసారి పరీక్షను నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం. ఇకనుంచీ రైల్వే రాత పరీక్ష ప్రశ్నపత్రంలో రాష్ట్రానికి సంబంధించినంత వరకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.  

ఉద్యోగ బాధ్యతలు వివరంగా... 
అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్: స్టేషన్ మాస్టర్ తర్వాత ముఖ్యమైన బాధ్యతలున్న పోస్ట్ ఇది. ఒక స్టేషన్‌లోని రైలును మరో స్టేషన్‌కు పంపడం ఇతడి ముఖ్యమైన విధి. పదోన్నతుల ద్వారా స్టేషన్ మేనేజర్‌గా వెళ్లవచ్చు.  
గూడ్స్ గార్డు: ఈ విభాగంలోని వారు రవాణా రైళ్లల్లో మాత్రమే పనిచేస్తారు. వీరికి బాధ్యతలు చాలా తక్కువ. జీతం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగంలో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాలి.  
కమర్షియల్ అప్రెంటిస్/ట్రాఫిక్ అప్రెంటిస్: ఈ విభాగంలో పనిచేసే వ్యక్తులు పెద్ద పట్టణాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పదోన్నతులతో గ్రూప్-1 స్థాయి ఉద్యోగం వరకు చేరుకోవచ్చు.  
సీనియర్ క్లర్క్ / టైపిస్ట్: ఈ విభాగంలో పనిచేయడానికి టైప్ రైటింగ్ నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు (లేదా) 25 హిందీ పదాలు చేయగలిగితే చాలు. టైప్‌రైటింగ్ సర్టిఫికెట్ అవసరం లేదు. వీరి పని కార్యాలయంలోనే ఉంటుంది. కేటాయించిన నిర్దిష్ట విధులు మాత్రమే చేయాలి. 
కమర్షియల్ క్లర్క్: ఈ విభాగంలోని వారు స్టేషన్ మేనేజరు నిర్ణయించిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరు పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్ రాయాలి.
టికెట్ ఎగ్జామినర్ / టికెట్ కలెక్టర్: గతంలో టికెట్ కలెక్టర్‌ను టికెట్ ఎగ్జామినర్‌గా పిలిచేవారు. దాదాపు ప్రతి రైల్వే స్టేషన్‌లో ఉంటారు. పదోన్నతులతో టి.టి. అవుతారు. 
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: ఈ విభాగంలో ఉద్యోగులు కార్యాలయంలోనే పనిచేయాల్సి ఉంటుంది.  

పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి? 
అన్ని పోస్టులకు రాత పరీక్ష తప్పనిసరి. ఇందులో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు అదనంగా స్కిల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మొత్తం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. 100 నుంచి 120 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు. ప్రశ్నపత్రంలో నాలుగు రకాల విభాగాలుంటాయి. 
(i) జనరల్ అవేర్‌నెస్ 
(ii) అరిథ్‌మెటిక్‌
(iii) జనరల్ ఇంగ్లిష్ / జనరల్ హిందీ 
(iV) జనరల్ ఇంటెలిజన్స్, రీజనింగ్ 

జనరల్ అవేర్‌నెస్: రైల్వే పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ కీలకమైంది. దీని పరిధి విస్తృతం.స్టాండర్డ్ జనరల్ నాలెడ్జి, వర్తమాన వ్యవహారాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశముంది.  స్టాండర్డ్ జి.కె.లో అంతర్జాతీయ సంస్థల సదస్సులు, పనితీరు, అవార్డులు, బహుమతులు, క్రీడలు, వాటి ప్రాథమ్యాలు; భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, శాస్త్ర సాంకేతిక సంబంధ విశేషాలు, భౌగోళిక నామాలు, ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు, రచయితలు, ప్రపంచంలో ఎత్తయినవీ, పెద్దవీ, పొడవైనవీ అడగవచ్చు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు; వార్లల్లోకి వచ్చిన వ్యక్తులు, ప్రదేశాలు; తీవ్రవాద సంస్థలు, కేంద్ర, రాష్ట్ర పతకాలు; క్షిపణులు, ప్రధాన ఉద్యమాలు, పురాతన కట్టడాలు మొదలైన అంశాలు తప్పకుండా చదువుకోవాలి. 

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌