కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్ నెస్ ఉన్నాయి. స్థూలంగా సిలబస్ వివరాలు...
జనరల్ ఇంగ్లిష్: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమపద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.
జనరల్ ఇంటలిజెన్స్: వెర్బల్, నాన్ వెర్బల్ రెండు రకాల ప్రశ్నలూ వస్తాయి. నంబర్ ఎనాలజీ, నంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ ఎనాలజీ, వెన్ డయాగ్రమ్స్, నంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్...మొదలైన విభాగాల నుంచి వీటిని అడుగుతారు. సంఖ్యలు, అంకెలపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధిస్తే.. వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: నంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, త్రికోణమితి అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అరిథ్మెటిక్లో శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్ గణిత పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.
జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలోని ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే చాలావరకు ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడేవుంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్ సోషల్, సైన్స్ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జులై 2019 నుంచి ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి.