• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో కేంద్ర కొలువులు

1,207 స్టెనో ఖాళీలకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం వచ్చింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 1,207 స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. బ్యాంకు, రైల్వే ఉద్యోగాల సన్నద్ధతతో ఈ పరీక్షనూ ఎదుర్కోవచ్చు


కేంద్ర కొలువులపై ఆసక్తి ఉండి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి, గ్రేడ్‌ డిలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రెండు పోస్టులకూ కలిపి పోటీ పడవచ్చు. ఇందులోని గ్రేడ్‌ సి పోస్టులు గ్రూప్‌ - బి నాన్‌ గెజిటెడ్‌ విభాగానికి చెందినవి. గ్రేడ్‌ డి పోస్టులు గ్రూప్‌ - సి నాన్‌ గెజిటెడ్‌ పరిధిలోకి వెళ్తాయి. ఉద్యోగాలకు ఎంపికైనవాళ్లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాలతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్రానికి చెందిన రీజనల్‌ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తారు. 


ఉద్యోగంలో చేరినవారు మొదటి నెల నుంచే రూ.35,000 వేతనంతోపాటు ఇతర సౌకర్యాలూ పొందవచ్చు. వీరు శాఖాపరమైన పరీక్షలు, అనుభవం ద్వారా గెజిటెడ్‌ స్థాయికీ చేరుకోవచ్చు. ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందువల్ల అభ్యర్థులకు స్టెనోగ్రఫీలో పరిచయం లేనప్పటికీ ఇప్పటి నుంచి రోజూ కొంత సమయం కేటాయించి సాధన చేస్తే సరిపోతుంది. పరీక్ష అనంతరం ఉన్న వ్యవధిని సద్వినియోగ పరచుకుంటే స్టెనోలో అర్హత సాధించవచ్చు.  


పరీక్ష..

ప్రశ్నపత్రం ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. ఆన్‌లైన్‌లో మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాల నుంచి 200 ప్రశ్నలు వస్తాయి. వీటిని 2 గంటల్లో పూర్తిచేయాలి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. సరైన సమాధానానికి 1 మార్కు, తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 30 శాతం (60), ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ 25 శాతం (50), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 20 శాతం (40) మార్కులు పొందాలి.


స్కిల్‌ టెస్ట్‌: ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ చూపినవారికి స్కిల్‌ టెస్టు ఉంటుంది. దీన్ని ఎస్‌ఎస్‌సీ ప్రాంతీయ కార్యాలయాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలవారికి చెన్నైలో ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషను ఎంచుకోవచ్చు. అభ్యర్థి ఎంచుకున్న భాషను అనుసరించి 10 నిమిషాలు డిక్టేషన్‌ ఉంటుంది. గ్రేడ్‌ సికి దరఖాస్తు చేసుకున్నవారికి నిమిషానికి 100, అదే గ్రేడ్‌ డి అయితే 80 పదాలను డిక్టేట్‌ చేస్తారు. దాన్ని వింటూ రాసుకోవాలి. ఈ సమాచారాన్ని కంప్యూటర్‌లో నిర్ణీత వ్యవధిలో టైప్‌ చేయాలి. ఇంగ్లిష్‌ ఎంచుకుంటే గ్రేడ్‌ సి పోస్టులకు 40, గ్రేడ్‌ డి పోస్టులకు 50 నిమిషాల వ్యవధి ఉంటుంది. అదే హిందీ అయితే గ్రేడ్‌ సి పోస్టులకు 55, గ్రేడ్‌ డికు 65 నిమిషాలు కేటాయించారు. స్కిల్‌ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి. 


నియామకాలు: స్కిల్‌ టెస్టులో అర్హులైనవారి జాబితా నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్‌ ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు. స్కిల్‌ టెస్టు మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.


ఇదీ సిలబస్‌..

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: అభ్యర్థి ఆంగ్లాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో ప్రశ్నల ద్వారా పరిశీలిస్తారు. పదసంపద, వ్యాకరణం, వాక్యనిర్మాణం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, వాటిని ఉపయోగిస్తున్న తీరు.. మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. ఆంగ్లంలో రైటింగ్‌ ఎబిలిటీనీ పరీక్షిస్తారు. ఎక్కువ మార్కులకోసం 8, 9, 10, ఇంటర్‌/ప్లస్‌2 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.


జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు ఉంటాయి. ఎనాలజీ, పోలికలు, భేదాలు, స్పేస్‌ విజువలైజేషన్, సమస్యలు పరిష్కరించడం, అనాలిసిస్, జడ్జ్‌మెంట్, నిర్ణయం తీసుకోవడం, విజువల్‌ మెమరీ, అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్స్, అరిథ్‌మెటికల్‌ రీజనింగ్, అరిథ్‌మెటికల్‌ నంబర్‌ సిరీస్, క్లాసిఫికేషన్, నాన్‌ వెర్బల్‌ సిరీస్, ఆబ్‌స్ట్రాక్ట్‌ ఐడియాస్, సింబల్స్, రిలేషన్‌షిప్స్, అరిథ్‌మెటికల్‌ కాంప్యుటేషన్, ఎనలిటికల్‌ ఫంక్షన్స్‌ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే, తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం గుర్తించగలరు. 


జనరల్‌ అవేర్‌నెస్‌: ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. చుట్టూ జరుగుతోన్న సంఘటనలపై అవగాహన ఉన్నవారు సమాధానాలు గుర్తించగలరు. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. క్రీడలు, భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, భారత రాజ్యాంగం, సైంటిఫిక్‌ రిసెర్చ్‌.. మొదలైన అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. వర్తమాన వ్యవహారాల కోసం 2023 జనవరి నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు గుర్తుంచుకోవాలి. పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నవాటిని నోట్సు రాసుకుంటే.. పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి చదువుకోవచ్చు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, అంతరిక్ష ప్రయోగాలు.. వీటికి ప్రాధాన్యమివ్వాలి. 8, 9, 10 తరగతుల సైన్స్, సోషల్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదవాలి. 


ముఖ్య సమాచారం.. 

ఖాళీలు: 1,207

అర్హత: ఇంటర్మీడియట్‌/ సమాన కోర్సును పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి పోస్టులకు ఆగస్టు 1, 2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1993 - ఆగస్టు 1, 2005 లోపు జన్మించినవారు అర్హులు. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి పోస్టులకు ఆగస్టు 1, 2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 2, 1996 - ఆగస్టు 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారికి రూ.వంద  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: ఆగస్టు 23 

ఆన్‌లైన్‌ పరీక్షలు: అక్టోబరులో.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్, వరంగల్‌. ఏపీలో.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


సన్నద్ధత 

1. ఈ పరీక్షలో అధిక ప్రాధాన్యం ఇంగ్లిష్‌కు కల్పించారు. సగం మార్కులు ఆ సబ్జెక్టు నుంచే ఉంటాయి. అందువల్ల ఆంగ్లంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

2. ఎక్కువ ప్రశ్నలు ప్రాథమికాంశాల నుంచే వస్తాయి కాబట్టి ముందు వాటిపైనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

3. పరిమిత పుస్తకాలనే ఎంచుకోవాలి. వాటినే బాగా చదవాలి.

4. గత ప్రశ్నపత్రాలు గమనించాలి. విభాగాలు, అంశాల వారీ.. ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి, అందుకు తగ్గ సన్నద్ధత ఉండేలా చూసుకోవాలి. 

5. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ ప్రకారం చదవాలి. అందులోని అంశాలే సాధన చేయాలి. ఆ పరిధి దాటి ప్రశ్నలు అడగరు. 

6. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనను కచ్చితంగా పాటించాలి. 

7. జవాబులను సరిచూసుకుని వెనుకబడిన విభాగాలకు అదనపు సమయం కేటాయించుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 


200 ప్రశ్నలకు 120 నిమిషాల వ్యవధి అంటే ఒక్కో ప్రశ్నకు గరిష్ఠంగా 36 సెకన్ల సమయమే దక్కుతోంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగానికి ఈ వ్యవధి సరిపోకపోవచ్చు. అందువల్ల జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌లను వీలైనంత తక్కువ సమయంలో పూర్తిచేస్తేనే ఈ విభాగంలో ఎక్కువ సమస్యలు సాధించడానికి అవకాశముంటుంది. వీలైనన్ని నమూనా ప్రశ్నలు సాధిస్తేనే పరీక్షలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కొన్నింటికి జవాబు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. వాటిని ఆఖరులో, సమయం మిగిలితేనే ప్రయత్నించాలి. 


రుణాత్మక మార్కులు ఉన్నందువల్ల అసలేమాత్రం తెలియని ప్రశ్నలను వదిలేయాలి. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫిజియోథెరపీతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు

‣ బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు

‣ న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 450 ‘ఏవో’ కొలువులు

‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్‌వో కొలువులు

Posted Date : 08-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌