• facebook
  • whatsapp
  • telegram

దేశ భ‌ద్ర‌తే.. ఉద్యోగ బాధ్య‌త‌గా!

డిగ్రీతో త్రివిధ దళాల్లో చేరే అవకాశం

యూపీఎస్సీ సీడీఎస్ఈ(2)-2021 నోటిఫికేషన్ విడుదల 

మాతృ దేశానికి సేవ చేయాలనే కోరిక ఎంతోమందికి ఉంటుంది. దానికి ఎన్నో దారులున్నా.. త్రివిధ దళాల్లో పని చేయడం గర్వంగా అనిపిస్తుంది. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటానికి ప్రాణాలను అర్పించడానికైనా వెనుకాడని ధీరులు.. మనజవాన్లు. ఈ బాటలో నడవాలనుకునే వారికి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) ఆహ్వానం పలుకుతోంది. ఆసక్తి గల మహిళా, పురుష అభ్యర్థులను ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లోకి తీసుకుని శిక్షణ ఇవ్వనుంది. ఎంపికైన వారికి గౌరవం, సమాజంలో హోదా లభిస్తాయి. శిక్షణ అనంతరం ఉద్యోగోన్నతులతోపాటు ఆర్థికాభివృద్ధి కూడా కొదువ ఉండదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తుంది. 

సీడీఎస్ఈ(2),2021 తాజా ప్రకటన ద్వారా మొత్తం 339 మందిని తీసుకుంటారు. ఇందులో ఇండియన్ మిలటరీ అకాడమీ(ఐఎంఏ)-  డెహ్రాడూన్(100), ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)- ఎజిమల(22), ఎయిర్ఫోర్స్ అకాడమీ- హైదరాబాద్(32),

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై)- ఎస్ఎస్సీ మెన్(నాన్ టెక్నికల్)-(169), ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై)- ఎస్ఎస్సీ విమెన్(నాన్ టెక్నికల్)-(16) విభాగాల ద్వారా శిక్షణ ఇస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ అకాడమీల్లో జులై, 2022 నుంచి, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అక్టోబర్, 2022 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుంది. 

ఇదీ అర్హత..

ఐఎంఏ, ఆఫీసర్స్ట్రైనింగ్ అకాడమీలో చేరడానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఐఎన్ఏలో చేరేందుకు ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఎయిర్ఫోర్స్ అకాడమీలో చేరేందుకు ఫిజిక్స్, మ్యాథమేటిక్స్ సబ్జెకులతో కూడిన10+2తోపాటు ఏదైనా సాధారణడిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డిగ్రీ చివరి ఏడాది/ సెమిస్టర్ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొంది ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. 

వయసు: ఐఎంఏ, ఐఎన్ఏ అభ్యర్థులు జులై 2, 1998 తర్వాత, జులై 1, 2003 కంటే ముందు జన్మించి, అవివాహితులై పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఎఫ్ఏ అభ్యర్థులు 20 ఏళ్ల నుంచి జులై 1, 2022 నాటికి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఎస్సీ మెన్, విమెన్అభ్యర్థులు జులై 2, 1997 తర్వాత, జులై 1, 2003 కంటే ముందు జన్మించి ఉండాలి. 

ఎంపిక ఎలా?

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1లో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి స్టేజ్-2 ఎస్ఎస్బీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఐఎంఏ, ఐఎన్ఏ, ఏఐఏ ఇంటర్వ్యూలో 300 చొప్పున మార్కులుంటాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కోర్సు ఇంటర్వ్యూకి 200 మార్కులు కేటాయించారు. 

దరఖాస్తు చేయండిలా..

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు ఆగస్టు 24, 2021 తుది గడువు. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.200 చెల్లించాలి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.

రాత పరీక్ష విధానం

ఐఎంఏ, ఐఎన్ఏ, ఏఐఏ అభ్యర్థులకు రాత పరీక్షలో మూడు విభాగాలుంటాయి. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.  ఇంగ్లిష్ (మార్కులు 100, సమయం రెండు గంటలు), జనరల్ నాలెడ్జ్ (మార్కులు 100, సమయం రెండు గంటలు), ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ (మార్కులు 100, సమయం రెండు గంటలు) నుంచి ప్రశ్నలుంటాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రవేశాలకు నిర్వహించే రాత పరీక్షలో ఇంగ్లిష్ (మార్కులు 100, సమయం రెండు గంటలు), జనరల్ నాలెడ్జ్ (మార్కులు 100, సమయం రెండు గంటలు) నుంచి ప్రశ్నలొస్తాయి. ఇంగ్లిష్ విభాగం మినహా ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో వస్తాయి. పరీక్షలో రుణాత్మక మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కు కోత విధిస్తారు. 

ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్

రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది అయిదు రోజులపాటు కొనసాగుతుంది. ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, సైకలాజికల్ పరిశీలనల ద్వారా అభ్యర్థుల తీరును సర్వీస్ సెలక్షన్ బోర్డు క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు బెంగళూరు కేంద్రంలో ఇవి జరుగుతాయి. ఇందులో ఎంపికైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు లభిస్తాయి.

ఇదీ సిలబస్ 

ఇంగ్లిష్: అభ్యర్థి ఆంగ్ల భాషను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో పరీక్షిస్తారు. అందుకు అనుగుణంగానే ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి.

జనరల్ నాలెడ్జ్: వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్ర అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నుంచే ఉంటాయి.

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: ఇందులో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయికి సంబంధించినవి. అరిథ్మెటిక్, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, క్షేత్రగణితం, స్టాటిస్టిక్స్ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష తేదీ: నవంబర్ 14, 2021.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

Posted Date : 06-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌