• facebook
  • whatsapp
  • telegram

రాజకీయ లక్ష్యానికి సివిల్స్‌ మజిలీ

ఉన్నత ఆశయాలూ, నిబద్ధతా ఉన్నవారు రాజకీయాల్లో ప్రవేశిస్తే సమాజానికి ప్రయోజనకరం. సివిల్‌ సర్వీసుల్లో తమదైన ముద్ర వేసి ఆపైన ప్రజాసేవా రంగమైన రాజకీయాల్లోకి ప్రవేశించే ధోరణి పెరుగుతోంది. సివిల్స్‌ను సాధించి, అక్కడితో ఆగిపోకుండా కెరియర్‌ను ఉన్నతీకరించుకునే ఈ తీరు సివిల్స్‌ ఆశావహులకు స్ఫూర్తిదాయకం!
దిల్లీ ఎన్నికలకు అనేక కోణాల్లో ప్రాముఖ్యం ఏర్పడింది. మొట్ట మొదటిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సివిల్‌ సర్వెంట్లు ఇద్దరు ప్రత్యర్థులుగా (ముఖ్యమంత్రి అభ్యర్థులుగా) పోటీ చేయడం. అరవింద్‌ కేజ్రీవాల్ ‌- మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి; కిరణ్‌బేడి - మాజీ ఐపీఎస్‌ అధికారి. వీరి పోరును యావద్దేశం ఆసక్తికరంగా, ఉత్కంఠగా గమనించింది.
భద్రత, హోదా, కీర్తి, విధాన నిర్ణయాల్లో భాగంగా ఉండడం మొదలైనవి సివిల్స్‌ సర్వీసెస్‌ను కెరియర్‌గా ఎంచుకోవాలనే ఆలోచనకు కారణాలయ్యాయి ఇన్నిరోజులూ. ఈ ఎన్నికల తరువాత మరో కొత్త కోణం కూడా ప్రచారంలోకి వచ్చింది. అదే- రాజకీయాల్లోకి ప్రవేశించటానికి సివిల్‌ సర్వీసెస్‌ (మిగతా కారణాలతో పాటు)ను వేదికగా చేసుకుంటున్న ధోరణి.
సివిల్‌ సర్వీసెస్‌నూ, రాజకీయ రంగాన్నీ లక్ష్యంగా పెట్టుకునేవారి గురించి సాధారణంగా ఏ అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి? కేవలం చదువుపైనే దృష్టి సారించే
వారు, విద్యేతర కార్యకలాపాల్లో పాలుపంచుకోనివారు, వదంతులు మొదలైనవాటితో సమయం వృథా చేయనివారు సివిల్‌ సర్వీసెస్‌ను ఆశిస్తారని ఎక్కువమంది భావిస్తుంటారు. ఇక రాజకీయ కుటుంబాల్లో అదే వాతావరణంలో పెరిగిన యువతా, చదువు అంతగా ఒంటబట్టనివారూ, రాజకీయ సంస్థల యువ విభాగాలకు నాయకులుగా ఉంటూ.. సమూహాల్లో జీవించడం అలవాటు ఉన్నవారు మాత్రమే క్రమేణా రాజకీయాల్లోకి వస్తారని మరో అభిప్రాయం.
అరవింద్‌ కేజ్రివాల్‌, కిరణ్‌ బేడిలు మాజీ సివిల్‌ సర్వెంట్లన్న మాట వాస్తవమే. కానీ రాజకీయాల్లోకి రావడానికి సివిల్‌ సర్వీస్‌ వారికెలా ఉపయోగపడింది? వీరే కాదు- రాజకీయాల్లోకి రావడానికి సివిల్స్‌ ఎలా సహాయపడుతోంది? ఈ అంశాలను విశ్లేషిద్దాం.

1. మధ్యతరగతి యువత అరుదుగా రాజకీయాల గురించి ఆలోచిస్తారు
'పెద్దయ్యాక
ఏమవుదామనుకుంటున్నావ్‌?' ఈ ప్రశ్నను మనలో అందరూ ఎదుర్కోనుంటారు. 'నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నా' అనే సమాధానం ఇస్తే ఆ ఆలోచనను పూర్తిగా నిరుత్సాహపరిచేవారే అత్యధికం. 'రాజకీయాలు మనకోసం కాదు, మధ్యతరగతి కుటుంబానికి చెందినవాళ్లం, సర్వీస్‌ వరకే మనకు రాసిపెట్టుంది'- అనే హితవులు వినాల్సివస్తుంది. అదే సివిల్‌ సర్వీసెస్‌ ఆశిస్తున్నానని చెప్పండి.. మీకు అవసరమైన మద్దతంతా వచ్చేస్తుంది. నిజానికి ఒకవేళ మనకు ఇండియన్‌ పార్లమెంటరీ సర్వీస్‌ (ఐపీఎస్‌)/ ఇండియన్‌ అసెంబ్లీ సర్వీస్‌ (ఐఏఎస్‌)లకు కూడా పరీక్ష ఉండుంటే, చాలా మంది మధ్యతరగతి తల్లిదండ్రులు సమర్థించి ఉండేవారు. విద్యార్థులెందరో వాటిని ఆశించి ఉండేవారు.

2. సామాన్యుల కష్టాలపై అవగాహన పెంచేలా పాఠశాలల కరిక్యులమ్‌ లేదు
మన విద్యావిధానంలో నేరుగా చేరిపోయే కోర్సులే ఉన్నాయి. పాఠశాలల్లో సాంఘికశాస్త్రాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాశాల యాజమాన్యం కూడా విసుగు పుట్టించే సబ్జెక్టుగా భావిస్తారు. విద్యాపరంగా సామాన్యుడి కష్టాలపై అవగాహన కూడా ఉండదు.
ఉదాహరణ చూద్దాం- కార్పొరేట్‌ పాఠశాల విద్యార్థిని పేద కుటుంబంపై వ్యాసం రాయమంటే.. 'ఒకానొక కాలంలో ఓ పేద కుటుంబం ఉండేది. తండ్రి పేదవాడు, తల్లీ, పిల్లలూ పేదవాళ్లు, వారి వాచ్‌మెన్‌, డ్రైవర్‌, వంటవాడు, తోటమాలి అందరూ పేదవారు..' ఇలా రాస్తాడేమో. తన దృష్టిలో పేదవారంటే ఇలానే ఉంటారు. ఎందుకంటే, అతడు పేదరికాన్ని ఎప్పుడూ చూసివుండడు. తన దృష్టిలో పేదవాడంటే రోడ్డుపై అడుక్కునే వ్యక్తి. పేదవారికి సహాయం చేయడమంటే అతడి దృష్టిలో భిక్షకులకు డబ్బులు దానం చేయడం.

 

3. కళాశాల పాఠ్యప్రణాళిక కూడా అంతే
పాఠశాల విద్య, ఇంటర్‌ తర్వాత ఇంజినీర్‌గానో, డాక్టర్‌గానో, చార్టర్డ్‌ అకౌంటెంట్‌గానో తయారయ్యే కోర్సుల్లో చేరిపోతుంటారు చాలామంది. ముఖ్యంగా సాంకేతిక కోర్సుల కరిక్యులమ్‌లో ప్రజల సమస్యల గురించి చెప్పే అంశాలకు స్థానం ఉండదు. సామాన్య ప్రజల అవసరాలపై అవగాహన పెంచుకునే అవకాశం చాలా తక్కువ. ఎంతసేపూ సబ్జెక్టు పరిజ్ఞానం సంపాదించటం, వార్షిక పరీక్షలు బాగా రాయటం, జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నించడం- వీటికే ప్రాముఖ్యం!

 

4. సివిల్స్‌ సన్నద్ధత ద్వారా దేశ సమస్యల పరిచయం
సివిల్‌ సర్వీసెస్‌ సిలబస్‌ వైవిధ్యమైన ఎన్నో సబ్జెక్టులతో ఉంటుంది. వాటిలో ప్రజలకు సంబంధించిన అంశాలే ఎక్కువ. దీనివల్ల వ్యక్తుల, సమాజ సమస్యలపట్ల అనుకూల స్పందన, అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అంటరానితనం గురించి పెద్దగా అవగాహన లేని విద్యార్థి కూడా సివిల్స్‌ కోసం చదివినపుడు దాని తీవ్రతను లోతుగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ విధంగా ఇలాంటి సమస్యలెన్నిటినో సివిల్స్‌ పరిచయం చేస్తుంది. ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశం బహుశా అప్పుడే చాలామందికి మొగ్గతొడుగుతుంది. . సహనం, కష్టపడి పనిచేయటం ఈ పరీక్షార్థులకు తప్పనిసరి. ఈ రెండూ రాజకీయాలకు కూడా చాలా అవసరమే కదా!

 

5. సివిల్స్‌ శిక్షణ ద్వారా ఆచరణాత్మక దృష్టి
దేశానికి సంబంధించిన ఎన్నో కోణాలు తెలిసేలా సివిల్స్‌ శిక్షణ ఉంటుంది. శిక్షణకు ముందు అభ్యర్థుల అనుభవం తన ప్రాంతానికో, నగరానికో పరిమితంగా ఉంటుంది. సివిల్‌ సర్వీస్‌ అఖిలభారత దృక్పధం ఏర్పడేలా చేస్తుంది. ఆచరణాత్మకతను కూడా జోడిస్తుంది. సర్వీసులకు ఎంపికైనవారికి నెలరోజులపాటు సాగే 'భారత్‌ దర్శన్‌' కార్యక్రమం వారిలో దేశంపై అవగాహనను పెంచుతుంది. గ్రామీణ సందర్శన... పల్లె ప్రజల సమస్యలను తెలిసేలా చేస్తుంది. శిక్షణ కాలంలోని ఉపన్యాసాలు కూడా ఉపయోగకరం.

 

6. పనిచేయటం మూలంగా దృక్కోణంలో మార్పు
నిష్పక్షపాతంగా చూసే దృష్టిని సివిల్‌ సర్వీస్‌ విధులు నేర్పించే అవకాశముంది. అసిస్టెంట్‌ కలెక్టర్‌గానో, ఏఎస్‌పీగానో మొదటి పోస్టింగ్‌ తీసుకున్నపుడు చక్కటి అనుభవం సొంతమవుతుంది. పరీక్షకు తయారయేటపుడు సమస్యల గురించి తెలుస్తుంది. శిక్షణలో సీనియర్లు సమస్యలనెలా పరిష్కరించారో బోధపడుతుంది. అలా సమస్యా పరిష్కర్తగా తయారవుతారు. ఎందరో ప్రజలు తమ బాధలను చెప్పుకోవడానికి వస్తారు. ఇదొక గొప్ప అనుభవం. ప్రజానీకానికి సేవ చేయడంలో ఇమిడివున్న గౌరవాన్నీ, సంతృప్తినీ రుచిచూపుతుంది. వ్యవస్థలోని లోటుపాట్లూ తెలిసొస్తాయి. అధికార చట్రంలో లోపం గుర్తించినపుడు వాటి పరిష్కారంపై మథనం మొదలవుతుంది.

 

7. సివిల్స్‌ ద్వారా ఉద్యమకారునిగా తయారయ్యే ప్రేరణ
ప్రజల సమస్యలు అనుభవంలోకి వచ్చాక వాటికి వ్యవస్థ లోపాలు కారణమని గ్రహించి దాన్ని మార్చాలనే పట్టుదల వస్తుంది. దానికి సర్వీసులో ఉంటే నిబంధనలు అడ్డుగా నిలుస్తాయి. ప్రజాసేవాభిలాష, తపన ఉన్నవారు ఉద్యమ నిర్మాణకారులుగా మారి ప్రజాసేవారంగంలో కృషి చేసే సందర్భం వస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జయప్రకాష్‌ నారాయణ్‌ విజయవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికీ అంతకంటే ప్రభావవంతమైన మార్పు కోసం లోక్‌సత్తాను స్థాపించారు. రాజకీయాల్లో ప్రవేశించి శాసనసభ్యునిగానూ ఎన్నికయ్యారు. అరుణారాయ్‌ ఆరేళ్ళ తర్వాత సర్వీసును వదిలి మజ్దూర్‌ కిసాన్‌శక్తి సంఘటన్‌ని స్థాపించారు. సమాచార హక్కు చట్టం కోసం కృషి చేసిన ముఖ్యుల్లో ఆమె కూడా ఒకరు. రాజకీయాల్లో చేరదల్చుకుంటే ఆమెను ఏ రాజకీయపక్షమైనా సంతోషంగా స్వాగతిస్తుంది.
అన్నా హజారే నేతృత్వంలో 2011లో కిరణ్‌బేడీ తదితరులతో కలిసి 'ఇండియా అగైన్‌స్ట్‌ కరప్షన్‌ గ్రూపు' స్థాపించిన అరవింద్‌ కేజ్రివాల్‌ జన్‌ లోక్‌పాల్‌ బిల్లు చట్టం కోసం ఉద్యమించారు. ప్రజా ప్రతినిధులను పనిచేయించడానికి ఉద్యమకారులకు హక్కుల్లేవని ఉద్యమం ద్వారా గ్రహించిన ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థా

పించారు. గత 14 నెలల కాలంలో ఆ పార్టీ ఉవ్వెత్తున ఎగసి... పడి లేచిన కడలి తరంగమై చరిత్ర సృష్టించింది!

లక్ష్యం నుంచి మరో కక్ష్యకు...
‣ సివిల్స్‌ సన్నద్ధత జీవితంపై దృక్పథాన్ని మార్చేస్తుంది. లక్ష్యాలు కూడా మారవచ్చు.
‣ భారత రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించదల్చిన మధ్యతరగతి విద్యావంతులకు సివిల్స్‌ తయారీ, అనుభవం వేదికలాగా మారుతోంది.
‣ సివిల్‌ సర్వీసెస్‌కు తయారయ్యే కృషి అభ్యర్థులకు విశాల దృష్టిని కలుగజేస్తుంది. అది మరింత ఉన్నతమైన, విభిన్నమైన కక్ష్యలో ప్రవేశించటానికీ ప్రేరణ కావొచ్చు.
‣ ఇటీవలి ఎన్నికల్లో యువత విరివిగా పాల్గొనటం వారి ఆసక్తిని తెలుపుతోంది.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌