• facebook
  • whatsapp
  • telegram

తొలిద‌శ విజ‌యానికి వ్యూహం

సివిల్స్ ప్రిలిమ్స్‌-2021 ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

నిపుణుల న‌మూనా టైమ్ టేబుల్‌

 

 

ప్రతిభావంతులైన విద్యార్థులు నెగ్గాలని కలలు గనే పరీక్ష.. సివిల్స్‌. పోటీ పరీక్షల్లో శిఖర సమానంగా పేరు పొందిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రకటన ఇటీవలే వెలువడింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 27న జరగబోతోంది. ఇంకా 100 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకుంటూ విజయం దిశగా దూసుకువెళ్లేందుకు ఏ మెలకువలు పాటించాలి?  

 

సివిల్స్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థి స్థూలంగా అనుసరించాల్సినవి.. ఎ) సిలబస్‌పై అవగాహన పెంచుకుని కష్టపడి చదవటం (సాధ్యమైనంతవరకు ప్రతిరోజూ 10- 14 గంటల అధ్యయనం. బి) ప్రాక్టీస్‌ పరీక్షలను రాయటం, వాటిలో బాగా స్కోర్‌ చేయడం. 

 

ఈ ఏడాది జరగబోయే సివిల్స్‌ పరీక్ష తీరుతెన్నులను పరిశీలిద్దాం:  

1) ఖాళీల సంఖ్యను 712 కు తగ్గించారు. 

2) అంటే ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య సుమారు 9300 ఉంటుంది.

3) హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య యథావిధిగా 5 లక్షలు ఉన్నప్పటికీ, ఈ ఏడాది శ్రద్ధగా రాసే సీరియస్‌ అభ్యర్థుల సంఖ్య పెరగబోతోంది. ఎందుకంటే... గత సంవత్సరం కరోనా కారణంగా గణనీయమైన సంఖ్యలో ఈ పరీక్షను రాయలేదని గుర్తించాలి. 

 

వీటన్నిటి ఫలితంగా... 

ఎ) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ -1 కఠినంగా ఉండబోతోంది.  

బి) క్వాలిఫైయింగ్‌ స్వభావమున్న పేపర్‌- 2 కూడా మరింత క్లిష్టంగా ఉండవచ్చు. 

 

పేపర్‌ -1

పేపర్‌-1లో ప్రతి సబ్జెక్టు నుంచి ఎన్నేసి ప్రశ్నలు వస్తాయో ఎవరూ ఊహించలేరు. అయితే గత సంవత్సరాల పేపర్ల విశ్లేషణ ఆధారంగా కింది అంచనాలకు రావచ్చు.

ముందే చెప్పినట్టు- ఇది ఊహలతో చేసిన అంచనా మాత్రమే (గెస్టిమేట్‌). దీని ఆధారంగా ప్రిపరేషన్‌ కార్యాచరణను రూపొందించుకోవచ్చు. 

 

సన్నాహక వ్యూహం 

మీరు ఇప్పటికే అన్ని సబ్జెక్టుల్లో అన్ని టాపిక్‌లనూ పూర్తి చేసివుండాలి. ఒకవేళ ఏమైనా అంశాలు మిగిలివుంటే వచ్చే పది రోజుల్లో వాటిని చదవటం పూర్తి చేయండి. 

గుర్తుంచుకోండి, పై సబ్జెక్టులన్నీ అంతం లేనివి. ఇవి సామాజిక శాస్త్రాలు. నిర్దిష్ట సరిహద్దు లేకపోవటం వీటి ప్రత్యేకత. ‘ప్రతి అంశాన్నీ సంపూర్ణంగా చదివేశాను’ అని చెప్పగలిగేలా ఏమీ ఉండదు. ఎందుకంటే అది అసాధ్యం. చేయాల్సిందల్లా- ప్రతి సబ్జెక్టుకూ తగిన వ్యవధి కేటాయించుకునేలా ఒక టైమ్‌ టేబుల్‌ తయారుచేసుకోవటం; దానికి కట్టుబడివుండటం.

ఏదైనా ఒక టాపిక్‌ను సరిగా పూర్తి చేయలేదనుకోండీ- చింతించనక్కర్లేదు. అందుబాటులో ఉన్న రోజులకు మీ షెడ్యూల్‌ను తిరిగి రూపొందించుకోవచ్చు.  

 

నమూనా టైమ్‌ టేబుల్‌  

మార్చి 21: ఈ తేదీ నాటికి వదిలేసిన టాపిక్‌లన్నిటినీ పూర్తిచేయటం.

మార్చి 22- మార్చి 27: హిస్టరీ, కల్చర్‌ అంశాల రివిజన్‌ 

మార్చి 28: ఉదయం- 100 ప్రశ్నలతో హిస్టరీ టెస్ట్‌ పేపర్‌ను రాయటం. మధ్యాహ్నం: 2014 సీశాట్‌ పేపర్‌ రాయటం.

మార్చి 29- ఏప్రిల్‌ 3: జనరల్‌ సైన్స్‌ (అప్లైడ్‌ అంశాలపై దృష్టితో) రివిజన్‌.

ఏప్రిల్‌ 4: ఉదయం- 100 ప్రశ్నలతో జనరల్‌ సైన్స్‌ టెస్ట్‌ పేపర్‌ను రాయటం. మధ్యాహ్నం: 2015 సీశాట్‌ పేపర్‌ రాయటం.

ఏప్రిల్‌ 5- ఏప్రిల్‌ 10: ఇండియన్‌ పాలిటీ, గవర్నెన్స్‌ రివిజన్‌

ఏప్రిల్‌ 11: ఉదయం- 100 ప్రశ్నలతో ఇండియన్‌ పాలిటీ, గవర్నెన్స్‌ టెస్ట్‌ పేపర్‌ను రాయటం. మధ్యాహ్నం: 2016 సీశాట్‌ పేపర్‌ రాయటం.

ఏప్రిల్‌ 12- ఏప్రిల్‌ 17: ఇండియన్‌ జాగ్రఫీ రివిజన్‌

ఏప్రిల్‌ 18: ఉదయం- 100 ప్రశ్నలతో ఇండియన్‌ జాగ్రఫీ టెస్ట్‌ పేపర్‌ను రాయటం. మధ్యాహ్నం: 2017 సీశాట్‌ పేపర్‌ రాయటం.

ఏప్రిల్‌ 19- ఏప్రిల్‌ 24: ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ రివిజన్‌

ఏప్రిల్‌ 25: ఉదయం- 100 ప్రశ్నలతో ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ టెస్ట్‌ పేపర్‌ను రాయటం. మధ్యాహ్నం: 2018 సీశాట్‌ పేపర్‌ రాయటం.

ఏప్రిల్‌ 26- మే 1: ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ రివిజన్‌

మే 2: ఉదయం- 100 ప్రశ్నలతో ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ టెస్ట్‌ పేపర్‌ను రాయటం. మధ్యాహ్నం: 2019 సీశాట్‌ పేపర్‌ రాయటం.

మే 3- మే 8: కరంట్‌ అఫైర్స్‌ రివిజన్‌

మే 9: ఉదయం-100 ప్రశ్నలతో కరంట్‌ అఫైర్స్‌ టెస్ట్‌ పేపర్‌ను రాయటం. మధ్యాహ్నం- 2020 సీశాట్‌ పేపర్‌ రాయటం.

మే 10- మే 15: సరిగా పూర్తిచేయలేదని భావించిన టాపిక్స్‌ అన్నిటినీ చదవటం. కీలక అంశాలను కరంట్‌ అఫైర్స్‌తో అనుసంధానించటం.

మే 16: ఉదయం- అన్ని సబ్జెక్టులూ వచ్చేలా  ప్రామాణిక ప్రచురణ సంస్థ/ శిక్షణ సంస్థ 2021 కోసం రూపొందించిన సమగ్ర ప్రశ్నపత్రాన్ని రాయటం. మధ్యాహ్నం: ప్రామాణికమైన 2021 నమూనా సీశాట్‌ పేపర్‌ను రాయటం.

మే 17- మే 22: నెగిటివ్‌ మార్కులకు దారితీస్తున్న- మీకు పట్టులేని అంశాలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టటం. ఈ సందర్భంగా వచ్చే కొత్త పాయింట్లను నోట్సులో రాసుకోవటం. 

మే 23- జూన్‌ 6:  సిలబస్‌లోని అన్ని అంశాలూ సమతూకంగా ప్రతిఫలించే సమగ్ర పేపర్‌ను ప్రతిరోజూ కనీసం ఒకటి రాయాలి. నెగిటివ్‌ మార్కులకు దారితీస్తున్న- మీకు పట్టులేని అంశాలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టటం. ప్రతి పరీక్షా రాశాక దానిపై విశ్లేషణ రాసుకోవటం. 

జూన్‌ 7: జవాబులిచ్చే పద్ధతిని విశ్లేషించుకోండి. మీరు మార్కులు కోల్పోతున్న అంశాలను నోట్‌ చేసుకోవటం.

జూన్‌ 20 వరకూ: మరికొన్ని సమగ్ర ప్రశ్నపత్రాలను పరీక్షా పద్ధతుల్లో రాయటం.  

జూన్‌ 21- జూన్‌ 24: మీరు బలహీనంగా ఉన్న అంశాలను పటిష్ఠం చేసుకుని, ఇంకా ఒకటి రెండు సమగ్ర ప్రశ్నపత్రాలను రాయటం.

జూన్‌ 25: నోట్సులోని పాయింట్లను రివైజ్‌ చేసుకోవటం. కొత్త అంశాలనేమీ చదవకపోవటం.

జూన్‌ 26: పరీక్ష కేంద్రం ఎక్కడుందో సరిచూసుకోవటం. రాయబోయే పరీక్షకు ఆత్మవిశ్వాసంతో.. మానసికంగా సిద్ధంగా ఉండటం. 

 

వీటిని గమనించాలి....

నమూనా పరీక్షల్లో మీరు కటాఫ్‌ మార్కును చేరుకోలేకపోతే, కారణాలను గుర్తించి లోపాలు సవరించుకోండి.

ప్రశ్నను చాలా వేగంగా చదువుతూ ప్రశ్నలోని ఏమైనా అంశాలను పట్టించుకోవటం లేదా? దాన్ని సవరించుకోండి.. 

మీరు కచ్చితమైన ఆధారంతో ఊహించి రాసినవి సరైన జవాబులు అవుతుంటే మంచిదే. 

‣ ఆధారం లేకుండా ఊహించి జవాబులు గుర్తిస్తున్నారా? అయితే, దాన్ని ఆపండి 

ఆ అంచనాలు సరిగ్గా లేకపోతే, అవి మీరు బలహీనంగా ఉన్న అంశాలేమిటి? 

మొత్తంమీద మీరు ఏయే అంశాలను మెరుగుపరుచుకోవాల్సివుంది? 

 

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష - 2021

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 24

ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌ 27

మెయిన్‌ పరీక్ష: సెప్టెంబరు 17

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం 

 

కొన్ని వాస్తవాలు  

1. ప్రిలిమినరీ ఏటా కష్టంగా మారుతోంది. ఈ ఏడాది మరింత కష్టతరమవుతోంది. మెయిన్‌ పరీక్షకు 9300 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు.  

2. అర్హత పేపర్‌ - 2ను మరింత కఠినంగా తయారుచేస్తారు. ఎగ్జామినర్‌ ఇక్కడ పెద్ద సంఖ్యలో అభ్యర్థులను తగ్గించాలని అనుకుంటారు. నాన్‌ మ్యాథ్స్‌ విద్యార్థులు గణిత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది.   

3. పేపర్‌-1లో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. బహుళ ఆప్షన్‌ల నుంచి సరైన సమాధానం ఎంచుకునే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి.  

4. శిక్షణ సంస్థలు తయారుచేసిన ప్రశ్నల నిధినుంచి ఏ ప్రశ్నా నేరుగా రాదు.  

5. మీకు సమాధానం స్పష్టంగా తెలియనప్పుడో, మీ సమాధానం తప్పుగా ఉన్నప్పుడో జవాబు కోసం కేవలం నెట్‌లో వెతకవద్దు. ప్రామాణిక పాఠ్యపుస్తకంలో చూడండి. ఎందుకంటే.. ప్రామాణిక పాఠ్యపుస్తకాన్ని రిఫర్‌ చేసినప్పుడు, వెతుకుతున్న సమాచారాన్ని మాత్రమే కాకుండా అదనపు సమాచారాన్ని కూడా పొందుతారు. 

6. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష కోసం రాసిన పుస్తకాల నుంచో,  గైడ్‌ల నుంచో ప్రశ్నలను తీసుకోరు. అందుకే ప్రామాణిక పాఠ్యపుస్తకాలను చదవడం మంచిది. 

7. కటాఫ్‌ మార్కును కొద్దిలో మిస్‌ అయిన చాలామంది అభ్యర్థుల విషయంలో వారు ప్రశ్నలను తప్పుగా ఊహించటమో.. అవసరం లేకపోయినా ఎక్కువ ప్రశ్నలకు తప్పు జవాబులు గుర్తించటమో కన్పిస్తుంది. 

 

Posted Date : 28-08-2021

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌