• facebook
  • whatsapp
  • telegram

ఇవిగో సివిల్స్‌ విజయ రహస్యాలు

అభ్యర్థులకు మేటి ర్యాంకులు సాధించిన విజేతల సూచనలు

ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీస్‌ సాధించడం ఎంతో ప్రత్యేకం. మూడంచెల కఠిన పరీక్షలో నిలిచి నెగ్గటం అపురూపం. తాజా సివిల్స్‌ ఫలితాల్లో మేటి ర్యాంకులు సాధించిన ముగ్గురు అభ్యర్థుల విజయ రహస్యాలు తెలుసుకుందాం!

పరిశీలన, విశ్లేషణలే సోపానాలు..

నాన్న ఆకాంక్షను నెరవేర్చటం కోసం వైద్యవిద్య నుంచి సివిల్స్‌పై దృష్టిపెట్టింది. ఈ సర్వీస్‌తో ప్రజలకు మెరుగైన, వ్యవస్థీకృత సేవలు అందించొచ్చనే విశ్వాసంతో మనస్ఫూర్తిగా, ఇష్టంగా చదివింది. తొలి ప్రయత్నంలోనే 20 ర్యాంకుతో విజయ పతాకను ఎగురవేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ ర్యాంకును సాధించిన డాక్టర్‌ పొలిశెట్టి శ్రీజ హైదరాబాద్‌లో స్థిరపడిన వరంగల్‌ అమ్మాయి. సివిల్స్‌లో అద్భుతమైన ఈ గెలుపు ఎలా సాధ్యమయిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం! 

ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ నుంచి 2019లో ఎంబీబీఎస్‌తో పాటు ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తిచేశాను. సివిల్స్‌ కోసం ఏడాది పాటు సిద్ధమయ్యాను. మెడికల్‌ సైన్స్‌ నా ఆప్షనల్‌ సబ్జెక్టు. ముందు మొత్తం సిలబస్‌ను పరిశీలించాను. సివిల్‌ సర్వీసెస్‌ పూర్వ ప్రశ్నపత్రాలను తెప్పించుకుని వాటిలో తరచూ అడుగుతున్న అంశాలనూ, ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నవీ, వదిలేస్తున్నవీ..ఇలా విభజించుకున్నా. ప్రిలిమినరీని మాత్రమే లక్ష్యం చేసుకోకుండా మెయిన్స్‌ను దృష్టిలో పెట్టుకునే మొదటి నుంచీ ప్రిపేర్‌ అయ్యాను. కంబైన్డ్‌ నోట్సు తయారు చేసుకున్నా. సివిల్స్‌ మూడు దశల సన్నద్ధతకు సంబంధించి ఆన్‌లైన్‌ వనరులను ఉపయోగించుకున్నా.

ఏ రోజైనా చదవాలని అనిపించకపోతే సినిమా చూసేదాన్ని. అయితే పరీక్షతో ఎంతోకొంత సంబంధముండే సబ్జెక్టులున్న సినిమాలనే ఎంచుకునేదాన్ని. ఉదాహరణకు ‘ఆర్టికల్‌ -15’ అనే మూవీ. ఇది కుల వివక్షతకు సంబంధించినది. ఇలాంటి సినిమాల దర్శకులు సమస్యను బాగా విశ్లేషించి తీస్తారు కాబట్టి కాన్సెప్టు సులువుగా అర్థమవుతుంది. తర్వాత ఆ టాపిక్‌ ఉన్న పుస్తకాలు ఓసారి చదివితే సరిపోతుంది. సినిమాలంటే ఇష్టం కాబట్టి నెలకు ఒకటో రెండో కామెడీ సినిమాలు చూసేదాన్ని.

సన్నద్ధత ఆగకూడదు

రోజుకు ఇన్ని గంటలు చదవాలని ఏమీ నియమం పెట్టుకోలేదు. గంటల చొప్పున కాకుండా టాపిక్‌ల వారీగా చదివేదాన్ని. కానీ ఇలాంటి పరీక్షల్లో సన్నద్ధత ఆగకూడదన్న అవగాహన మాత్రం ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆ ప్రభావం నా సివిల్స్‌ ప్రిపరేషన్‌పై పడకుండా మెడిటేషన్, డైరీ రాయటం లాంటి కొత్త వ్యాపకాలపై దృష్టిపెట్టాను. బోర్‌ అనిపించినపుడు కొత్త పాటలు నేర్చుకున్నా. 

సివిల్స్‌ సిలబస్‌కు సంబంధించనిది అంటూ ఏమీ ఉండదు. ఏదైనా ఎక్కడోచోట తప్పకుండా కలుస్తుంది. ప్రతి విషయాన్నీ పరిశీలించటం, విశ్లేషించటం, ఒక అభిప్రాయానికి రావటం.. సివిల్స్‌లో విజయానికి అవసరం. అందుకే ఎక్కడికైనా వెళ్లినా, ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా శ్రద్ధగా వినేదాన్ని; గమనించేదాన్ని. వాళ్ల దృక్కోణం ఏమిటో, ఎలా ఆలోచిస్తున్నారో పరిశీలించేదాన్ని. కొత్త విధానంలో ఆలోచించటం అలవాటవటానికి ఇది తోడ్పడింది. 

రివిజన్‌.. నమూనా పరీక్షలు

రివిజన్‌ను నిర్లక్ష్యం చేస్తే సన్నద్ధత అంతా వృథా అవుతుంది. ‘అందుకే చదివినవే కదా’ అనిపించినా అశ్రద్ధ చేయలేదు. స్నేహితులతో ఆ టాపిక్స్‌ను చర్చించటం ద్వారా వాటి రివిజన్‌ పూర్తిచేశాను. ఇలా చేసినపుడు కొత్తకోణం తెలియటంతో పాటు బాగా గుర్తుండిపోతాయి. నమూనా పరీక్షలు ఎక్కువ రాశాను.  

అంతకుముందు సివిల్స్‌ కోసం ప్రయత్నిస్తున్నవారితో, ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లుగా చేస్తున్న చాలామందితో మాట్లాడాను. వారి సలహాలు తీసుకున్నా. ముఖ్యంగా వారు ఎక్కడ పొరపాట్లు చేశారో తెలుసుకున్నాను. వాటిని నేను చేయకుండా జాగ్రత్తపడ్డాను. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించడానికి ఇవి కారణమని భావిస్తున్నా. ఇంటర్వ్యూలో వైద్య సంబంధ అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. 

సంకల్పించారు.. కలిసి సాధించారు!

సివిల్స్‌లో సోదరుల సత్తా 

వైఫల్యాలు వెంటాడినా చెదరని దృఢ సంకల్పమే ఆ అన్నదమ్ములను విజేతలుగా నిలిపింది. నిరంతర కృషి, శ్రమ ఉన్నత స్థానం కట్టబెడతాయని వారు నిరూపించారు. ఒకే ఇంట్లో పుట్టి పెరిగారు..ఒకే లక్ష్యాన్ని ఎన్నుకుని ఒకేసారి విజయం సాధించారు! తాజా సివిల్స్‌ తుది ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనుకు చెందిన రాళ్లపల్లి జగత్‌సాయి 32, అతడి తమ్ముడు వసంత్‌ కుమార్‌ 170 ర్యాంకు సాధించారు. తమ ప్రణాళిక, సన్నద్ధత గురించి వారి మాటల్లోనే.. 

పొరపాట్లే పాఠాలు: జగత్‌సాయి

పొరపాట్లు చేయని మనుషులు ఉండరు. కానీ పొరపాట్ల నుంచి నేర్చుకునే వారినే విజయం వరిస్తుంది. రాయవేలూరులో ఇంజినీరింగ్‌ చదివాను. పుణెె, చెన్నైల్లో ఏడాది పాటు ఉద్యోగం చేసి సంతృప్తి లేక వదిలేశాను. 2015లో సివిల్స్‌ సన్నద్ధత మొదలుపెట్టా. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో విఫలమయ్యాను. అవగాహన లేమి, మొదటి సారి పరీక్షలు రాస్తున్నామనే భయంతో తెలిసిన ప్రశ్నలు కూడా వదిలేశాను. రెండో ప్రయత్నంలో ప్రాథమిక, ప్రధాన పరీక్షల్లో విజయం సాధించి ఇంటర్య్వూ వరకు వెళ్లాను. కార్పొరేట్‌ రంగంలో అనేక ఇంటర్వ్యూలకు వెళ్లటంతో ఈ ముఖాముఖీ అలాగే ఉంటుందని భావించాను. దీంతో చాలా తేలిగ్గా తీసుకున్నాను. ఫలితం- మళ్లీ పరాజయం పలకరించింది. ఈ ఒత్తిడితో మూడోసారి ప్రాథమిక పరీక్షలోనే వెనుదిరిగాను. నాలుగో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ప్రతిభ చూపినా ప్రధాన పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు తక్కువ మార్కులు రావటంతో ఓటమి తప్పలేదు. ఇన్నిసార్లు సన్నద్ధమైన అనుభవం, పొరపాట్ల నుంచి తెలుసుకున్న విషయాలు అయిదో ప్రయత్నంలో విజయతీరాలకు చేర్చాయి. 

నమూనా పత్రాల సాధన 

సివిల్స్‌లో ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ముఖాముఖీ.. మూడు ముఖ్యమే. ప్రాథమిక పరీక్షకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. సన్నద్ధత సమయంలో అలాంటివి సాధన చేశాను. ఎక్కువ నమూనా పత్రాలు పూర్తి చేసేవాడిని. దీంతో ఏ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నల్లో బలహీనంగా ఉన్నానో తెలుసుకుని సాధన చేసేవాడిని. వ్యాసరూప ప్రశ్నలుండే ప్రధాన పరీక్షలో చరిత్ర, ఆర్థికం, రాజనీతి, భూగోళశాస్త్రాల్లో అన్ని విషయాలూ తెలుసుకున్నాను. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ఆంత్రొపాలజీని ఎంచుకున్నాను. ఇంటర్వ్యూ విషయంలో నిర్దిష్టంగా ఇలాగే సన్నద్ధమవ్వాలనేమీ లేదు. ఆ సమయంలో మాతో శిక్షణ తీసుకుంటున్న మరో 10 మంది బృందంగా ఏర్పడి ఎక్కువగా చర్చించేవాళ్లం. అది ఉపయోగపడింది. 

హైదరాబాద్, దిల్లీలోని ప్రముఖ సివిల్స్‌ శిక్షణశాలల్లో తర్ఫీదు పొందాను. అన్ని కోచింగ్‌ సెంటర్లలో అన్ని విషయాల్లో మెరుగైన శిక్షణ ఉండదు. ఒకచోట ప్రాథమిక పరీక్షకూ, మరోచోట ప్రధాన పరీక్షకు మెరుగైన శిక్షణ లభిస్తుంది. నాకు శిక్షణ ఇచ్చిన కోచింగ్‌ సెంటర్ల వెబ్‌సైట్లు ఎక్కువగా చూసేవాడిని ఎన్‌సైట్స్‌ ఐఏఎస్, ఫోరం ఐఏఎస్, విజన్‌ ఐఏఎస్‌ లాంటివి. లక్ష్మీకాంత్‌ ఇండియన్‌ పాలిటీ, స్పెక్ట్రం హిస్టరీ, 11, 12 తరగతుల సీబీఎస్‌ఈ పాఠ్యపుస్తకాలు, రోజూ వార్త్తాపత్రికలూ చదివేవాడిని. రోజుకు 10-12 గంటల సమయం సన్నద్ధతకు కేటాయించేవాడిని. సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి ప్రోత్సాహం, ప్రేరణ ఉండాలి. ఈ రెండూ నాకు మా తల్లిదండ్రుల నుంచి అద్భుతంగా అందాయి!

అన్నయ్య బాటలో..: వసంత్‌కుమార్‌

నాన్న భీమేశ్వరరావు విద్యుత్తుశాఖ ఏఈగా ఏలూరులో విధులు నిర్వహిస్తున్నారు. అమ్మ అనసూయ గృహిణి. కుటుంబంలో చాలా వరకూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటం, అన్నయ్య సివిల్స్‌కి సన్నద్ధం అవుతుండటంతో నాకు కూడా ఈ పరీక్షపై ఇష్టం పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రజల సమస్యలు తీర్చే ఉద్యోగం చేయటం మరింత సంతృప్తినిస్తుందని అమ్మానాన్నలు చెప్పిన మాటలు ప్రేరణనిచ్చాయి. వైజాగ్‌ గాయత్రి విద్యాపరిషత్తులో ఇంజినీరింగ్‌ చేశాను. అది పూర్తికాగానే అన్నయ్య దిల్లీలో శిక్షణ తీసుకుంటున్న చోటే చేరాను. ఎలా సన్నద్ధం కావాలి, ఏ విషయాలపై పట్టు పెంచుకోవాలి, ఏ విభాగాల్లో బలహీనంగా ఉన్నాను.. ఇలాంటివి అన్నయ్య జగత్‌సాయి నుంచి తెలుసుకున్నాను. తన అనుభవాల నుంచి నేర్చుకుని, తను చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడ్డాను. రోజులో 10 గంటలు సన్నద్ధతకు కేటాయించాను. అన్నయ్య  చదివిన పుస్తకాలే చదివాను. ఇద్దరం కలిసి సిద్ధం అవ్వటం వల్ల చర్చించుకునేవాళ్లం. ప్రాథమిక పరీక్షలో తొలిసారి విఫలం అయ్యాను. ప్రస్తుతం రెండో ప్రయత్నంలో 170వ ర్యాంకు సాధించాను. 
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

‣ న్యాయవిద్యలో మేటి!

Posted Date : 27-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌