‣ అవగాహన పెంచుకుంటే పలు అంశాలపై పట్టు
కెరియర్ ఎంపిక విషయంలో అనుభవజ్ఞులైన పెద్దలను సలహా అడిగారనుకుందాం. వారి నుంచి ‘సివిల్ సర్వీసెస్‌కు ప్రయత్నించండి’ అనే సలహా వస్తుంది. ఆ వెంటనే.. ‘నేను జనరల్ నాలెడ్జ్ (జీకే)లో బాగా పూర్. సివిల్ సర్వీసెస్‌కు సరిపోనేమో’ అనే సందేహాన్ని మీరు వెలిబుచ్చుతారు. ‘తగినంత జీకే లేదని ఎందుకనుకుంటున్నారు’ అంటే.. ‘సివిల్స్ టాపర్ల మాక్ ఇంటర్వ్యూలు చూశా. వాళ్లకు జీకే ఎక్కువని అర్థమైంది. నాకంత పరిజ్ఞానం లేద’నే సమాధానం వస్తుంది.
ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. జనరల్ నాలెడ్జ్ విషయంలో.. ఏ ఒక్కరూ పుట్టుకతోనే పరిపూర్ణులు కారు. టాపర్లకు ఉండే జనరల్ నాలెడ్జ్ మిమ్మల్ని ఆకట్టుకుని ఉండొచ్చు. కానీ దాన్ని సంపాదించడానికి వాళ్లు.. వివిధ అంశాల మీద ఏకాగ్రతతో దృష్టిని కేంద్రీకరించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ ఇంటర్వ్యూలను మరింత జాగ్రత్తగా గమనించినట్లయితే.. వాళ్లు ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పలేదనే విషయాన్ని మీరు గమనిస్తారు. ప్రజా సేవకులైన సివిల్ సర్వీసెస్ అధికారులు.. వివిధ విధానాలను రూపొందించే విషయంలో రాజకీయ నాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి అవసరమైన పరిజ్ఞానంతో ఉంటారు. ఇలాంటి పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయిలో సివిల్ సర్వీసెస్‌లో పరీక్షిస్తారు. దీన్నే జనరల్ స్టడీస్ (జీఎస్) అంటారు. దీనికీ జనరల్ నాలెడ్జ్కీ తేడా ఉంది. వివిధ క్విజ్ ప్రోగ్రాముల్లో అడిగే ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పే అభ్యర్థులు కొందరు సివిల్ సర్వీసెస్ పరీక్షలో అర్హత సంపాదించలేకపోవడానికి కారణం ఇదే.
కింద ఇచ్చిన ప్రశ్నలు సివిల్ సర్వీసెస్‌లో అడిగినవి. వీటినే పరిమితమైన జనరల్ నాలెడ్జ్ కోణంలో ఎలా అడగొచ్చనేది పక్కన చూడవచ్చు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు నిర్దేశించిన సిలబస్ వెనకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే ఒకే విషయాన్ని జనరల్ స్టడీస్‌లో ఎలా అడుగుతారో, జనరల్ నాలెడ్జ్‌లో ఎలా అడుగుతారో గ్రహించవచ్చు. ఈ తేడా తెలుసుకుంటే.. దానికి అనుగుణంగా చదవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు.
పరిణామ క్రమంలో...
బ్రిటిష్ పాలనా కాలంలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు రూపకల్పన చేశారు. అదే పరీక్షా విధానాన్ని స్వాతంత్య్రానంతరం 1979 వరకు అనుసరించారు. దానిలో ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా రాయాల్సి మూడు డిస్క్రిప్టివ్ సబ్జెక్టులు ఉండేవి. అవేమిటంటే.. ఎస్సే, జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్.
‣ ప్రభుత్వం 1985లో కొఠారీ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ప్రభుత్వ పరిధి సామాజిక-ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన, పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, పరిశ్రమల ఆధునికీకరణ, మానవ వనరుల అభివృద్దితో పాటు కనీస అవసరాలైన నీరు, ఆరోగ్యం, విద్య, రోడ్లు, విద్యుత్తు, గృహకల్పన.. మొదలైనవి అందించేలా విస్తృతం కావాలని సూచించింది. ఈ లక్ష్యాల సాధనకు సివిల్ సర్వీస్ అభ్యర్థులు కృషిచేయాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ పరీక్షకు పోటీపడే అభ్యర్థులకు సంబంధిత పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉండటమే కాకుండా సమాజ శ్రేయానికి పాటుపడే భావోద్వేగం, నైతిక విలువలూ ఉండాలి. ఈ లక్షణాలన్నీ వారికి ఉన్నాయో లేదో సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు.

‣ ఈ కమిటీ జనరల్ నాలెడ్జ్ పదాన్ని జనరల్ స్టడీస్‌గా మార్చింది. ప్రిలిమినరీ పరీక్షలో 150 మార్కులకు ఒక జనరల్ స్టడీస్ పేపర్ని తప్పనిసరి చేసింది. మెయిన్ పరీక్షలో ఒక్కో పేపర్‌కు 300 మార్కుల చొప్పున రెండు జనరల్ స్టడీస్ పేపర్లు ఉండేలా చేసింది. ఫలితంగా దీని పరిధిలోకి విస్తృతమైన అంశాలు వచ్చేశాయి.
‣ అప్పటినుంచీ జనరల్ స్టడీస్ సబ్జెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయుల్లో జరిగే ప్రతి పబ్లిక్ సర్వీస్ పరీక్షకు తప్పనిసరి పేపర్‌గా మారింది.
‣ సారాంశం ఏమిటంటే... జనరల్ స్టడీస్ ప్రధానంగా దృష్టిపెట్టేది- ప్రజలపై. అంటే వారికి సంబంధించిన సకల అంశాలూ, వారిపై ప్రభావం చూపే విషయాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రజల దృక్కోణం, వారి అభివృద్ధి గురించిన పరిజ్ఞానాన్ని జనరల్ స్టడీస్ పరీక్షిస్తుంది.
ఈ చర్చ అంతా జనరల్ స్టడీస్ సన్నద్ధత ఎలా చేయాలనే విషయంలో స్పష్టత రావడానికి తోడ్పడుతుంది. ఈ దృక్కోణంలోనే జనరల్‌స్టడీస్ సిలబస్‌లో ఇండియన్ హిస్టరీ-కల్చర్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సోషల్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్, సొసైటీ అండ్ సోషల్ జస్టిస్, ఇంçర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీలను భాగంగా చేర్చారు.
కార్యాచరణ ప్రణాళిక
1. ఇండియన్ హిస్టరీ, కల్చర్‌కు సంబంధించిన పుస్తకాలను ముందుగా చదవాలి. చరిత్ర చదివేటప్పుడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని వివిధ పాలకులు ఏ విధంగా పరిష్కరించారనే దాని మీద దృష్టి పెట్టాలి. ప్రజా సంక్షేమం కోసం వివిధ పాలకులు చేపట్టిన కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
2. ‘భారత జాతీయోద్యమం’ గురించి చదివేటప్పుడు.. ఆధునిక భారతదేశ నిర్మాతలు, జాతీయోద్యమంలో వారి పాత్ర మీద దృష్టి కేంద్రీకరించాలి. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించే దిశగా చేపట్టిన వివిధ కార్యకలాపాల మీద పరిజ్ఞానం పెంచుకోవాలి.
3. స్వాతంత్య్రానంతరం భారతదేశం సాధించిన ప్రగతిని తెలియజేసే ఏ పుస్తకం చదివినా ఫర్వాలేదు. వాటిల్లోని ముఖ్యాంశాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
4. స్వేచ్ఛ, సమానత్వం... లాంటి పదాలకు రాజకీయపరమైన నిర్వచనాన్ని తెలుసుకోవాలి. పాలనాపరమైన విషయాల్లో వాటిని ముడిపెడుతూ అవగాహన పెంచుకోవాలి.
5. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకుని, నోట్సు తయారుచేసుకోవాలి. ఆ నోట్సులోని అంశాలు... వై, వెన్, వాట్, హూ, వేర్ అండ్ హౌ అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేలా ఉండాలి.
6. ఇండియన్ జాగ్రఫీ విషయంలో పరిజ్ఞానం సంపాదించాలి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విషయాలనూ గుర్తించాలి.
7. భారత సమాజంలో ఉన్న సామాజిక సమస్యల గురించి తెలుసుకోవాలి. వాటి పరిష్కార మార్గాల దిశగా ఆలోచించాలి.
8. వర్తమానాంశాలపై పట్టు సాధించాలి. అలాగే పేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బడుగు వర్గాల జీవితాలపై ప్రభావం చూపించే అంశాల మీద అవగాహన పెంచుకోవాలి.
9. విషయాలను విభిన్న కోణాల్లో గ్రహించడం మొదలుపెడితే.. విజయ సాధన దిశగా మీ ప్రయాణం ప్రారంభమైనట్టే.
