• facebook
  • whatsapp
  • telegram

‘ఎథిక్స్‌’లో జవాబులు ఎలా ?

ప్రజాస్వామ్య ప్రభుత్వం చట్టాల్ని రూపొందిస్తే సివిల్‌ సర్వీసులు వాటిని అమలు చేస్తాయి. సమాజం సాఫీగా ముందుకు సాగాలంటే మనిషిలోని నైతిక విలువలూ, చట్టం రెండూ కలిసి పనిచేయాలి. సివిల్స్‌ అభ్యర్థులకు నైతిక విలువల ప్రాధాన్యం తెలియజేయటం ‘ఎథిక్స్‌, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్‌’ పేపర్‌ అసలు లక్ష్యం. దీనిలో అధిక మార్కులు సాధించే అభ్యర్థులకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువుంటాయని చెప్పవచ్చు!


నిజమైన నాయకత్వ లక్షణాలున్నవారు సవాళ్ళను దీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నతాధికారులు విధుల నిర్వహణలో అంతర్గత ఇబ్బందులు, ఒత్తిళ్ళు తట్టుకోవడానికి మానసిక దృఢత్వం అవసరం. అధికారులు ఉత్తమ ప్రణాళికలు వేసుకుని, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొని సేవలందించటానికి మానసికంగా సంసిద్ధులైవుండాలి.
2014లో జరిగిన సివిల్స్‌ మెయిన్స్‌ ‘ఎథిక్స్‌, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్‌ పరీక్షలో అడిగిన ప్రశ్న... దీనికి సమాధానం ఏ రకంగా రాయవచ్చో చూద్దాం.
 

All human beings aspire for happiness. Do you agree? What does happiness mean to you? Explain with examples. (150 words & 10 marks)
 

మనుషులందరూ సంతోషాన్ని కోరుకుంటారని నేను నూటికి నూరుశాతం అంగీకరిస్తాను. మనిషి జీవితాన్ని ఆనందమయం చేసే ఓ ప్రధాన భావోద్వేగమే సంతోషం. అది మనిషి మనసులో, ఆలోచనల్లోనే దాగివుంది. మజ్జిగలోంచి వెన్నముద్ద చిలికి తీసినట్టు, ఎవరికి వారు తమ సంతోషాన్ని తమ మనసులోంచి వెలికితీయాలి.

పసివాడు సృష్టిలోని ప్రతి చమత్కారాన్నీ ఎంతో ఆహ్లాదంగా చూస్తూ కేరింతలు కొడుతూ ఎంతో ఆనందంగా ఉంటాడు. వయసు పెరిగేకొద్దీ మనిషి తన సంతోషం తగ్గిపోతున్నట్లు భావిస్తాడు. కానీ నిజానికి సంతోషం పెరగదూ, తరగదూ. ఆలయ పుష్కరిణిలా ఎల్లవేళలా నిండుగానే ఉంటుంది. సమస్య అంతా మన మనసులోనే! ఆస్వాదించడంలోనే ఉంది. మనలోనే ఆనంద అక్షయపాత్ర ఉన్న సంగతి మరిచిపోయి ఎక్కడెక్కడో వెతుకుతాం.
ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఎలా సాధ్యం? అప్పుడప్పుడూ కష్టాలూ నష్టాలూ వస్తుంటాయిగా అని మనం అనుకుంటాం! పొట్టచెక్కలు చేసే హాస్యాన్ని ఒక్కసారి వింటే నవ్వుతాం. రెండోసారి వింటే కొంచెం నవ్వుతాం. అదే నాలుగోసారీ, ఐదోసారీ నవ్వు వస్తుందా? మరి ఒక్క కష్టానికి పదిసార్లు, వందసార్లు కుమిలి కుమిలి ఏడుస్తామా? ఒక హాస్యపు సందర్భానికి ఒకసారే మనస్ఫూర్తిగా నవ్వు వస్తుంది, అది సహజం. ఒక కష్టం ఒకసారే బాధపెడుతుంది, ఇది కూడా సహజమే. రెండోసారీ, తర్వాత మరెన్నోసార్లూ మనం అనుభవించేది అనవసరమైన క్షోభే!

పళ్ళబుట్టలో కుళ్ళిన పళ్ళుంటే ఏరి చెత్తబుట్టలో పడేస్తాం. నాణ్యమైనవాటిని మాత్రం భద్రంగా దాచుకుంటాం. మరుసటి రోజుకు ఇంకొన్ని కుళ్ళిపోతే వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాం. ‘అయ్యో, పడేస్తున్నాం’ అనే బాధ వల్ల మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కుళ్ళిన పళ్ళను అట్టిపెట్టుకుంటే అది మంచి పళ్ళకు కూడా సోకి అన్నీ చెడిపోతాయి. మనసులోని బాధ కూడా అంతే! ఎప్పటికప్పుడు తీసివేయకపోతే అది మన సంతోషాన్ని కూడా పాడుచేస్తుంది.
నల్లబల్ల మీద అందమైన బొమ్మ గీసి ఆనందిస్తాం. అంతకన్నా మంచి బొమ్మ గీయాలనిపించినపుడు దాన్ని తుడవకుండా గీస్తే బొమ్మ గజిబిజిగా కనిపిస్తుంది. పడిన శ్రమంతా వృథా అవుతుంది. జీవితానుభవాలు కూడా అంతే! బాధ కలిగించే ఆలోచనలు, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలు మనసులోంచి తీసేయకపోతే సంతోషం దరికి చేరుకోలేం. సంతోషం మనం చేసే ప్రతి మంచి పనిలోనూ, ప్రతి మంచి ఆలోచనలోనూ ఉంటుంది.
 

సంతోషంగా ఉండటమనేది మనం ఎంత సంపాదించామనేదానిపై ఆధారపడివుండదు. ఎన్ని ఆధునిక పరికరాలు మన వద్ద ఉన్నాయనే దానిపై ఉండదు. అవసరాన్ని బట్టి భారమైన విషయాలు తేలికగా భావించాలి. ఆత్మీయులు చేసిన పొరపాట్లను పెద్దమనసుతో క్షమించేయాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తగవులు మానాలి. మనం మానవ మాతృలమని గుర్తించాలి. పగలూ ప్రతీకారాలూ సంతోషాన్నివ్వవు. పగ అంటే తలపై ఎంతో భారంతో కొండ ఎక్కుతున్నట్టే. బరువు అంతా దింపుకుంటే కొండ ఎక్కటం తేలిక కదా?
అవసరాన్ని బట్టి మన డబ్బు, శారీరక శ్రమ, మానసిక శ్రమ, మన సమయం... ఇవి ఇతరులకివ్వాలి. ఇతరుల విజయం, సంతోషం కోసం పాటుపడాలి. అనాథలకు సేవ చేయడంలో ఆనందం ఉంటుంది. ‘సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయి, దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయి’ అన్న గురజాడ మాటలను చేతల్లో చూపెడితే సంతోషం జాడ తెలుస్తుంది. మన సుభాషితాలు చెప్పినట్టు ‘ఇతరుల సంతోషం కోసం చెట్లు పండ్లనిస్తాయి, ఆవు పాలిస్తుంది, నది ప్రవహిస్తుంటుంది’. అందుకే ఇతరుల సంతోషం కోసం కృషి చేయాలి. దానిలోనే మన సంతోషమూ ఇమిడివుంటుంది. అప్పుడే మన ఉనికికి సార్థకత!
 

గుర్తుంచుకోవాల్సినవి

 జవాబులో వాస్తవిక ధోరణి ప్రతిబింబించాలి.
 నిజాయతీ, సమగ్రత, దయాగుణం, నిష్పాక్షికత లాంటి పదాలు జవాబుల్లో కనపడాలి.
 అవసరాన్ని బట్టి తత్వవేత్తల, మానసిక నిపుణుల మాటలనో, నిర్వచనాన్నో ఉపయోగించి విషయ ప్రాధాన్యం తెలియజేయాలి.
 సందర్భానుసారం మీ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాన్ని రాసినా ఫరవాలేదు.
 ఏ రకం సమస్యలైనా అందరి శ్రేయమే పరమావధిగా నొక్కిచెప్పాలి.
 సందిగ్ధత లేకుండా నిర్దిష్టంగా జవాబు ఉండాలి.
 సమస్యకు అతి తక్కువ సమయంలో పరిష్కారం అందించేలా విషయాన్ని విశదపరచాలి.
 చూపే పరిష్కారం పరిపాలనకు సంబంధించిన చట్టం, న్యాయపరిధికి లోబడివుండాలి.
 జటిల సమస్యలకు కూడా అసాధారణమైన ఆలోచనా సరళి చూపవచ్చని ఒప్పించాలి.
 ‘ప్రజాసేవే నా తొలి ప్రాథమ్యం’ అనేలా వైఖరి ప్రదర్శించాలి.
 సార్వజనీనమైన సివిల్‌ సర్వీస్‌ విలువలే నా విలువలు - అన్నట్టుగా అభ్యర్థుల వ్యక్తిత్వం ప్రతిబింబించాలి.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌