సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలనే ఉద్దేశం ఉన్నవారిలో చాలామందిలో ఎన్నో సందేహాలుంటాయి. దీనికి తగిన సామర్థ్యాలు తమలో ఉన్నాయో లేవో...తమ ప్రతిభ సివిల్స్ స్థాయికి సరిపోతుందో లేదో..! ఇలా ఎన్నో అనుమానాలు వీరిని సతమతం చేస్తుంటాయి. వీటిని నివృత్తి చేసుకుని సివిల్స్ పథంపై అవగాహన పెంచుకోవటం సివిల్స్ ఆశావహ విద్యార్థుల కర్తవ్యం. ఇందుకు ఉపకరించే అంశాలతో ఇదిగో- కథనం!
తమ పిల్లలు సివిల్ సర్వీసెస్ కెరియర్ను ఎంచుకునేలా ప్రోత్సహించే తల్లిదండ్రులు కొంతకాలంగా బాగా పెరిగారు. ఇందుకు అనుగుణంగా గట్టి పునాది ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలోనే పడాలని ఆశిస్తున్నారు. ఇలా ప్రారంభ దశలోనే పునాది వేయాలని ఆలోచించడం అభినందనీయమే. కానీ ఇదంతా సరైన దిశలో, పద్ధతిలో జరిగితేనే తగిన ఫలితం ఉంటుంది. దీనికంటే ముందుగా సివిల్ సర్వీసెస్ కెరియర్ను సమగ్రంగా అర్థం చేసుకోవడం, దానికి కావాల్సిన ప్రాథమిక అర్హతలు తమకు ఉన్నాయో లేదో అభ్యర్థులు పరిశీలించుకోవడం ఎంతో అవసరం. ఉద్యోగం ద్వారా ఉపాధి దొరుకుతుంది. పడిన కష్టానికి జీతం రూపంలో ప్రతిఫలమూ లభిస్తుంది. కానీ సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకున్నప్పుడు... దీన్నో వృత్తిగా మాత్రమే భావించకూడదు. ఎందరో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప అవకాశం లభించేలా చేయటమే ఈ కెరియర్ ప్రత్యేకత! .
పెద్ద సవాలు
నిజానికి సరైన కెరియర్ను ఎంపిక చేసుకోవడం అనేది విద్యార్థులకు పెద్ద సవాలే. తమకు సరిపడని వృత్తిని ఎంచుకుని ఇబ్బందులు పడుతున్న వారెందరో ఉన్నారు. తప్పుగా నిర్ణయం తీసుకోవడం.. లేదా విపరీతమైన పోటీ వల్ల కొంతమంది ఏదో ఒక వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. తమకు కచ్చితంగా తగిన వృత్తిని ఎంచుకోవాలంటే స్వీయ అవగాహనతో పాటు, నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవడం ఎంతో అవసరం.
తమ అభీష్టానికి తగినట్టుగా కెరియర్ను ఎంచుకున్నవారు ఎంత గట్టి పోటీనైనా ఎదుర్కొని విజయ శిఖరాలను అధిరోహించగలుగుతారు. ప్రయత్నమూ కష్టమూ తోడైతే ఫలితం విజయమేనన్నది నిజమే! కానీ అన్ని సందర్భాల్లోనూ ఇది నిజం కాకపోవచ్చు. అందరూ అన్ని వృత్తులకూ సరిపోరు. ప్రతి వ్యక్తీ ఒక నిర్దిష్ట వృత్తికి అన్నివిధాలా సరిపోతారు.
రెండు దశలు ముఖ్యం
విద్యార్థి జీవితంలో రెండు దశలు చాలా ముఖ్యమైనవి. స్కూలు, జూనియర్ కాలేజీ దశ మొదటిది. జూనియర్, డిగ్రీ కాలేజీల మధ్య ఉండే రెండో దశ చాలా ముఖ్యమైంది. తానేం కావాలనుకుంటున్నాడో విద్యార్థి తెలుసుకోవాలి. దాని కోసమే కృషి చేయాలి. మ్యాథమేటిక్స్ అంటే ఆసక్తిలేని విద్యార్థి ఇంజినీర్‌గా విజయం సాధించలేడు కదా! ఏ వృత్తికి సరిగ్గా సరిపోతారనే విషయంలో ప్రాథమిక స్థాయిలోనే.. అంటే విద్యార్థి దశలోనే తగిన సూచనలు అందుతాయి. వీటిని నిర్లక్ష్యం చేసి పొరపాటుగా కెరియర్ను ఎంచుకుంటే విఫలమయ్యే అవకాశమే ఎక్కువ.
జీతం.. ఆత్మసంతృప్తి
గత కొన్నేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి ప్రాధాన్యం పెరిగింది. దీంతో కొంతమంది తమకు ఆసక్తి లేకపోయినా... కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడి, ఎక్కువ జీతం అందుకోవచ్చనే ఉద్దేశంతో ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల అధిక వేతనాలు అందుకోవచ్చుగానీ ఆత్మసంతృప్తిని పొందలేరు. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంపాదించడమే జీవిత లక్ష్యం అయిలే. ఉన్నత విద్య చదవడం ఎందుకు? సంపాదించడానికి సులువైన దారులెన్నో ఉన్నాయి.
సరైన కెరియర్ను ఎంచుకున్నప్పుడే సృజనాత్మకత వికసించి జీవితంలో విజయం సాధ్యమవుతుంది. ఏ ప్రొఫెషన్‌ను ఎంచుకుందామనుకున్నా... ముందుగా దానికి తాము సరిపోతామో లేదోననే విషయాన్ని గమనించుకోవాలి. ఈ విషయాన్ని వివిధ కోణాల్లో పరిశీలించుకోవాలి. సివిల్ సర్వీసెస్‌ను కెరియర్‌గా ఎంచుకోవాలంటే తగిన వైఖరి ఎంతో అవసరం. ఈ కెరియర్ను ఎంచుకోవడంలో తమకున్న అనుకూలతల గురించి విశాల దృక్పథంతో ఆలోచించాలి.
మీ స్కోరెంతో చూసుకోండి
మీకు ఏ వృత్తి అంటే ఇష్టమో... జీవితంలో మీకేం కావాలో తెలుసుకోవడం కాస్త కష్టమే. మీ వైఖరిని విశ్లేషించుకోవడానికి ఈ చిన్న ప్రయత్నం చేయొచ్చు. ఐఏఎస్/ ఐపీఎస్/ ఐఆర్ఎస్ కావాలంటే కొన్ని భిన్నమైన నైపుణ్యాలు అవసరం అవుతాయి. కింది చెక్‌లిస్ట్ ఆధారంగా సివిల్ సర్వీసెస్‌కు మీరు సరిపోతారో లేదో పరీక్షించుకోవచ్చు.
‣ 6 ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు మీ జవాబు 2 అయితే.. సివిల్ సర్వీసెస్‌కు మీరు అన్నివిధాలా తగిన అభ్యర్థి.
‣ 6 ప్రశ్నల్లో 4 ప్రశ్నలకు మీ జవాబు 2 అయితే... సివిల్ సర్వీసెస్ మీకు అనుకూలమే.
‣ 3 ప్రశ్నలకు మీ జవాబు 2 అయితే... సివిల్ సర్వీసెస్‌కు అనుకూలంగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి.
‣ 2 ప్రశ్నలకు మీ జవాబు 2 అయితే... సివిల్ సర్వీసెస్ మీకు తగినది కాకపోవచ్చు. మీకు ప్రైవేటు రంగమే సరైన ఎంపిక.
పై విధంగా స్వీయ విశ్లేషణ చేసిన తర్వాత మీరు సివిల్ సర్వీసెస్‌కు సరిపోతారని తేలితే.. సివిల్స్ పరీక్షకు తగిన లక్షణాలు మీకున్నాయో లేదో గమనించుకోవటం తర్వాతి దశ.
