• facebook
  • whatsapp
  • telegram

వర్తమానంపై..పట్టు ఎలా? 

ఏ పోటీ పరీక్ష రాయాలన్నా వర్తమాన అంశాల (కరెంట్‌ అఫైర్స్‌)పై అవగాహన ఎంతో అవసరం. ప్రొఫెషనల్‌ కాలేజీలో ప్రవేశపరీక్ష రాయాలన్నా, ఇంటర్వ్యూలో గెలుపొందాలన్నా తాజా విశేషాలు తెలుసుకోవాల్సిందే. సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల్లో వర్తమాన అంశాలు అంతర్భాగం. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ విభాగంపై పట్టు సాధించాలంటే విద్యార్థులు వేటిపై దృష్టి పెట్టాలి? ఏయే మెలకువలు పాటించాలి?  

‘వార్తాపత్రికలు చదివి కరెంట్‌ అఫైర్స్‌ను తెలుసుకోవటం అలవాటు లేదు. ప్రాంతీయంగా సంచలనం కలిగించిన విషయాలను మాత్రం తెలుసుకుంటాను. మరి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు పోటీ పడటానికి నాకు అర్హత ఉందా లేదా?’ - ఇదే సందేహం చాలామంది విద్యార్థుల్లో కనిపిస్తుంటుంది.  ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించినవారిలో కొంతమంది మొదట్లో వార్తలు, వర్తమానాంశాల విషయంలో అంత ముందంజలో లేరు. ప్రస్తుతం వార్తలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌ మీద ఆధారపడటం పెరిగింది. అయినా సివిల్స్‌ లాంటి పరీక్షకు అవసరమైన వర్తమానాంశాలను తెలుసుకోవడం ఇప్పుడైనా తాజాగా మొదలుపెట్టవచ్చు. 

కరెంట్‌ అఫైర్స్‌ అంశాలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియక సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులు ఇబ్బందులు పడుతుంటారు. మిగతా పరీక్షలతో పోలిస్తే.. సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌-1 పరీక్షల్లో వీటికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్షలో కరెంట్‌ అఫైర్స్‌ మూడు విధాలుగా ఉంటుంది. 

మిగతా ప్రశ్నలతో పోలిస్తే కరెంట్‌ అఫైర్స్‌పైన వచ్చే ప్రశ్నలు మరీ ఎక్కువగా ఉంటాయి (100కు 20 వరకు). కొన్నేళ్ల క్రితం సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌లో ఇలా వచ్చాయి. 

నేరుగా కరెంట్‌ అఫైర్స్‌ మీద వచ్చే ప్రశ్నలు మిగతా విభాగాల ప్రశ్నలతో పోలిస్తే సమతూకంలో ఉంటాయి (ఉదాహరణకు 100కు 8-12 ప్రశ్నలు).

ఎక్కువ విభాగాల నుంచి అడిగేవాటిలో వర్తమానాంశాలతో సంబంధమున్న ప్రశ్నలు ఉండొచ్చు. 

వార్తల్లో ముఖ్యాంశాలను రాసుకునేదెలా? 

పోటీ పరీక్షల అభ్యర్థులు ఇతర పాఠకుల్లాగా వార్తాపత్రికను చదివేస్తూపోకూడదు. ముఖ్యాంశాలను రాసుకోవాలి. లేకపోతే ఆ అంశాలు తర్వాత గుర్తుండవు.  

ఉదాహరణకు 2021 డిసెంబరు మొదటి వారంలో ప్రచురితమైన వార్తాపత్రిక చదువుతున్నారు అనుకుందాం. అందులో ‘నదులను అనుసంధానం చేసే కెన్‌-బెత్వా ప్రాజెక్టుకు నిధుల మంజూరు, అమలుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది’ అనే వార్త ఉంది. ఇది ముఖ్యమైన వార్త. దీనిపై నోట్సు రాసుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్షల నేపథ్యంలో ముఖ్యమైన వార్తే కాకుండా దీని నుంచి ఎన్నో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 

1. కెన్‌- బెత్వా లింక్‌ ప్రాజెక్ట్‌ అంటే ఏమిటి?

2. ఇది ఎక్కడ ఉంది? దేశంలోని ఏయే రాష్ట్రాలకు దీనితో సంబంధం ఉంది? 

3. దీన్ని ఎలా అమలుచేస్తున్నారు?

4. ఈ ప్రాజెక్టు ఉపయోగం ఏమిటి? దీని వల్ల ఏ ప్రాంతాలు ప్రయోజనం పొందుతాయి?

5. ఈ ప్రాజెక్టు పర్యావరణం మీద ప్రభావం చూపిస్తుందా?

6. పర్యావరణం మీద ప్రభావాన్ని తగ్గించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు సేకరించాలి. ఆబ్జెక్టివ్, విశ్లేషణాత్మక (గ్రూప్‌-1, గ్రూప్‌-2), సంక్షిప్త, వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు జవాబు రాయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. సంబంధిత పటం (మ్యాప్‌) వేసుకుంటే భౌగోళిక వ్యవస్థ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి తోడ్పడుతుంది.

ముందడుగు ఎలా?

‘కరెంట్‌ అఫైర్స్‌కు ఎలా సన్నద్ధం కావాలి?’ అనేది సివిల్స్‌కు సిద్ధం అవుతోన్న విద్యార్థులు మాత్రమే కాదు.. వారి తల్లిదండ్రులు కూడా అడుగుతోన్న ప్రశ్న. రోజూ వార్తాపత్రిక చదవడమే సరైన మార్గం.   సమాధానం తేలిగ్గానే ఉన్నప్పటికీ సాధ్యాసాధ్యాలనూ ఒకసారి గమనించాలి. రోజూ వార్తాపత్రిక చదివి దాంట్లోని అంశాలను గుర్తుంచుకోవాలంటే మాటలు కాదు. వార్తాపత్రికలో దాదాపు 16 పేజీలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది నెట్‌లోనే పేపర్‌ చదువుతున్నారు. దీనివల్ల ఏకాగ్రతను నిలిపి ఉంచే అవకాశం తక్కువ. పరీక్షల కోణం నుంచి చూస్తే వార్తాపత్రికలో ఏ అంశాలు చదవాలో గ్రహించటం ముఖ్యం. 

జనరల్‌ న్యూస్‌పేపర్‌: వివిధ వర్గాల పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని వార్తాపత్రికలు అన్ని రకాల అంశాలనూ ప్రచురిస్తుంటాయి. సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా ఈ జనరల్‌ స్వభావమున్న జాతీయ వార్తాపత్రికను చదవడం అలవాటు చేసుకోవాలి. రాష్ట్ర సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రాంతీయ వార్తా పత్రికలను ఎంచుకోవచ్చు. 

పేజీల వర్గీకరణ: ప్రతి వార్తాపత్రిక కొన్ని పేజీలను కొన్ని ప్రత్యేకాంశాల కోసం కేటాయిస్తుంది. ఉదాహరణకు ముఖ్యమైన వార్తల కోసం మొదటి పేజీని కేటాయిస్తారు. దీంట్లో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ, స్థానిక (వార్తాపత్రిక ఎక్కడ ప్రింట్‌ అవుతుందో ఆ నగరానికి సంబంధించిన) వార్తలుంటాయి. ఈ వర్గీకరణను అర్థం చేసుకోవాలి. 

పరీక్షను బట్టి పేజీల ఎంపిక: సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధం అవుతుంటే ప్రాంతీయ, నగరానికి సంబంధించిన వార్తలున్న పేజీలను చదవాల్సిన అవసరంలేద]ు. జాతీయ, అంతర్జాతీయ అంశాలున్న పేజీలను చదివితే సరిపోతుంది. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షల కోసమైతే ప్రాంతీయ అంశాలుండే పేజీలపై దృష్టి పెట్టొచ్చు. సివిల్స్‌ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలక్కూడా హాజరవటం మంచిది కాబట్టి ప్రాంతీయ, జాతీయ అంశాలు రెండింటినీ చదవటం అలవాటు చేసుకోవాలి. అయితే ప్రాంతీయ అంశాల కంటే జాతీయ, అంతర్జాతీయ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.  

ప్రతిరోజూ చదవాలి: ఏయే పేజీలు చదవాలనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత వాటిని రోజూ క్రమం తప్పకుండా చదవడం మొదలుపెట్టాలి. రోజూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకుని అదే సమయంలో చదవడం అలవాటు చేసుకోవాలి. ఒకరోజు చదవడాన్ని వాయిదా వేస్తే అదే అలవాటుగా మారొచ్చు. వారం రోజులపాటు అలా చదవడాన్ని వాయిదా వేశారనుకుందాం. అలాగే నెల రోజులకు వాయిదా వేసి ఆ తర్వాత పోగుపడిన పాత పేపర్లను అమ్మేయటం తప్ప మార్గం ఉండదు.  

టీవీ బదులు వార్తాపత్రికే ఎందుకు?

1. వార్తాపత్రికలో ప్రచురించినా, టీవీలో ప్రసారమైనా వార్త వార్తే కదా. కానీ పోటీ పరీక్షల కోసం వార్తాపత్రికనే చదవాలంటారు, ఎందుకు?

టీవీలో, డిజిటల్‌ మీడియాలో ఎక్కువగా దృశ్యరూపంలో విషయం ఉంటుంది. వీటిలో సాధారణంగా సంచలనాత్మక వార్తలనిస్తూ ప్రేక్షకుల ఆసక్తిని నిలపాలనుకుంటారు. ఎప్పటికప్పుడు చోటుచేసుకునే తాజా పరిణామాలతో రోజంతా వార్తలను ప్రసారం చేస్తుంటారు. కానీ వార్తాపత్రికలో వార్తలను రోజుకు ఒకసారే ప్రచురిస్తారు. సమగ్ర వార్తాకథనాలు దీనిలో ఉంటాయి. అనవసరమైన సమాచారాన్ని వదిలేసి ముఖ్యాంశాలను మాత్రమే ప్రచురిస్తారు. వార్తలను వివిధ స్థాయుల్లోని సుశిక్షిత వ్యక్తులు.. రిపోర్టర్‌ నుంచి ఎడిటర్‌ వరకూ పరిశీలించి, సవరించిన తర్వాతే ప్రచురిస్తారు. కాబట్టి వార్తాపత్రికల్లో ప్రచురింంచే కథనాలు పోటీ పరీక్షల్లో రాయడానికి ఎంతో అనువుగా ఉంటాయి. ఇలాంటి ప్రయోజనం కల్పించేవే వీక్లీ, మంత్లీ మ్యాగజీన్లు. వీటిలో వివిధ అంశాలపై సమగ్రంగా కథనాలు అందిస్తారు.    

2. సివిల్స్‌ పరీక్షలో టాప్‌ ర్యాంక్‌ సాధించినవాళ్లందరూ రోజూ వార్తాపత్రికలు చదివామని చెప్తుంటారు. నేను గ్రాడ్యుయేట్‌నే కానీ శీర్షికలు తప్ప ఇప్పటివరకు వార్తాపత్రికను ఎప్పుడూ ఆసక్తిగా చదవలేదు. అసలు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయడానికి నేను తగినవాడినేనా? 

పాఠశాలలో, కళాశాలలో కరెంట్‌ అఫైర్స్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అవసరమైనప్పుడు మాత్రమే వార్తాపత్రిక చదువుతుంటారు. ఇప్పటివరకూ మీరు వార్తాపత్రికను సీరియస్‌గా చదవలేదంటే అర్థం.. ఇంతవరకూ చదవడం మొదలుపెట్టలేదని కాదు. ఇప్పుడు కూడా చదవడం ప్రారంభించవచ్చు. చాలామంది ర్యాంకర్లు .. పోటీ పరీక్షలు రాయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాతే వార్తాపత్రికలు చదవడం మొదలుపెడుతుంటారు. 

3. చాలామంది ర్యాంకర్లు తాము వార్తాపత్రికల సంపాదకీయాలను చదివామని చెప్తుంటారు. కానీ వాటిని చదవడానికి ప్రయత్నించినా అర్థం చేసుకోలేకపోతున్నాను. నేనేం చేయాలి? 

సంపాదకీయాలు అనేవి.. సాధారణంగా సంపాదకుని అభిప్రాయాలై ఉంటాయి. లేదా అనుభవజ్ఞుల, తగిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల భావాలై ఉంటాయి. అవి సాధారణంగా 400 నుంచి 450 పదాలుంటాయి. వీటిని గ్రహించాలంటే సంబంధిత అంశంపై పాఠకులకు తగిన ప్రాథమిక పరిజ్ఞానం అవసరం. సంపాదకీయ అంశంలోని నేపథ్యం అర్థమైతేనే మీరు దాన్ని అవగాహన చేసుకోగలుగుతారు.  

4. నేను కోచింగ్‌లో చేరాను. అక్కడ వర్తమాన అంశాలు బోధిస్తారట. అవి సరిపోవా?  

నిజమే. అవి పోటీ పరీక్ష అవసరాలకు తగినంతగా ఉండవు. వాళ్లు అనేక మూలాల నుంచి సేకరించిన సమాచారాన్ని మీకు అందిస్తారు. దాని ఆధారంగా మీరు మరింత కృషిచేసి అదనపు సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. వారు చూపిన మార్గంలో ప్రయాణించాల్సింది మీరే.  

5. కరెంట్‌ అఫైర్స్‌ నిరంతరం మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆ మార్పులను అందిపుచ్చుకోవాలంటే?

నిజమే. ఎప్పటికప్పుడు మారుతుండే వర్తమాన అంశాలకు సంబంధించి ఒక ఫైల్‌ను ఏర్పాటుచేసుకుని ఒక్కో టాపిక్‌కు సంబంధించిన పేపర్లు జోడిస్తుండాలి. ప్రతి కొత్త అంశానికీ విడిగా పేపర్‌ షీటును ఉపయోగించాలి. తేదీ వేసుకుని ఫైలుకు జోడించుకోండి. ఆ టాపిక్‌కు సంబంధించిన వ్యాసం కనిపించి ఉపయుక్తమనిపిస్తే.. దాన్ని కూడా ఫైల్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తుండటం వల్ల సమాచారం అంతా ఒకేచోట భద్రంగా ఉంటుంది. కొంతకాలం తర్వాత ఈ సమాచారంతో మీరు వ్యాసం రాసుకోవచ్చు. ఇలాచేస్తే వర్తమానాంశాల విషయంలో మీరు సంసిద్ధంగా ఉన్నట్టే అవుతుంది.  

6. ఈ వ్యాసం ఎలా రాయాలి?

మీ దగ్గరున్న ఫైల్‌లోని సమాచారం నుంచి పాయింట్లు రాసుకోవాలి. జరిగిన పరిణామాల క్రమాన్ని అనుసరించి పాయింట్లను వ్యాసంలా రాసుకోవాలి. చిన్నగా ఉండే పాయింట్లను అర్థంచేసుకుని, విస్తరించి రాసుకోవాలి. ఒరిజినల్‌ ఫైల్‌ చూడకుండా వ్యాసం రాసుకుంటే మంచిది. ఆ తర్వాత ఫైల్‌ చేసుకున్నవాటిలో ముఖ్యమైన పాయింట్లు మర్చిపోతే వాటిని జతచేయొచ్చు. ఇలాంటి కసరత్తు చేయడం వల్ల అవసరమైనప్పుడు ఆ విషయం వెంటనే గుర్తుకొస్తుంది. 

7. వార్తాపత్రికలు రాసే విధానం ద్వారా ఏమైనా నేర్చుకునే అవకాశం ఉంటుందా?

ఔత్సాహిక పాత్రికేయులందరికీ కిప్లింగ్స్‌ ఆరు మార్గదర్శకాలను అనుసరించాలని సూచిస్తారు. అవి - వాట్, వై, వెన్, వేర్, హు, హౌ. పత్రికా వార్తా నివేదికల్లో మొదటి పేరానే ఈ ఆరు ప్రశ్నలకు చాలావరకూ సమాధానం చెబుతుంది. మీరేదైనా అంశాన్ని తీసుకున్నట్లయితే ఈ ఆరు ప్రశ్నలు వేసుకుని, వాటికి సమాధానం అన్వేషించాలి. ఇలా చేయడం వల్ల పరీక్షలో రాయడానికి అవసరమైన సమాచారమంతా సమకూరుతుంది. 
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌