• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ సాధించాలంటే ఏ గ్రూపు ఎంచుకోవాలి?

టెన్త్‌ తర్వాత ఏ కోర్సులో చేరితే ఎంత ఉపయోగం?

సివిల్‌ సర్వీస్‌ సాధించాలనే ఆశయం, అభిలాష చాలామందికి ఉంటాయి. కానీ వాళ్లలో కొంతమందే ఆ లక్ష్యాన్ని అందుకోగలుగుతారు. కొందరు మొదటి ప్రయత్నంలోనే నెగ్గితే... మరికొందరు రెండు, మూడు లేదా నాలుగోసారి ప్రయత్నించినప్పుడు సాధిస్తారు. ఇన్నిసార్లు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే.. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టామనే సమాధానం వారి నుంచి వస్తుంది. దాంతో త్వరగా ప్రయత్నాలు మొదలుపెడితే వెంటనే సివిల్స్‌ సాధించవచ్చనే అభిప్రాయం కలుగుతుంది. సివిల్‌ సర్వీసెస్‌ను సాధించాలనే ఉద్దేశం ఉంటే.. టెన్త్‌ తర్వాత ఏ గ్రూపు ఎంచుకోవాలనే సందేహం చాలామందికి వస్తుంది. ఒక నిర్దిష్ట గ్రూపు చదవటం వల్ల ఉండే అనుకూలతలూ, ప్రతికూలతల గురించి తెలుసుకుందాం!

పదో తరగతి తర్వాత విద్యార్థి ఏ గ్రూప్‌ తీసుకోవాలనే నిర్ణయాన్ని సాధారణంగా తల్లిదండ్రులే తీసుకుంటారు. డాక్టర్, ఇంజినీర్, ఆర్కిటెక్ట్, లాయర్, ఐఏఎస్‌ అధికారి.. లాంటి ఏదో ఒక కెరియర్‌ను ఎంచుకోవాలని ఆశిస్తారు. తమ పిల్లలు కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించాలని కోరుకుంటారు. విద్యార్థులు పదో తరగతిలో ఉండగానే సివిల్స్‌కు ప్రయత్నించాలనే నిర్ణయాన్ని ఎక్కువ సందర్భాల్లో తల్లిదండ్రులు తీసుకుంటూ ఉంటారు.

తరతరాలుగా మానవుడు పెంపొందించుకున్న విజ్ఞానంలోని అంశాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. విద్యార్థులు కళాశాలలో ఎంచుకునే సబ్జెక్టుల సమ్మేళనాన్ని బట్టి విజ్ఞానం మొత్తాన్నీ స్థూలంగా మూడు రకాల గ్రూపులుగా విభజించుకోవచ్చు. 

1. సైన్స్‌ 

2. కామర్స్‌ 

3. హ్యుమానిటీస్‌

సివిల్స్‌ సన్నద్ధతలో ఈ గ్రూపులు ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం. 

ఈ సబ్జెక్టులు ప్రధానంగా మ్యాథమేటిక్స్‌/ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల సమ్మేళనంతో ఉంటాయి. టెన్త్‌ తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్న సబ్జెక్టు కాంబినేషన్లు ఇవే. ఇంజినీరింగ్, మెడిసిన్‌ కెరియర్లను ఇష్టపడే విద్యార్థులు ఈ కాంబినేషన్‌లోనే సబ్జెక్టులను ఎంచుకుంటారు.

సైన్సెస్‌

ప్రయోజనాలు: ఎక్కువమంది ఎంచుకుంటున్న గ్రూప్‌ కాంబినేషన్‌నే మీరూ ఎంచుకుంటే.. ఎక్కువమందికి ఆమోదయోగ్యం అవటం వల్ల వీటిని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నను ఎవరూ అడగరు. ఈ కాంబినేషన్‌లో కోర్సులను అందించే విద్యాసంస్థలు చాలానే ఉంటాయి. ఈ సబ్జెక్టులు చదవడం ఆసక్తిగా లేకపోతే గ్రాడ్యుయేషన్‌లో సబ్జెక్టులు మార్చుకోవచ్చు. ఇంజినీరింగ్, మెడిసిన్‌లే కాకుండా ఆర్ట్స్‌/లా/కామర్స్‌/మేనేజ్‌మెంట్‌ కోర్సుల వైపు వెళ్లొచ్చు. భారమని భావించకుండా మ్యాథమేటిక్స్, సైన్స్‌ సబ్జెక్టులు కలిపి చదవాలనిపిస్తే ఎంబైపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్‌ బయాలజీ)ని ఎంచుకోవచ్చు. ఈ గ్రూప్‌ను చదివితే తార్కిక అధ్యయనం అలవాటవుతుంది. దీనిలో విస్తృత అంశాలు కవర్‌ కావడంతో గ్రాడ్యుయేషన్‌లో వివిధ సబెక్టుల సమ్మేళనాలను ఎంచుకునే అవకాశం ఎక్కువ. సైన్స్‌ సబ్జెక్టుల పరిజ్ఞానం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో జనరల్‌ సైన్స్‌ అంశాలు రాయడానికి (పరీక్షలో ఈ టాపిక్స్‌ భాగం తక్కువైనప్పటికీ) పునాదిలా తోడ్పడుతుంది. మ్యాథమేటిక్స్‌ విషయానికొస్తే జీఎస్, పేపర్‌-2 (ప్రిలిమినరీ పరీక్షలో సీశాట్‌) రాయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ లేదా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ రాయాలనుకున్నా ఈ సబ్జెక్టుల పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. 

పరిమితులు: దేశంలోని ప్రజా సమస్యల మీద అభ్యర్థుల అవగాహనను పరీక్షించడమే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ప్రధానోద్దేశం. సైన్స్‌ సబ్జెక్టు స్వభావరీత్యా వాస్తవాలను ప్రతిబింబిస్తుంది. దీంట్లో మానవీయ కోణాన్ని జోడించడానికి అవకాశం ఉండదు. కాబట్టి సివిల్స్‌ సన్నద్ధతను మొదలుపెట్టిన తర్వాత సిలబస్‌లో ఉన్న సబ్జెక్టుల్లోని సారాన్ని గ్రహించడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ సబ్జెక్టులతో రాత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉండదు. ఇది సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ముందుకువెళ్లడానికి ప్రధాన అవరోధంగా మారుతుంది. 

సివిల్స్‌ కోణంలో కార్యాచరణ: సాధారణ పాఠకులకోసం ఉద్దేశించిన నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలు చదవాలి. దీని వల్ల సివిల్స్‌కు అవసరమైన పఠన సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడాన్ని అలవాటు చేసుకోవచ్చు.  
సైన్స్‌ సబ్జెక్టుల పరిజ్ఞానం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో జనరల్‌ సైన్స్‌ అంశాలు రాయడానికి తోడ్పడుతుంది. జీఎస్, సీశాట్‌ రాయడానికి మ్యాథ్స్‌ ఉపయుక్తం.

కామర్స్‌

మ్యాథమేటిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్‌ స్టడీస్, ఎకనామిక్స్‌... ఈ సబ్జెక్టులన్నీ కామర్స్‌ స్ట్రీమ్‌లో భాగం. వర్తక, వాణిజ్యాలు, ఆర్థికపరమైన రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులు సాధారణంగా ఈ సబ్జెక్టును ఎంచుకుంటారు. సైన్స్‌ సబ్జెక్టులపై అయిష్టత ఉన్నవారు కూడా ఈ గ్రూపును ఎంచుకుంటుంటారు.  

ప్రయోజనాలు: ఈ సబ్జెక్టుల సమ్మేళనంలో కొన్ని హ్యుమానిటీస్‌కు సంబంధించిన అంశాలుంటాయి. పాక్షిక సైన్స్‌గా ఉండే ఎకనామిక్స్‌ హ్యుమానిటీస్‌ కోణాన్ని వృద్ధి చేసుకోడానికి ఉపకరిస్తుంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సంబంధించి ఎకనామిక్స్‌ ఓ ప్రధానాంశం. ఆర్థిక, సాంఘికాభివృద్ధిపై ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు వస్తాయి. దీనికి అదనంగా మ్యాథమేటిక్స్‌ నైపుణ్యాలను పెంచుకుంటే ప్రిలిమినరీలోని సీశాట్‌లో ఉపయోగపడతాయి. 

పరిమితులు: ఇంటర్మీడియట్‌ తర్వాత అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. కామర్స్, మేనేజ్‌మెంట్, లా మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక్క ఎకనామిక్స్‌కు తప్ప మిగతా సబ్జెక్టుల ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. 

సివిల్స్‌ కోణంలో కార్యాచరణ: మిగతా సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి ఎకనామిక్స్‌లోని మానవీయ కోణాన్ని ఉపయోగించుకోవాలి. సాధారణ పాఠకుల కోసం ఉద్దేశించిన నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి.

హ్యుమానిటీస్‌

ఈ స్ట్రీమ్‌లో హిస్టరీ, జాగ్రఫీ, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులు ఉంటాయి. 

ప్రయోజనాలు: ఈ సబ్జెక్టులన్నీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు మూల స్తంభాల్లాంటివి. వీటిని చదివినవారు ప్రిలిమ్స్, మెయిన్స్, ఆప్షనల్‌ సబ్జెక్టుల విషయంలో ఎక్కువ ప్రయోజనాలను పొందొచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సంబంధించిన 70 శాతం సిలబస్‌ను ఈ స్ట్రీమ్‌ నుంచి పొందొచ్చు. 

‣ పరిమితులు: ఈ సబ్జెక్టులు విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించలేవు. పైగా ప్రిలిమినరీ సీశాట్‌ పేపర్‌-2లోని ప్రశ్నల సంఖ్య కొంతకాలంగా పెరుగుతోంది. దీంతో మ్యాథమేటిక్స్‌ నేపథ్యంలేని విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇంటర్‌లో హ్యుమానిటీస్‌ సబ్జెక్టులు చదివితే గ్రాడ్యుయేషన్‌లోనూ వీటినే కొనసాగించాల్సివుంటుంది. అవకాశాలు పరిమితమైపోతాయి.  

సివిల్స్‌ కోణంలో కార్యాచరణ: అకడమిక్‌ సబ్జెక్టులను అదనపు ఆసక్తితో చదవాలి. ఎంచుకున్న సబ్జెక్టులకు సంబంధించి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఉద్దేశించిన పుస్తకాలు చదవాలి. దీంతో పరిజ్ఞానం పెరగడమే కాకుండా పునాది గట్టిపడుతుంది. అదే సమయంలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్‌కు సంబంధించిన తగినంత పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

ప్రతి గ్రూప్‌లోనూ కొన్ని అనుకూలతలూ, ప్రతికూలతలూ ఉంటాయి. హ్యుమానిటీస్‌పై పట్టు సివిల్స్‌కు ఉపయోగపడుతుందంటే.. సైన్స్‌ గ్రూప్‌ వల్ల ప్రయోజనాలేమీ ఉండవని అనుకోకూడదు. 

విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి చదవాల్సిన గ్రూప్‌ను ఎంచుకోవటం అన్నిటికంటే ప్రధానం. నిపుణులైన బోధకులు అందుబాటులో ఉండేలా చూసుకుంటే అవకాశాలు విస్తృతమవుతాయి. మనం ఎదుగుతున్నపుడూ, ఎక్కువగా చదవటం కొనసాగించినప్పుడూ జీవితంలో మన ఎంపికలు మారిపోతుంటాయి. 

‘మీరెన్నో విషయాలు తెలుసుకుంటేగానీ.. మీకు తెలిసింది తక్కువనే విషయం తెలియదు’ అంటారో రచయిత. 

ఎంచుకున్న గ్రూపుతో సంబంధం లేకుండా కింది పుస్తకాలు చదివితే సివిల్స్‌ పరీక్షకు పునాది ఏర్పడుతుంది. 

1) India in the 21st Century: What Everyone Needs to Know by Mira Kamdar

2) Indian Constitution by Madhav Khosla

3) Indian Foreign Policy by Sumit Ganguly

4) Introduction to Sociology Textbook for Class XI NCERT

5) Caste by Surendar S Jodhka

6) India since 1947 by Gopa Sabharwal

7) Some eminent Indian Scientists (Publications Division Government of India)

8) Our Environment NCERT

9) Indian History NCERT

గమనిక: ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలన్నింటినీ https://ncert.nic.in/textbook.php వెబ్‌సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉచితంగా బీటెక్‌ నేవీలో ఉద్యోగం!

‣ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రతిష్ఠాత్మక కోర్సులు

‣ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

‣ నచ్చని సబ్జెక్టుపై మక్కువ పెరగాలంటే?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-02-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు