• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు సమగ్ర వ్యూహం!

ప్రణాళిక బద్ధమైన ప్రిపరేషన్‌కు నిపుణుల సూచనలు

ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది జూన్‌ 5న జరుగనుంది. దీనిలో నెగ్గితేనే తర్వాతి అంచె మెయిన్స్‌లోకి ప్రవేశించటం సాధ్యం. సుమారు మూడున్నర నెలలకు పైగా సమయం అందుబాటులో ఉంటుంది. కీలకమైన ఈ పరీక్షకు  ఏ వ్యూహం అనుసరించాలో తెలుసుకుందాం! 

సివిల్స్‌ ప్రిలిమినరీ ప్రశ్నపత్రం రూపకల్పన వెనుక యూపీఎస్‌సీకి మూడు లక్ష్యాలు కనిపిస్తాయి. 

నిరంతరం జ్ఞాన సముపార్జన, నైపుణ్యాలను మెరుగుపరచుకునే తపన ఉన్న అభ్యర్థుల ఎంపిక. 

స్వభావరీత్యా, ప్రేరణ పరంగా.. ఎంచుకున్న రంగానికి సరిగ్గా సరిపోయే అభ్యర్థులను గుర్తించడం. 

 ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని వడపోత ద్వారా అభ్యర్థుల సంఖ్య అవసరమైనంత తగ్గించడం.

వీటిని ఎలా సాధిస్తారంటే...

ఎ) సిలబస్‌లో ఉన్న కీలక అంశాల మీద వర్తమాన అంశాల కోణంలో ప్రశ్నలు అడుగుతారు. సమాజంలో జరుగుతోన్న విషయాల మీద అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు.  

బి) జాతీయ, అంతర్జాతీయ విషయాల్లో అభ్యర్థికి ఉండే ఆసక్తిని పరీక్షిస్తారు. ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల విషయంలో వీరికి ఉన్న అవగాహనను అంచనా వేస్తారు. 

సి) జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న సంఘటనలు సామాన్యుడి మీదా ప్రభావాన్ని చూపిస్తాయి. దాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వేస్తారు (ఇదంతా పేపర్‌-1కు సంబంధించింది).

డి) అభ్యర్థికి ఉండే సగటు తార్కిక, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి (పేపర్‌-2కు సంబంధించి).

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రిలిమినరీ పరీక్ష ఎలా ఉంటుందో గమనించాలి. ప్రిలిమినరీలో రెండు పేపర్లు ఉంటాయి. 

అవి: జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ప్రతి పేపరుకు 200 మార్కులు. 

పేపర్‌-1లో 100 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు ఉంటాయి. 

పేపర్‌-2లో 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 2 1/2 మార్కులు. రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.33% మార్కులు తగ్గిస్తారు. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే- పేపర్‌-2 అనేది అర్హత పరీక్ష మాత్రమే. అభ్యర్థి కనీస అర్హత మార్కులు 33 శాతం సాధించాలి. అంటే 200 మార్కులకు కనీసం 67 మార్కులు. ఇవి తెచ్చుకోలేని అభ్యర్థి తిరస్కరణకు గురవుతాడు. కటాఫ్‌ మార్కుల కంటే ఎక్కువగా సాధిస్తే.. అప్పుడు పేపర్‌-1ను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పేపర్లోని అత్యధిక మార్కుల ఆధారంగా, రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని మెరిట్‌ లిస్టును రూపొందిస్తారు.

సిలబస్‌లో...

సన్నద్ధత సమర్థంగా ఉండాలంటే పునాది దృఢంగా ఉండాలి. అందుకోసం సిలబస్‌నూ, ప్రస్తుత పోకడలనూ అర్థంచేసుకోవాలి. 

సివిల్స్‌ ప్రిలిమినరీ పేపర్‌-1 సిలబస్‌ జనరల్‌ స్వభావంతో ఉంటుంది. ఒక్కో విభాగం పరిధిలోకి ఏయే అంశాలు వస్తాయో కచ్చితంగా చెప్పలేం. ఒకే ఒక మార్గం ఏమిటంటే.. గత కొన్ని సంవత్సరాల్లో వచ్చిన ప్రశ్నలనూ, వాటి సంఖ్యనూ విశ్లేషించుకోవాలి. 

ప్రశ్నలను వివరంగా పరిశీలిస్తే.. కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలు నేరుగా ఉంటే.. మరికొన్ని ప్రధానాంశాల్లో వర్తమాన విశేషాలకు సంబంధించినవిగా ఉంటున్నాయి. కొన్ని ప్రశ్నలు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినవి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినవే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సివిల్స్‌ సహా పోటీపరీక్షలన్నిటిలో కరెంట్‌ అఫైర్స్‌ వాటా పెరిగింది.  


సన్నద్ధం కావడం ఎలా?

ముందుగా ప్రతి సబ్జెక్టులోను ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. గట్టి పునాది ఏర్పర్చుకోవాలి. సాధారణంగా సబ్జెక్టుల్లోని అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అభ్యర్థులకు కొత్తగానే ఉంటాయి. చాలామంది అభ్యర్థులు పదో తరగతి తర్వాత ఇంజినీరింగ్‌/ సైన్సెస్‌ లేదా కామర్స్‌ చదివి ఉండటమే దీనికి కారణం. ప్రాథమిక అవగాహన కలిగిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా సివిల్స్‌లో అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. ప్రశ్నలు అడిగే శైలిలో ఏటా మార్పు వస్తుందని గమనించాలి. ప్రశ్నల కూర్పును అర్థం చేసుకున్న తర్వాత ప్రతి విభాగంలోను వర్తమానాంశాల గురించి తెలుసుకోవాలి. 

ముందుగా చదవడానికి టైమ్‌టేబుల్‌ను తయారు చేసుకోవాలి. ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉంటే అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా దాన్ని మార్చుకోవాలి. సరైన దారిలోనే వెళుతున్నారని ఊహించుకుంటూ టైమ్‌టేబుల్‌కి అనుగుణంగా ముందుకు వెళ్లాలి. ఎప్పటికప్పుడు ప్రిపరేషన్‌ను సమీక్షించుకుంటూ మెరుగుదల చూపించాలి. 

ఒక విభాగం (సబ్జెక్టు)ను పూర్తిచేయడం రెండో అడుగు. ఉదాహరణకు ఇండియన్‌ పాలిటీ సబ్జెక్టు అనుకుంటే.. దీనిలో పరీక్ష పెట్టుకుని పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎంత స్కోరు వచ్చిందో చూసుకోవాలి. 75 శాతానికి పైగా సాధిస్తే ఆందోళనపడాల్సిన పని లేదు. కొంతకాలం తర్వాత ఇవే సబ్జెక్టుల్లో మళ్లీ పరీక్ష పెట్టుకోవాలి. నిలకడగా 75 శాతం సాధిస్తే మరో సబ్జెక్టును చదువుకోవచ్చు. ఉదాహరణకు ఎకనామిక్స్‌. దీనిలోనూ అదే రకంగా పరీక్షించుకోవాలి. అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకోవాలి.

ఇదంతా పూర్తయిన తర్వాత కాంప్రహెన్సివ్‌ పేపర్లను రాయటం మొదలుపెట్టాలి. అంటే.. సిలబస్‌లోని అన్ని అంశాలూ కవర్‌ అయ్యేలా గ్రాండ్‌ టెస్ట్‌లు రాయాలి. దీంట్లో 65 శాతం మార్కులు సాధించడం లక్ష్యం కావాలి. రుణాత్మక మార్కులను తీసేసిన తర్వాత ఈ స్థాయి మార్కులు వచ్చేలా చూసుకోవాలి. మొదటిసారి ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఈ మార్కులు తక్కువగా అనిపించవచ్చు. కానీ నిలకడగా వీటిని పొందితే అభ్యర్థి విజయపథంలో ఉన్నారనే అర్థం. ప్రిలిమ్స్‌ పాసవడానికి కటాఫ్‌ మార్కులు 55 శాతం అనేది గుర్తుంచుకోవాలి. పై వ్యూహాన్ని అనుసరిస్తే ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరై పేపర్‌-1లో మంచి మార్కులు సాధించగలుగుతారు. 

పేపర్‌-2కు సన్నద్ధత

జనరల్‌ స్టడీస్‌లో పేపర్‌-2నే సీశాట్‌ అంటుంటారు. ఈ పేపర్లో 80 ప్రశ్నలు వస్తాయి.

200 మార్కులు, కాలపరిమితి 2 గంటలు

కాంప్రహెన్షన్‌

కమ్యూనికేషన్‌

ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌

లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ

డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ

బేసిక్‌ న్యూమరసీ (నంబర్స్‌- రిలేషన్స్, ఆర్డర్స్‌ ఆఫ్‌ మాగ్నిట్యూడ్‌) డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ మొదలైనవి). ఇవన్నీ పదో తరగతి స్థాయి. చాలా సంవత్సరాలుగా ‘డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌’ ప్రశ్నలు రావటంలేదు.  


1. ఈ పేపర్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే తక్కువగానూ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇది అర్హతను నిర్దారిస్తుంది. దీనిలో మార్కులు తగ్గి ఆ ఏడాది పోటీ నుంచి తప్పుకున్నవారూ ఎంతోమంది ఉన్నారు. 

2. గణితంలో దృఢమైన పునాది ఉన్న విద్యార్థులు.. గణితం అంటే భయపడేవారి కంటే, హ్యుమానిటీస్‌ (మానవీయ శాస్త్రాలు) విద్యార్థుల కంటే మంచి స్థాయిలో ఉంటున్నారు. 2015 నుంచీ ఉన్న పాత పేపర్లను పూర్తిచేసి తమ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవాలి. ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసే సామర్థ్యం వచ్చినట్లయితే.. దృష్టిని కాంప్రహెన్షన్‌ మీద కేంద్రీకరింవచ్చు. 

3. మ్యాథమేటిక్స్‌లో బలహీనంగా ఉన్న విద్యార్థులు ఈ పేపర్‌ మీద మరింత ఏకాగ్రతను కేంద్రీకరించాలి. షార్ట్‌కట్‌ పద్ధతులు తెలుసుకోవడానికి స్నేహితుల, ట్యూటర్ల సహాయం తీసుకోవచ్చు. 

4. అభ్యర్థులు తమ సబ్జెక్టుల నేపథ్యంతో సంబంధం లేకుండా కాంప్రహెన్సివ్‌ టెస్టులు రాయాలి. కనీసం 50 శాతం మార్కులు సాధించే విధంగా కృషిచేయాలి. 

5. చివరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే ఈ పేపర్‌ సన్నద్ధతను మొదలుపెట్టాలి. ఎందుకంటే ఈ పేపర్‌ రాయడానికి నైపుణ్యాలు అవసరం అవుతాయి. వాటిని అనుకున్నదే తడవుగా సాధించే అవకాశం ఉండదు.

రెండేళ్ల కటాఫ్‌ మార్కులు కిందివిధంగా ఉన్నాయి. 

2021 కటాఫ్‌ మార్కును 2022 జూన్‌లో ప్రకటిస్తారు. ప్రశ్నల క్లిష్టత ఆధారంగా కటాఫ్‌ మార్కు ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా.

 


 

Posted Date : 20-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌