• facebook
  • whatsapp
  • telegram

ఎన్నో అపోహలు.. ఇవిగో వాస్తవాలు

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షపై సందేహాలకు సమాధానాలు

ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షపై కొద్ది సంవత్సరాలుగా అవగాహన పెరుగుతోంది. అయితే ఈ పరీక్ష రాయదల్చిన ఎంతోమందికి అనేక అనుమానాలు వస్తుంటాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎన్నో అపోహలు, అర్ధ సత్యాలూ ప్రచారంలో ఉన్నాయి. కచ్చితమైన సమాచారం ఉన్నపుడే ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేసుకోవచ్చు. అప్పుడే అభ్యర్థులు పూర్తిస్థాయిలో పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది!

1. సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపికయ్యే ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌) ఎంతో ఉత్తమమైనది. కాబట్టి ఐఏఎస్‌కు తప్ప ఇతర సర్వీసులకు ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదు.

వాస్తవం: ఉత్తమమైన సర్వీసుల్లో ఐఏఎస్‌ ఒకటి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే దీంతో సమాన ప్రాముఖ్యం, సంతృప్తినీ ఇచ్చే ఇతర సర్వీసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇతర సర్వీసుల్లో ఉండే కెరియర్‌ అవకాశాల గురించి కూడా ఆలోచించటం అవసరం. ప్రభుత్వ వెబ్‌సైట్లలోకి వెళ్లి ఇతర సర్వీసుల గురించి వివరాలు తెలుసుకోవటం మేలు. 

2. ఐఏఎస్, ఐపీఎస్‌ సర్వీసుల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువ. ఈ సర్వీసుల్లోకి ప్రవేశించేకంటే ప్రైవేటు ఉద్యోగం చేసుకోవడమో విదేశాల్లో ఉద్యోగం సంపాదించడమో ఉత్తమం. 

వాస్తవం: ఐఏఎస్, ఐపీఎస్‌ రెండూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే సర్వీసులు. ఈ అధికారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీసుకునే నిర్ణయాలు సామాన్యుల మీద చెప్పుకోదగ్గ ప్రభావం చూపిస్తాయి. ఎన్నో అధికారాలు ఉన్నప్పటికీ కొన్ని నిబంధనలకు లోబడి వీరు పనిచేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెంటికీ వర్తిస్తుంది. ప్రైవేటు రంగంలో స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉంటుందనుకోవడం పొరపాటు. ఈ రంగంలో ఉన్నతోద్యోగం చేసేవారు ఏదో ఒక రూపంలో నియంత్రణ, అనుచిత జోక్యాలకు లోబడి పనిచేయాల్సి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసినా స్వతంత్రంగా పనిచేయడానికి ఉండదు. కాబట్టి ‘స్వతంత్రం’ ఉంటుందనేది అపోహ మాత్రమేనని గుర్తుంచుకోవాలి. 

3. ఈ పరీక్షలో ఐఏఎస్‌/ ఐపీఎస్‌ ఆఫీసర్ల పిల్లలు మాత్రమే అర్హత సాధిస్తారు. 

వాస్తవం: సివిల్‌ అధికారుల పిల్లలు ఈ పరీక్షలో అర్హత సాధించడమనేది కేవలం యాదృచ్ఛికమే. గత కొన్నేళ్లుగా ఇలాంటివి చాలా తక్కువే చూస్తున్నాం. అన్ని వర్గాలకు చెందినవారు అర్హత సాధిస్తున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల పిల్లలకు ఈ రంగంలో ఉన్న కెరియర్‌ అవకాశాలపై అవగాహన ఉంటుంది. అంతేకానీ ఎంపిక సమయంలో వీరికి ఎలాంటి ప్రాధాన్యమూ లభించదు. 

4. చదువులో ప్రతిభావంతులు, బాగా తెలివైన విద్యార్థులు మాత్రమే సివిల్‌ సర్వీస్‌ పరీక్ష పాసవుతారు. 

వాస్తవం: తెలివితేటలకు కొలమానం ఏది? పాఠశాల స్థాయిలో ఎక్కువ మార్కులు వచ్చినవారే, ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకునేవారు మాత్రమే తెలివైనవారని అనగలమా? నిజానికి తెలివితేటలను కొన్ని పరిమితులకు లోబడి నిర్వచించడం కష్టం. ఈమధ్యకాలంలో ఈ పరీక్షకు ఎంపికైనవారిని గమనిస్తే... పాఠశాల/ కళాశాలల్లో ఎక్కువ మార్కులు సాధించినవాళ్లు, మధ్యస్థంగా ఉన్నవాళ్ల సమ్మేళనం కనిపిస్తుంది. ఎక్కువ మార్కులు సాధించటం మంచి విషయమేగానీ సెకండ్, థర్డ్‌ క్లాసులు వచ్చినంత మాత్రాన  అవకాశం ఏమీ చేజారిపోదు. అభ్యర్థి తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇంకా ఉందన్నమాట. స్కూల్లో, కాలేజీలో మంచి మార్కులు రాకపోతే సివిల్‌ సర్వీస్‌ పరీక్ష పాసయ్యే అవకాశం లేదని కాదు. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష రాయడానికి కనీస అర్హత గ్రాడ్యుయేషన్‌ అని యూపీఎస్‌సీ పేర్కొంది. అంతేగానీ గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం అంటూ నియమం పెట్టలేదు. అంటే ఈ పరీక్ష రాసే అభ్యర్థులు వివిధ రకాల సామాజిక పరిస్థితులు, అనుభవాలు/ వర్గాల నుంచి వస్తారు కాబట్టి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ప్రతిభ కనబరచకపోయినా తగిన కృషి చేస్తే సివిల్స్‌లో నెగ్గేలా అవకాశం లభిస్తోంది.

5. సివిల్‌ సర్వీసెస్‌కు అర్హత సాధించాలంటే పాఠశాల స్థాయి నుంచే సన్నద్ధత మొదలుపెట్టాలి.

వాస్తవం: ఈ పరీక్షలో ర్యాంకు సాధించినవారు సివిల్‌ సర్వీసెస్‌ సాధించడం తమ చిన్ననాటి నుంచీ ఉన్న కల అంటుంటారు. అయినా దానికి కృషిని మాత్రం పాఠశాల స్థాయిలో ఆరంభించటం చాలా అరుదు. అత్యధికులు మాత్రం గ్రాడ్యుయేషన్‌ నుంచీ, ఆ తర్వాత మాత్రమే సివిల్స్‌ దృష్టితో అధ్యయన కృషిని ప్రారంభిస్తారు. మీరు కూడా గ్రాడ్యుయేషన్‌ తర్వాతే సివిల్‌ సర్వీసెస్‌ గురించి ఆలోచించినట్లయితే.. ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదు. 

6. పుస్తకాల పురుగయితేనే ఈ పరీక్షలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. 

వాస్తవం: సిలబస్‌ మీద దృష్టిని కేంద్రీకరించి, సన్నద్ధత మొదలుపెట్టినప్పటి నుంచీ సంబంధిత పుస్తకాలు శ్రద్ధగా, అంకితభావంతో చదివితే సరిపోతుంది. సబ్జెక్టుల పరిజ్ఞానంతోపాటు మానసిక పరిపక్వతా సివిల్స్‌ సాధనకు ఎంతో అవసరం. ఇది కేవలం పుస్తక పఠనంతో మాత్రమే రాదు. 

7. ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పోలిస్తే ఇంటర్మీడియట్, డిగ్రీలో ఆర్ట్స్‌ చదివిన విద్యార్థులకు సివిల్స్‌ పరీక్ష పాసయ్యే అవకాశం ఎక్కువ. 

వాస్తవం: ఫలితాలను బట్టి చూస్తే.. ఆర్ట్స్‌ గ్రాడ్యుయేట్లు ప్రత్యేక ప్రయోజనం పొందిన దాఖలాలు ఏమీ లేవు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినవారిలో ఎక్కువమంది ఇంజినీర్లు లేదా ప్రొఫెషనల్‌ డిగ్రీ చేసినవాళ్లే ఉంటున్నారు. ప్రొఫెషనల్‌ డిగ్రీ చేయడం ఎప్పుడూ అదనపు ప్రయోజనం అందించేదే.

8. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే అభ్యర్థి రోజుకు కనీసం 16 గంటలపాటు కష్టపడాలి. 

వాస్తవం: చాలామంది ఇలాగే అనుకుంటారు. 16 గంటలపాటు కేంద్రీకృతంగా ఎవరైనా చదవగలరా అనేది సందేహమే. ఎన్ని గంటలపాటు చదివారు అనే దానికంటే.. ఎంత ఏకాగ్రతతో చదివారు, ఎంత పరిజ్ఞానం సంపాదించారు అనేదే ప్రధానం. ప్రతి ఒక్కరికీ ఏకాగ్రత పరిమిత సమయంపాటే నిలుస్తుంది. ఆ సమయంలోనే చదవాల్సి ఉంటుంది. ‘ఎక్కువ గంటలు కష్టపడటం’ అనేదానికి అంత ప్రాముఖ్యం ఇవ్వనవసరం లేదు. కొందరు అభ్యర్థులు 16 గంటలపాటు చదవొచ్చు. అందరూ అలా చదవలేరు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రోజూ 8-10 గంటలపాటు చదివితే సరిపోతుంది..

9. ప్రిలిమినరీ పరీక్ష అనేది జూదం లాంటిది. ఫలితాలు వచ్చేంతవరకు పాసవుతారనే గ్యారంటీ ఉండదు. కాబట్టి ప్రిలిమ్స్‌ పాసైన తర్వాతే మెయిన్స్‌కు సిద్ధం కావడం మొదలుపెట్టాలి.

వాస్తవం: ఇది నిరాశావాదం. పైగా ప్రిలిమ్స్‌ పాసయ్యాక మెయిన్స్‌ చదవటం మొదలుపెడితే ఉన్న సమయం సరిపోదు. ప్రతి పోటీ పరీక్ష ‘ఛాన్స్‌’ మీదే ఆధారపడి ఉంటుంది. దీనికి సివిల్‌ సర్వీసెస్‌ మినహాయింపు ఏమీ కాదు. ప్రిలిమినరీ పరీక్షకు 5 లక్షల మంది హాజరైతే అందులో 9,500 మంది మాత్రమే ఎంపికవుతారు. 100 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయాల్సి ఉంటుంది. విజయం అనేది మార్కులను స్కోరు చేసే పద్ధతిని గుర్తించి అమలు చేయటం మీదే ఆధారపడివుంటుంది. అది మెరుగ్గా ఉంటే ‘అదృష్టం’ లాంటి కారణాలేమీ నిలవవు.

10. ప్రిలిమినరీ పరీక్షలో రిజర్వేషన్‌ నియమం వర్తించదు. 

వాస్తవం: ఈ పరీక్ష ప్రతి స్థాయిలోనూ రిజర్వేషన్‌ నియమం వర్తిస్తుంది. అన్ని కేటగిరీలకు నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు ఉంటాయి. లేకపోతే తర్వాతి స్థాయి పరీక్షలో విభిన్న వర్గాల ప్రాతినిధ్యం సాధ్యంకాదు. కాకపోతే ఆ తేడా ప్రిలిమినరీ స్థాయిలో మరీ ఎక్కువేమీ ఉండదు. 

11.ఎంచుకున్న ఆప్షనల్‌పై అభ్యర్థులకు లోతైన పరిజ్ఞానం ఉండాలి.

వాస్తవం: పరీక్షలో విజయం సాధించిన చాలామందిని గమనిస్తే ఇది వాస్తవం కాదని తెలుస్తుంది. సబ్జెక్టును లోతుగా అధ్యనం చేయడానికి సమయం సరిపోని అభ్యర్థులు కూడా పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించారు. వారు సబ్జెక్టును అర్థం చేసుకున్న పద్ధతి, మెరుగైన రాత నైపుణ్యాలతో ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ విషయంలో లోతైన పాండిత్యం కంటే తగిన పరిజ్ఞానాన్ని సాధారణ స్థాయిలోనే యూపీఎస్‌సీ ఆశిస్తుంది.

12. తప్పనిసరి లాంగ్వేజ్‌ పేపర్లు క్వాలిఫై అవ్వడానికే కదా, వీటికి ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ అవసరం లేదు.  

వాస్తవం: కంపల్సరీ పేపర్లు... మోడ్రన్‌ ఇండియన్‌ లాంగ్వేజ్, ఇంగ్లిష్‌. ఈ సబ్జెక్టుల్లో అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాలి. అయినప్పటికీ ఏమీ చదవకుండానే వాటిలో నెగ్గవచ్చని అనుకోకూడదు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మాతృభాషే కదా, అని తెలుగును తేలిగ్గా తీసుకోకూడదు. వారు ఇంగ్లిష్‌ మీడియంలో చదివినప్పుడు పదో తరగతి తర్వాత తెలుగుకు దూరమవుతారు. దాంతో మాతృభాషలో రాసే నైపుణ్యం తగ్గిపోవచ్చు. తెలుగు మాట్లాడినంతమాత్రాన మెరుగ్గా రాయగలరని చెప్పటానికి లేదు. రాత అనేది పూర్తి విభిన్నమైన నైపుణ్యం. లాంగ్వేజ్‌ పేపర్లలో విఫలమైన అభ్యర్థులూ ఉన్నారు. పైగా ప్రశ్నలు ఏటా మరింత క్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి అర్హత సాధించాల్సిన (ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) పేపర్లను తక్కువ అంచనా వేయకుండా, వాటి విషయంలోనూ సన్నద్ధత సాగించడం మంచిది.
 

Posted Date : 09-12-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు