• facebook
  • whatsapp
  • telegram

పరిధి పెద్దదైనా పట్టు పట్టొచ్చు!

ప్రణాళికబద్ధంగా జనరల్‌ స్టడీస్‌ అధ్యాయనానికి సూచనలు

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో నెగ్గాలనే లక్ష్యం నిర్దేశించుకున్నవారు జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌)పై అవగాహన పెంచుకోవటం అవసరం. పరిధి విస్తారంగా ఉండే జీఎస్‌ అధ్యయనం కొద్దిరోజుల్లో ముగిసేది కాదు. దీనికి క్రమబద్ధమైన దీర్ఘకాలిక ప్రణాళికను వేసుకోవాలి. శ్రద్ధతో కృషి సాగించాలి!

జనరల్‌ స్టడీస్‌ చాలా విస్తృతంగా ఉంటుంది. జనరల్‌ సైన్స్, జాగ్రఫీ, ఎకాలజీ, ఇండియన్‌ పాలిటీ, ఇండియన్‌ ఎకానమీ, సోషల్‌ అండ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్, హిస్టరీ ఆఫ్‌ ఇండియా, ఫ్రీడమ్‌ స్ట్రగుల్, కరెంట్‌ ఈవెంట్స్, మెంటల్‌ ఎబిలిటీ... ఈ విభిన్నమైన సబ్జెక్టులన్నీ దీని పరిధిలోకి వస్తాయి. 

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లోని ప్రాథమికాంశాల ఆధారంగా జనరల్‌ సైన్స్‌ ఉంటుంది. చాలామంది పాఠశాల స్థాయిలోనే ఈ సబ్జెక్టులను చదవడం వల్ల వీటి మీద మంచి పట్టు ఉంటుంది. సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధం అయ్యే క్రమంలో ఈ సబ్జెక్టు పెద్ద సమస్య కాదు. 
కానీ కొన్ని ఇతర సబ్జెక్టుల విషయంలో పాఠశాల, కళాశాలల స్థాయుల్లోనే సరైన పునాది ఉండాలి. 

హిస్టరీ, పాలిటీ, సొసైటీ.. వీటిపై సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌ చదివినవారు మినహా ఎక్కువమంది పాఠశాల స్థాయిలో దృష్టిపెట్టరు. 

వివిధ కారణాల వల్ల విద్యార్థులకు ఈ సబ్జెక్టుల్లో పట్టు ఉండటం లేదు. పదో తరగతి వరకు సోషల్‌ స్టడీస్‌లో భాగంగా విద్యార్థులు వీటిని చదువుతారు. కానీ ఆ దశలో వీటిపై అంత ఆసక్తి చూపరు. మన రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు సైన్స్‌ సబ్జెక్టును ఎంచుకుంటున్నారు కాబట్టి హిస్టరీ, పాలిటీ అంశాలు ఇంటర్మీడియట్‌ నుంచి చదివే అవకాశం ఉండదు. డిగ్రీలోనూ ఇదే జరుగుతోంది. 

సివిల్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ అంశాలపై పట్టు సాధించడం ఈ విద్యార్థులకు కష్టమవుతోంది. అందువల్ల వీటి అధ్యయనానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సివస్తోంది. దాంతో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో అర్హత సాధించడానికి ఎక్కువ ప్రయత్నాలు అవసరమవుతున్నాయి. కాబట్టి వీలైనంత ముందుగానే సివిల్స్‌ సన్నద్ధత ఆరంభించడం సముచితం.

ఇండియన్‌ పాలిటీ...

జనరల్‌ స్టడీస్‌లో మొదటిదీ.. అతి ముఖ్యమైనదీ అయిన ఇండియన్‌ పాలిటీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రాథమికంగా ప్రభుత్వం.. దాని పనితీరు, విధానాలను గురించి పాలిటీ తెలుపుతుంది. దీంట్లో ఉపయోగించే చట్టపరమైన పరిభాష కొత్తగా ఉంటుంది. ఇండియన్‌ పాలిటీని అర్థంచేసుకోవడానికి ముందు ఆయా పదాలకు అర్థాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు రూల్‌ ఆఫ్‌ లా, గవర్నమెంట్, డెమోక్రసీ, యూనిటరీ అండ్‌ ఫెడరల్‌ గవర్నమెంట్స్, పార్లమెంటరీ అండ్‌ ప్రెసిడెన్షియల్‌ గవర్నమెంట్స్, కాన్‌స్టిట్యూషన్‌. ఈ భావనల అవగాహనకు ముందు వాటి మౌలిక అర్థాన్ని గ్రహించాలి. ఆ తర్వాత మనదేశానికి అన్వయించాలి. ఇప్పుడు కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

రూల్‌ ఆఫ్‌ లా: చట్టాలు అంటే ఏమిటి? వాటిని ఎవరు రూపొందిస్తారు. చట్టం అనేది పౌరులందరికీ సమానంగా వర్తిస్తుందా? చట్టాలను ఎవరు అమలుచేస్తారు? చట్టాన్ని ఉల్లంఘించినవారిని ఎవరు శిక్షిస్తారు? ఈ అంశాలన్నింటినీ రాజ్యాంగంలో పేర్కొన్నారు.

గవర్నమెంట్‌:  మానవ సమాజాలన్నీ సమాజిక సంబంధాల నిర్వహణకూ, సమస్యల పరిష్కారానికీ, ఉమ్మడి ప్రయోజనాల సాధనకు నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. అధికారం, నియంత్రణ ఉండే ఈ వ్యవస్థనే ప్రభుత్వం (‘గవర్నమెంట్‌’) అంటారు. కొన్ని సంస్థల సముదాయంగా దీన్ని నిర్వచించవచ్చు. చట్టపరమైన సంస్థల ద్వారా నియంత్రించడం, అతిక్రమించినవారికి జరిమానాలు విధించడం లాంటివి చేస్తుంది. 

ఈ నిర్వచనం మరికొన్ని ప్రశ్నలకు తావిస్తుంది. ప్రభుత్వానికి ఉండే రూపాలేమిటి? చట్టం అంటే? రూపొందించేదెవరు? ఎవరు అమలు చేస్తారు? ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే... వాళ్లను శిక్షించేదెవరు? మొదటి ప్రశ్నకు సమాధానం వెదికితే.. ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రభుత్వ స్వరూపం ‘ప్రజాస్వామ్యం’ దగ్గరకు వస్తాం. ఈ వ్యవస్థలో ప్రత్యక్షంగా లేదా తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పాలించే అధికారం ప్రజలకు ఉంటుంది. ప్రపంచంలోనే పెద్దప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ప్రజాస్వామ్యం మొదటిసారిగా ఎక్కడ ఆవిర్భవించింది? అమెరికా, బ్రిటిష్, భారత వ్యవస్థల మధ్య ఉండే తేడా ఏమిటి? ఈ సందేహాలు తలెత్తుతాయి.

సోషల్‌ సైన్సెస్‌ అంటే...

ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ మొదలైనవి సోషల్‌ సైన్సెస్‌ కిందికి వస్తాయి. ముందుగా వీటి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. సోషల్‌ సైన్సెస్‌ అంటే.. ఫిజిక్స్, బయాలజీల్లా కచ్చితమైన సైన్స్‌ కాదు. దీంట్లోని అంశాలు ఒకదానితో మరోదానికి సంబంధం లేనట్టుగా కనిపిస్తాయి. కానీ ఇది నిజం కాదు. సిలబస్‌ పూర్తిగా చదివితే ఒక అవగాహన వస్తుంది. వివిధ భాగాలను అర్థం చేసుకుంటే వాటిని కలిపి ఉంచే అంశం స్పష్టమవుతుంది. సోషల్‌ సైన్సెస్‌ను మెడలోని హారం అనుకుంటే.. దాంట్లో వివిధ పూసలను దారం కలిపినట్టుగా.. వేర్వేరు స్వతంత్ర అంశాలు అనుసంధానమైవుంటాయి.  

భారత రాజ్యాంగం-  తాజా పరిణామాలు 

మన దేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ఉంది. అయితే భారత్‌ పార్లమెంటరీ విధానాన్ని ఎందుకు ఎంచుకుంది? ఈ విధానంలో చట్టాలను ఎవరు రూపొందిస్తారో తెలుసుకోవాలి. కార్యనిర్వాహక వర్గం చట్టాలను రూపొందిస్తుంది. లేదా ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలి రూపొందిస్తారు. చట్టం సరైనదో కాదో అనే విషయాన్ని న్యాయ వ్యవస్థ (జ్యుడిషియరీ) నిర్ణయిస్తుంది. 

పార్లమెంటు ఎలా ఏర్పడుతుంది? దాని సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? పార్లమెంటు అనుసరించే విధానాలేమిటి? కార్యనిర్వాహక వర్గ కూర్పు ఎలా ఉంటుంది? ప్రధానమంత్రి ఎలా ఎన్నికవుతారు? పదవీ కాలం ఎంత? న్యాయ వ్యవస్థను ఎవరు ఏర్పాటుచేస్తారు? జడ్జిల నియామకం ఎలా ఉంటుంది?  ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్ని స్థాయుల్లో పనిచేస్తుందో తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం అనే స్థాయులు ఉంటాయి. రాష్ట్ర శాసనసభ ఎలా ఏర్పడుతుంది? ముఖ్యమంత్రిని ఎలా ఎన్నుకుంటారు? గవర్నర్‌ను ఎలా నియమిస్తారు? అలాగే స్థానిక ప్రభుత్వాల ప్రాముఖ్యం ఏమిటి? పంచాయతీ రాజ్‌ అంటే ఏమిటి? మునిసిపాలిటీలను ఎలా ఏర్పాటుచేస్తారు? అవెలా పనిచేస్తాయి?

వీటన్నిటి గురించీ భారత రాజ్యాంగం (ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌)లో వివరంగా తెలిపారు. కాబట్టి మన  సిలబస్‌ను ‘భారత రాజ్యాంగం-  తాజా పరిణామాలు’గా చెప్పుకోవచ్చు.

రాజ్యాంగాన్ని ఒక దేశానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన చట్టంగా పరిగణిస్తారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ పత్రం ఆధారంగా రూపొందినదే. దేశ మౌలిక చట్టమైన దీని ప్రభావం అపారం. సుదీర్ఘమైన పత్రమే కాకుండా సాంకేతిమైనది కూడా. దీంట్లో చట్టపరమైన పరిభాష ఉండటం వల్ల దీన్ని అర్థం చేసుకోవడం సామాన్యులకు చాలా కష్టం. 

రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలంటే అత్యున్నతస్థాయి కచ్చితత్వం అవసరం. రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్న అనుభవజ్ఞులు కూడా.. వివిధ నిబంధనలను వివరించే సందర్భంలో సందిగ్ధంలో పడుతుంటారు. అవగాహన చేసుకోవడంలో ఇన్ని చిక్కులున్న రాజ్యాంగాన్ని సివిల్స్‌ అభ్యర్థులు అర్థం చేసుకుని, పరీక్షల్లో ప్రతిభ చూపించాల్సివుంటుంది.
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-03-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు