• facebook
  • whatsapp
  • telegram

ఏ బోర్డులో చదివితే గెలుపు సులువు?

సివిల్స్‌ ఫౌండేషన్‌  పేరుతో తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితిగతులకు  మించిన పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాల్సిన అవసరం ఏమీలేదు. 

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు తగిన పునాది పడాలంటే ఏ బోర్డులో చదవాలి? ఒకవేళ దాంట్లో చదవకపోతే ఎంపిక కావడం కష్టమా?... ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ వస్తుంటాయి. వీటిని నివృత్తి చేసుకుని సరైన అవగాహన పెంచుకుందాం! 

తమ నేపథ్యం, నిర్దిష్ట దిశలో కష్టపడే తత్వం వల్లనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో నెగ్గామని విజేతలైన అభ్యర్థులు చెప్తుంటారు. పరీక్ష రాయటానికి ఏడాది లేదా రెండేళ్ల ముందు నుంచే పరీక్ష మీద పూర్తి ఏకాగ్రతతో వీరు కష్టపడటం చూస్తుంటాం.  నేపథ్యం అంటే.. పాఠశాల రోజుల నుంచీ ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కృషి చేయడం, జీవితంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవటం అని చెప్పుకోవచ్చు. పాఠశాల విద్యార్థుల విషయంలో వారికి సంబంధించిన నిర్ణయాలన్నీ తల్లిదండ్రులే తీసుకుంటారు. అయితే ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు సివిల్‌ సర్వీసెస్‌కు వెళ్లాలని పాఠశాల స్థాయిలోనే కోరుకుంటారనేది సందేహమే. ఈ విషయంలో విద్యార్థులను ప్రోత్సహించే స్కూళ్లూ ఉన్నాయి. స్కూళ్లు వివిధ బోర్డులను అనుసరిస్తాయి. రెండు, మూడు బోర్డుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని చాలా పాఠశాలలు విద్యార్థికి కల్పిస్తున్నాయి. 

పాఠశాల విద్యలో జాతీయ, రాష్ట్ర స్థాయి బోర్డులు ఉన్నాయి. వీటిలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ), కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ- ఇదే ఐసీఎస్‌ఈగా ప్రచారంలో ఉంది), ది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌), ఇంకా స్టేట్‌ బోర్డులు ప్రముఖమైనవి.

1. సాధారణ పాఠశాలలో చదివిన విద్యార్థుల కంటే జాతీయ కరిక్యులమ్‌ అమలులో ఉండే పబ్లిక్‌ స్కూళ్లలో చదివినవారికి సివిల్స్‌ పరీక్ష పాసయ్యే అవకాశం ఎక్కువా?

పట్టణ ప్రాంతాల్లోని ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదివిన విద్యార్థులకు అదనపు లాభం కొంత ఎక్కువే. అది ప్రధానంగా కమ్యూనికేషన్‌ ఇంగ్లిష్‌ వరకే. ఇతర విద్యార్థులు ఇంగ్లిష్‌ మీద ఎక్కువగా దృష్టి పెట్టగలిగితే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుతున్నప్పటికీ ఈ భాషను ధారాళంగా మాట్లాడటంలో వెనకబడి ఉంటే? విద్యార్థులందరూ కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి ఇంగ్లిష్‌లోనే మాట్లాడటం మొదలుపెడితే ఈ అవరోధాన్ని అధిగమించవచ్చు. మొదట్లో పొరపాట్లు చేసినప్పటికీ.. ఆ తర్వాత రోజురోజుకూ భాష మెరుగవుతోన్న విషయాన్ని ఎవరికి వారే స్వయంగా గుర్తిస్తారు. 

2. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’, ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ లాంటి గేమ్‌ షోలు చూసినప్పుడు సీబీఎస్‌ఈ విద్యార్థులు నాకంటే బాగా జవాబులు చెప్పడం గమనించాను. ఇది నాకు ప్రతికూలమా?  

కరెక్టు సమాధానం ఇవ్వటం అనేది ‘చాన్స్‌ ఫ్యాక్టర్‌’ మీదే ఆధారపడి ఉంటుంది. సీబీఎస్‌ఈ వారితో పోల్చుకోవడానికి ఇది సరైన కొలమానం కాదు. జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రాథమిక పుస్తకాలు చదివితే మీరు కూడా ఈ వ్యత్యాసాన్ని అధిగమించగలరు. 

3.  ఈ అంతరాన్ని పూరించడానికి ఎలాంటి పుస్తకాలు చదవాలి?

నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ మెటీరియల్‌ ఉపయోగకరం. కరెంట్‌ అఫైర్స్‌ను తెలుసుకోవడానికి వర్తమానాంశాలను తెలియజేసే మేగజీన్లు చదవొచ్చు. ఇలా చేయడం ద్వారా అంతరాన్ని అధిగమించడానికి ప్రయత్నించవచ్చు.  

పుస్తకాల లింకులు 

NCERT: https://ncert.nic.in/textbook.php

NIOS : https://nios.ac.in/online-course-material.aspx

సీబీఎస్‌ఈ

మన దేశంలో ఈ బోర్డు స్కూళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీబీఎస్‌ఈ స్కూళ్లన్నీ ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణీకరించిన పాఠ్య పుస్తకాలను అనుసరిస్తాయి. ఈ బోర్డు సిలబస్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలకూ, పోటీ పరీక్షలకూ అనుకూలంగా ఉంటుంది.  ఈ విద్యా విధానంలో మ్యాథమేటిక్స్, సైన్స్‌ సబ్జెక్టుల మీద ఉన్నతస్థాయి దృష్టిని కేంద్రీకరిస్తారు.  

ఐసీఎస్‌ఈ

ఈ విధానంలో ప్రాక్టికల్స్‌కూ, నిర్దిష్ట నైపుణ్యాలకూ అధిక ప్రాధాన్యం ఉంటుంది. అలాగే సైన్స్, లాంగ్వేజ్, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఎన్నో సబ్జెక్టుల నుంచి కొన్నింటిని ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. ఇంగ్లిష్, సాహిత్యాలకు ఎక్కువ ప్రాముఖ్యం కనిపిస్తుంది. థియరీ కంటే ప్రాక్టికల్‌గా నేర్పించడానికే ప్రాధాన్యమిస్తారు. ఈ విద్యా ప్రణాళిక క్లిష్టమైనదిగా పేరుపొందింది. 

ఎన్‌ఐఓఎస్‌

ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్‌ స్కూలింగ్‌ విధానాల్లో ఇదొకటి. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దీన్ని ప్రవేశపెట్టారు. అక్షరాస్యతను పెంచడంతోపాటు సమాజంలోని అన్ని వర్గాలవారు అనుకూలమైన వేళల్లో విద్య నేర్చుకునేలా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ పాఠ్య ప్రణాళిక సీబీఎస్‌ఈ మాదిరిగా ఉంటుంది. పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. వివిధ కారణాలతో రెగ్యులర్‌ స్కూలింగ్‌ సాధ్యంకాని వారికిది ప్రత్యామ్నాయం. ఆసక్తికరమైన సంగతేమిటంటే... ఓపెన్‌ స్కూల్‌ అందించే స్టడీ మెటీరియల్‌ సివిల్స్‌ పరీక్షకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

స్టేట్‌బోర్డ్‌

ప్రతి రాష్ట్రానికీ సొంత స్టేట్‌బోర్డ్‌ ఉంటుంది. పాలనాధికారాలన్నీ ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి. విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక, పేపర్‌ నమూనా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటాయి.

సంక్షిప్తంగా...

ఎంచుకోవడానికి చాలా బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిదానికీ దాని ప్రత్యేక ప్రయోజనాలూ, పరిమితులూ ఉన్నాయి.  

అభ్యర్థి సీబీఎస్‌ఈని ఎంచుకుంటే సివిల్‌ సర్వీసెస్‌లో ప్రవేశించడానికి అది పునాదిలా ఉపయోగపడుతుంది.

అభ్యర్థులు ఇతర బోర్డులను ఎంచుకున్నట్లయితే.. ఆ తర్వాత నిర్దిష్ట అంశాల్లో బ్రిడ్జ్‌ కోర్సులో చేరొచ్చు. లేకపోతే హిస్టరీ, జాగ్రఫీ లాంటి సబ్జెక్టుల్లో మాడ్యూల్స్‌ను అందించే సంస్థలను ఎంచుకుని వేసవి సెలవుల్లో ఈ తరగతులకు హాజరు కావచ్చు.  

తరగతులకు హాజరుకావటం సాధ్యంకాని పక్షంలో నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ప్రాథమిక మెటీరియల్‌ను చదవొచ్చు. మరికొంత లోతుగా కావాలంటే... ఇగ్నో, ఇతర ఓపెన్‌ యూనివర్సిటీల స్టడీ మెటీరియల్‌ను అధ్యయనం చేయొచ్చు.

సివిల్‌ సర్వీసెస్‌ సబ్జెక్టులు ఎలాంటివంటే.. పరీక్షకు ఒకటి రెండు సంవత్సరాల ముందు నుంచే సన్నద్ధత మొదలుపెట్టాలి ఉంటుంది.

విద్యార్థులు గమనించాల్సింది ఏమిటంటే... ఉత్తమ ఉపాధ్యాయులున్న, నివాసానికి సమీపంలో ఉండే మంచి పాఠశాలను ఎంచుకోవటం సముచితం. కేవలం సివిల్స్‌ ఫౌండేషన్‌ అనే పేరుతో తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థాయికి మించిన పాఠశాలలను అన్వేషించాల్సిన అవసరమూ లేదు. వీటన్నిటినీ మించి విద్యార్థి చక్కని ప్రొఫెషనల్‌ డిగ్రీని సంపాదించటమూ అవసరమే. సివిల్స్‌ లక్ష్యానికి ఇది అవరోధం అవ్వదు.

మెరుగైన పునాది దేనిలో?

ఏ బోర్డును ఎంచుకోవాలనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించడానికి ఏ బోర్డు మెరుగైన పునాదిని వేయగలదో తెలుసుకుందాం.   విశాల దృక్పథంతో పరిశీలిస్తే.. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష అనేది ప్రజాసేవ చేయడంలో అభ్యర్థి వైఖరిని పరీక్షిస్తుంది. సామాజిక సమస్యల పట్ల అభ్యర్థికి ఉండే అవగాహన, స్పందనలను పరిశీలిస్తుంది. రాత పరీక్షలోనే కాకుండా ఇంటర్వ్యూ సమయంలోనూ అభ్యర్థికి ఈ ‘గవర్నమెంటల్‌ యాటిట్యూడ్‌’ను గమనిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌ అని వ్యవహరించేది దీన్నే.  

స్థూల స్థాయిలో ఇండియన్‌ హిస్టరీ, కల్చర్, ఇండియన్‌ పాలిటీ, ఇండియన్‌ జాగ్రఫీ, సోషల్‌ అండ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ మొదలైన వాటి పరిజ్ఞానాన్ని సివిల్స్‌ పరీక్షిస్తుంది. అభ్యర్థి అభీష్టానికి అనుగుణంగా ఆప్షనల్‌ సబ్జెక్టును ఎంచుకుంటే.. దాంట్లో అతడికి లోతైన పరిజ్ఞానం ఉందో లేదో పరీక్షిస్తారు. ముఖ్యంగా అభ్యర్థికి ఉండే సూక్ష్మ, స్థూల జ్ఞానాలను పరీక్షించే విధంగా ఈ సివిల్స్‌ పరీక్షా విధానాన్ని రూపొందించారు. ఒక సబ్జెక్టులో వచ్చే కొత్త మార్పులను గుర్తించే విద్యార్థి సామ  ర్థ్యాన్నీ పరీక్షిస్తారు. 

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే.. మిగతా బోర్డుల కంటే సీబీఎస్‌ఈ బోర్డు వల్ల ప్రయోజనాలు కొంత ఎక్కువగా ఉండొచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు అవసరమైన పరిజ్ఞానాన్ని సంపాదించే అవకాశం దీంట్లో ఉంటుంది. సివిల్స్‌ ప్రశ్నపత్రంలో కనిపించే సబ్జెక్టుల నుంచి వచ్చే ప్రశ్నలన్నీ సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఉంటాయి.   అయితే విద్యార్థులు మరే ఇతర బోర్డును ఎంపిక చేసుకున్నా ఆందోళన పడాల్సిన పనేమీ లేదు. సీబీఎస్‌ఈలా పునాది వేయడానికి తోడ్పడే బోర్డును ఎంచుకోనట్లయితే బ్రిడ్జ్‌ కోర్సులో చేరొచ్చు. హోమ్‌ ట్యూషన్స్‌ విధానంలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్, హ్యుమానిటీస్‌ సబ్జెక్టుల మీద ప్రాథమిక పరిజ్ఞానాన్ని ఇవి అందిస్తాయి.
 

Posted Date : 23-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌