• facebook
  • whatsapp
  • telegram

 కవులు - రచయితలు - వారి సేవలు

సాధారణంగా తెలుగు వాచకాల్లోని పాఠ్యాంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగటంలేదు. కానీ ఆ పాఠ్యాంశాల పరిచయం అవసరం. ఆయా పాఠ్యాంశాల రచయితలు, వారి ప్రముఖ రచనలు, గ్రంథాలు, విశిష్టతలగురించి తెలుసుకుని ఉంటే మంచిది. దీనివల్ల ఇటు తెలుగు, అటు జి.ఎస్. రెండింటిలోనూ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
         శ్రీశైలం, దక్షారామం, కాళేశ్వరం అనే ప్రసిద్ధ శైవ క్షేత్రాలను త్రిలింగ క్షేత్రాలు అంటారు. ఈ త్రిలింగ శబ్దం నుంచే 'తెలుగు' పదం పుట్టిందని కొందరి అభిప్రాయం.  శ్రీశైలం కర్నూలులో, దక్షారామం (ద్రాక్షారామంగా వ్యవహారం) తూర్పు గోదావరిలో, కాళేశ్వరం కరీంనగర్‌లో ఉన్నాయి.
* స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ సార్వభౌమత్వానికి చిహ్నంగా ఒక పతాకం ఉండాలని నాయకులు నిశ్చయించారు. జాతీయ పతాకను సిస్టర్ నివేదిత రూపొందించారు. ఇంకా చాలామంది పలు పతాకాలను రూపొందించారు. కానీ కొన్ని మార్పులతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకను జాతీయ పతాకగా ఆమోదించారు. జాతీయ పతాక రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచిన పింగళి వెంకయ్య స్వాతంత్య్ర సమరయోధులు, బహుభాషా కోవిదులు, నిరాడంబర రాజకీయవేత్త.
* 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో' అని కందుకూరి వీరేశలింగం హితవు పలికారు.  గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకట రమణయ్య, కోదాటి నారాయణరావు లాంటి వారు గ్రంథాలయోద్యమాన్ని నడిపారు. అయ్యంకి వెంకట రమణయ్యను గ్రంథాలయోద్యమ పితామహగా పేర్కొంటారు.

* గంగాపురం హనుమచ్ఛర్మ 'దుందుభి 'అనే పద్య కావ్యం రాశారు.  ఇది నదీ కావ్యం.  రంగారెడ్డి జిల్లాలో పుట్టిన, కృష్ణానది ఉపనది అయిన 'దుందుభి' గురించి రాశారు.
* ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద పరిశోధకోత్తములు.  'తెలుగు' జానపద గేయ సాహిత్యం అనేది వీరి తొలి జానపద పరిశోధనా గ్రంథం. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా పనిచేశారు. వీరి 'రామరాజీయం' అనే వ్యాస సంకలనం నుంచి 'మన సంస్కృతి' అనే పాఠ్యభాగాన్ని స్వీకరించారు.
     
 * శ్రీశ్రీగా పేరుగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు అభ్యుదయ, విప్లవ భావాలున్న కవి.  ఈయన రాసిన మహాప్రస్థానం నుంచి 'ప్రతిజ్ఞ 'అనే పాఠ్యభాగాన్ని స్వీకరించారు. 1910లో విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ ఎనిమిదో ఏటనే కందపద్యం రాశారు.  'ప్రతిజ్ఞ' అనే ఖండిక మార్క్సిజం ఆధారంగా రాసింది. ఈ పాఠంలోని

                         'విలాపాగ్నులకు విషాదాశ్రులకు
                          ఖరీదు కట్టే షరాబు లేడోయ్'

           అనే పంక్తులు సుప్రసిద్ధం.  శ్రీశ్రీ అభ్యుదయ దృక్పథానికి, కార్మిక, శ్రామికుల కల్యాణ కాంక్షకి, శబ్ద శక్తికి ఇది దర్పణం. 'ప్రస్థానం' అంటే ప్రయాణం అని అర్థం.
*  ఆదికవి, వాగనుశాసనుడు, శబ్దశాసనుడుగా ప్రసిద్ధిగాంచిన నన్నయ రాసిన పాఠ్యభాగం 'అమ్మ కోసం'.  ఇది ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వంలోది.  మహాభారత, రామాయణాలను ఇతిహాసాలు అంటారు. గరుత్మంతుడు తన శక్తి సామర్థ్యాలను నిరూపిస్తూ, అమ్మ కోసం అమృతాన్ని తేవడం ఈ పాఠ్యభాగ సారాంశం.

 'కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు
 నష్టపెట్టబోకు నాన్న మనసు'     - 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్యశాస్త్రి

 

* నార్ల వేంకటేశ్వరరావు ప్రసిద్ధ పత్రికా సంపాదకులు, హేతువాది.  ఈయన 'నార్ల వారి మాట', 'నరకంలో హరిశ్చంద్రుడు' లాంటి రచనలు చేశారు. వారు రాసిన 'అజంతా చిత్రాలు' అనే పాఠ్యభాగం యాత్రారచనకు చెందింది. తెలుగులో తొలి యాత్రారచనగా ఏనుగుల వీరాస్వామి రాసిన 'కాశీ యాత్రాచరిత్ర'ను పేర్కొంటారు. గౌరన శ్రీనాథయుగం నాటి (15వ శతాబ్దం) కవి. 'హరిశ్చంద్రోపాఖ్యానం' అనే ద్విపద కావ్యం రాశాడు. 'నక్షత్ర' పాత్రను మొదట ప్రవేశపెట్టింది గౌరనగా పేర్కొంటారు. హరిశ్చంద్రుడు సూర్య వంశానికి చెందిన త్రిశంకుడి కుమారుడు. బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన 'సత్యహరిశ్చంద్ర' నాటకం చాలా ప్రాచుర్యం పొందింది.
* నల్గొండ జిల్లాకు చెందిన వట్టికోట ఆళ్వారు స్వామి గొప్ప రచయిత.  'ప్రజల మనిషి' అనే నవల ప్రసిద్ధి చెందింది.  ఈయన రాసిన పాఠ్యాంశం పేరు 'చిన్నప్పుడే'. తెలుగు కోసం ఆనాడు ఎలా ఉద్యమించారో వెల్లడిస్తుందీ పాఠం.
* జ్ఞానపీఠ్ గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన 'జీవనభాష్యం' అనేది గజల్ ప్రక్రియకి సంబంధించిన పాఠ్యభాగం. గజల్ ఉర్దూ కవితా ప్రక్రియ. గజల్ అంటే 'ప్రియురాలితో సల్లాపం' అని అర్థం.  సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యులుగా, విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా గౌరవం పొందారు.  వీరి 'విశ్వంభర' కావ్యానికి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది.

                                ''మనిషీ మృగమూ ఒకటే అనుకుంటే వ్యర్థం
                                 మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది''    - సినారె

* రాయల కాలంనాటి అయ్యలరాజు రామభద్ర కవి అష్టదిగ్గజాల్లో ఒకరు. ఈయన రాసిన రామాభ్యుదయం అనే కావ్యం నుంచి 'సముద్ర లంఘనం' పాఠ్యభాగాన్ని స్వీకరించారు. రాయల యుగాన్ని ప్రబంధ యుగం అంటారు. 'రామాభ్యుదయం' కావ్యాన్ని గొబ్బూరి నరసరాజుకి అంకితం ఇచ్చారు.  రామభద్ర కవికి 'చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి' అనే బిరుదుంది.
* డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి 'కవి సమయాలు'అనే సిద్ధాంత గ్రంథం రాశారు. వీరి పాఠ్యభాగం 'ప్రాచీన సాహిత్యాధ్యయనం - ఆవశ్యకత' అనే వ్యాసం.
* నండూరి రామమోహనరావు ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులుగా పనిచేశారు.  విశ్వరూపం, నరావతారం,  విశ్వదర్శనం లాంటి రచనలు చేశారు. వీరు రాసిన పాఠ్యభాగమే 'సంస్కరణ'వ్యాసం. పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన 'సాక్షి 'వ్యాసాలు ప్రసిద్ధిచెందాయి.
*  జ్ఞానానంద కవి రాసిన పాఠ్యభాగం 'సందేశం'. పద్మశ్రీ పురస్కారం పొందిన వీరి రచనల్లో 'ఆమ్రపాలి 'అనే కావ్యం ప్రసిద్ధమైంది.
*  హాస్య రచయిత నండూరి సుబ్బారావు 'హద్దులు హద్దులు' అనే నాటికను రాశారు.
*  'ఆషామాషీ 'అనేది రావూరి వేంకట సత్యనారాయణరావు రచన. వీరు రాసిన పాఠ్యభాగం 'మధుపర్కాలు'.
* 'హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమం' అనే పాఠానికి వెల్తుర్ది మాణిక్యరావు రాసిన 'హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్ర', స్వామి రామానంద తీర్థ రాసిన 'హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం - అనుభూతులు, జ్ఞాపకాలు ' అనే పుస్తకాలు ఆధారం. 

* భాగ్యనగరం అంటే హైదరాబాద్. మన రాష్ట్రానికి రాజధానిగా కంటే పురాతనమైన, భిన్న సంస్కృతులకు నిలయంగా, శిల్పకళా వైభవం ఉన్న నగరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నిజాం పరిపాలనలో ఉర్దూ అధికార భాషగా, బోధనా భాషగా ఉండేది. చార్మినార్, గోల్కొండ, హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్, సాలార్‌జంగ్ మ్యూజియం లాంటి దర్శనీయ స్థలాలెన్నో ఉన్నాయి.  ట్యాంక్‌బండ్‌పై తెలుగు జాతికి చెందిన మహనీయుల విగ్రహాలను నెలకొల్పారు.

Posted Date : 29-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు