• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తగ్గిన పేపర్లలో.. నెగ్గాలంటే..!

పదోతరగతి పరీక్షల చివరిదశ ప్రిపరేషన్‌ వ్యూహం

పదోతరగతి సంవత్సరాంత పరీక్షల్లో స‌న్న‌ద్ధ‌త పూర్త‌యిన అనంత‌రం ఇంకొద్దిగా దృష్టిపెడితే మార్కులు పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో సన్నద్ధమైన తర్వాతే గ‌తంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. కాబట్టి ఈ దశలో అప్పుడు చదివిన వాటిని ప్రణాళికాబద్ధంగా గుర్తుకు తెచ్చుకుంటే చాలు మంచి మార్కులు తేలిగ్గా తెచ్చుకోవచ్చు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల సంఖ్యను కుదించింది. గతంలో హిందీ భాషతో కలిపి 11 పేపర్లు ఉండగా ఇప్పుడు వీటిని ఆరుకు తగ్గించింది. హిందీ పరీక్షను గతంలోనూ వంద మార్కులకే నిర్వహించారు. పాత పద్ధతిలో 50 మార్కులకు ఒక్కో ప్రశ్నపత్రం చొప్పున రెండు పేపర్లు ఉంటే కొత్త విధానంలో వంద మార్కులకు ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. తొమ్మిదో తరగతి, పదిలో సమ్మెటివ్‌, ప్రీఫైనల్‌ పరీక్షల వరకు రెండు పేపర్ల విధానంలోనే విద్యార్థులు పరీక్షలు రాస్తూ వచ్చారు. పేపర్‌-1, పేపర్‌-2 వారీగా ప్రిపేర్‌ అయ్యారు. 

మూడు విభాగాల ప్రశ్నలతో సామాన్యశాస్త్రం
సామాన్యశాస్త్రం పబ్లిక్‌ పరీక్షలో భౌతిక రసాయన శాస్త్రం, జీవనశాస్త్రం, పర్యావరణ విద్య సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ విద్యా ప్రమాణాల ప్రకారం ఉంటాయి. ప్రశ్నపత్రంలో భౌతిక రసాయన శాస్త్రాన్ని పార్ట్‌-ఏగా, జీవశాస్త్రం, పర్యావరణ విద్యను పార్ట్‌-బీగా పేర్కొంటారు. పార్ట్‌-ఏ 46మార్కులకు, పార్ట్‌-బీ 54 మార్కులకు ఉంటుంది. భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి ముఖ్యంగా ప్రయోగాలు, పటాలు, పట్టికలు, భేదాలు, ఉపయోగాలు, ఉదాహరణలు, లెక్కలు, విలువలు, ఫార్ములాలు, నిజ జీవిత అనువర్తనాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. పాయింట్ల వారీగా రాయడం, పునశ్చరణ చేయడం తప్పనిసరి అని సబ్జెక్టు నిపుణులు నౌషద్‌ సూచించారు. మొదటి పేపర్‌కు సంబంధించిన 12 పాఠ్యాంశాల్లో అన్ని భావనలను అర్థవంతంగా నేర్చుకోవాలి.

జీవశాస్త్రానికి 54 మార్కులు కేటాయించారు. ఒక్క మార్కు ప్రశ్నల్లో శాస్త్రవేత్తలు, పరిశోధనలు, అబ్రివేషన్‌ను వివరించడం, బొమ్మలోని తప్పులను గుర్తించడం, నేనెవరిని వంటి అంశాలను బాగా చదవాలని జీవశాస్త్రం సబ్జెక్టు నిపుణులు హరిప్రసాద్‌ తెలిపారు. పర్యావరణ విద్యలో ఆరో విద్యా ప్రమాణంపై ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చిన అంశాన్ని బాగా చదివి ‘నీవైతే మీ ఇంట్లో ఏ చర్యలు చేపడతావు? ఎలాంటి సూచనలు ఇస్తావు అని సొంతంగా రాసే ప్రశ్నలు ఇస్తారు. వీటి కోసం భావనలను సరిగా చదివి అవగాహన చేసుకోవాలి. రెండో విద్యా ప్రమాణమైన ప్రశ్నించడం, పరికల్పనలను చేయడంలో సాధారణంగా ప్రశ్నించే విధంగా సమాధానం రాయాలి. 1-8 పాఠాల్లో ఎక్కువగా విషయావగాహన ప్రశ్నలు ఉంటాయి. 9, 10 పాఠాల్లో సమాచార సేకరణ పట్టికలు, గ్రాఫ్‌లు వంటివి చదవాలి.

అనుకూలంగా తెలుగు
కొత్త ప్రశ్నపత్రాన్ని సామర్థ్యాల వారీగా పరిశీలిస్తే వ్యక్తీకరణ- సృజనాత్మకతకు మార్కులు తగ్గించారు. భాషాంశాల్లో మార్కులు పెంచారు. కష్టంగా ఉండే కొన్ని ప్రశ్నలను తొలగించారు. ఈ మార్పులు విద్యార్థులకు చాలా అనుకూలమని సబ్జెక్టు నిపుణులు కె. లీలాకుమార్‌ పేర్కొన్నారు. వ్యక్తీకరణ-సృజనాత్మకత సామర్థ్యంలో 7 లఘు ప్రశ్నలకు బదులుగా కేవలం 2 ప్రశ్నలు రాస్తే చాలు. వాటి కోసం పద్యభాగంలో కవి పరిచయాలు, గద్యభాగంలో ప్రక్రియలు (వ్యాసం, లేఖ, పీఠిక, కథానిక) చదివితే సరిపోతుంది. పద్యభాగంలో వ్యాసరూప ప్రశ్న తొలగించారు. భాషాంశాల్లోని లఘు సమాధాన ప్రశ్న (అలంకారం), వ్యాసరూప (ఛందస్సు) ప్రశ్నను తొలగించి అతి లఘు సమాధాన ప్రశ్నల్లో చేర్చారు.

పేపర్‌-2కి సంబంధించి అవగాహన-ప్రతిస్పందనలో అపరిచిత పద్యభావం, వ్యవహార రూపం... ప్రశ్నలను తొలగించారు. వ్యక్తీకరణ-సృజనాత్మకతలో 5 లఘు సమాధాన ప్రశ్నల స్థానంలో కేవలం పాత్ర స్వభావానికి చెందిన 1 ప్రశ్నను ఉంచారు. భాషాంశాల్లో విద్యార్థులకు కష్టం అనిపించే ప్రత్యక్ష కథనం... పరోక్ష కథనం ప్రశ్నలు ఈసారి లేవు. ఇది అనుకూలమైన అంశం. ప్రధానంగా అవగాహన-ప్రతిస్పందనకి సంబంధించి ప్రతి పదార్థాలు (వాచకం), పద్యపూరణ భావం (వాచకం), సంఘటనా క్రమం (ఉపవాచకం) చదవాలి. వ్యక్తీకరణ - సృజనాత్మకతలో లఘు సమాధాన ప్రశ్నలుగా పద్య కవిపరిచయాలు, గద్యప్రక్రియలు, ఉపవాచక పాత్ర స్వభావాలు వస్తాయి. వ్యాసరూప ప్రశ్నలు గద్యభాగం, ఉపవాచకం నుంచి ఇస్తారు. సృజనాత్మక ప్రశ్నగా లేఖ, కరపత్రం మాత్రమే వస్తాయి. భాషాంశాల్లో నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, ప్రత్యక్ష-పరోక్ష కథనాలు తప్ప మిగిలిన పదజాలం, భాషాంశాలను చదువుకోవాలి.ప్రతిరోజూ ఒక వ్యాసరూప ప్రశ్న, ఒక లఘు సమాధాన ప్రశ్న, ఒక అతిలఘు సమాధాన ప్రశ్న, భాషాంశాల్లో ఏదైన ఒక అంశాన్ని అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే పరీక్షలకు ముందే పునశ్చరణ కూడా పూర్తవుతుంది. పరీక్షలకు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ప్రణాళికతో చదివితే పదికి పది గ్రేడ్‌ సంపాదించుకోవచ్ఛు.

పరిమిత అధ్యాయాల నుంచే గణితం
వ్యాసరూప ప్రశ్నలు పరిమితంగా కొన్ని అధ్యాయాల నుంచే రావడానికి అవకాశం ఉంది. 14 అధ్యాయాలు ఒకే పేపరుగా ఉన్నాయి కాబట్టి ప్రణాళికబద్ధంగా అభ్యాసం చేయాలి. ప్రతి అధ్యాయంలో ఒకే రకమైన ప్రశ్నలు రావడానికి అవకాశం లేదు. ఉదాహరణకు సమితులు, శ్రేఢులు, ఛేదనరేఖలు, స్పర్శ రేఖలు, సంభావ్యత, అధ్యాయం నుంచి 1, 2, 4 మార్కుల ప్రశ్నలే రావచ్చని గణిత సబ్జెక్టు ఉపాధ్యాయులు జీవీబీఎస్‌ఎన్‌ రాజు అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రం నాలుగో విభాగంలో 8 మార్కుల ప్రశ్నలు అయిదింటిలో అంతర్గత ఎంపికకు అవకాశం ఉంది. చాయిస్‌లో ఇచ్చే ప్రశ్నలు ఒకే అధ్యాయం నుంచి రాకపోవచ్ఛు ఉదాహరణకు వాస్తవ సంఖ్యలో కరణీయ సంఖ్యల నిరూపరణ, సరూప త్రిభుజాల్లో థేల్స్‌ లేదా పైథాగరస్‌ సిద్ధాంత నిరూపణ వంటివి రావచ్ఛు ఒక ప్రశ్న బహుపదుల గ్రాఫ్‌, జ్యామితీయ నిర్మాణం నుంచి ఉండవచ్ఛు మొదట 8 మార్కుల ప్రశ్నలకు సమాధానం రాయాలి. 8 మార్కుల ప్రశ్నలు అయిదింటిలో రెండు సమస్య-సాధన నుంచి, నిరూపణలు, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడంపైన ఒక్కోటి వచ్చే అవకాశం ఉంది. 8, 4, 2, 1 మార్కుల ప్రకారం జవాబులు రాస్తే సమయం కలిసి వస్తుంది.

పట, సమాచార నైపుణ్యాలతో సాంఘిక శాస్త్రం
సాంఘికశాస్త్రంలో పట నైపుణ్యాలకు సంబంధించి భారతదేశ పటానికి 4 మార్కులు, ప్రపంచ పటానికి 4 మార్కులు కేటాయించి అంతర్గత చాయిస్‌ ఇచ్చారు. పట నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలపై దృష్టిపెడితే 30 మార్కులు సాధించుకునే అవకాశం ఉందని సబ్జెక్టు నిపుణులు డాక్టర్‌ దీక్షితుల వాణీప్రభ చెబుతున్నారు. ప్రతి చాప్టర్‌లో ఉన్న పటాలు, చిత్రాలు, గ్రాఫ్‌లను అధ్యయనం చేయాలి. ఇప్పటికే రివిజన్‌ చేసి ఉంటారు. ఇంకా నలభై రోజులపైగా సమయం ఉంది. సరిగ్గా ఉపయోగించుకుంటే పదికి పది సంపాదించుకోవచ్ఛు మళ్లీ మళ్లీ రివిజన్‌ చేయాలి. గ్రాండ్‌ టెస్ట్‌ మోడల్‌ పేపర్లకు సమాధానాలు రాస్తూ ప్రాక్టీస్‌ చేయాలి. దీని వల్ల పరీక్షలో సమయపాలనపై పట్టు కుదురుతుంది.

గమనించాల్సిన అంశాలు
* ప్రశ్నల సంఖ్య పెరగకపోయినా ఒకేసారి చదవాల్సిన పాఠ్యాంశాలు పెరిగాయి.
* పరీక్ష సమయం గతంలో 2.45 గంటలు ఉంటే అర్ధ గంటపెంచారు. ఇందులో 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోడానికి కేటాయించారు. మూడు గంటలపాటు పరీక్ష రాయాలి.
* సమయం పెంపు కొంతవరకు విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రస్తుతం లభించిన ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు.
* సామాన్యశాస్త్రం, హిందీ మినహా మిగతా సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో ప్రతి సెక్షన్‌లోనూ రెండు పేపర్ల పాఠ్యాంశాల నుంచి సమానంగా ప్రశ్నలు వస్తాయి.
* కొత్త ప్రశ్నపత్రంలో మార్కులు రెట్టింపు అయినా జవాబులను రెట్టింపు చేసి రాయాల్సి అవసరం ఉండదు. ప్రశ్నపత్రంలో సూచించిన పరిమాణం మేరకు పదాలు, వాక్యాల్లో రాస్తే సరిపోతుంది.

ఆంగ్లంతో ఇబ్బంది లేదు
రెండు పేపర్లకు సంబంధించిన విషయాలను ఒకే రోజు గుర్తుంచుకోవాల్సిన సమస్య ఆంగ్లంలో చాలా వరకు ఉండదు. క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్‌ విభాగంలో మార్కులను 5 నుంచి 10 కి పెంచారు. కాబట్టి పదికి పది జీపీఏ ఆశించే విద్యార్థులు సమాధానం పరిమాణం పెంచాలని డాక్టర్‌ నవులూరి పేరయ్య సూచించారు. కాంప్రహెన్షన్‌ విభాగంలో రీడింగ్‌ ప్యాసేజ్‌, అన్‌సీన్‌ ప్యాసేజ్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌లు; గ్రామర్‌లో ఎడిటింగ్‌, నాన్‌-ఫినిట్‌ క్లాజెస్‌, రిపోర్టెడ్‌ స్పీచ్‌, అడ్‌వెర్బ్స్‌ ఆఫ్‌ రీజన్‌, ఎయిథర్‌-ఆర్‌, నైథర్‌-నార్‌, టూ-టు, సో-దట్‌, ఇఫ్‌ క్లాజ్‌, ఆర్టికల్స్‌, యూజింగ్‌ ఇట్స్‌ టైమ్‌; వొకాబ్యులరీలో ఫ్రేజల్‌ వెర్బ్స్‌, ఇడియమాటిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, బైనామియల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఫారిన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌; క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్‌లో డిస్క్రిప్షన్‌, స్క్రిప్ట్‌ ఫర్‌ స్పీచ్‌, న్యూస్‌ రిపోర్ట్‌, స్టోరీ రైటింగ్‌ తదితరాలను చదవాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్‌ ట్రాన్స్‌ఫర్‌ లేదా ఫ్రేమింగ్‌ డబ్ల్యూహెచ్‌ ప్రశ్నల్లో ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చూస్తే ఒక పేపర్‌ విధానం వల్ల విద్యార్థులకు మేలు చేకూరిందనుకోవచ్ఛు గ్రామర్‌, ఒకాబ్యులరీలకు సంబంధించిన జవాబులను ఒకేచోట, ప్రశ్నపత్రంలో ఉన్న క్రమంలోనే రాయాలి.

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం