• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డమ్మీ పరీక్షలే అని.. డుమ్మా కొడితే!

మార్కులు మారిపోతాయ్‌!
టెన్త్‌, ఇంటర్‌ ప్రీ-ఫైనల్‌ పరీక్షల గైడెన్స్‌

ప్రాక్టీస్‌ లేకుండా క్రికెట్‌ మ్యాచ్‌లో నేరుగా బ్యాటింగ్‌కి వెళితే ఎలా ఉంటుంది? కుదిరితే పరుగులు కొడతారు. కాదంటే డకౌటై పెవిలియన్‌ దారిపట్టేస్తారు. అంతేకానీ పద్ధతిగా ప్రణాళిక ప్రకారం ఆడే అవకాశం ఉండదు. ప్రీ-ఫైనల్స్‌ రాయకుండా తుది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పరిస్థితీ దాదాపు ఇంతే. డమ్మీ ఎగ్జామ్స్‌ కదా అని తేలిగ్గా తీసుకుంటే అసలు పరీక్షలో అడ్రస్‌లు మారిపోవచ్చు. ఎంత చదివినా పరీక్షల్లో ఇచ్చే ప్రదర్శనే ఫైనల్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో కష్టానికి తగిన ఫలితాన్ని పొందాలంటే బలాలు, బలహీనతలు తెలుసుకొని తగిన అధ్యయన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. అందుకే టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు ప్రీ-ఫైనల్‌/ మోడల్‌ పరీక్షలను సీరియస్‌గా తీసుకొని రాయాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా తుది పరీక్షలకు నెల ముందు విద్యాసంస్థలన్నీ ప్రీ ఫైనల్‌/ మోడల్‌ టెస్టులను నిర్వహిస్తుంటాయి. కొన్ని కళాశాలలు ఒకటికి మించి ప్రీ ఫైనల్స్‌ను జరుపుతాయి. వాటికి కొందరు నామమాత్రంగా హాజరవుతారు. ఆ సమయాన్ని సన్నద్ధతకు కేటాయిస్తే లాభముంటుందని చాలామంది నమ్ముతుంటారు. తేలికగా తీసుకుంటారు. ఇంకొందరు ఏకంగా ఎగ్గొట్టేస్తుంటారు.

నిజానికి ప్రీఫైనల్స్‌ విద్యార్థులను తుది పరీక్షలకు సిద్ధంచేయడానికి మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. కెరియర్‌ మార్గం నిర్ణయించే ముఖ్య దశలైన టెన్త్‌, ఇంటర్‌లలో మంచి మార్కులు సాధించాలంటే తుది పరీక్షల ముందు సరైన పునశ్చరణ తప్పనిసరి. అందుకోసం ఈ ప్రీ-ఫైనల్‌ పరీక్షలు ఉపయోగపడతాయి.

బలం.. బలహీనత!
పరీక్షలనగానే ఒక్కో పాఠాన్నీ, సబ్జెక్టునూ చదువుకుంటూ వెళతారు. అలా చదువుతుంటే ప్రిపరేషన్‌ ముందుకు వెళ్లినట్లే ఉంటుంది. కొన్ని అప్పటికప్పుడు వచ్చినట్లే అనిపిస్తాయి. తీరా పరీక్షలో కూర్చుంటే ఎంత ప్రయత్నించినా గుర్తుకురావు. ఈ పరిస్థితి చాలామందికి ఎదురవుతుంది. నమూనా పరీక్షలు రాయకుండా నేరుగా తుది పరీక్షకు హాజరైతే అలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాని వల్ల మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే విద్యార్థి తనను తాను పరీక్షించుకోవడమే మంచి మార్గం. అందుకు ప్రీ-ఫైనల్స్‌ సాయపడతాయి. ఇవి రాయడం వల్ల విద్యార్థి తనకు బాగా వచ్చిన పాఠాలు, వచ్చాయనుకుంటున్నవీ, రానివీ.. ఏమిటో తెలుసుకోవచ్చు. తన సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నేర్చుకున్నవాటిపైనా స్పష్టత వస్తుంది. ఏ అంశాల్లో వెనుకబడ్డారో తెలుస్తుంది. తద్వారా పునశ్చరణ ప్రణాళికను మెరుగ్గా రూపొందించుకోవచ్చు.

ఎంతవరకూ గుర్తున్నాయ్‌?
విద్యార్థులు తమకు రాని అంశాలపైనే ఎక్కువగా దృష్టిపెడుతుంటారు. వచ్చినవి ఎలాగూ గుర్తుంటాయనే భావనే అందుకు కారణం. కానీ, ఎంత బాగా వచ్చినవి అయినా.. ఎంతటివారైనా కొన్నిరోజులకు మర్చిపోవడం సాధారణం. పూర్తిగా కాకపోయినా కొంతమేరకైనా మర్చిపోతారు. చదివినవి బాగా గుర్తుండాలంటే తరచూ పునశ్చరణ చేసుకోవాలి. ఏయే అంశాలను పునశ్చరణ చేయాలో ప్రీ-ఫైనల్స్‌/ మోడల్‌ టెస్టులకు హాజరుకావడం వల్ల తెలుస్తుంది.

స్కూలులో ఇప్పటికే త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షలు రాసి ఉంటారు. వాటిలో సిలబస్‌ పూర్తిగా కవర్‌ కాదు. సాధారణంగా పాఠాలు మొదట్లో కొంత సులువుగా ఉంటాయి. క్రమంగా కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న భాగాలపై నిర్వహించే పరీక్షకు సిలబస్‌ మొత్తం మీద ఇచ్చే పేపర్‌కు తేడా ఉంటుంది. ప్రశ్నల స్థాయి, పరీక్ష తీరులో మార్పులు ఉంటాయి. వాటిని సమగ్రంగా అర్థం చేసుకొని సిలబస్‌ మొత్తం మీద పరీక్షకు సరిగా సన్నద్ధం కావాలంటే ప్రీ-ఫైనల్స్‌ రాయాలి. అప్పుడే విద్యార్థి ప్రిపరేషన్‌ స్థాయి తెలుస్తుంది. పొరపాట్లను సరిదిద్దుకోడానికి సమయం దొరుకుతుంది.

రాత సాధనేదీ?
ఒకే భంగిమలో కూర్చుంటే కాసేపటికి కాళ్లు కదిలించలేని స్థితి వస్తుంది. చేతి రాత పరిస్థితీ అంతే. రాయడం మానేస్తే పెన్ను కదిలే వేగంలో మార్పు వచ్చేస్తుంది. రోజువారీ సన్నద్ధతలో భాగంగా కొందరు చదివిన ప్రశ్న వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి చూడకుండా రాస్తుంటారు. తుది పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ విధమైన సాధన వీలు కాదు. సూత్రాలు, లెక్కలు మినహా చాలావరకూ చదువుకుంటూ వెళ్లడానికే విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది కొన్నిరోజులపాటు సాగుతుంది. దీంతో పూర్తిగా కాకపోయినా రాత వేగంలో కొంతైనా మార్పు వస్తుంది. పరీక్ష అంటే సమయంతో పోటీ పడటమే. ఇక్కడ ఏమాత్రం వేగాన్ని అందుకోకపోయినా మార్కులను పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే రాత వేగాన్ని, తీరును అంచనా వేసుకోడానికైనా ప్రీ-ఫైనల్స్‌ రాయాలి.

ఒత్తిడిలో ఎలా?
పరీక్ష పేరు వింటే విద్యార్థులు ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. సొంత స్కూలు లేదా కాలేజీలో పరీక్ష రాయడానికీ కొత్త సంస్థల్లో తెలియని వారి మధ్య రాయడానికీ తేడా ఉంటుంది. దీంతో కొంత ఒత్తిడికి గురవుతారు. పరీక్ష సమయం పూర్తవుతున్నప్పుడు ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల జవాబులను మర్చిపోయే అవకాశం ఉంది. అలాంటి టెన్షన్‌ పరిస్థితులు ఎదురైనప్పుడు విద్యార్థి ప్రవర్తన ఎలా ఉంటోంది? పరీక్షను సరిగా పూర్తిచేయగలుగుతున్నారా లేదా.. ఆ ఒత్తిడిని తట్టుకోడానికి ఏం చేయాలి? ఎంత సమయంలోగా పరీక్షను పూర్తిచేయగలుగుతున్నారు? తదితరాలను తెలుసుకోవడానికి నమూనా పరీక్షలు రాయాలి. స్వయంగా ఒత్తిడి పరిస్థితులను పరిశీలించుకుని తమకు అనుకూలమైన విధానాన్ని రూపొందించుకోవడానికి ప్రీ-ఫైనల్స్‌ను ఉపయోగించుకోవాలి.

ఎవరి స్థానం ఏంటి?
తుది పరీక్షలు అంటే.. కొన్ని లక్షల మందితో పోటీ. అక్కడ విద్యార్థి బలం తెలియాలంటే ముందు చుట్టూ ఉన్నవారిలో తమ స్థానమేంటో తేలాలి. అందుకు ప్రీ-ఫైనల్స్‌ సాయపడతాయి. వాటిలో మార్కులు బాగా వచ్చినా, తక్కువ వచ్చినా విద్యార్థికి లాభమే. వచ్చిన మార్కులను ముందస్తు సంకేతంగా భావించి ఉత్సాహంగా, మరింత జాగ్రత్తగా సన్నద్ధత సాగించవచ్చు. ఎంత వేగంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరంఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎలా ఎదుర్కోవాలి?
‣ ముఖ్యమైన అంశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే ఉపాధ్యాయులు ముఖ్యమైన, గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను సూచించి ఉంటారు. అలాంటివాటిని మొదట పూర్తిచేయాలి. ఈ పరీక్షల్లో ఛాయిస్‌గా ఏ కాన్సెప్టులనూ, పాఠాలనూ వదలవద్దు. అన్నింటినీ ప్రయత్నించాలి. స్వయంగా కుదరలేదు అనుకున్నవాటికి సాయం తీసుకోవాలి.
‣ ప్రీ ఫైనల్‌ పరీక్షలనైనా, నమూనా టెస్టులనైనా నిజమైన పరీక్షగానే భావించాలి. తుది పరీక్షకు ఎలాగైతే అన్నింటినీ చదువుతారో, వీటికీ అలాగే చదవాలి.
‣ సమయానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడా తుదిపరీక్షను ఎలా రాస్తారో, అలాగే రాయాలి. ఏ విభాగానికి ఎంత సమయం పడుతోందో అంచనా వేసుకోవాలి. అప్పుడే తుది పరీక్షలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో స్పష్టంగా తెలుస్తుంది.

ప్రీ-ఫైనల్స్‌లో ...
 

75-90% వస్తే..!
మంచి స్కోరు. సన్నద్ధత సరైన దిశలోనే సాగుతున్నట్లు భావించవచ్చు. అలా అని రిలాక్స్‌ అయిపోకూడదు. తోటి విద్యార్థుల మార్కులు గమనించాలి. 10% వెనుకబడటానికి కారణాలనూ పరిశీలించుకోవాలి. ఇప్పటివరకూ సాగిస్తున్న సన్నద్ధత విధానాన్ని మరింత మెరుగు పరుచుకోడానికి అధ్యాపకులు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి.

55-70% అయితే..!
ఫర్వాలేదు. సన్నద్ధతలో కొంత వెనుకబడి ఉన్నట్లుగా గ్రహించాలి. పూర్తి శ్రద్ధతో ప్రిపరేషన్‌ సాగించడంపై దృష్టిపెట్టాలి. బలాలు, బలహీనతలు గమనించి సరైన అధ్యయన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. కష్టపడాలి.

50% కంటే తక్కువా..!
ఇబ్బందుల్లో ఉన్నట్లే. సన్నద్ధతను చాలా తేలికగా తీసుకున్నట్లుగా అర్థం చేసుకోవాలి. భయపడకుండా, చదివినా ప్రయోజనం ఉండదని వదిలేయకుండా, ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిపెట్టాలి. సీరియస్‌గా చదవాలి. అర్థం కాని పాఠాల కోసం టీచర్లు లేదా స్నేహితుల సాయం తీసుకోవాలి. ఏ ప్రాధాన్య క్రమంలో, వేటిని చదవాలో తెలుసుకోడానికి అధ్యాపకులను సలహాలు, సూచనలు కోరాలి.

Posted Date : 05-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని