• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గజగజ మాయం మార్కులు ఖాయం

టెన్త్‌, ఇంటర్మీడియట్‌ గణిత గైడెన్స్‌

అమ్మో లెక్కలా.. అనే భయం చాలామంది నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది. నూరుశాతం మార్కులకు నిజమైన హామీ ఇచ్చే గణితం అంటే గజ గజ వణుకుతుంటారు. పాఠ్యపుస్తకం నిండా పరిష్కరించాల్సిన సమస్యలు చూసి సతమతమైపోతుంటారు. అంత ఆందోళన అవసరం లేదంటున్నారు నిపుణులు. తర్కాన్ని గ్రహిస్తే వంద మార్కులు తిరుగులేకుండా తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. పద్ధతి ప్రకారం చదివితే లెక్కలపై పట్టు సాధించడం సులభమే అంటున్నారు. టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షల నేపథ్యంలో గణితం అంటే ఉన్న భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఏవిధంగా ప్రిపేర్‌ అయితే మంచిమార్కులు సాధించుకోవచ్చో తెలియజేస్తున్నారు.

తరతరాల సామాజిక అభివృద్ధిలో గణితం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇంజినీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీల ఆవిష్కరణలన్నింటిలో దీని ప్రమేయం ఉంటుంది. అసలు నిత్యజీవితంలో లెక్కలతో సంబంధం లేకుండా మనకు ఏ రోజూ గడవదు. దీనిపై ఆసక్తి ఉన్నవారికి ఇదో ఆట లాంటిది. కానీ చాలామంది విద్యార్థులకు మాత్రం ఒక బూచి. దాదాపుగా 60%కుపైగా విద్యార్థులు దీనికి భయపడుతుంటారని అంచనా. లెక్కలేనన్నిసార్లు సాధన చేసినా ఏదో తెలియని కంగారు పడుతుంటారు. అసలే పరీక్షల సమయం. కాబట్టి, పది, ఇంటర్‌ విద్యార్థులకు ఈ సబ్జెక్టు విషయంలో ఇంకాస్త కంగారు సహజమే. అపోహలనూ, భయాన్నీ తగ్గించుకోగలిగితే గణితంలో మంచి మార్కులు సాధ్యమేననేది నిపుణుల అభిప్రాయం. అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయం అందుకు సరిపోతుందంటున్నారు. సన్నద్ధతలో కాస్త మార్పులు చేసుకోవాలంతే!

ఒక్కోదానికి ఒక్కోటి
మ్యాథ్స్‌ అంటేనే ఫార్ములాలు, థియరీలు, మెథడ్స్‌. సన్నద్ధమయ్యే సమయంలోనే వీటన్నింటికీ షార్ట్‌ నోట్స్‌ తయారు చేసుకొని ఉంచుకోవాలి. వేటికవే వేర్వేరుగా చేసుకొని ఉంచుకోవాలి. ముఖ్యంగా వెయిటేజీ ఆధారంగా వాటిని సిద్ధం చేసుకోవాలి. అవసరమైనప్పుడు.. సందేహం వచ్చినప్పుడు, గుర్తుకురానప్పుడు సులువుగా తీసి చూసుకోవడానికి వీలుగా వీటిని తయారు చేసుకోవాలి. ఇవి పరీక్ష ముందురోజు పునశ్చరణకూ సాయపడతాయి.

ప్రాథమికాంశాలూ ముఖ్యమే
ణితం సన్నద్ధత అనగానే చాప్టర్లవారీగా సమస్యలను తీసుకోవడం, సాధించేయడం చూస్తుంటాం. ఈ సబ్జెక్టులో ప్రాథమికాంశాలు (ఫండమెంటల్స్‌), కాన్సెప్టులకే ప్రాధాన్యం. ముందు వీటిని బాగా నేర్చుకోవాలి. పట్టు సాధించాలి. ఇవి సమస్యలను సాధించడానికి అవసరమైన టెక్నిక్‌ను ఉపయోగించడంపై అవగాహన కల్పించడంతోపాటు సబ్జెక్టును అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడతాయి. ఇవి నేర్చుకున్న తర్వాతే లెక్కల వైపు వెళ్లాలి. దేనికి ఎన్ని మార్కులు అన్నదానిపైనా అవగాహన పెంచుకోవాలి. గణితం విషయంలో సరిగా రాసిన సూత్రానికీ, వేసిన స్టెప్‌లకూ మార్కులు వస్తాయి. ఈ విధానంపై అవగాహన తెచ్చుకోవాలి. ఒకవేళ పరీక్ష సమయంలో లెక్క చేయడంపై అవగాహన రాకపోయినా సూత్రాన్ని రాసి, సమస్యలోని అంకెలను ప్రతిక్షేపించినా ఎన్నో కొన్ని మార్కులను సొంతం చేసుకోవచ్ఛు.

చదవడం కాదు.. సాధించాలి!
గణితం అంటేనే మొత్తం సూత్రాలతో ఉంటుంది. దీనిలో చదివి, గుర్తుంచుకునే అంశాలు తక్కువ. సమయం సరిపోవడం లేదనో, ఇదివరకే పట్టు సాధించినవే అనో కొందరు స్టెప్పుల వారీగా చదువుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వచ్చినవే అయినా వాటిని స్టెప్పులవారీగా పేపర్‌పై సాధించాల్సిందే. అలా పూర్తిచేస్తేనే వచ్చినట్లు, సరిగా సిద్ధమైనట్లు. సూత్రాల సాధనకూ ఇదే పద్ధతిని అనుసరించాలి. వెయిటేజీ ఆధారంగా సిద్ధం చేసుకున్న సూత్రం వచ్చింది అనిపించిన తర్వాత దానికి సంబంధించిన లెక్కలను సొంతంగా చేయడానికి ప్రయత్నించాలి. ఒక్కదానికే పరిమితం కాకుండా అలాంటివాటినే 3-4 వరకూ ప్రయత్నించాలి. ఆ తరువాతే మరో కాన్సెప్టును అధ్యయనం చేయడం ప్రారంభించాలి.

పాత పేపర్లు.. మాదిరి ప్రశ్నపత్రాలు

గతంలో జరిగిన పరీక్షల పేపర్లు, మాదిరి ప్రశ్నపత్రాలు మానసికంగా విద్యార్థిని పరీక్షలకు సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయి. ఎన్ని ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం వస్తుంది. దీన్ని ఎక్కువ వెయిటేజీ ఉన్న అధ్యాయాలవారీగా చేయడం మంచిది. ఆ అధ్యాయంలో కాన్సెప్టులు క్షుణ్ణంగా వచ్చాయనుకున్న తర్వాతే దానికి సంబంధించిన ప్రశ్నలను వివిధ ప్రశ్నపత్రాల్లో నుంచి తీసుకుని, సాధన చేయాలి. దీని వల్ల ప్రశ్నలు అడిగే తీరుపైనే కాకుండా ఒకే అంశంపై పూర్తి అవగాహన కలుగుతుంది. ఒకవేళ ఏదైనా ప్రశ్న చేయలేకపోతే దాన్ని తర్వాత చేద్దాం అని పక్కన పెట్టేయవద్ధు సందేహాలను అప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడమే మేలు. లేదంటే అవి భారంగా తయారవుతాయి. దేన్నీ పూర్తిగా నేర్చుకోలేదన్న భావనా వస్తుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ ఎన్నో వేదికలు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయమూ తీసుకోవచ్ఛు

ఏరోజువి ఆరోజే..!
సులువైనవాటికీ, కష్టమైనవాటన్నింటికీ ఒకేసారి సిద్ధం కావద్ధు అది ఒత్తిడితోపాటు అనాసక్తికీ దారితీస్తుంది. ఒక సులువైన, ఆపై ఒక కష్టమైన కాన్సెప్టును ప్రయత్నిస్తూ వెళ్లాలి. అలాగే పరీక్షల ముందు తక్కువ సమయంలోనే అన్ని అధ్యాయాలనూ పూర్తిచేయాలనే తాపత్రయమూ వద్ధు నిజానికి ఒక థియరీ సబ్జెక్టుతోపాటుగా గణితాన్నీ చదివేలా ప్లాన్‌ చేసుకుంటే ఇంకా మంచిది. రోజు చివర్లో ఆరోజు సిద్ధమైన కాన్సెప్టులను పునశ్చరణ చేయాలి. అందుకు కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలి. పునశ్చరణ సమయంలో కాస్త కష్టంగా భావించినవాటిని మరుసటి రోజూ రివిజన్‌ చేయాలి. అప్పుడు కాన్సెప్టులన్నీ తప్పక గుర్తుండిపోతాయి.

అన్ని అధ్యాయాల లెక్కలనూ త్వరగా పూర్తిచేయాలనే ఆరాటం వద్ధు అవగాహన ఉన్నవాటిని ముందు ప్రాక్టీస్‌ చేయాలి. తర్వాత కష్టమైన వాటిని పరిష్కరించాలి. పునశ్చరణ తప్పనిసరి. రివిజన్‌లోనూ లెక్కలను చదవకూడదు. చేయాలి. మళ్లీ మళ్లీ చేయాలి. అదే మార్కుల మంత్రం.

లెక్కలను ఒకసారి చేయగానే వచ్చినట్లే అనిపిస్తాయి. కొంతకాలం తర్వాత చేయబోతే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. వచ్చినవే అని వదిలేయ కూడదు. మళ్లీ మళ్లీ చేయాలి.

లెక్కకు సరైన సమాధానం రాబట్టడం ఒక ఎత్తయితే.. సూత్రం రాయడం, స్టెప్‌ల ప్రకారం జవాబును సాధించడం మరోఎత్తు. స్టెప్‌లు కరెక్టుగా రాస్తే మరిన్ని మార్కులు పడతాయి.

Posted Date : 01-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని