• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉపకారం.. నాలుగేళ్లపాటు!

తెలంగాణ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల చివరి తేదీ నవంబరు 20
 


కేంద్ర ప్రభుత్వానికి చెందిన మానవవనరుల శాఖలోని స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం అర్హత పరీక్ష నిర్వహించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్(ఎన్ఎంఎంఎస్) పేరుతో స్కాలర్షిప్లను అందిస్తోంది. ఈ అర్హత పరీక్షలో ఎంపికైన విద్యార్థులు నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ.12000 చొప్పున ఉపకార వేతనం అందుకోవచ్చు. ప్రస్తుతం 2020-21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 

అర్హతలు
ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.5 లక్షలకు మించకూడదు. ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ గురుకులాలు, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, వసతితో కూడిన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇందుకు అనర్హులు. ఏడో తరగతి వార్షిక పరీక్షలో 55 (ఎస్సీ, ఎస్టీలు 50) శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది కొవిడ్ కార‌ణంగా 7వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌క పోవ‌డంతో ఆరో త‌ర‌గ‌తి మార్కుల‌ను ప్రామాణికంగా తీసుకోనున్నారు. రాష్ట్రాలవారీగా విద్యార్థుల ఎంపిక కోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరీక్ష నిర్వహిస్తాయి. అనంతరం ఎంపికైన విద్యార్థుల జాబితాను కేంద్రానికి పంపుతాయి. దేశ వ్యాప్తంగా లక్ష మందిని ఎంపిక చేస్తారు. వీరిలో రిజర్వేషన్ కిందఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీలకు 29, దివ్యాంగులకు 3 శాతం కేటాయించారు. 

పరీక్ష విధానం
అర్హత పరీక్ష మొత్తం 180 మార్కులకు ఉంటుంది. పార్ట్-ఎ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్)లో 90 ప్రశ్నలు, పార్ట్-బి స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టు (సాట్)లో 90 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పార్ట్-ఎలో వెర్బల్, నాన్ వెర్బల్ విభాగాలనుంచి ప్రశ్నలొస్తాయి. పార్ట్-బిలో 7, 8 తరగతుల్లోని మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కనీసం 40 మార్కులు (ఎస్సీ, ఎస్టీలు 32) శాతం మార్కులు తప్పనిసరి. అర్హులైన విద్యార్థుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన స్కాలర్షిప్లకు ఎంపిక చేస్తారు.

నాలుగేళ్లపాటు ఈ స్కాలర్షిప్ కొనసాగాలంటే పైతరగతుల్లోనూ నిర్దేశిత మార్కులు తప్పనిసరిగా సాధించాలి.

దరఖాస్తును ఆన్ లైన్ లో నవంబరు 20, 2020 లోపు పంపాలి. ఎస్టీ, ఎస్టీ విద్యార్థులు రూ.50, ఇతరులు రూ.100 పరీక్ష రుసుం చెల్లించాలి.

వెబ్సైట్: https://www.bse.telangana.gov.in/ 
 

Posted Date : 31-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని