• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దానశీలము

కవి పరిచయం:
* పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు.
* వరంగల్ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు.
* ఆయన తల్లిదండ్రులు - లక్కమాంబ, కేసన.
* పోతన భాగవత పురాణాన్ని రాసి శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు.
* పోతన తన రచనలను రాజులకు అంకితం ఇవ్వలేదు. వాటిని భగవంతుడికే ఇవ్వాలని సంకల్పించిన కవి.
* ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీ కల్యాణం - లాంటి ఘట్టాల్లోని పద్యాలు ప్రతి తెలుగువాడికి వస్తాయి.
 

పోతన ఇతర రచనలు
       1) వీరభద్ర విజయం
       2) భోగినీ దండకం
       3) నారాయణ శతకం
* పోతన 'సహజ పండితుడు'గా ప్రసిద్ధి చెందాడు.
* భక్తిరస ప్రధానంగా, పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత.
 

పాఠం నేపథ్యం/ ఉద్దేశం
* ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు, విరోచనుడి కుమారుడు బలిచక్రవర్తి.
* బలిచక్రవర్తి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గ లోకాన్ని ఆక్రమిస్తాడు.
* స్వర్గలోకంలోని దేవతలు బలిచక్రవర్తి పరిపాలనలో వివక్షకు గురవుతారు.
* ఈ విషయాన్ని దేవతలు మహావిష్ణువుతో చెబుతారు.
* మహావిష్ణువు తాను వామనుడిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానన్నాడు.
* వామన అవతారం ఎత్తిన మహావిష్ణువు నర్మదానదీ తీరంలో యాగం చేస్తున్న బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల కావాలని అడుగుతాడు.
* వామనుడు అడిగిన మూడు అడుగుల నేలను ఇస్తానని బలి చక్రవర్తిమాట ఇచ్చాడు.
* రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుడి మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించి బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అంటాడు.
* ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని, దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు
* 'దానశీలము' అనే పాఠ్యభాగం 'పురాణ' ప్రక్రియకు చెందింది.
* పురాణం అంటే పాతదైనప్పటికీ కొత్తగా భాసిల్లేది.
 

పురాణ లక్షణాలు: సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం
* పురాణాలు 18. వీటిలో భాగవత పురాణం ఉంది.
* పోతన భాగవతాన్ని తెలుగులో రాశాడు.
* ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమత్ భాగవతం అష్టమ స్కందంలోని 'వామనచరిత్ర' లోనిది.
 

ప్రవేశిక
       ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం.
       తాను సంపాదించిన దానిలో శక్తిమేర దానం చేయడం...
       ఇంటికి వచ్చిన అతిథి, అభ్యాగతును ఆదరించడం....
       ఇలాంటి సుగుణాలన్నీ మానవులకు ఉండాల్సిన మహిత గుణాలు. మన పురాణాల్లోని చరిత్రలో ఇలాంటి గుణాలు ఉన్నవారి కథలు ఎన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది.
* ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించినా, హెచ్చరించినా ఆయన మాట కాదంటూ 'వామనుడి' కోరిక మేరకు దానం చేస్తాడు. ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం.
 

పద్యాలు ప్రతిపదార్థ భావాలు

1వ పద్యం (పరీక్షలో రాదగిన పద్యం) (నేర్చుకోవాల్సిన పద్యం)
మ. కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
     డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
     గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లా కర్ణింపు కర్ణంబులన్
     వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!
ప్రతిపదార్థం:

వదాన్య + ఉత్తమా - వదాన్యోత్తమా  =       దాతల్లో ఉత్తముడా! (ఓ బలిచక్రవర్తి)
కులమున్  =    మీ వంశాన్ని
రాజ్యమున్ =    మీ రాజ్యాన్ని
తేజమున్ =    ప్రకాశాన్ని
నిలుపుము  =    కాపాడు
ఈ కుబ్జుండు =    ఈ పొట్టివాడు (వామనుడు)
విశ్వంభరుండు  =    విశ్వాన్ని భరించ గలిగేవాడు (విష్ణుమూర్తే)
అలతిన్ + పోడు =    ఇంత తక్కువతో వెళ్లడు
త్రివిక్రమ స్ఫురణవాడు + ఐ  =    మూడు లోకాలను ఆక్రమించగలవాడై
బ్రహ్మాండమున్ =    ఈ విశ్వమంతటినీ
నిండున్  =    వ్యాపిస్తాడు
ఒకండు =    మరొకడు
మాన్పన్ + కలడే =    తప్పించగలుగుతాడా
నా =    నా
పలుకులు  =    మాటలు
కర్ణంబులన్ =    చెవులతో
ఆ కర్ణింపు =    విను
దానము గీనమున్ =    దానం గీనం లాంటివి
వలదు =    వద్దు
వర్ణిన్  =    ఈ బ్రహ్మచారిని
పనుపుమా! =    పంపించవయ్యా

భావం: దాతల్లో గొప్పవాడా! ఓ బలిచక్రవర్తీ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణుమూర్తే. ఇతడు కొంచెం మాత్రమే తీసుకుని వెళ్లేవాడు కాడు. మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించు.
 

వచనం: అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు
             క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యశస్వి యిట్లనియె
ప్రతిపదార్థం:

అని =    అంటూ
ఇట్లు  =    పైవిధంగా
హితంబు  =    మేలైన మాటలు
పలుకుచున్న =    మాట్లాడుతున్న
కులాచార్యునకు =    తమ రాక్షస కుల గురువైన శుక్రాచార్యుడితో
క్షణమాత్ర  =    క్షణకాలం
నిమీలిత =    మూసిన
లోచనుండయి =    కన్నులు గలవాడై
యశస్వి =    కీర్తిగల బలిచక్రవర్తి
యిట్లనియె  =    ఇలా అన్నాడు

 
భావం: మేలైన మాటలు మాట్లాడుతున్న తమ రాక్షస కులగురువైన శుక్రాచార్యుడితో క్షణకాలం కళ్లు మూసుకుని బలిచక్రవర్తి ఇలా అన్నాడు.

2వ పద్యం
సీ. నిజమానతిచ్చితి నీవు మహాత్మక!
     మహిని గృహస్థధర్మంబు నిదియ
     యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు
     నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
     నర్థలోభంబున నర్థిఁ బొమ్మనుటెట్లు?
     పలికి లేదనుకంటెఁ బాప మెద్ది
     'యెట్టి దుష్కర్ముని నే భరించెదఁగాని
     సత్యహీనుని మోవజాల' ననుచుఁ
తే. బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
    సమరమున నుండి తిరుగకఁ జచ్చుకంటెఁ
    బలికి బొంకక నిజమునఁ బరఁగు కంటెఁ
    మానధనులకు భద్రంబు మఱియొఁ గలదె
ప్రతిపదార్థం:

నిజము =      నిజం
ఆనతిచ్చితి =    చెప్పితివి
నీవు =    నీవు (గురువా)
మహాత్మక =    ఓ మహాత్మా
మహిని =    ఈ లోకములో
గృహస్థ ధర్మంబున్ =    గృహస్థుల ధర్మం
ఇదియ =    ఇదే
అర్థంబు =    ధనం
కామంబు =    కామం
యశమును =    కీర్తిని
వృత్తియున్  =    జీవనాధారాన్ని
ఎయ్యది =    ఏది అడిగినా
ప్రార్థింపన్ =       అడిగినా
ఇత్తుననియున్ =    ఇస్తానని చెప్పాను
అర్థ లోభంబునన్ =    ధనంపై దురాశతో
అర్థిన్ =    అడిగే వాడిని
పొమ్మనుట =    వెళ్లమనడం
ఎట్లు  =    ఎలా?
పలికి లేదనుకుంటే =    ఇస్తానని చెప్పి లేదని అనడం కంటే
పాపమెద్ది =    పాపం లేదు
తొల్లి =    మునుపు
భూదేవి =    భూమాత
ఎట్టి దుష్కర్మునిన్ =    ఎలాంటి చెడ్డపని చేసిన వాడినైనా
నేన్ =    నేను
భరించెదగాని =    భరిస్తాను కానీ
సత్యహీనుని =      ఆడిన మాట తప్పిన వాడిని
మోవజాలన్ =    మోయలేను
అనుచు =    అంటూ
పలుకదే =    పలికింది
బ్రహ్మతోడ  =    బ్రహ్మతో
సమరమున ఉండి =    పోరులో ఉండి
తిరుగకన్ =    వెనుదిరుగకుండా
చచ్చుకంటే =    వీరమరణం పొందడం కంటే
బలికి బొంకక =    పలికి తప్పకుండా
నిజమునన్ =    సత్యంతో
పరగుకంటే =    బతకడం కంటే
మానధనులకున్  =    మానధనులకు
భద్రంబు =    మేలైంది
మరియున్ గలదె =    వేరొకటి ఉంటుందా


భావం: ఓ మహాత్మా! నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం...... వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి ''ఎలాంటి చెడ్డపని చేసినా వాడినైనా భరిస్తాను, కాని ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను" అని బ్రహ్మతో చెప్పింది కదా! యుద్ధంలో వెనుదిరగకుండా వీర మరణం పొందడమూ, మాటకు కట్టుబడి సత్యంతో బతకడమూ మానదనులైన వాళ్లకు మేలైన మార్గాలు.

3వ పద్యం
క. ధాత్రిని హలికునకును సు
    క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం
    జిత్రముగ దాత కీవియుఁ
    బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే!
ప్రతిపదార్థం:

ధాత్రిని =      భూలోకంలో
హలికునకును =    రైతన్నకు
సుక్షేత్రము =    మంచి పొలం
బీజములు =    మంచి విత్తనాలు
ఒకట  =    ఒక్క దగ్గరే
చేకుఱు భంగిన్ =    దొరికినట్లుగా
చిత్రముగ  =    అదేవిధంగా (అలాగే)
దాతకు =    దానం చేసే అతడికి
ఈవియు =    తగినంత ధనం
పాత్రము =    గ్రహించే ఉత్తముడు
సమకూరునట్టి =    దొరికే
భాగ్యము  =    అదృష్టం
గలదే =    అరుదే కదా!


భావం: రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడం అరుదు. అలాగే దాతకు తగినంత ధనం, దాన్ని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తీ దొరికే అదృష్టం కూడా అరుదే కదా!

4వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
శా. కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
     వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
     బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
     యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
ప్రతిపదార్థం:

భార్గవా =       ఓ ఆచార్యా (శుక్రాచార్య)
కారే రాజులు =    పూర్వం రాజులు లేరా? (ఉన్నారు)
రాజ్యముల్ =    రాజ్యాలు
కలుగవే?  =    కలిగి లేరా? (ఉన్నారు)
గర్వోన్నతిన్ =    ఎక్కువ అహంకారంతో
బొందరే =    ఉండలేదా (ఉన్నారు)
వారేరి =    అలాంటివారు ఎక్కడ
సిరిన్ =    సంపదలను
మూటగట్టుకొని =    ముల్లెగా చేసుకుని
పోవంజాలిరే? =    పోయారా?
భూమిపై =    ఈ నేలపై
పేరైనం గలదే?  =    వారి పేరైన మిగిలి ఉందా?
శిబి ప్రముఖులుం =    శిబి చక్రవర్తిలాంటి గొప్పదాతలైనవారు
ప్రీతిన్ =    సంతోషంతో
యశ: కాములై =    కీర్తి కోరినవారై
యీరే  =    ఇవ్వలేరా
కోర్కులు =    అడిగినవారికి
వారలన్ =    దాతలందరిని
మఱచిరే =    మరువలేదు కదా
యిక్కాలమున్ =    ఈనాటికి


భావం: ఆచార్యా! పూర్వం రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకుని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగల్లేదు. కీర్తి కోసం శిబి చక్రవర్తి లాంటివారు సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా!

5వ పద్యం
క. ఉడుగని క్రతువుల వ్రతములఁ
   బొడగనఁ జననట్టి పొడవు పొడవునఁ గుఱుచై
   యడిగెడి నఁట; ననుబోఁటికి
   నిడరాదె మహానుభావ! యిష్టార్థంబుల్
ప్రతిపదార్థం:

మహానుభావ! =      ఓ మహానుభావా!
ఉడుగని =    ఎడతెగని
క్రతువుల =    యజ్ఞాలతో
వ్రతముల =    పుణ్యకార్యాలు (వ్రతాలు)
పొడగనన్ =    చూడటానికి
చననట్టి =    సాధ్యంకాని
పొడవు =    విష్ణుమూర్తి రూపం
పొడవునన్  =    పెద్దదైనట్టిది
కుఱుచై =    చిన్నదై
అడిగెడినట =    అడిగాడట
ననుబోటికి =    నాలాంటి వాడికి
నిడరాదె =    ఇవ్వవద్దా
ఇష్టార్థంబుల్ =    ఇష్టమైన వాటిని

 
భావం: మహానుభావా! ఎడతెగని యజ్ఞాలు, పుణ్యకార్యాలు ఎన్నిచేసినా విష్ణువును చూడడం సాధ్యంకాదు. అలాంటి గొప్పవాడు చిన్నవాడిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దాన్ని ఇవ్వడం కంటే నాలాంటి వాడికి ఇంకేం కావాలి?

6వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
మ. నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
      ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
      హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
      దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య! వేయేటికిన్?
ప్రతిపదార్ధం

ధీవర్య =    పండితోత్తమా
నిరయంబైన =       నరకం వచ్చినా
నిబంధమైన =       బంధనం ప్రాప్తమైన
ధరణీ  =       ఈ భూమి
నిర్మూలనంబైన =       అదృశ్యమైనా
దుర్మరణంబైనన్  =       ఘోర చావు వచ్చినా
కులాంతమైనన్ =       వంశం అంతా నశించినా
నిజమున్ రానిమ్ము  =       నిజంగా పైవన్నీ జరిగినా
కానిమ్ము పో =       ఏదైనా రానీ
హరుడైనన్ =       శివుడైనా
హరియైన =       విష్ణువైనా
నీరజభవుండు =       బ్రహ్మ అయినా
అభ్యాగవంతుడైనా  =       భోజన సమయానికి వచ్చిన అతిథి అయినా
ఔ  =       ఎవరైనా కావచ్చు
నాదు జిహ్వ =       నా నాలుక
తిరుగన్ నేరదు =       తిరిగి తప్పుపలకదు
వినుమా =       నామాట విను
వేయేటికిన్  =       వేయి మాటలు ఎందుకు?


భావం: ఓ పండితోత్తమా! నాకు నరకం వచ్చినా, బంధనం ప్రాప్తమైనా ఈ భూమి అదృశ్యమైనా నాకు దుర్మరణం వచ్చినా సరే. నా వంశం నశించినా ఏమైనా కానీ, ఏదైనా రానీ! ఆడినమాట తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరుగదు. ఎందుకీ వేల కొద్ది మాటలు?

7వ పద్యం
ఆ. బ్రదుకవచ్చుగాక బహుబంధనములైన
    వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక
    జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
    మాట దిరుగలేరు మానధనులు.
ప్రతిపదార్థం:

బ్రదుకవచ్చుగాక =       ఎలాగైనా బతుకవచ్చు (సుఖమైనా, దు:ఖమైనా)
బహుబంధనములైన =     ఎన్నో కష్టాలైన
వచ్చుగాక =     రావచ్చుగాక
లేమి =     పేదరికం
వచ్చుగాక =     రావచ్చుకాక
జీవధనములైనన్ =     ప్రాణం, ధనం ఐనా
చెడుగాక =     చేటు వచ్చుకాక
పడున్‌గాక =     మరణం వచ్చుకాక
మాట =     మాట
తిరుగలేరు =     తప్పలేరు
మానధనులు =     అభిమాన ధనులు

 
భావం: బాగా బతికినా, ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికీ, ధనానికీ చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా సరే అభిమానధనులు మాట తప్పలేరు.
వచనం: అయ్యవసరంబున = ఆ సమయంలో

8వ పద్యం
ఆ. దనుజలోకనాథు దయిత వింధ్యావళి
    రాజవదన మదమరాళ గమన
    వటుని కాళ్లు గడుగ వర హేమ ఘటమున
    జలము దెచ్చె భర్త సన్నయెఱిగి
ప్రతిపదార్థం:

దనుజలోకనాథు =        రాక్షసలోక ప్రభువైన బలిచక్రవర్తి
దయిత =    భార్య
వింధ్యావళి =    బలిచక్రవర్తి భార్యయైన వింధ్యావళి
రాజవదన =    చంద్రబింబ ముఖం
మదమరాళ గమన =    మత్తిల్లిన రాజహంస నడకతో
వటుని =    వామనుడి
కాళ్లుగడుగన్ =      కాళ్లు కడిగేందుకు
వర =    శ్రేష్ఠమైన
హేమ =    బంగారు
ఘటమునన్ =    కలశంతో
జలము తెచ్చెన్ =    నీళ్లు తెచ్చింది
భర్త =    తన భర్త బలిచక్రవర్తి
సన్నయఱిగి =    సైగను గమనించి


భావం: అని ఈవిధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం లాంటి ముఖంతో, మత్తిల్లిన రాజహంస లాంటి నడకతో అతడి ఇల్లాలు వింద్యావళి భర్త సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్లు కడిగి దానం చేయడం కోసం శ్రేష్ఠమైన బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది.
 

వచనం: అ య్యవసరంబునఁ గపటవటునకు నద్దానవేంద్రుం డిట్లనియె

అయ్యవసరంబున =       ఆ సమయంలో
కపటవటునకున్  =    మోసంగా వచ్చిన వామనుడితో
అద్దానవేంద్రుడు =    బలి చక్రవర్తి
ఇట్లనియె   =    ఇలా అన్నాడు

భావం: ఆ సమయంలో వామనుడితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు.

9వ పద్యం:
క. రమ్మా! మాణవ కోత్తమ!
   లెమ్మా! నీ వాంఛితంబు లే దన కిత్తుం
   దెమ్మా! యడుగుల నిటు రా
   నిమ్మా! కడుగంగవలయు నేఁటిఁకి దడయున్?
ప్రతిపదార్థం:

రమ్మా =        రావయ్యా
మాణవకోత్తమా =     బ్రహ్మచారుల్లో ఉత్తముడా
లెమ్మా =     లేవయ్యా
నీ వాంఛితంబు =     నువ్వు అడిగింది
లేదన కిత్తు =     లేదు అనక ఇస్తాను
తెమ్మా =     తీసుకురా
యడుగుల =     నీ పాదాలను
నిటురానిమ్మా =     ఇటు వచ్యెయ్యనియ్యు
కడుగంగవలయున్ =         కడగాలి
ఏటికి  =     ఎందుకు
తడయున్  =     ఆలస్యం


భావం: ఓ ఉత్తమ బ్రహ్మచారీ! లేవయ్యా! ఇటు రావయ్యా! నువ్వు అడిగింది లేదనకుండా ఇస్తా. నీ పాదాలు కడుగనివ్వు. ఇంకా ఆలస్యం దేనికి?

10వ పద్యం
క. సురలోక సముద్ధరణము
    నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతాలం
    కరణము భవసంహరణము
    హరిచరణము నీటఁ గడిగె నసురోత్తముఁడున్.
ప్రతిపదార్థం:

అసురోత్తముడున్ =      రాక్షస రాజుల్లో ఉత్తముడైన బలిచక్రవర్తి
సురలోక =    దేవలోకాన్ని (దేవతల)
సముద్ధరణము =    కష్టాలను తొలగించేది
నిరత  =        కలకాలం
శ్రీ కరుణ  =    మేలు కలిగించేది
అఖిల =    సమస్తమైన అన్ని
నిగమాంత =    ఉపనిషత్తులకు
అలంకరణము =    అలంకారమైంది
భవ సంహారణము  =    భవ బంధాలను పోగొట్టి మోక్షాన్ని ఇచ్చె
హరి చరణమున్ =    విష్ణు పాదాన్ని
నీట గడిగె  =    నీళ్లతో కడిగాడు


భావం: రాక్షస రాజుల్లో ఉత్తముడైన బలిచక్రవర్తి దేవతల కష్టాలను తొలగించేది, కలకాలం మేలు కలిగించేది, ఉపనిషత్తులకు అలంకారమైంది, భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని ఇచ్చే విష్ణు పాదాన్ని నీటితో కడిగాడు.
వచనము: ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు సేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు సేసి.

ప్రతిపదార్థం:

ఇట్లు =        ఈ విధంగా
ధరణీసుర =    వామనుడి (బ్రాహ్మణుడై)
దక్షిణ చరణ =    కుడి పాదాన్ని
ప్రక్షాళనంబుచేసి =    కడిగి
వామపాదంబు =    ఎడమ పాదాన్ని
కడిగి =    కడిగి
తత్పావన జలంబు =    పవిత్రమైన ఆ జలాలను
శిరంబునం =    నెత్తిపై
చల్లుకుని  =    చల్లుకుని
వార్చి =    ఆచమనం చేసి
దేశకాలాది =    దేశ, కాల పూర్వకమైన
పరిగణనంబు =    సంకల్పాన్ని కూడి
సేసి =    చెప్పాడు


భావం: ఈ విధంగా వామనుడి పాదాలను కడిగి పవిత్రమైన ఆ జలాలను తలపై చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశ, కాల పూర్వకమైన సంకల్పాన్ని చెప్పాడు.

11వ పద్యం:
శా. 'విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వే
    ద ప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి' యంచుం గ్రియా
    క్షి ప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాఁచి పూజించి 'బ్ర
    హ్మప్రీత'మ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందఁగన్
ప్రతిపదార్థం:

ధనుజేశ్వరుండు =        రాక్షసులకు ఈశ్వర సమానుడైన బలిచక్రవర్తి
విప్రాయ =    బ్రాహ్మణుడవూ
ప్రకటవ్రతాయ =    ప్రసిద్ధమైన వ్రతం గలవాడా
భవితే  =    నీకోసం
విష్ణుస్వరూపాయ =    విష్ణుస్వరూపుడవూ
వేద ప్రామాణ్యవిదే =    వేద ప్రమాణతను తెలిసినవాడవు
త్రిపాద ధరణీం =    మూడు అడుగుల నేలను
దా స్యామి =    దానంగా ఇస్తున్నాను
అంచు  =         అని పలికి
క్రియాక్షిప్రుండై =    పనిచేయాలనే తొందరతో
వడుగున్ =    వామనుడి
జేసాచి =    చేతులు చాచి
పూజించి =    పూజించాడు
బ్రహ్మప్రీతమ్మని =    పరమాత్ముడికి ప్రీతి కలగాలని అని
భువనంబు =    లోకం
ఆశ్చర్యమున్ =    ఆశ్యర్యం
బొందగన్ =    పొందింది.


భావం: బలి చక్రవర్తి చేతులు చాచి వామనుడిని పూజించాడు. ''బ్రాహ్మణుడవూ ప్రసిద్ధమైన వ్రతం గలవాడవూ, విష్ణు స్వరూపుడవూ వేదాల ప్రమాణతను తెలిసినవాడవు అయిన నీకు మూడు అడుగుల నేలను దానం చేస్తున్నా" అని పలికి ''పరమాత్మునకు ప్రీతి గలుగుగాక" అంటూ వెనువెంటనే చేతిలో నీటిని ధారపోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది.

12వ పద్యం
క. బలిచేసిన దానమునకు
    నలినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁడగుటం
    గలకలమని దశ దిక్కులు
    బళి బళియని పొగడె భూత పంచకమనఘా!
ప్రతిపదార్థం:

అనఘా =         ఓ పరీక్షిన్మహారాజా
బలి చేసిన =    బలి చక్రవర్తి చేసిన
దానమునకు =    దానానికి (మూడు అడుగుల నేల)
నలినాక్షుడు =    తామర లాంటి కన్నులున్న విష్ణువు
అఖిల భూతనాయకుడు =    అన్ని భూతాలకు అధిపతి
అగుటన్ =    కావడం వల్ల
కలకలమని =    కళకళ లాడుతూ
దశదిక్కులు  =    పది దిక్కులు
భూత పంచకము =      పంచ భూతాలు
బళిబళియని =    'బళి బళి' అని
పొగడె =    పొగిడాయి


భావం: ఓ పరీక్షిన్మహారాజా! అన్ని భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానమియ్యగానే పది దిక్కులూ, పంచభూతాలూ 'బళి బళి' అని పొగిడాయి.

రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌