• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

ప్రాజెక్టు పని

గాంధీజీ - సత్యశోధన, సామల సదాశివ - యాది, కాళోజీ - నా గొడవ, దాశరథి రంగాచార్య - జీవనయానం, గడియారం రామకృష్ణశర్మ - శతపత్రము మొదలైన ప్రముఖుల జ్ఞాపకాలు, అనుభవాలు గ్రంథస్థమై ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక గ్రంథాన్ని సేకరించి అందులోని విషయాలను చదవండి. వాటిలో మీకు నచ్చిన ఒక సంఘటనను పేర్కొంటూ ఎందుకు నచ్చిందో తెలుపుతూ నివేదిక రాయండి.
జ: నేను సేకరించిన గ్రంథం - గాంధీజీ చరిత్రను వివరించే 'సత్యశోధన'. అందులోని విషయాలను చదివాను. అందులో నాకు నచ్చిన సంఘటన 'దొంగతనం - ప్రాయశ్చిత్తం'
    గాంధీజీ ఒక బంధువు సావాసంలో పడి సిగరెట్ తాగాలని అనుకున్నాడు. గాంధీజీ పినతండ్రి పొగపీల్చి బయటకు వదలడం చూసి ఈయనా కాల్చాలనుకున్నారు. అయితే వారి దగ్గర డబ్బులు లేవు. అందుకోసం కాల్చిన బీడీలు ఏరి గాంధీజీ కాల్చడం మొదలుపెట్టారు. వాటిద్వారా ఎక్కువ పొగ రాకపోవడంతో నౌకర్ల డబ్బు దొంగిలించి బీడీలు కొనడం మొదలుపెట్టారు. దొంగిలించిన డబ్బుతో దేశవాళీ సిగరెట్‌లు కొని రహస్యంగా తాగడం ప్రారంభించారు. కాని తృప్తి కలగలేదు. వారు వారి పారతంత్య్రాన్ని గురించి యోచించి చాలా దుఃఖించారు. పెద్దల అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నందుకు విచారించారు. విసిగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నారు.
   కేదారేశ్వర దేవాలయానికి వెళ్లి దైవారాధన చేసారు. 'వెంటనే ప్రాణం పోకపోతే? చస్తే ఏం లాభం? ఏమి సాధించినట్లు? స్వాతంత్య్రం లేకుండా బతకకూడదా?' ఈ రకమైన ఆలోచనలతో గాంధీజీ బుర్ర వేడెక్కించుకున్నారు. ఉమ్మెత్త గింజలను ఎంచుకున్నారు. రెండు మూడు మింగివేశారు. తర్వాత కొన్ని క్షణాల్లో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రాణం నిలుపుకునేందుకు రామమందిరం వెళ్లి పశ్చాత్తాపపడ్డారు. దొంగతనం గురించి చీటీమీద రాసి తప్పంతా తెలియజేస్తూ క్షమించమని ప్రార్థిస్తూ తన తండ్రికి చీటీ ఇచ్చారు. అది చదివి గాంధీజీ తండ్రి కళ్లు మూసుకుని యోచించి చీటిని చింపివేశారు. తండ్రికి కలిగిన వేదనను గాంధీజీ గ్రహించారు. ఆయన ప్రదర్శించిన శాంతితత్వం అద్భుతం. మళ్లీ ఇలాంటి దోషం చేయను అని గాంధీజీ శపథం చేసుకున్నారు.

 

నివేదిక
    గాంధీజీకి యుక్తవయసులో సిగరెట్ కాల్చాలన్న కోరిక కలిగింది. పొగతాగే పినతండ్రిని చూసి తాను కాల్చలన్న ఆరాటం కలిగింది. అందుకోసం దొంగతనం కూడా చేశారు. ఆత్మహత్య కూడా చేసుకోవాలన్న తలంపు కూడా వచ్చింది. చివరకు అది వృథా అయిన ఆలోచన అని తప్పును క్షమించమని తన తండ్రిని ప్రార్థించడం చాలా గొప్పగా అనిపించింది.
    అంతేకాదు తండ్రి ప్రేమలో ఉన్న అద్భుతమైన శాంతితత్వం బోధపడింది. తండ్రి ప్రేమకు తన్మయుడైన గాంధీజీ మళ్లీ తప్పు చేయనని శపథం చేయడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన జీవిత విషయాలు సర్వదా ఆచరణీయం. ప్రతి సంఘటన మనకొక కొత్త మేలుకొలుపు.

 


రచయిత: అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌