• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

రచయిత పరిచయం
* రచయిత డాక్టర్ సామల సదాశివ.
* సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహెగామ్ మండలం తెనుగుపల్లెలో 1928 మే 11న జన్మించారు.
* ఇతడు సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో పండితుడు.
* ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
 

రచనలు
    1. ఉర్దూ సాహిత్య చరిత్ర
    2. అమ్జద్ రుబాయీలు
    3. మలయ మారుతాలు
    4. యాది
    5. సంగీత శిఖరాలు
* 'అమ్జద్ రుబాయీలు' రచనకు 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనా పురస్కారాన్ని అందించింది.
* 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన - 'స్వరలయలు'
* కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.
* హిందుస్థానీ - కర్ణాటక సంగీతానికి 'సాంస్కృతిక వారధి' గా రచయిత గుర్తింపు పొందారు.
* సదాశివ రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
 

పాఠం ఉద్దేశం
* ఒక భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల అది ఎంతో పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెప్పడం.
* ఇతర భాషల్లో గొప్పదనాన్ని కూడా బేరీజు వేయడంతోపాటు తెలుగు భాష గొప్పదనం, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేయడం.
 

పాఠ్యభాగ వివరాలు
* 'ఎవరి భాష వాళ్ళకు వినసొంపు' అనే ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందింది.
* వ్యాసం అంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేలా వివరించడం.
 

వ్యాసం లక్షణం:
* సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం.
* ప్రస్తుత ఈ పాఠ్యభాగం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన 'యాది' అనే వ్యాస సంపుటిలోనిది.
 

ప్రవేశిక
* కప్పగంతుల లక్ష్మణశాస్త్రి సంస్కృత ఆంధ్ర కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్ధండ పండితుడు, ఆంధ్ర బిల్హణ బిరుదాంకితుడు.
   ''వారీ రామచంద్రా! ఇగపటు..." అని అన్నాడు
   గుడి పూజారి ''మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి" అని ఆశ్చర్యపరచాడు.
* ప్రముఖ కవి మీర్ తఖీమీర్ ''మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను" అని అన్నాడు
   పై ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ 'యాది' లోనివి. ఇలాంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదవవలసిందే.
 

పాఠ్యభాగం


   సామల సదాశివ మనుమరాలు లావణ్య ''తాతా ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ" (తాతా ఇది తీసుకో నీ పాను, జర్దా డబ్బా) అని తెచ్చి ఇచ్చింది. లావణ్య కంటే రెండేళ్ల పెద్దదైన కావ్య సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంది. వాళ్లు ఇద్దరూ హిందీలో మాట్లాడతారు. తెలుగురాదు. అంటే తెలుగు మాటలు హిందీ నుంచి అనువదించుకుని మాట్లాడతారు. కానీ, తెలుగువాళ్ల పలుకుబడి (యాస), నుడికారము (మాట చమత్కారం) వాళ్లకు తెలియదు. సామల సదాశివకు లావణ్య తోడుగా ఉండేది. నాలుగేళ్లు పూర్తిగా నిండని లావణ్య 'ఇగపటు' అనగానే ఈ ప్రాంతపు తీయని తెలుగు మాట పలికినందుకు రచయిత సంతోషించాడు. 'తాతాగారండీ! ఇదిగోనండీ మీ పాను' అని పలికినా మంచి తెలుగే. అయితే ఏ ప్రాంతపు వాళ్ల తెలుగు ఆ ప్రాంతపు వారికి ఇంకా మంచిగా ఉంటుంది.
ఈ విషయం జరగగానే సామల సదాశివకు ఒక విషయం యాదికి (గుర్తుకు) వచ్చింది. అది ఏమిటంటే తిరుమల రామచంద్ర 'హైదరాబాద్ నోట్‌బుక్' అనే పేరుతో ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు. (బ్లిట్జ్ పత్రికలో కె.కె.అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే చాలామంది ఆ పత్రికను కొనేవారు)
   'హైదరాబాద్ నోట్‌బుక్‌'లో తిరుమల రామచంద్ర తన బాల్య మిత్రుడైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రిని గుర్తు చేసుకున్నారు. లక్ష్మణశాస్త్రి తిరుపతి వెళ్లివచ్చి అక్కడ నుంచి తెచ్చిన ఒక లడ్డూను తన మిత్రుడైన రామచంద్రకు ''వారీ రామచంద్రా ఇగపటు తిరుపతి లడ్డూ" అని ఇచ్చాడు. ఈ విషయం ఇప్పుడు సామల సదాశివకు గుర్తుకు వచ్చింది. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి సంస్కృతం, ఆంధ్ర భాషల్లో పండితుడు. కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండుడు. సంస్కృతంలో బిల్హణుడు రాసిన 'విక్రమాంకదేవ చరిత్ర' ను తెలుగులోకి లక్ష్మణ శాస్త్రి అనువదించారు. అంతేకాదు బిల్హణ మహాకవి రాసిన 'కర్ణసుందరి' నాటకాన్ని అనువదించి ప్రచురించారు. అందుకే లక్ష్మణ శాస్త్రిని 'ఆంధ్ర బిల్హణుడు' అంటారు.
   లక్ష్మణశాస్త్రి దగ్గర సామల సదాశివ శిష్యరికం చేయలేదు కాని అతడి సన్నిధానంలో కూర్చొని, తరుచుగా జాబులు రాస్తూ వారి నుంచి అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. శాస్త్రిని గురుస్థానీయులుగా భావిస్తారు.
   లక్ష్మణశాస్త్రి కుమార్తె కమల వ్యాసపూర్ణిమ సందర్భంగా బాసర సరస్వతీ క్షేత్రంలో మాట్లాడిన మాటలను బట్టి సామల సదాశివకు తన గురువు గుర్తుకు వచ్చాడు.
   లక్ష్మణశాస్త్రి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. నిజాం కాలంలో సమాచార, పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉద్యోగంలో చేరి, చివరకు స్కూలు ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేశారు.
సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలోని నీళ్లులేని 'ఇటిక్యాలపాడు'. ఇది నిజాం రాజ్యంలో రాయచూర్ జిల్లాకు చెందింది. అంటే ఒకప్పుడు 'ఇటిక్యాలపాడు' రాయచూర్ (కర్ణాటక) జిల్లాలోనిదే. సురవరం వారి రాతలు, మాటల్లో తెలుగుదనంతో కూడిన ప్రాంతీయత కనిపించేది. గడియారం రామకృష్ణ శర్మ పండితులు, పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. వీరి ద్వారా కూడా సామల సదాశివ అనేక విషయాలు నేర్చుకున్నారు. ఇతడిని కూడా గురుస్థానీయులుగా భావిస్తారు.
   నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే. నల్గొండలోని ఏదో ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం అనే కవి ఉండేవారు. ఈయన 'వత్సలుడు' అనే కావ్యాన్ని రాశారు. ఇతడి శిష్యులు సారస్వత పరిషత్తును ఏర్పాటుచేసి అంబటిపూడి కావ్యాన్ని, లక్ష్మణశాస్త్రి సంక్షిప్త వ్యాకరణాన్ని పరీక్షల్లో సిలబస్‌గా ఉంచారు. వేలూరికి సామల సదాశివ ఏకలవ్య శిష్యుడు.
   పలుకుబడి, నుడికారం, జాతీయాలు అనేవాటికి ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉంది. వరంగల్ తెలుగును 'టక్సాలీ తెలుగు' అంటారు. దిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అంటారు. టక్సాలా అంటే టంకశాల. టంకశాల అంటే నాణేలు తయారుచేసే చోటు. టంకశాలలో తయారయ్యే నాణేలకే విలువ ఉంటుంది. ఇతరులు ఎవరైనా తయారుచేస్తే అవి నకిలీ నాణాలు.

'ఆడవాళ్లనోట అసలైన భాష'

   సామల సదాశివ ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు ''మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి" అంటాడు. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటారు కాని ఇంకో సందర్భంలో దీని అర్థం వేరు. ''కళ్లనీళ్లు పెట్టుకోండి" అని మాత్రం అనడు. ఇది టంకశాల బయట తయారైన నకిలీ నాణెం.
వరంగల్‌లో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలో అయినా అసలైన భాష ఆడవాళ్ల నోటనే వినగలం. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్లనివాళ్లు- రాజమందిరాల్లో ఉండే బేగముల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. కలుషితం కాని ఉర్దూను 'బేగమాతీ జుబాన్' 'మహెల్లాతీ జుబాన్' అనేవారు. సామల సదాశివ చిన్నతనంలో 'ఆగా సాహెబ్' అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజామ్ కళాశాలలో పనిచేసేవారు. అతడు గంటలకొద్దీ దిల్లీ బేగమాతీ జుబాన్‌లో ప్రసంగించేవాడు.
   సామల సదాశివ వరంగల్‌లో పెద్ద కాళోజీ వర్ధంతి సభకు వెళ్లారు. ఆ సభలో కవి సమ్మేళనం, ప్రసంగాలు, గజళ్లు వినిపించేవారు. సామల వెళ్లేసరికి సాహితీ మిత్రమండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఆ సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టరు అధ్యక్షులై ఉన్నారు. ఆ రెవెన్యూ అధికారి అధ్యక్షులుగా ఉన్నారెందుకా అని అనుకున్నారు సదాశివ. ఆయన అచ్చమైన వరంగల్ ప్రాంతీయ తెలుగులో తన మనసులోని భావాలను వెల్లడించారు. కల్తీలేని తెలుగును చూసి తెలుగులో కాకుండా సదాశివ ఉర్దూలో మాట్లాడారు.
   సామల సదాశివను గుంటూరు విద్వాంసులు అడ్వకేట్ ఉప్పులూరి గోపాలకృష్ణ శర్మ 'మీ. వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాషనే కనిపిస్తుంటుంది. మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా?' అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలను సదాశివ ప్రశంసగానే భావించారు. ఎందుకంటే తెలంగాణాలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్లు కూడా చదివేలా రాయడం విశేషమే కదా.
   సామల సదాశివ తెలంగాణ సీమ ఉల్లంఘనం చేయడం ద్వారా తిరుపతి వెంకన్నను చూడలేదు. కారా (కాళీపట్నం రామారావు) ఆజ్ఞను తిరస్కరించలేక మూడురోజులు విశాఖపట్నం, శ్రీకాకుళానికి వెళ్లి వచ్చారు.
వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతీయ భాషలు - మాండలిక భాషలు. ఉర్దూ, మరాఠీ పిల్లలు వారి ఇళ్లలో మాట్లాడే భాషనే బళ్లో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషవేరు, బడిలో చదివే భాష వేరు. ఇది ఘోరమైన విషయం. ఈ వ్యవహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లా ఇళ్లలో మాట్లాడే భాషనే బడిలో చదువుతున్నారు. అయితే మాండలిక భేదాలను అటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోవాలి. అన్ని ప్రాంతాల తెలుగు పలుకుబళ్లను ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవాలి. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉంది. ఏదో టీవీ ఛానల్‌లో ''తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి" అని చెప్పినప్పుడు సదాశివ రెండు ప్రశ్నలు వేసుకుంటారు. ఇది ''ఏ తెలుగు? ఎక్కడి తెలుగు" అని.
   ఉర్దూ సాహిత్యంలో పండితుల పార్సీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యం ఉంటుంది. మీర్ తఖీమీర్ ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడు. అతడి కవిత గంభీర భావ భరితమైనప్పటికీ, భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైంది.
   మీర్ తఖ్‌మీర్‌ను ఒకరు ఇలా అడిగారట ''ఉస్తాద్! పార్సీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు గదా మీరు. ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎలా పట్టుకున్నారు" అని. దానికి సమాధానంగా ''శుక్రవారం శుక్రవారం ఢిల్లీ జామా మసీదు మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటూ ఇటూ వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. వెళుతుంటారు. మాట్లాడుకుంటారు. అవి వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజాకవిత కదా" అని చెప్పాడు మహాకవి మీర్ తఖీమీర్. దీనికి సంబంధించి ఒక షేర్ కూడా రాశాడు.
గో మేరే షేర్ హై ఖవాస్ పసంద్
 పర్ మెరీ గుఫ్తగూ అవామ్ సె హై
   ఖాస్ - ఆమ్ అనే రెండు మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైంది అని అర్థం. దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. 'ఆమ్' అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. కవి ఏమంటున్నాడంటే ''నా కవితను ప్రత్యేక వ్యక్తులు ఇష్టపడుతున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే" అని అంటున్నాడు.

రచయిత: అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌