• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొత్తబాట

భాషాంశాలు

పదజాలం
1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి.
అ. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
జ: చెవివారిచ్చి = ఆసక్తితో వినడం
   వివేకానందుడి బోధనలను రేడియో‌లో చెవివారిచ్చి విన్నాను.

 

ఆ. చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి.
జ: గవిన్లలో = గుహల్లో
   మా ప్రాంత సమీపంలోని ఏడుపాయల అడవీ ప్రాంతంలోని గవిన్లలో అనేక అడవి జంతువులు ఉంటాయి.

ఇ. కుటిల వాజితనం పనికిరాదు
జ: కుటిల వాజితనం = మోసపూరిత బుద్ధి
   కుటిలవాజితనంతో కూడిన జీవితం దుర్భరమైంది.

ఈ. మా ఊరి పొలిమేరలో పంట పొలాలున్నాయి.
జ: పొలిమేర = సరిహద్దు
   మా ఊరి పొలిమేరలో మంజీర నది ప్రవహిస్తుంది.

2. కింది వాక్యాల్లో పర్యాయపదాలను గుర్తించి రాయండి.
అ. రోజూ పెయి కడుక్కోవాలి లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.
పర్యాయపదాలు: పెయి, మేను, దేహం
ఆ. మనుషులు నీళ్లు దొరికే తావుల్ల నివసిస్తారు. సరకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.
పర్యాయపదాలు: తావు, చోటు, ప్రదేశం.
 

3. కింది పట్టిక నుంచి ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి.

 సముద్రం  ఆదెరువు  శిఖ  విద్య  పైనం
 విద్దె  ప్రయాణం  సంద్రం  సిగ  ఆధారం


జ:

    ప్రకృతి -    వికృతి
 సముద్రం -  సంద్రం
 విద్య -  విద్దె
 ప్రయాణం -  పైనం
 శిఖ -  సిగ
 ఆధారం -  ఆదెరువు

4. కింది జాతీయాలను వివరించండి.
నక్షత్రకుడు: పట్టువదలనివాడు అనే అర్థంలో వాడతారు.
నిండుకొన్నవి: ఏమీలేని సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు.
దడిగట్టు: ఖాళీ లేకుండా అందరూ గుమికూడినప్పుడు దీన్ని వినియోగిస్తారు.
నిప్పుకలు సెరుగంగ: విపరీతమైన కోపం వచ్చిన సందర్భంలో వాడతారు.

వ్యాకరణాంశాలు

కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.
అ. ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు + కోల్పోవు - గసడదవాదేశ సంధి
సూత్రం: ప్రథమ మీద పరుషాలు గసడదవలుగా మారతాయి.
ఆ. మూటఁగట్టు = మూటన్ + కట్టు - సరళాదేశ సంధి
సూత్రం: ద్రుతం మీది పరుషం సరళంగా మారుతుంది.
ఇ. ఆసువోయుట = ఆసు + పోయుట - గసడదవాదేశ సంధి
సూత్రం: ప్రథమ మీద పరుషాలు గసడదవలుగా మారతాయి.
ఈ. కాలుసేతులు = కాలు + చేతులు - గసడదవాదేశ సంధి
సూత్రం: ప్రథమ మీద పరుషాలు గసడదవలుగా మారతాయి.
ఉ. పూచెను గలువలు = పూచెను + కలువలు - సరళాదేశ సంధి
సూత్రం: ద్రుతంమీది పరుషాలు సరళాలుగా మారతాయి.

 

వృద్ధి సంధి


కింది పదాలను విడదీయండి.
ఉదా: రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)
అ. ఏకైక = ఏక + ఏక = (అ + ఏ = ఐ)
ఆ. వసుధైక = వసుధ + ఏక = (అ + ఏ = ఐ)
ఉదా: దివ్యైరావతం = దివ్య + ఐరావతం = (అ + ఐ = ఐ)

 

అ. దేశైశ్యర్యం = దేశ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఆ. అష్టైశ్వర్యాలు = అష్ట+ ఐశ్వర్యాలు = (అ + ఐ = ఐ)
ఉదా: ఘనౌషధి = ఘన + ఓషది = (అ + ఓ = ఔ)

 

అ. వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ)
ఆ. మహౌషధి = మహా + ఓషధి = (ఆ + ఓ = ఔ)
ఉదా: రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ)

 

అ. దివ్యౌషదం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ )
ఆ. నాటకౌచిత్యం = నాటక + ఔచిత్యం = (అ + ఔ = ఔ)
* పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మార్పులు కింది విధంగా ఉన్నాయి.
    1) పూర్వపదంలో 'అ, ఆ' వచ్చాయి.
    2) పరపదంలో 'ఏ, ఐ, ఓ, ఔ' లు వచ్చాయి.
    3) పూర్వపదంలో 'అ' ఉండి పరపదంలో ఏ, ఐ, లు వచ్చినపుడు 'ఐ' వచ్చింది.
    4) పూర్వ పదంలో 'అ' ఉండి పరపదంలో ఓ, ఔ లు వచ్చినప్పుడు 'ఔ' వచ్చింది.
  అంటే
    i) 'అ' కారానికి ఏ, ఐ, లు పరమైనప్పుడు 'ఐ' వస్తుంది.
    ii) 'అ' కారానికి ఓ, ఔ లు పరమైనపుడు 'ఔ' వస్తుంది.
* 'ఐ, ఔ' లను వృద్ధులు అంటారు.
* వృద్ధుల వల్ల ఏర్పడిన సంధి కాబట్టి ఇది వృద్ధి సంధి.

సూత్రం:
    అ కారానికి (అ, ఆ లకు) ఏ, ఐ లు పరమైతే 'ఐ' కారం, ఓ, ఔలు పరమైతే 'ఔ' కారం ఏకాదేశంగా వస్తాయి.

విశేషాంశాలు

1. నక్షత్రకుడు: ఇతడు విశ్వామిత్రుడి శిష్యుడు. హరిశ్చంద్రుడి వద్ద అప్పు వసూలు చేయడానికి విశ్వామిత్రుడు ఇతడిని నియమించాడు. అప్పు వసూలు విషయమై హరిశ్చంద్రుడిని నక్షత్రకుడు ముప్పుతిప్పలు పెట్టాడు. ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా పీడించేవాడి విషయంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఈ పాత్రను గౌరన హరిశ్చంద్రోపాఖ్యానంలో మొదటగా ఉపయోగించాడు. ఇది చాలా ఆదరణ పొందింది.
2. వస తాగిన పిట్ట: 'వస' అనేది ఒక మొక్క. చిన్న పిల్లలకు మాటలు చక్కగా రావడానికి ఈ మొక్క రసాన్ని కొంచెం మోతాదులో తాగిస్తారు. మోతాదు అధికమైతే మాటలు ఎక్కువైతాయి. ఎక్కువగా మాట్లాడేవారి గురించి ఈ పదబంధాన్ని వాడతారు.
3. వెన్నెల మాసం: శరత్ రుతువు విశేషంగా వెన్నెలను కురిపించే కాలం. ఆశ్వయుజ, కార్తీక మాసాలు ఈ రుతువుకు చెందినవి. ప్రత్యేకంగా కార్తీక మాసానికి వెన్నెల మాసంగా పేరుంది.
4. ఆసుపోయు: బట్టలు నేసేవారు ఒడికిన దారాన్ని కుదురుకు చుట్టి ఆ తర్వాత నేయవలసిన బట్ట పొడుగును అనుసరించి దారాలన్నీ వరుసలుగా అమర్చాల్సి ఉంటుంది. అలా చేసేటప్పుడు ఆ పని చేసేవ్యక్తి ఒక కొన నుంచి మరో కొనకు తప్పక తిరగాల్సి ఉంటుంది. ఈ పనికి ఆసుపోయడం అనిపేరు. ఇలా విరామం లేకుండా తిరిగిన తోవనే అదేపనిగా (మళ్లీమళ్లీ) తిరగడం అనే సందర్భంలో దీన్ని వాడతారు.
5. అలుగు: చెరువు నిండిన తర్వాత మత్తడి అవుతుంది. ఆ తర్వాత ఉబికి బయటికి వచ్చే నీళ్లు కాలువలా మారతాయి. దీన్ని 'అలుగు' అంటారు. ఈ క్రమాన్నే చెరువు నిండింది. మత్తడి దూకింది. అలుగు పారుతుంది అని అంటారు. అలుగు అనేది చెరువు కట్టకు రక్షణ. ఎక్కువైన నీళ్లు దీని ద్వారా బయటికి పోవడం వల్ల చెరువు కట్ట తెగకుండా ఉంటుంది.


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌