• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొత్తబాట

రచయిత్రి పరిచయం
* కొత్తబాట పాఠ్యాంశ రచయిత్రి - పాకాల యశోదా రెడ్డి.
* మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో ఆగస్టు 8, 1929లో జన్మించారు.
* తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.
* తెలుగు ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
* రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ.

యశోదారెడ్డి రాసిన పరిశోధనా గ్రంథాలు
   1) ఆంధ్ర సాహిత్య వికాసం
   2) పారిజాతాపహరణ పర్యాలోచనం
   3) ఎఱ్రాప్రెగడ
   4) కథా చరిత్ర

కథా సంపుటాలు
   1) మావూరి ముచ్చట్లు
   2) ఎచ్చమ్మ కథలు
   3) ధర్మశాల
* ఈమె ధారావాహిక రేడియో కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది.
* తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తిమంతమైన సాధనంగా మలుచుకున్నారు.
* రచయిత్రి కథలో నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవచ్చు.
* ఈమె 2007 అక్టోబరు 7న మరణించారు.

పాఠం ఉద్దేశం

* భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి.
* క్రమానుసారంగా, రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసనాలు, స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుంది ఈ కథ.
* దేశంలోని కీలకమైన పల్లెలో జరిగే స్వాతంత్య్ర సంబరాలను అక్కా, తమ్ముడి సంభాషణల్లో ప్రతిధ్వనింపజేసింది రచయిత్రి.
* జాతీయతా, ప్రాంతీయతాపరంగా; భాషాపరమైన దృక్పథంలోనూ తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్తబాటలో నడిచిన కొత్త కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

* కొత్తబాట అనే ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది.
* ఈ కొత్తబాటలో రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు తెలుస్తాయి.
* ఈ పాఠ్యభాగం నేషనల్ బుక్‌ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది.
 

ప్రవేశిక

* ఈ కథను రచయిత్రి తెలంగాణ మాండలికంలో రాశారు.
* అక్కాతమ్ముళ్లిద్దరూ బస్సుదిగి అక్కడి నుంచి ఎద్దుల బండిలో వాళ్ల ఊరు వెళ్లారు. బండిలో ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన సంఘర్షణ, సాధించిన విజయాలను సప్రమాణంగా ప్రదర్శించారు.
* ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలను స్పృశించారు.
* భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకుని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుంది. ఆ కొత్తబాటలో మనం కూడా నడుద్దామా....!
 

పాఠ్యభాగం

   అక్కాతమ్ముళ్లు ఎద్దుల బండిలో ఊరికి ప్రయాణమయ్యారు. నిజానికి అక్క రానంది. అది తరాలబాట అనీ, వానలకు వరదలకు ఎంత చెడిపోయిందో, ఎన్ని గండ్లు పడ్డదో, ఆ పగుళ్లలో వేగంగా నడవడం చేతగాదని చెప్పినా తమ్ముడు మాట వినకుండా, పట్టుపట్టి తీసుకువచ్చాడు. 'ఊరికి కొత్తబాట వేశాం. నువ్వు చూసి మెచ్చిందాకా గాదు' అని పట్టుతో అనేసరికి అక్క బండెక్కి బయలుదేరింది. వస దాగిన పిట్టలా (వస = వాక్కును శుద్ధిచేసే వనమూలిక) ఉల్లాసంతో అనేక విషయాలు అక్కకు చెప్పాడు.
'అక్కా ఇది ఈగ కాలం, పూలకాలం, వెన్నెల మాసం ఎక్కడ చూసిన కమ్మటి వాసన. ఆకు అంతా రాలిపోయి పోషాకులు (పెళ్లి బట్టలు) తొడిగి అందంగా ఉంది. మోదుగు చెట్లు శరీరం అంతా పులకరించిపోయేట్లు మొగ్గతొడిగి, ఎర్రగా తయారయ్యి కొత్తబాటకు మంగళహారతి పడుతున్న ముత్తైదువ లాగా నిలబడ్డాయి. తేనెతెట్టెలు చూడు. ఏమీ మాట్లాడవేమి? నేను చెప్పేది విను. అదిగో కోయిల కూతలు, చింతలతోటలు, గున్నమామిడ్లు, ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కనిపిస్తున్నాయి. వేపలు ఇప్పుడే మొగ్గలు విచ్చుకుంటున్నాయి. అదిగో మాటల్లోనే మన ఊరి పొలిమేర కూడా వచ్చింది. పెండ్లినాడు మగ పెండ్లివారి సుట్టాలకు మర్యాద చేసేందుకు గుంపులుగా నిలబడ్డట్టు పెరిగిన వాయిలు పొదలు. బాట పక్కల ఉన్న పెద్దచెట్లు కూలుతూ ఉండగా ఎదిగివస్తున్న కొత్త చెట్లు చూడు. ఇటు చూడు చెరువు. ఇప్పుడు నిండా నీల సముద్రంలా నీరు మోస్తుంది. ఈ చెరువు ఆనకట్ట వల్ల ఇది అందరికీ ఆదెరువు అయ్యింది'. నిజంగానే పాదరసంలా ఈ చెరువు వెన్నెలకు మెరుస్తుంది. నీటి గుంటల్లో కొర్రమీను చేపలు ఎగిరి సన్న చేపలను తింటూ నీళ్లల్లో సుడిగుండాలను లేపుతున్నాయి. గుహల్లోని గుడ్డేలుగులు (ఎలుగుబంట్లు) చెదలపుట్టలను తిని చెట్ల కొనల్లో ఉండే తేనె తెట్టెలను తాగి, ఈతకల్లు కోసం వస్తుంటాయి.
   గట్టుమీద జారుడుబండల వెనుక అలుగుపారే దగ్గర అప్పుడే ఈనిన ఆడ చిరుత - కండ్లు కనబడక ఆకలి బాధతో తన పిల్లలనే తినేందుకు చూస్తుంది. గొర్రెపోతును మందు గోలీలు మింగినట్లు మింగిన తాసుపాము చెట్టుకు తీగలా చుట్టుకుంది. తిన్నది అరగని రెండు తలల పాము గురిగింజలాగా గుడ్లు పెట్టి మిటుకుమిటుకుమంటూ సుట్టలాగా చుట్టుకుని స్పృహ లేకుండా ఉంది. అక్కడక్కడ నక్కలు దాక్కుని అదును కాస్తున్న గుర్తులు ఉన్నాయి.
   మరి ఆ బాట వాళ్ల తమ్ముడు చెప్పిన కొత్త దారిలా లేదు. అది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న బాటనే. అందులో కొత్త లేదు. అయినా అక్కకు తన మనసు తనకే బుద్ధి చెబుతున్నట్లుగా తోచింది.
   రెండు కళ్లు తెరిచి నిదానంగా లోతుగా పాటిచ్చి చూడాలి. జ్ఞాపకం కనుమరుగైనా మరుగునపడి తప్పినట్లే కదా! ఎంత బాగా బతికినా ఇంకొకని ఆసరా తోటి, మంది భుజాలెక్కి నడవకుండా ప్రయాణం సాగితే చాలు. మనకు కావలసింది, మనం చూడాల్సింది ఒక వ్యక్తి తన కాళ్ల మీద తాను నిలబడ్డాడా లేదా అనేది.
   అక్కా, తమ్ముడు ఊరి చెరువు దాటారు. మత్తడి దాటారు. పశువుల పాకలు కనిపించాయి. వాటిలో గడ్డివాములు నిండుగా ఉన్నాయి. ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆమె పసుపు బండారితో చెక్కు చెదరకుండా ఉంది. పూజారి కిష్టమాచర్ల ఇల్లు దాటారు. ఆ తర్వాత కనిపించేది గోపాల్ రాయుని బంగాళా. ఇక్కడికి బండి చేరిందంటే చూపునకు బండి కట్టినట్లే. ఎవరి కంటిలో పడకుండా బండికి పర్దాలు వేస్తాడని అక్క చెదిరిన వెంట్రుకలు చక్కగా చేసుకుని కొంగు నిండా సవరించుకుంది. కానీ, అలాంటి దాపరికం పనులు జరగలేదు. పర్దాలు ఉన్న ఉనికి కనిపించలేదు. దాంతో అక్కకు కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది.
   పెండ్లి చూపులనాడు పెళ్లికూతురును ఎగాదిగా చూసినట్లు అక్క ఊరిని చూడసాగింది. ఇంతలో రాగిచెట్టుతో పెనవేసుకుని ఉన్న రచ్చబండ కనిపించింది. ప్రతిసారి లాగా లేదు. ఊరి పెద్దమనిషితోపాటు అందరూ రచ్చబండపైనే కూర్చున్నారు. నిజమేనా అని మళ్లీ చూసినా వారికి అదే చిత్రం కనిపించింది. ఓ రచ్చబండ, ఓ రాగిచెట్టు హెచ్చుతగ్గులుమాని తోటి మనిషికి సమానమై తావును, నీడను ఇచ్చాయి. ఇది మెచ్చుకుంటూ సంబరంతో ముందుకు సాగారు. బండి వెళుతూ ఉంది.
   గోపాల్ రాయుని బంగ్లా దాటగానే ఆయన బామ్మర్ది రంగరాయుడుకు చెందిన రెండంతస్తుల భవంతి ఊరికి కులపెద్దగా కనిపించింది. ఎప్పుడూ లేనిది ఆ భవంతి అరుగుల్లోని దీపాలు వెలగడంలేదు. ఎందుకంటే అని తమ్ముడును అడిగేలోగా అతడే చెప్పాడు. 'ఊరివారంతా ఇప్పుడిప్పుడే తెలివికి వచ్చి మిత్తి మీద మిద్దెలు కట్టి శ్రీమంతుడైన రంగరాయునికి తిరగబడి ఎగనామం పెట్టారు. దాంతో పెళ్లాం పిల్లలతో కలిసి చుట్టాలు ఉండే రంగాపురం చేరాడు' అని అన్నాడు.
   బండి పాలివారు (సంబంధీకులు) ఉండే ఇళ్ల దగ్గరికి వెళ్లుతూ ఉంది. వాళ్ల బావ పోలీస్ పటేల్ పాపిరెడ్డికి ఇల్లు గడవడం లేదని విన్నారు. ఆయనా ఇంచుమించు రంగరాయని లాంటి వాడే. ఊళ్లో ఒకర్ని ఎక్కించి ఒకర్ని దించి ఇద్దరినీ ఎదగనీయకుండా ఎప్పటికప్పుడు పన్నాగాలు పన్నేవాడు.
   అనుమంతరాయుడు దుర్మార్గపు చెడు ఆలోచన గలవాడు. కడుపుల విషం, నాలుకలో తీపి ఉన్నట్లు నక్కతంతులు పన్నేవాడు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ల తంత్రాలన్నింటినీ మొదట్లోనే తొలగించే తీరుగా తయారయ్యారు. సన్నకారులు అందరూ అయినదానికి కానిదానికి గొడవలు పడి నెత్తురు కళ్ల చూసి పంచాయతీల పడి పంచాయతీదార్లకు దండుగ కట్టడంలేదు. దొంగతనాలు లేవు. చేను దోపిడీలు లేవు. లాగుల తొండలు, ముంతపొగలు, ఈపు ముద్దెర్లు, బండబర్వులు లాంటివి లేవు. అడుక్కుతినడం లేదు.
   బండి వాళ్ల ఇంటి దిక్కు మూల మల్పు తిరిగింది. వాళ్ల పెద్దమామ ఇంటి పక్కన ఉన్న గరిసెల ఇండ్లల్ల (ధాన్యం ఉండే ఇల్లు) దీపాలు వెలిగినట్లు నలుగురు మనుషులు మెసిలినట్లు చప్పుడు వచ్చింది. ఇదేం అనట్టు అక్క తమ్ముడిని చూసింది.
తమ్ముడు వెంటనే ''అక్కా! ఇది మన మ్యాన పల్లకీలు ఉండే పాత పొత్తుల ఇల్లు. ఇది ఇప్పుడు రాత్రి బడి అయ్యింది. ఈ ఊళ్లో ఎవరి పెండ్లి అయినా వాళ్లెంత గొప్పవారైనా మనుషులు మోసే మ్యాన పల్లకీలు రాకూడదు. సంబరానికి పగటి దీపాలు వెలిగించి ఊరేగింపులు తీసే నియమం లేదు. మన పెద్ద తాత కండ్లల్లో మిక్కిలి కోపం చేసుకోగా చేసేది లేక పట్టిన చెమటలను తుడ్చుకుంటూ ఉండగా ఈ వాహనాలను ఇంటి గుమ్మాలకు అలంకారంగా పెట్టాం" అని చెప్పాడు.
   బండి వాళ్ల ఇంటి గేటు ముందు ఆగింది. గజ్జెల చప్పుడు విని ఆ చుట్టుపక్కల పిల్లలంతా వచ్చి చేరారు. ఈ వచ్చిన పిల్లలు ఈసురుమంటలేరు. చీమిడి ముక్కులు లేవు. చినిగిన ముక్కలు తొడుక్కోవడంలేదు. సీరపేండ్లు (మురికి బట్టల్లో పుట్టే క్రిములు) లేవు, ఊసుకండ్లు లేవు, ఓరకాళ్లు లేవు. పిల్లలందరూ దోసపండ్లలా, బంతుల్లా కళకళలాడుతున్నారు.
   బండి దిగి అరుగులు దాటి ఇంట్లోకి నడిచారు. అలవాటు వల్ల బావి దగ్గరి గచ్చులకు వెళ్లారు. అక్కడ చెంబు పట్టుకుని నడుముకు చెయ్యి పెట్టి వయ్యారంగా ఉండే పనిమనిషి నిలబడి లేదు. ఆ పనిమనిషి ఇప్పుడు వత్తులు పేనుతూ ఉంది. కలనా? నిజమా అని తేరుకునే లోపే అక్కా! అంటూ నీళ్ల చెంబుతో వచ్చింది కుసుమ. ఆమె పాలేరు రాజని బిడ్డ. అందరూ కదులలేదు. మాటలు పెకలలేదు. బాయి దగ్గర ఉన్న తరాల నాటి కారుమల్లె మొద్దు అనుకోకుండా మళ్లీ ఈనాటికి చిగురు వేసి సింగారించిన తీరుగా అందం పడుతుంది. ఇంతట్లోకే తమ్ముడు వచ్చి నవ్వుకుంటూ బావి దగ్గరి కమాను స్తంభానికి ఆని నిలబడ్డాడు. ఇల్లంతా వెన్నెలలు వచ్చినట్లయింది. నిజంగా ఇది కొత్త బాటనే! ఇంతకంటె కొత్త బాట, మంచి బాట ఇంకా ఎట్లుంటది. ఎక్కడుంటది. బాట వేసేవారు నడుస్తుండాలె కానీ పాపం ఆ బాట వద్దంటదా? ఒదగనంటదా? నలుగురు పలికిందే మాట. నలుగురు మెచ్చిందె నడత, నలుగురు నడిసిందే బాట.

రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం