• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నగరగీతం

'ఆలోచించండి - చెప్పండి' సమాధానాలు

1. పల్లె సీమలను కవి తల్లి ఒడితో ఎందుకు పోల్చాడు?
జ: ఒడిలో ఉన్న బిడ్డ అన్ని అవసరాలను తల్లి తీరుస్తుంది. అలాగే పల్లె సీమలు కూడా విశాలమైన స్థలాలను, స్వచ్ఛమైన ప్రకృతిని, కావాల్సిన ముఖ్య వనరులను అడక్కుండానే అందిస్తాయి. పల్లె మనుషుల మధ్య సంబంధాలను పెంచుతుంది. బిడ్డను తల్లి ఎలా చూసుకుంటుందో పల్లె కూడా అక్కడి ప్రజలపై అంతే మమకారం చూపుతుంది. అందుకే కవి పల్లె సీమలను తల్లి ఒడితో పోల్చాడు.
 

2. పట్టణాలను ఇనప్పెట్టెలు అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది?
జ: రైతులు ఇనప్పెట్టెలో పట్టా పాసుపుస్తకాలు, డబ్బును పెడతారు. వాటిని ఎవరూ చూడకుండా భద్రపరుస్తారు. అందులోకి గాలి సైతం చొరబడలేదు. అలాగే పట్టణాల్లోని ఇరుకైన మురికి ప్రదేశాలన్నీ ఒకేచోట దర్శనమిస్తాయి. ఇనప్పెట్టెలో మాదిరిగా పట్టణాల్లోని ప్రదేశాలు కూడా ఊపిరాడని స్థితిలో ఉంటాయి. అందుకే కవి 'పట్టణాలను ఇనప్పెట్టెలు అన్నాడు.
 

3. ''నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే' అనే వాక్యం గురించి మీకేం అర్థమైంది?
జ: నగరంలో ప్రతి వ్యక్తీ చదవాల్సిన పుస్తకం లాంటివాడు. పఠనీయ గ్రంథంలో ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి. అవి చదివితేనే అర్థం అవుతాయి. నగరంలోని మనిషి బతుకు పుస్తకాన్ని చదివేవారే ఉండరు. అతడిని చదివితే (తెలుసుకుంటే) ఆనందాలు, విషాదగాథలు తెలుస్తాయి.
 

4. ''పేవ్‌మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి" అని కవి ఎవరి గురించి అన్నాడు? దీనిపై మీ అభిప్రాయం తెలపండి.
జ: నడిచే దారిలో విరబూసిన పువ్వుల్లా ఉండే కాన్వెంట్ పిల్లలు సందడి చేస్తారని కవి అన్నాడు. అంటే కాన్వెంట్ బడుల్లో చదివే పిల్లలు పువ్వుల్లా ఉంటారని 'పిల్లల'ను ఉద్దేశించి అన్నాడు.
నా అభిప్రాయంలో - నడిచే దారిలో విరబూసిన పువ్వులు రాల్చే పుప్పొడిలా పిల్లల మాటలు స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ పువ్వులను చూస్తే ఎంత సందడిగా ఉంటుందో పిల్లల గుంపు కూడా అంతే కోలాహలంగా ఉంటుంది.

 

5. ''సిటీ అంటే అన్నీ బ్యూటీ బిల్డింగ్‌లు కావు!" ఇది వాస్తవమేనా? ఎందుకు?
జ: ''నగరం అంటే అన్నీ అందమైన భవనాలే కావు" - ఈ మాటలు వాస్తవమే. ఎందుకంటే నగరంలో మనం విన్నట్లుగానే అందమైన భవనాలు ఉంటాయి. ఒకపక్క ఖరీదైన భవనాలు, ఆ పక్కనే ఇరుకైన చిన్న చిన్న పూరిళ్లు ఉంటాయి. నగరం అందరికీ నిలయం కాబట్టి అక్కడ అన్ని రకాల భవనాలూ ఉంటాయి.
 

6. ''రెండు కాళ్ళు, మూడు  కాళ్ళు, నాలుగు  కాళ్ళు'' అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి?
జ: రెండు కాళ్లు అంటే నడిచేవారు, మూడు కాళ్లు అంటే ఆటోరిక్షాల్లో వెళ్లేవారు, నాలుగు కాళ్లు అంటే కార్లలో ప్రయాణించేవారు. నగరాల్లో పేద, మధ్యతరగతి, ధనిక వర్గాల ప్రయాణం గురించి కవి ఈ రకంగా వివరించాడు. ఆయన ఉద్దేశంలో నగరజీవులు తమ తమ స్థాయిల్లో తీరిక లేకుండా జీవిస్తారు, విభిన్నంగా వ్యవహరిస్తారు.
 

7. ''మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు" అంటే ఏమిటి?
జ: పెద్ద నగరాల్లో రోడ్డు నాలుగు దిక్కుల్లో ఉంటుంది. మనం వెళ్లే మార్గంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
అఅన్నివైపులా ప్రమాదం పొంచి ఉంటుంది. ఏవైపు నుంచైనా ప్రమాదం సంభవించవచ్చు. అంటే మహానగరాల్లో మరణం రోడ్డుకి నాలుగువైపుల నుంచి వెంటాడుతుందని కవి తెలియజేస్తున్నాడు.

 

8. నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనీ కవి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది?
జ: నగరాన్ని రసాయనశాల అనీ, పద్మవ్యూహం అనడంలో కవి ఉద్దేశం- రసాయనశాలలోని ఆమ్లాలు, అవి జరిపే చర్యలు అందరికీ అర్థం కావు. నగరం కూడా అదేవిధంగా అంతుచిక్కని ప్రదేశం. బతుకుతెరువు కోసం నగరానికి వచ్చినవాళ్లు ఉపాధి దొరక్కపోయినా ఆశగా వేచి చూస్తుంటారు.
నగరం పద్మవ్యూహం లాంటిది. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు ప్రజలను ఆకర్షిస్తాయి. కాలుష్యం కలవరపెడుతున్నా, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినా నగరం పల్లెలకు వెళ్లనివ్వని చిక్కుముడి లాంటిది.
                                                               

ఇవి చేయండి

I. అవగాహన - ప్రతిస్పందన
1. కింది అంశాల గురించి చర్చించండి.
అ. మీరు ఇప్పటివరకు ఏయే నగరాలను చూశారు? చూసిన నగరాల్లో మీకు నచ్చిన, నచ్చని అంశాలను తెలపండి.
జ: ఇప్పటివరకు నేను చూసిన నగరాలు: హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
హైదరాబాద్:
నచ్చిన ప్రదేశాలు: సచివాలయం, రవీంద్రభారతి, రామోజీఫిల్మ్‌సిటీ, సాలార్‌జంగ్ మ్యూజియం, ట్యాంక్‌బండ్, అధునాతన సౌకర్యాలున్న ఆసుపత్రులు, గోల్కొండ కోట, నెహ్రూ జూలాజికల్ పార్క్, లాల్‌బహదూర్ స్టేడియం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్‌మాళ్లు.
నచ్చని అంశాలు: వాహన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, వర్షం పడితే జలమయమయ్యే రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అనాథలు, దుర్వాసన.
 

వరంగల్
నచ్చిన ప్రదేశాలు: వేయిస్తంభాల గుడి, కాకతీయ తోరణం, భద్రకాళి దేవాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, రైల్వేస్టేషన్
నచ్చని అంశాలు: వీధుల్లో పారిశుద్ధ్య సమస్య, గుంతలు పడ్డ రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు.
 

విజయవాడ
నచ్చిన ప్రదేశాలు: కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ, దుర్గమ్మ ఆలయం, రైల్వేస్టేషన్, గన్నవరం ఎయిర్‌పోర్ట్, స్టేడియాలు.
నచ్చని అంశాలు: కిక్కిరిసిన జనసందోహం, అపరిశుభ్రత, తాగునీటి కొరత, దొంగతనాలు.
 

విశాఖపట్నం
నచ్చిన ప్రదేశాలు: రుషికొండ, యారాడ, భీమిలి, ఆర్.కె. బీచ్‌లు; ఆంధ్ర విశ్వవిద్యాలయం, కైలాసగిరి, పార్కులు, షిప్‌యార్డ్, స్టీల్‌ప్లాంట్.
నచ్చని అంశాలు: చేపల వాసన, అపరిశుభ్రత, కాలుష్యం.
 

నిజామాబాద్
నచ్చిన ప్రదేశాలు: రైల్వేస్టేషన్, సాయిబాబా దేవాలయం, షాపింగ్ మాల్స్, తిలక్ గార్డెన్స్, కంఠేశ్వర్ దేవాలయం, మల్టీప్లెక్సులు, తెలంగాణ విశ్వవిద్యాలయం.
నచ్చని అంశాలు: రోడ్లు, చెత్త, సిటీ బస్సుల కొరత, వాయు కాలుష్యం.
 

ఆ. మీ ఊరి నుంచి ఎవరైనా నగరాలకు వలస వెళ్లారా? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వారు అక్కడ ఏం చేస్తున్నారు?
జ: మా ఊరి నుంచి చాలామంది నడివయసువారు, యువకులు, వృద్ధులు నగరాలకు వలస వెళ్లారు. గ్రామంలో పంటలు బాగా పండుతాయనే ఉద్దేశంతో బోర్లు వేశారు. కాని నీరు పడలేదు. చేసిన అప్పులు తీర్చేందుకు పని ఎక్కువ దొరికే నగరానికి వలస వెళ్లారు. మరికొందరు తమ కుమార్తెలకు పెళ్లి చేసేందుకు అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు వలస వెళ్లారు. కొంతమంది ముసలివారు తమ కొడుకులు తిండి పెట్టలేని స్థితిని చూసి కార్యాలయాల వద్ద కాపలాదారులుగా వెళ్లారు. కొందరు యువకులు ఉపాధి కోసం వలస బాట పట్టారు. మరికొందరు ప్రైవేటు కంపెనీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేందుకు వెళ్లారు.
కొంతమంది తమ సంతానాన్ని పెద్ద చదువులు చదివించేందుకు వలస వెళ్తున్నారు. ఇంటిల్లిపాదీ వివిధ పనుల్లో ఉండి పిల్లలను చదివిస్తున్నారు.

2. పాఠం ఆధారంగా కింది కవితా పంక్తుల్లో దాగిన అంతరార్థాన్ని గుర్తించి రాయండి.
అ. ''నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే"
జ: నగరంలోని ప్రతి వ్యక్తీ చదవాల్సిన గ్రంథం లాంటివాడు. పని నిమిత్తం నగరానికి ఎన్నో ఆశలతో వస్తారు. వారు వివిధ రకాల సమస్యలతో వేదనకు గురవుతూ ఉంటారు. అతడి వెనుక ఆసక్తికరమైన ఆనంద, విషాద గాథలు ఉంటాయి. గ్రంథాన్ని చదివి అన్ని వివరాలు తెలుసుకుని అర్థం చేసుకున్నట్లుగానే నగరంలోని ప్రతి వ్యక్తికి ఏదో ఒక కథ ఉంటుంది. అది తెలుసుకుని అతడి బాగోగులు పట్టించుకోవాలి. పట్టించుకునే వారే ఉండరన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కవి పై కవితా పంక్తిని తెలియజేస్తున్నాడు. అందులోని అంతరార్థాన్ని గ్రహించి నగరంలోని ప్రతి మనిషి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. వారికి భరోసా ఇవ్వాలి.

ఆ. ''నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి"
జ: నగరం అనేది మహావృక్షం లాంటిది. వృక్షాల మీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరంలోని వ్యక్తులు ఏదో ఒక రకంగా వచ్చి ఆ నగరమనే మహావృక్షం మీద కలుసుకుంటారు. కానీ ఆ వ్యక్తులు పక్క వ్యక్తులతో ఎలాంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన లేకుండా, పట్టించుకోకుండా ఉంటారు. ఒంటరితనం, మానసిక క్షోభతో ఏకాకి జీవితాన్ని అనుభవిస్తారు. వృక్షంపై ఉండే పక్షుల్లోని ఆత్మీయత ఈ నగరంలోని వ్యక్తుల మధ్య లేదనే అంతరార్థాన్ని కవి ఈ కవితా పంక్తి ద్వారా తెలియజేశాడు.
 

ఇ. ''మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు"
జ: పెద్ద నగరాల్లో రోడ్లు నాలుగు వైపులా విస్తరించి ఉంటాయి. నిత్యం వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఏ దిక్కు నుంచి ఏం వస్తుందో తెలియదు. అన్నివైపులా ప్రమాదం పొంచి ఉంటుంది. మరణం ఏ వాహన రూపంలోనైనా రావచ్చు. నాలుగు రోడ్లలో మృత్యువు పొంచి ఉందని తెలుస్తోంది. అంత
రార్థాన్ని గమనిస్తే మహానగరాల్లో మరణం నాలుగు వైపుల నుంచి వస్తుందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని కవి హెచ్చరిస్తున్నాడు.

 

3. కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
 కుందుర్తి ఆంజనేయులు రచించిన వచన పద్య ఖండిక 'నగరంలో వాన' కవిత్వంలా మొదలై రాజకీయ శాసనంతో అంతం అవుతుంది. అందరూ వాస్తవికత నుంచి వ్యంగ్యాన్ని పుట్టిస్తే, ఇందులో కవి వ్యంగ్యం నుంచి వాస్తవికతను సృష్టిస్తాడు.
ప్రబంధ కవి అయ్యలరాజు రామభద్రుడు వర్షధార నుంచి కవితాధారను శ్లేషించాడు. అది కేవలం శబ్దగతమైన శ్లేష మాత్రమే. ఇందులో భావ సంఘర్షణ నుంచి వెలువడిన వ్యంగ్యం గుబాళిస్తుంది. కవి భావుకత వ్యంగ్య ధనువును ఎక్కుపెడితే, సంస్కారం వాస్తవికత భాగాన్ని గుండెలకు గురిపెట్టి కొడుతున్నది. ఆ దెబ్బ తప్పదు. అది ఎంత సున్నితంగా తాకుతుందో అంత గాఢంగా ముద్ర వేస్తుంది. వచన పద్యం ఎంత సహజమైనదో, ఈ ఖండికలోని రచన కూడా అంత సహజంగా రూపుదిద్దుకొన్నది. కుందుర్తి వాన కరిసింది నగరంలోనే అయినా ఆ వానలో తడిసింది మాత్రం సామాన్యుడి జీవనమే! ఇందులో వాన కేవలం కేన్వాసు మాత్రమే. దాని ఆధారం చేసుకుని కవి చిత్రించిన వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింపజేస్తాయి.

 

ప్రశ్నలు
 

అ. కవులు సామాన్యంగా వ్యంగ్యాన్ని ఎలా సృష్టిస్తారు?
జ: 'వాస్తవికత' నుంచి కవులు సామాన్యంగా వ్యంగ్యాన్ని సృష్టిస్తారు.
ఆ. అయ్యలరాజు రామభద్రుడి కవితాధారను విశ్లేషించండి.
జ: అయ్యలరాజు రామభద్రుడు వర్షధార నుంచి కవితాధారను శ్లేషించాడు. అది కేవలం శబ్దగతమైన శ్లేష మాత్రమే. ఇందులో భావ సంఘర్షణ నుంచి వెలువడిన వ్యంగ్యం గుబాళిస్తుంది.
ఇ. కుందుర్తి 'నగరంలో వాన' కవితను ఏ శైలిలో రాశాడు?
జ: కుందుర్తి 'నగరంలో వాన' కవితను వచన పద్య శైలిలో రాశాడు.
ఈ. కుందుర్తి వాస్తవికత ఎలాంటిది?
జ: వానను కేవలం కేన్వాసుగా చేసుకుని దాని ఆధారంగా వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింపజేసేటంత 'వాస్తవికత' కుందుర్తి గారిది.
ఉ. నగరంలో వాన కవితలోని ప్రధానాంశం ఏమిటి?
జ: 'నగరంలో వాన' కవితలోని ప్రధానాంశం ''సామాన్యుడి జీవనం". దీనిలో కవి వ్యంగ్యం నుంచి 'వాస్తవికత'ను సృష్టించాడు.
 

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ. అలిశెట్టి ప్రభాకర్ కవితా దృక్పథం ఏమిటి?
జ: అలిశెట్టి ప్రభాకర్ తన కవిత్వంతో పాఠకుల ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి. నగరంలోని మూలాలను దర్శించిన మహానుభావుడు. నగర నాగరికత నరకప్రాయమని, నగరంలో మరో పార్శ్వాన్ని చూపాడు. ఆయన రాసిన కవితలను 'మనసు' అనే కిటికీ తెరచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి. ఆయన కవితా దృక్పథం ఎలాంటిదంటే ప్రతి కదలిక నుంచి ప్రేరణ పొందేలా రాయడం. తర్వాతి కవులకు ఆదర్శనీయుడు అలశెట్టి ప్రభాకర్.
 

ఆ. 'నగరగీతం' రాయడానికి గల నేపథ్యాన్ని వివరించండి.
జ: ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకుదెరువు కోసం నగరాలకు వలసలు పెరిగిపోయాయి.
నగరంలోని విద్య, ఉపాధి, వివిధ రకాల సదుపాయాలు ఉంటాయి. వాటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండటానికి తాపత్రయపడుతున్నారు. దీంతో అనేక నగరాలు అత్యధిక జనాభాతో నిండిపోతున్నాయి. నగరంలో జనాభా ఎక్కువ కావడంవల్ల చాలా సమస్యలు పెరిగిపోయాయి. ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటుంది. సామాన్యుడికి అందనంత దూరంగా నగరం కదలిపోతోంది. మధ్య తరగతికి అంతుచిక్కని ప్రాంతంగా మారిపోయింది. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకుతానే పరాయికరణకు గురవుతున్నాడు. పల్లెను మరచిపోయి సమస్యలకు నిలయమైన నగరాల్లో ఉంటున్న వారందరినీ చైతన్యపరచేందుకు, యదార్థాలను చూపించేందుకు కవి 'నగరగీతం' రాశాడు.

 

ఇ. నరుడి జీవనఘోష కవికి ఎలా వినిపించింది?
జ: మానవుడు జీవనం కోసం వివిధ రకాల శబ్దాలు చేస్తుంటాడు. దానిలో భాగంగా అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో రణగొణ ధ్వనులు వినిపిస్తుంటాయి. అవి గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకా నాదంలా ఉన్నాయి. ఉద్ధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపించింది. నిజానికది అరణ్యం లాంటి నగరం చేస్తున్న ధ్వని. నగరజీవి తాను చేస్తున్న బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా వినిపించింది నరుడి జీవన ఘోష.
 

ఈ. నగరంలో దారిద్య్రం, సౌభాగ్యం ఏ విధంగా కనిపిస్తాయి?
జ: నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తయిన భవనాలు ఉంటాయి. వాటి పక్కనే చిన్న చిన్న పూరిపాకలు ఉంటాయి. ఖరీదైన భవంతుల్లో ధనవంతులు, పూరిపాకల్లో పేదవారు ఉంటారు. అంటే దారిద్య్రం, సౌభాగ్యం పక్క పక్కనే సమాంతర రేఖల్లా కనిపిస్తాయి. ఆ రెండూ సమాన స్థాయిలో పయనిస్తాయి.
 

ఉ. అలిశెట్టి ప్రభాకర్ 'సిటీ లైఫ్' కవితల ప్రత్యేకత ఏమిటి?
జ: 'సిటీ లైఫ్' అనేది మినీ కవితల సంగమం. మినీ కవిత అంటే ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంతో, చురకతో తక్కువ పంక్తుల్లో చెప్పడం. మినీ కవిత ఆయన ప్రత్యేకత. ''అలిశెట్టి ప్రభాకర్ కవిత" అనే గ్రంథంలోని 'సిటీ లైఫ్' మినీ కవితల్లోనివి ఈ 'నగరగీతం పంక్తులు'. 'సిటీ లైఫ్' కవితలు 1992లో వచ్చాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్లపాటు సీరియల్‌గా 'సిటీలైఫ్' పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవితలు రాశారు. ఈ 'సిటీ లైఫ్' కవితలు ప్రఖ్యాతి పొందాయి.
నగరంలోని మూలలను, మూలాలను ఓ కవి హృదయం ఎలా దర్శించిందో 'సిటీలైఫ్' కవితలు మన కళ్లకు కడతాయి. నగర జీవనం నరకప్రాయం అని తెలియజేస్తాయి. ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవిత సిటీలైఫ్.
                                         

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత


1. కింది ప్రశ్నలకు అయిదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ. నగరం అంటే ఏమిటి? పల్లెకు, నగరానికి మధ్య ఉండే ప్రధాన వ్యత్యాసాన్ని తెలపండి.
జ: విద్య, వైద్యం, రవాణా, ఉపాధి, ఎత్తయిన భవనాలు, ప్రధాన వ్యాపారాలకు నిలయమైన ప్రదేశాన్ని 'నగరం' అంటారు. ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది.

          పల్లె        నగరం
 1. పెంకుటిల్లు, పూరిల్లు ఎక్కువగా ఉంటాయి.  1. ఎత్తయిన భవనాలు ఎక్కువగా ఉంటాయి.
 2. ఆహ్లాదకరమైన వాతావరణం.  2. పొగతో కలుషితమైన వాతావరణం.
 3. ఉపాధి అవకాశాలు తక్కువ.  3. ఉపాధి అవకాశాలు ఎక్కువ.
 4. ఆత్మీయ పలకరింపులు ఉంటాయి.  4. ఎవరికివారే ఏకాకిలా బతుకుతుంటారు.
 5. అన్నిరకాల సదుపాయాలు ఉండవు.  5. అన్నిరకాల అధునాతన సౌకర్యాలు ఉంటాయి.


ఆ. 'నగర జీవికి తీరిక దక్కదు కోరిక చిక్కద'నే పంక్తుల్లోని వాస్తవాన్ని తెలపండి.
జ: నగరంలో ధనవంతులు, పేదవారు ఉంటారు. వారు వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. పేదవారైతే పనిదొరికే ప్రాంతాలకు వెళ్తారు. ఉద్యోగాలు చేసేవారు సమయాన్ని పాటిస్తారు. ఉదయమే లేచి వడివడిగా తయారై, దూరప్రాంతంలో ఉండే కార్యాలయాలకు చేరుకుంటారు. చీకటిపడ్డాక మళ్లీ ఇంటికి వస్తారు. మధ్యలో ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటారు. కూలీలు పని ప్రాంతానికి వెళ్లి, తిరిగి చీకటి పడ్డాకే ఇంటికి చేరుకుంటారు. నిరంతరాయంగా పనిచేసినా నగరజీవికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకడం లేదు. తమకు వచ్చే చాలీచాలని జీతాలతో కోరికలను తీర్చుకోలేరు. అన్నీ ఖరీదైనవిగా ఉంటాయి. నగరంలో జీవించగలం కానీ కోరికలు నెరవేర్చుకోలేం.
 

ఇ. ఈ పాఠం ఆధారంగా నగరం ఎలా ఉంటే కవికి నచ్చుతుందో తెలపండి.
జ: 'నగర గీతం' అనే పాఠం ఆధారంగా నగరం కిందివిధంగా ఉంటే కవికి నచ్చుతుంది.
* నగరం రణగొణ ధ్వనులు లేకుండా ఉండాలి.
* భవనాలు, నివసించే ప్రదేశాలు ఇరుగ్గా ఉండకూడదు.
* మురికి ప్రదేశాలు ఉండకూడదు.
* అందరూ ఇతరుల బాగోగులు అడిగి తెలుసుకోవాలి.
* ఐశ్వర్యం, దారిద్య్రం రెండూ సమాంతరరేఖల్లా ఉండకూడదు.
* నగరజీవి విశ్రాంతి తీసుకునేందుకు సమయం దొరకాలి.
* రోడ్డుపై మరణాలు సంభవించకూడదు.
* ఆత్మీయ పలకరింపులు ఉండాలి.
* రోజూ ఉపాధి దొరకాలి.
* ట్రాఫిక్ కష్టాలు తొలగాలి.

 

ఈ. నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి?
జ: పల్లెలన్నీ పట్టణాలకు తరలుతున్న ఈ పరిస్థితులను చూసి తల్లడిల్లి నగరంలో కంటికి కనిపించని వాస్తవాలను కవి తెలిపాడు. నగరాల్లో ఎత్తయిన భవనాలతో పాటు పూరిళ్లూ ఉన్నాయి. వివిధ రకాల సమస్యలు వస్తుంటాయి. ఏకాకి జీవితాలు ఉంటాయి. ఆత్మీయ పలకరింపులు ఉండవు. కాలుష్యం నిండి ఉంటుంది. మానసికంగా, ఆరోగ్యంగా ఉండే పరిస్థితులు నగరంలో లేవని సంపూర్ణ వికాసం పొందాలని కవి తెలియజేస్తున్నాడు.
నగరంలోని సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పైపై మెరుగులు ప్రజలను ఆకర్షిస్తాయి. వాటికి లొంగి వస్తే ఇక్కడే చిక్కిపోతారు. ఉన్న పల్లెలోనే పని వెతుక్కుని ప్రశాంత జీవనం గడపాలనేదే కవి ఆంతర్యం. తాను నగరంలో అనుభవించిన కష్టాలు ఇతరులు పడొద్దని కవి చెబుతున్నారు.

 

ఉ. నగరంలో మనిషి జీవన విధానాన్ని పాఠం ఆధారంగా వివరించండి.
జ: నగరంలో మనిషి జీవన విధానం: నగరం మనుషుల మాటలతో, చిరు వ్యాపారుల అరుపులతో నిండి ఉంటుంది. ఉండటానికి స్థలం దొరకదు. ఇరుకైన మురికి ప్రదేశంలో ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉంటారు. ఒకరిని ఒకరు పట్టించుకోరు. సిటీ బస్సుల్లో, ఆటోల్లో, నడిచే దారిలో స్కూలు పిల్లల సందడి ఉంటుంది. పలు సమస్యలు నగరంలో ఉంటాయి. అవి మనిషిలో కలకలం రేపుతాయి.
పెద్ద భవనాలు మాత్రమే కాకుండా పూరిళ్లలోనూ మనుషులు జీవిస్తుంటారు. ధనవంతులతో పాటు పేదలు కూడా ఉంటారు. మనిషి జీవనంలో స్థిరత్వం లేని హడావుడి కనిపిస్తుంది. ఎల్లప్పుడూ పనిచేస్తుంటారు. కానీ విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. నగరంలో మనిషి వెంట మృత్యువు రోడ్డుకు నలువైపులా పొంచి ఉంటుంది. నగరంలో సాటి మనిషితో ఆత్మీయ పలకరింపులు ఉండవు. ఏకాకిగా
బతుకుతారు. కాలుష్యం కలవరపెడుతుంది. ట్రాఫిక్‌జామ్ కష్టాలు వెంటాడుతాయి.

 

ఊ. అందరూ నగరాల్లో జీవించాలని ఎందుకు అనుకుంటున్నారు?
జ: నగరాలు అన్ని సౌకర్యాలకు నిలయాలు. చదువుకున్న వారికి స్థాయిని బట్టి ఉద్యోగం లభిస్తుంది. కూలీలకైతే నిత్యం పని దొరుకుతుంది. అందరూ పని చేసి కుటుంబ కష్టాలను తొలగించుకోవడానికి నగరంలో జీవించాలనుకుంటారు.
అకడమిక్, వృత్తి విద్య, సాంకేతిక విద్య లాంటి అన్ని రకాల చదువుల కోసం నగరాన్ని ఆశ్రయిస్తారు. ఈ చదువులు పూర్తిచేసి వివిధ స్థాయిల్లో పనిచేసే స్థితిని నగరం కల్పిస్తుంది. అందుకే నగరంలో జీవించాలనుకుంటారు. అన్ని రకాల వృత్తులవారికి ఇక్కడ పని దొరుకుతుంది. నగరాల్లో ఎక్కువ సంపాదించవచ్చనే ఆలోచనతో వలస వెళ్తున్నారు. జీవనోపాధి కోసం నగరాలకు తరలిపోతున్నారు.

 

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ. 'నగరగీతం' సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జ: నగరగీతం సారాంశం:
నగరంలో వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులు, కూడళ్లలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా ఉంటాయి. ఆ శబ్దాలు మోగుతున్న ఢంకాలను తలపిస్తాయి.
   పల్లెను వదిలి ఉపాధి కోసం నగరం వచ్చిన వారికి ఉండటానికి స్థలం దొరకదు. పేద రైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకైన మురికి ప్రదేశంలో ఊపిరి తీసుకోలేని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు. నగరంలోని ప్రతి మనిషి ఒక పుస్తకం లాంటివాడు. ఆయన బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారు లేరు. నగరంలోని మనిషి వెనక అనేక ఆసక్తికర ఆనందాలు, విషాద గాథలు ఉంటాయి. వాటిని పట్టించుకునేవారు ఉండరు.
   నగరంలో ఉదయాన్నే స్కూలు పిల్లలు పేవ్‌మెంట్లపై సందడి చేస్తారు. నగరం నిండా ఎత్తయిన భవనాలు మాత్రమే కాదు పూరిపాకలు కూడా ఉంటాయి. ఐశ్వర్యం, దారిద్య్రం రెండూ సమాంతర రేఖల్లా ఉంటాయి. ఎప్పుడూ పనిచేస్తున్నా విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. సంపాదించిన ధనంతో సరదాలను తీర్చుకునే సమయం ఉండదు.
   నగరంలో అసహజపు నవ్వులతో, స్థిరత్వం లేని హడావుడి నడకలతో వెళ్లేవారు, ఆటోరిక్షాల్లో తిరిగేవారు, కార్లలో ప్రయాణించేవారు ఉంటారు. అక్కడ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు జరుగుతాయి. రోడ్లకు నాలుగు దిక్కుల్లో మృత్యువు పొంచి ఉంటుంది.
   నగరంలో ఆత్మీయ పలకరింపులు ఉండవు. ఏకాకులుగా బతుకుతారు. నగరానికి వచ్చినవారు పని దొరక్కపోయినా ఆశగా వేచిచూస్తారు. నగరంలోని సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు ఆకట్టుకుంటాయి. బతకడం భయపెట్టినా నగరాన్ని విడిచివెళ్లరు. కాలుష్యం బాధపెట్టినా ట్రాఫిక్‌జామ్‌తో ఇబ్బందులు ఎదురైనా పల్లెలకు పోరు. రసాయనశాలలా చిక్కుముడి విడదీయలేని పద్మవ్యూహంలా ఉంటుంది నగరం.

 

ఆ. నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి.
జ: పల్లెలన్నీ సదుపాయాలను వెతుక్కుంటూ నగరానికి తరలుతున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వస్తున్నారు. ఇలా అన్ని ప్రాంతాల ప్రజలు నగరానికి రావడం వల్ల తలదాచుకోవడానికి స్థలం దొరకడం లేదు. జనాభా పెరిగిపోయింది. ఎత్తయిన భవనాల పక్కనే పూరి గుడిసెలు వెలుస్తున్నాయి. మురుగునీటి పారుదల సరిగా ఉండక, చెత్తా చెదారంతో నిండిపోతోంది. ఫుట్‌పాత్‌లు, బస్సులు, ఆటోరిక్షాలు, రైళ్లన్నీ నిత్యం జనసమ్మర్థంతో కిటకిటలాడుతూ ఉంటాయి. నగర జీవనం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉపాధి అవకాశాలు విరివిగా దొరకడం వల్ల పల్లెవాసులు నగరాలను ఆశ్రయిస్తున్నారు.
 

ఇ. నగరాన్ని రసాయనశాల, పద్మవ్యూహంగా వర్ణించడంలోని నిజానిజాలను గురించి చర్చించండి.
జ: నగరాన్ని అర్థం కాని రసాయనశాల, చిక్కువీడని పద్మవ్యూహం అని కవి వర్ణించాడు.
రసాయనశాల: ప్రయోగశాలలో ఎన్నో రసాయన ద్రవాలు, ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థం కాని రసాయనశాలలా ఉంటుంది. కవి రసాయనశాల అని ఎందుకు ప్రయోగించాడంటే నగరంలో నివసించేవారి సంఖ్య పెరిగిపోయింది. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. నగరంలో ఆధునిక వైద్యం వల్ల వాటికి సంబంధించిన వాడి పారేసిన మందులు, దూది, సూదులు, సెలైన్ డబ్బాలు అన్నీ మిగిలిపోతున్నాయి. అదేవిధంగా నగరవాసులు ఇంటిలో మిగిలిన అన్నం, కూరగాయలు పారవేయడం వల్ల చెత్తాచెదారం పెరిగిపోతోంది.
పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనాలను పక్కనే పారే కాలువలోకి విడిచిపెట్టడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడింది. పెరిగిన వాహనాల వల్ల వాయు కాలుష్యం కూడా ఎక్కువైంది.
ఈ విధంగా రసాయనశాలలోని ద్రవాలు, ఆమ్లాల మాదిరిగా పైవన్నీ అంతకంటే ఎక్కువగా నగరాన్ని బాధిస్తున్నాయి. అందుకే కవి అలా ప్రయోగించాడు.

పద్మవ్యూహం: నగరం పద్మవ్యూహం లాంటిది. పద్మవ్యూహంలోకి ప్రవేశించినట్లే తొందరగానే నగరానికి వెళ్లవచ్చు. అయితే అక్కడ నుంచి తిరిగి రావడం కష్టం. నగరాల్లోని సౌకర్యాలకు ప్రజలు ఆకర్షితులై తిరిగి వెనక్కి వెళ్లలేకపోతున్నారు. ఉపాధి కోసం నగరానికి వచ్చినవారు ఏదో ఒకరోజు పనిదొరకుతుందని ఆశగా వేచి చూస్తుంటారు. అక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పైపై మెరుగులు వారిని బలంగా ఆకర్షిస్తాయి. వీటిని విడిచిపెట్టి అంత త్వరగా వెళ్లలేరు. అందుకే కవి నగరాన్ని పద్మవ్యూహం అన్నాడు.
 

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ. నగర గీతం కవితకు మరోపార్శ్వంగా నగర జీవనంలోని అనుకూల అంశాలపై ఒక వ్యాసం రాయండి.
జ: వ్యాసం: 'నగర జీవనంలోని అనుకూల అంశాలు'
     నగరం అందమైన జీవితానికి పొదరిల్లు లాంటిది. నగరం క్రమంగా విస్తరిస్తోంది. దానికి తగ్గట్టుగానే సౌకర్యాలూ పెరుగుతున్నాయి. నగరంలో జీవించేందుకు అన్ని వర్గాలవారికి అవకాశం ఉంది. ఉన్నతస్థాయికి చేరేందుకు ప్రధాన కూడలి నగరం. అందరినీ తన కడుపులో పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడుతుంది. అక్కడి జీవనం శోభాయమానం. వసతులు అమిత సుఖాలకు నిలయాలు.
     నగరంలో అధునాతన వైద్య సదుపాయాలు ఉంటాయి. ఇక్కడే ఉండే విద్యాలయాలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తోడ్పడతాయి. అన్ని రకాల వృత్తుల వారికి ఉపాధి కల్పిస్తుంది. వ్యాపారాలు చేసుకునేందుకు నగరం మంచి వేదిక.
     నగరంలో మంచినీటి సరఫరా, మురుగు నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, వినోదానికి సినిమాలు, క్రీడా నైపుణ్యాలను పెంచే స్టేడియాలు, ప్రశాంతత కోసం దేవాలయాలు, విశాలమైన రోడ్లు, చదువుకు తగిన ఉద్యోగాలు దొరుకుతాయి.
     నగరంలో ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహిస్తారు. ఇక్కడ తిరిగేందుకు సిటీ బస్సులు, రైళ్లు ఉంటాయి. నగరంలో శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులు ఉంటారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి వెళ్లవచ్చు. ప్రతిభను వెలికితీసే వేదికలు, సేవాసంస్థలు నగరాల్లో ఉంటాయి.

 

ఆ. ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పదనాన్ని వర్ణిస్తూ ఒక వచన కవిత రాయండి.
జ: వచన కవిత: 'నా పల్లె తల్లి'
        పచ్చని మువ్వల హారం నా పల్లె సమాహారం
        చల్లని పైర చిందించును చిరుగాలి
        విరిసిన పువ్వులు మూయనివ్వవు కన్నులను
        పరచుకున్న చెట్ల నీడలు తొలగించును అంతస్సంఘర్షణ గోడలను
        ఆత్మీయతల పలకరింపులు అలరించును అనునిత్యం
        పచ్చదనపు పరవశం పరిగెత్తించును అలసటలను
        కష్టసుఖాలలో అందరూ ఎల్లవేళలా కలిసుందురు
        అన్ని పండగలకు పల్లెలు ముస్తాబగును నిండుగా
        ప్రశాంతమైన వాతావరణం పల్లెతల్లికో వరం
        కాలుష్యం లేని పల్లె కలకాలం నింపును ఆరోగ్యం
        పల్లె జానపదుల జట్టు అది ఉండును విశ్వాసానికి పట్టు
        సౌఖ్యానికి నిలయాలు నా చల్లని పల్లెలు.


రచయిత: జి. అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం