• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నగరగీతం

కవి పరిచయం:
* ఈ పాఠ్యభాగ రచయిత అలిశెట్టి ప్రభాకర్. ఈయన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో 1954లో జన్మించారు.
* చిత్రకారుడిగా జీవితం ప్రారంభించి పత్రికలకు బొమ్మలు వేసేవారు. జగిత్యాలలో 'సాహితీమిత్ర దీప్తి' సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించారు.
* 1974లో వచ్చిన 'పరిష్కారం' ఆయన రచనల్లో అచ్చయిన మొదటి కవిత. ఇది ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చేది. జగిత్యాలలో 'స్టూడియో పూర్ణిమ (1976)', కరీంనగర్‌లో 'స్టూడియో శిల్పి (1979)', హైదరాబాద్‌లో 'స్టూడియో చిత్రలేఖ (1983)' లను ప్రారంభించి ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. జీవిత పోరాటంలో కవిగా ఎదిగారు. ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మారు. 1993లో మరణించారు.
* మొదటి కవితా సంకలనం 'ఎర్ర పావురాలు (1978)'.

అచ్చయిన కవిత్వ సంకలనాలు:
* మంటల జెండాలు, చురకలు (1979)
* రక్తరేఖ (1985)
* ఎన్నికల ఎండమావి (1989)
* సంక్షోభ గీతం (1990)
* సిటీ లైఫ్ (1992)
* ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరు సంవత్సరాల పాటు 'సిటీలైఫ్' పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితల ద్వారా ఆయన పేరుపొందారు.
* తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించారు.

పాఠ్యాంశ ఉద్దేశం/ నేపథ్యం:
ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకుతెరువు కోసం నగరాలకు వలసలు పెరిగిపోయాయి. నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. వీటిని వినియోగించుకోవాలనే కోరికతో ప్రజలు నగరాల్లో ఉండటానికి తాపత్రయపడుతున్నారు. దీంతో నగరాల్లో జనాభా పెరిగింది. సమస్యలూ పెరిగాయి. ప్రపంచీకరణ ప్రభావంతో నగరాల రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత దూరంగా, మధ్య తరగతికి అంతుచిక్కని ప్రాంతంగా నగరం మారిపోయింది. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకుతానే పరాయివాడు అయిపోయాడు. ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాలను మన కళ్ల ముందు నిలుపుతూ, నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ, వాస్తవాలను కఠినంగా నిర్వచించిన విధానాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:
* ఈ పాఠం 'మినీ కవిత' అనే ప్రక్రియకు చెందింది.
* మినీ కవిత ద్వారా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకంటిస్తూ తక్కువ పంక్తుల్లో చెబుతారు.
* 'అలిశెట్టి ప్రభాకర్ కవిత' అనే గ్రంథంలోని 'సిటీ లైఫ్' మినీ కవితల్లో కొన్నింటిని 'నగరగీతం' పాఠ్యాంశంగా గ్రహించారు.

ప్రవేశిక
దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది.
కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి.
సహృదయుడు ప్రతి కదలిక నుంచీ ప్రేరణ పొందుతాడు.
అతడికి భాష ఆయుధమైతే, భావం కవితా రూపం సంతరించుకుంటుంది.
నగరంలోని మూలాలను, మూలలను ఓ కవి హృదయం ఎలా దర్శించిందో 'అలిశెట్టి' మినీ కవిత(లు) మన కళ్లకు కడుతుంది. మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి.

పాఠ్యభాగ 'మినీ కవిత'లోని పదాలకు అర్థాలు:

పంక్తులు
నగారా మోగిందా
నయగరా దుమికిందా
నాలుగు రోడ్ల కూడలిలో ఏమది?
అదే, నగరారణ్యహోరు
నరుడి జీవన ఘోష
 

పదాలకు అర్థాలు:
నగారా మోగిందా = ఢంకా చప్పుడు చేసిందా
నయాగరా దుమికిందా = 'నయాగరా' జలపాతం దూకిందా
నాలుగు రోడ్ల కూడలిలో = నాలుగు రోడ్లు కలిసే స్థలంలో
ఏమది = ఏమిటది
అదే = ఆ చప్పుడు
నగరారణ్య హోరు = అరణ్యం లాంటి నగరం చేస్తున్న ధ్వని
నరుడి జీవన ఘోష = నగర జీవి బతుకు పోరాటంలో నుంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దం
 

భావం:
అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా, ఉద్ధృతమైన వేగంతో దూకే నయాగారా జలపాతం హోరులా అనిపిస్తుంది. నిజానికది అరణ్యం లాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా ఉందని కవి వర్ణిస్తున్నాడు.
 

పంక్తులు
తల్లి ఒడి వంటి
పల్లె సీమల్నొదిలి
తరలివచ్చిన పేదరైతులూ
ఇనప్పెట్టెల్లాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులూ
 

అర్థాలు:
తల్లి ఒడి వంటి = అమ్మ ఒడి లాంటి
పల్లె సీమల్నొదిలి (పల్లె సీమలన్ + ఒదిలి) = పుట్టిన ఊరిని వదిలి
తరలివచ్చిన = ఉపాధి కోసం వచ్చిన
ఇనప + పెట్టెల్లాంటి = ఇనుముతో తయారుచేసిన పెట్టె లాంటి
ఈ పట్టణాల్లో = ఈ నగరాల్లోని ఇళ్లల్లో
ఊపిరాడని మీ బతుకులూ = ఊపిరి తీసుకోలేని స్థితిలో మీ బతుకులు
 

భావం:
అమ్మ ఒడి లాంటి పుట్టిన ఊరిని వదిలి ఉపాధి కోసం నగరానికి తరలి వచ్చినవారికి ఇంత పెద్ద పట్నంలో తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా దొరకదు. పేద రైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు.
 

పంక్తులు
నగరంలో ప్రతి మనిషి
పఠనీయ గ్రంథమే
మరి నీ బతుకు
పేజీలు తిరగేసేదెవరో!
 

అర్థాలు:
నగరంలో ప్రతి మనిషి = నగరంలో ఉండే ప్రతి ఒక్కరు
పఠనీయ గ్రంథమే = చదవాల్సిన ఒక పుస్తకం లాంటి వారు
మరి నీ బతుకు = మరి నీ బతుకు పుస్తకంలోని
పేజీలు తిరగేసేదెవరో = పేజీలను చదివేవారు ఎవరో
 

భావం:
నగరంలోని ప్రతి మనిషీ చదవాల్సిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే ఎవరూ అతడి బతుకు పుస్తకంలోని పేజీలను చదవరు. నగరంలోని మనిషి వెనక అనేక ఆసక్తికరమైన, ఆనంద, విషాదగాథలు ఉంటాయి. అతడి బాగోగులు పట్టించుకునేవారు ఒక్కరైనా ఉండరనే చేదు నిజాలను చెబుతున్నాడు కవి.
 

పంక్తులు
ఉదయమే
బస్సుల్లో రిక్షాల్లో
పేవ్‌మెంట్లపై విరబూసిన
కాన్వెంటు పువ్వుల సందడి
రాలే చదువుల పుప్పొడి!
 

అర్థాలు:
ఉదయమే = పొద్దున్నే
బస్సుల్లో రిక్షాల్లో = బస్సులు, రిక్షాల్లో
పేవ్‌మెంట్లపై = నడిచే దారిపై
విరబూసిన = ఎక్కువగా పూసిన
కాన్వెంటు పువ్వుల సందడి = పువ్వుల లాంటి చదువుకునే పిల్లల గోల
రాలే = పిల్లల నుంచి వచ్చే మాటలు
చదువుల పుప్పొడి = పువ్వుల నుంచి రాలిన పుప్పొడి లాంటివి
 

భావం:
నగరంలో ఉదయాన్నే సిటీ బస్సుల్లో, ఆటోల్లో, నడిచే దారిపై విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సందడి చేస్తుంటారు. వారి మాటల్లోంచి చదువుల పుప్పొడి రాలుతుంది.
 

పంక్తులు
సిటీ అంటే అన్నీ
బ్యూటీ బిల్డింగులు కావు
అటు భవంతులూ ఇటు పూరిళ్ళూ
దారిద్య్రం, సౌభాగ్యం సమాంతర రేఖలు!
ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం!
 

అర్థాలు:
సిటీ అంటే = నగరం అంటే
అన్నీ = మొత్తం అక్కడున్నవి
బ్యూటీ బిల్డింగులు = అందమైన భవనాలు
కావు = కావు
అటు భవంతులూ = ఒకవైపు భవనాలు
ఇటు పూరిళ్ళు = ఒకవైపు గుడిసెలు
దారిద్య్రం = పేదరికం
సౌభాగ్యం = ఐశ్వర్యం
సమాంతర రేఖలు = సమానమైన కలిసిపోని గీతలు
ఇది వెరైటీ సమస్యల = వివిధ రకాలైన సమస్యల
మనుష్యుల = మనుషుల
సమ్మేళన = కలయికల
కోలాహలం = కలకలం (శబ్దం)
 

భావం:
నగరానికి అన్నివైపులా అందమైన ఎత్తయిన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిళ్లూ ఉంటాయి.
ఇక్కడ ఐశ్వర్యం, దారిద్య్రం పక్కపక్కనే సమాంతర రేఖల్లా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది.
 

పంక్తులు
ఎంత చేసినా ఎవరికీ
తీరిక దక్కదు కోరిక చిక్కదు
మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు
కొందరికి రెండూ కాళ్ళు
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు!
 

అర్థాలు:
ఎంతచేసిన ఎవరికీ = ఎంతసేపు పనిచేసినా ఎవరికైనా
తీరిక దక్కదు కోరిక చిక్కదు = తీరిక ఉండదు కోరిక తీరదు
మెర్క్యూరీ నవ్వులు = పాదరసం నవ్వులు (కృత్రిమమైన వెలుగులు)
పాదరసం నడకలు = పాదరసంలా స్థిరత్వం లేని హడావుడి నడకలు
కొందరికి రెండు కాళ్ళు = కొందరు నడిచి
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు = మూడు చక్రాల రిక్షాల్లో తిరిగేవారు
ఉన్నవాళ్లకి నాలుక్కాళ్లు = డబ్బు ఉన్నవారు నాలుగు చక్రాల కారులో తిరుగుతారు.
 

భావం:
ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరికా ఉండదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వం లేని హడావుడి నడకలతో వెళ్లేవారు; ఆటోరిక్షాల్లో తిరిగేవారు, కార్లలో ప్రయాణించే ధనవంతులూ ఉంటారు.
 

పంక్తులు
నగరంలో అన్నిపక్కలా
సారించాలి మన చూపులు
మహానగరాల రోడ్లకి
మరణం నాలుగువైపులు!
 

అర్థాలు:
నగరంలో అన్నిపక్కలా = నగరంలో అన్ని వైపులా
సారించాలి మన చూపులు = చూడాలి మన చూపులతో
మహానగరాల రోడ్లకి = పెద్ద నగరాల్లోని రోడ్లకు
మరణం నాలుగువైపులు = చావు నలుదిక్కుల నుంచి పొంచి ఉంటుంది.
 

భావం:
నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు పొంచి ఉంటాయి. నాలుగు దిక్కుల్లోని రోడ్లలో
మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.
 

పంక్తులు
నగరం మహావృక్షం మీద
ఎవరికి వారే ఏకాకి!
నగరం అర్థం కాని రసాయనశాల!
నగరం చిక్కువీడని పద్మవ్యూహం!!
 

అర్థాలు:
నగరం మహావృక్షం మీద = నగరమనే పెద్ద చెట్టుమీద
ఎవరికి వారే ఏకాకి = ఎవరినివారే పట్టించుకోకుండా ఒంటరిగా ఉంటారు
నగరం అర్థం కాని రసాయనశాల = నగరం అర్థం కాని రసాయనాలు ఉండే చోటు లాంటిది
నగరం చిక్కువీడని పద్మవ్యూహం = నగరం చిక్కు తీయలేని, విడదీయలేని పద్మవ్యూహం.
 

భావం:
వృక్షాల మీద ఉండే పక్షులు పరస్పరం కలివిడిగా ఉంటాయి. కానీ నగరమనే మహావృక్షం మీద నివసించే ఈ మనుషులు సాటి మనిషితో ఎలాంటి ఆత్మీయ పలకరింపులు లేకుండా, ఇరుగూపొరుగనే భావన కూడా లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక స్థితిని నిరసిస్తున్నాడు కవి. నగరం అర్థం కాని రసాయనశాల లాంటిది. ఉపాధి దొరక్కపోయినా, దొరుకుతుందనే ఆశతో అక్కడే ఉండి నగర జీవనానికి ఆకర్షితులై, పల్లెలకు వెళ్లలేరు. నగరం చిక్కుముడి విడదీయలేని పద్మవ్యూహం లాంటిది.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌