• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భాగ్యోదయం

'ఆలోచించండి - చెప్పండి'కి సమాధానాలు

1. కుల వ్యవస్థ వల్ల సమాజంలో ఏం జరుగుతుంది?
జ: కుల వ్యవస్థ వల్ల సమాజం కూలిపోతుంది. తమ కులంవారనే భావంతో సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. ఇతర కులం వ్యక్తి అని తెలియగానే దూరంగా ఉంచేస్తున్నారు. అన్యాయం చేసినవాడు తమ కులస్థుడు అని తెలియగానే అతడి రక్షణ దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కుల వ్యవస్థ తన ప్రభావాన్ని చూపుతుంది. మనుషులంతా ఒక్కటే అనే భావనను ఈ కుల వ్యవస్థ మలినం చేస్తుంది. భేదాలను చూపుతుంది. దీని ద్వారా అభివృద్ది మరుగున పడుతుంది. దీనివల్ల కొన్ని కులాలు మాత్రమే బలంగా తయారవుతున్నాయి.
 

2. చిత్తశుద్ధి, నిజాయితీ అంటే మీకు ఏం అర్థమైంది?
జ: చిత్తశుద్ధి అంటే మనసు స్వచ్ఛంగా ఉండటం. అంటే చేసే పనిలో మనసును కేంద్రీకృతం చేసి అది అయ్యే వరకు అహర్నిశలూ కష్టపడటం. అలా కాకుండా చేసే పనులు సఫలీకృతం కావు. ఏదో పేరుకు మాత్రమే (నామమాత్రంగా) పనులు చేసి పూర్తయింది అనేలా ప్రవర్తించడం చిత్తశుద్ధి కాదు. చిత్తశుద్ధితో చేసే ఏ పని అయినా నూటికి నూరుపాళ్లూ విజయవంతం అవుతుంది.
నిజాయితీ అంటే ఏ పని చేసినా తన స్వార్థం చూసుకోకుండా సక్రమమైన ప్రవర్తనతో పనిచేయడం. నిజంపైనే నడిచేది నిజాయితీ. నిజాయితీతో ఉంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది. పనిలో అందరినీ ఆకర్షిస్తాం. అది మనల్ని అందనంత ఎత్తులోకి తీసుకువెళుతుంది. నేటి సమాజానికి నిజాయితీ చాలా అవసరం.

 

3. అజ్ఞానం, ఉదాసీనత వల్ల కలిగే నష్టాలేమిటి? చర్చించండి.
జ: అజ్ఞానం అంటే ఏమీ తెలియకపోవడం. ఉదాసీనత అంటే ఏమీ పట్టించుకోకపోవడం. ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుందో తెలియదు. తెలిసీ తెలియనట్లు అనిపించినా పట్టించుకోవడం లేని కారణంగా కష్టాలు వస్తాయి. ఏది మంచి, ఏది చెడు అనేదాన్ని గుర్తించలేని కారణంగా సమస్య జటిలమై ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది.
   అజ్ఞానం, ఉదాసీనత వల్ల బానిసలుగా మారే అవకాశం ఉంటుంది. శ్రమ దోపిడీ జరుగుతుంది. తేలికగా మోసపోతారు. కుట్రలు అధికమై హింసల బారినపడే ప్రమాదం ఉంది.

4. మూఢ నమ్మకాలు అంటే మీకేం అర్థమైంది?
జ: మూఢ నమ్మకాలు అంటే భవిష్యత్తులో ఏవో పరిణామాలు జరుగుతాయనే భ్రమను కలిగి ఉండటం. అలా చేస్తే మంచి జరుగుతుంది. ఇలా చేస్తే చెడు జరుగుతుంది అనేది మనసులో నాటుకుని ఉంటుంది. ఇవన్నీ కేవలం ఊహాజనితాలే. కచ్చితంగా అవుతాయని చెప్పలేం. అతి నమ్మకాల్లో కొట్టుమిట్టాడుతూ ఉండటాన్ని మూఢనమ్మకాలుగా చెప్పవచ్చు. ఇవి మనుషుల్లో భయాన్ని పెంచుతాయి. సమయాన్ని వృథా చేస్తాయి. ఆధారాలు లేని ఈ మూఢ నమ్మకాలను గ్రామాల్లో అమితంగా పాటిస్తారు. దీని ద్వారా శాస్త్ర సాంకేతికత వారికి బోధపడదు. ప్రజలు ఈ మూఢ నమ్మకాలను నమ్మి ఒకటి చేయబోయి మరొక కొత్త సమస్యను తెచ్చుకుంటారు.
 

5. వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగారు?
జ: వర్మ తన జాతి జనుల కోసం బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పారు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకున్నారు. తాగుడు వల్ల కుటుంబాలు ఎలా గుల్ల అవుతాయో చెప్పి మాన్పించారు. పిల్లలను దేవుడికి వదిలివేయడాన్ని మాన్పించారు. చదువుపై దృష్టి పెట్టేలా వారిని మార్చారు. మూఢ నమ్మకాలను కొద్దికొద్దిగా మార్చుకునేందుకు సిద్ధపరిచాడు.
 

6. మంచి వక్త అని ఎవరిని అనవచ్చు?
జ: విషయాలను స్పష్టంగా, సవివరంగా, అర్థమయ్యేలా చెప్పేవారిని మంచి వక్త అంటారు. ఉత్సాహవంతంగా, హావభావాలతో అన్ని వివరాలను అందించే వ్యక్తి మంచి వక్త అవుతాడు. అనేక ఉదాహరణలతో విషయాన్ని అనురక్తి కలిగేలా చెప్పే నేర్పరిని మంచి వక్త అంటారు. శ్రోతకు విసుగు కలిగించకపోవడం మంచి వక్త ప్రధాన లక్షణం.
 

7. అండగా ఉండటం అంటే ఏమిటి?
జ:  అండగా ఉండటం అంటే సహాయంగా ఉండటం. ఆపద వచ్చినప్పుడు ఎవరో ఒకరు తనకు సహాయకారిగా ఉండాలనుకుంటారు. అలాంటి సందర్భంలో అండగా ఉంటే, ఎంతో లాభం చేకూరుతుంది. మంచి జరిగినా చెడు జరిగినా నేనున్నాను అనే ధీమాను ఇవ్వడం వల్ల కుంగుబాటు అనేది ఉండదు. అండగా ఉండేవారు అరుదుగా ఉంటారు. వారు ఎల్లవేళలా ధైర్యం కలిగి ఉంటారు. ధైర్యం ఇస్తారు.
 

8. చదువుకోవడం వల్ల సమాజం ఏ విధంగా చైతన్యవంతమవుతుంది?
జ: చదువుకోవడం వల్ల సమాజం చాలా గొప్ప చైతన్యాన్ని పొందుతుంది. అదెలా అంటే, చదువు వల్ల అన్ని రకాల విషయాలు అవగతమవుతాయి. వివేకవంతులవుతారు. మూఢ నమ్మకాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. చెడు అలవాట్లు దరికి చేరవు. సాంఘిక దురాచారాలు తగ్గి సమాజంలో వ్యక్తులందరూ సమానమే అనే భావన బలంగా నిలిచిపోతుంది. చదువుకోవడం వల్ల గౌరవ మర్యాదలంటే ఏంటో తెలుస్తాయి. విశ్లేషణా నైపుణ్యం పెరుగుతుంది. చదువు సమాజ అభివృద్ధికి సహాయకారిగా తోడ్పడుతుంది. చదువు వల్ల సేవాగుణం అలవడుతుంది. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ తెలుస్తుంది. సమస్యలపై సమష్టిగా పోరు చేసే సత్తా, అన్యాయాన్ని గుర్తించి ఎదిరించే ధైర్యం వస్తుంది. సమన్యాయం కోసం ఆలోచించడం అనేది చదువు వల్ల సాధ్యమవుతుంది. సమాజాన్ని చైతన్యవంతం చేసేది కేవలం చదువు మాత్రమే.
 

9. నాయకత్వ పటిమను ఏ విధంగా అంచనా వేయవచ్చు?
జ: తను ముందు ఉండి ప్రజలను నడిపించేవాడు నాయకుడు. అన్నివేళలా, అన్నివిధాలా, అందరికీ అందుబాటులో ఉండేవాడే నాయకుడు. కష్టసుఖాల్లో తోడుండేవాడే నాయకుడు. ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. అతడు చెప్పిన వెంటనే పనులు పూర్తవుతాయి. ఖర్చుకు వెనుకాడడు. నేనున్నాను అని ధైర్యాన్ని ఎవరు అందిస్తారో వారిలో నాయకత్వ పటిమ ఉన్నట్లుగా అంచనా వేయవచ్చు.

ఇవి చేయండి

I. అవగాహన - ప్రతిస్పందన

1. నిమ్న వర్గాల్లో భాగ్యరెడ్డివర్మ తెచ్చిన మార్పులు చెప్పండి.
జ: ప్రతిఫలం ఆశించకుండా తమ కోసం అన్నివేళలా పనిచేసే భాగ్యరెడ్డివర్మను అంటరాని వర్గాలన్నీ తమ నాయకుడిగా అంగీకరించాయి. అజ్ఞానం, ఉదాసీనతలే తమ దుస్థితికి కారణమని ప్రజలు తెలుసుకోగలిగేలా వర్మ చేశారు. మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేలా వర్మ చేశారు. సాంఘిక దురాచారాలను మటుమాయం చేశారు. ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించారు. మందు తాగడం మాన్పించారు. మత సాంఘిక సభల్లో పాల్గొనేలా చేశారు. అణగారిన వర్గాల్లో చైతన్యం కోసం 3,348 ఉపన్యాసాలు ఇచ్చారు.
 

2. భాగ్యరెడ్డివర్మ, అంబేద్కర్‌ల మధ్య పోలికలు రాయండి.
జ: భాగ్యరెడ్డివర్మ, అంబేద్కర్ నిమ్న జాతుల సముద్ధరణకు పాటుపడ్డారు. ఒకే రకమైన లక్ష్యం ఉన్నవారు. నిజాయితీగా పని చేశారు. సొంత కాళ్లపై నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని ఇద్దరూ నమ్మారు. అంటరానితనాన్ని, తాగుడునూ వ్యతిరేకించారు. సమయాన్ని ఎక్కడా వృథా చేయకుండా అంటరాని వర్గాలకు, బడుగు, బలహీన వర్గాల సముద్ధరణకు ఉపయోగించారు. సమాజంలో పేరుకుపోయిన మూఢవిశ్వాసాలను తీవ్రంగా ప్రతిఘటించారు. ఇద్దరూ మంచి వక్తలు. తమ ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. పనికి సంబంధించి ఆచరణ, ఆలోచనల్లో పూర్తి స్వేచ్ఛను అనుభవించారు. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేశారు.
ప్రజల నుంచి ఇద్దరూ కూడా సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకున్నవారే. భాగ్యరెడ్డివర్మ, అంబేద్కర్ ఇద్దరూ మహోన్నత వ్యక్తిత్వం ఉన్నవారు. జీవితాన్ని అంతా సమాజం కోసం కేటాయించారు. కుల వ్యవస్థపై పోరాటం చేసిన మహానుభావులు. సామాజిక వికాసం కోసం పాటుపడి ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారు.

3. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాఫూలే బహుజనుల అభివృద్ధికి విశేషకృషి చేశారు. దొరల దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశారు. సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. బి.ఎస్.వెంకటరావు హైదరాబాద్‌లోని ఘాస్‌మండిలో పుట్టారు. హైదరాబాద్ అంబేద్కర్‌గా ప్రసిద్ధి చెందారు. హైదరాబాద్‌లో అంబేద్కరిజానికి పాదులు తీసి, దారులు వేశారు. సమరోత్సాహంతో దళిత ఉద్యమాలను నడిపారు. హైదరాబాద్‌లో దేవదాసీ దురాచార నిర్మూలనకు, దళితుల్లో విద్యాభివృద్ధికి కృషి చేశారు. 1926లో ఆది హిందూ మహాసభను స్థాపించారు.

 

సరైన జవాబు గుర్తించి కుండలీకరణ (బ్రాకెట్)లో రాయండి.
1. జ్యోతిబాఫూలే స్థాపించిన సమాజం పేరు ఏమిటి? (అ)
   అ) సత్యశోధక      ఆ) సమసమాజం      ఇ) నవ సమాజం
2. పేదలందరికీ అందుబాటులోకి రావలసింది..... (ఆ)
   అ) డబ్బు      ఆ) చదువు      ఇ) న్యాయం
3. దేవదాసీ దురాచార నిర్మూలనకు కృషిచేసింది.... (ఇ)
   అ) జ్యోతి బాఫూలే     ఆ) అంబేద్కర్      ఇ) బి.ఎస్. వెంకటరావు
4. ఆది హిందూ మహాసభను స్థాపించిన సంవత్సరం (ఆ)
   అ) 1936      ఆ) 1926      ఇ) 1916

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) చదువుకుంటే కలిగే లాభాలను తెలపండి.
జ: చదువుకుంటే కలిగే లాభాలు:
     * చదువుకుంటే జ్ఞానం వస్తుంది.
     * ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది.
     * సమాజంలో గౌరవం పెరుగుతుంది.
     * చెడు అలవాట్లు తొలిగిపోతాయి.
     * కష్టాలను తట్టుకునే మనోధైర్యం వస్తుంది.
     * ఆలోచనా పరిధి పెరుగుతుంది.
     * ఉపాధి, తద్వారా ఆనందమయ జీవనం లభిస్తుంది.

 

ఆ. అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి?
జ: అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే మొదట చదువు ఉన్నతోన్నత స్థాయివరకు అందించాలి. పేదలకు తోడ్పాటు అందించాలి. ప్రభుత్వ పథకాల్లో పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రిజర్వేషన్లు అమలు చేయాలి. అందరికీ పని కల్పించాలి. వెనుకబాటుతనాన్ని గుర్తించి తగిన సహాయం అందించాలి. పేద, గొప్ప అనే భేదాలను రూపుమాపాలి. అందరూ సమానమే అనే భావనను బలపరచాలి. కులవ్యవస్థకు దూరంగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. బతకడానికి ఉపాధి మార్గాలను చూపాలి.
 

ఇ. అంకిత భావంతో పనిచేయడం అంటే ఏమిటి?
జ: తనకు కేటాయించిన పనిని సకాలంలో సరిగ్గా పూర్తిచేయడాన్ని అంకితభావంతో పనిచేయడం అంటారు. తనని తాను పని కోసం సమర్పించుకోవడం, వేరే ఇతర పనుల గురించి ఆలోచన చేయకుండా కేటాయించుకున్న పనిని మాత్రమే చేయడాన్ని అంకిత భావంగా చెప్పొచ్చు. నేను ఇది పూర్తి చేస్తాను, ఇది నా కర్తవ్యం, నాకు అప్పజెప్పిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తాను అనే భావం ఆ పనిలో కనిపిస్తుంది. పనిలో నిమగ్నమై పైసా కోసం పరితపించకుండా పూర్తి చేయడం అనేది అంకితభావంతో పనిచేయడంలో కనిపిస్తుంది.
 

ఈ. వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
జ: వ్యసనం అంటే ఏదో ఒక దురలవాటుకు బానిస కావడం. అలాంటివి ఒకటి కంటే ఎక్కువ ఉంటే వ్యసనాలు అంటారు. వ్యసనాల వల్ల సంపద నష్టపోతారు. నిత్యావసర వస్తువులను కొనడం పక్కన పెట్టి వ్యసనానికి ఖర్చు పెడతారు. మానవ సంబంధాలు తెగిపోతాయి. కుటుంబం వీధిపాలు అవుతుంది. తాకట్టులకు తాళిబొట్టు అమ్మాల్సి వస్తుంది. ఆరోగ్యాలన్నీ అనారోగ్యాలుగా మారతాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. సోమరితనం అలవాటు అవుతుంది. దాని ద్వారా సంపాదన నష్టపోతారు. వ్యసనాల వల్ల చివరకు మరణం సంభవించవచ్చు.
 

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ)
మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?
జ: మూఢ నమ్మకాలను పారదోలడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఎవరికైతే మూఢ నమ్మకాలు ఉంటాయో వారిని గుర్తిస్తాం. స్వతహాగా వారి ఇంటికి వెళ్లి మూఢ నమ్మకాలవల్ల మన సమయం, ధనం ఎలా నష్టపోతున్నామో తెలియజేస్తాం. కరపత్రాలు ముద్రించి పంచుతాం. గ్రామాల్లోకి తిరిగి నాటకాల రూపంలో ప్రదర్శనలు ఇస్తాం. లఘుచిత్రం రూపొందించి ప్రదర్శింపజేస్తాం. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు కారణమైన నిరక్షరాస్యతను పారదోలేందుకు అందరూ బడికి వెళ్లేలా చూస్తాం.
         మూఢ నమ్మకాలపై పోరాడుతున్న సంస్థలను ఆశ్రయించి వారికి విషయం తెలియజేసి వారితో ఉపన్యాసాలను ఇప్పించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తాం. మూఢ నమ్మకాలతో తీవ్రంగా నష్టపోయిన వారితో వారి అనుభవాల సహాయంతో అవగాహన కల్పిస్తాం. మూఢనమ్మకాల నిర్మూలనకు సంబంధించిన ఫ్లెక్సీలను తయారు చేసి పలు చోట్ల ఏర్పాటు చేస్తాం. 'జాడ్యాలను పెంచేవి మూఢనమ్మకాలు' అనే ప్రగాఢ విశ్వాసాన్ని సమాజంలో తీసుకువస్తాం. ప్రభుత్వ సహాయాన్ని కోరతాం. పాఠ్య పుస్తకాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన దిశగా పాఠ్యాంశాలు ఉండేలా చూస్తాం.

 

ఆ) భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషిని వివరించండి.
జ: భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం విశేషమైన కృషి చేశారు. సభల్లో ఉపన్యసించి ప్రజలను చైతన్యపరిచారు. ఆయన 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించారు. ఆది హిందూ యువతీ యువకులు సవర్ణ యువతీ యువకులతో సమంగా రాణిస్తారని నిరూపించారు.
1925లో న్యాయమూర్తి రాయ్ బాల ముకుంద్ అధ్యక్షత వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలోని ఆదిహిందువుల ప్రతినిధులంతా భాగ్యరెడ్డి వర్మను తమ మార్గదర్శకుడిగా ఎన్నుకున్నారు. ఆయన నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగొని, ఆదిహిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వల్ల ఆది హిందూ సమాజం జాగరూకమైంది. ఆది హిందువులు సొంత కాళ్ల మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించేలా చేశారు.

   భాగ్యరెడ్డివర్మ కృషి ఫలితంగా ప్రభుత్వం ఎన్నో పాఠశాలలను నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించారు. అణగారిన వర్గాలను మేల్కొల్పేందుకు 3,348 ఉపన్యాసాలు ఇచ్చారు.

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ) భాగ్యరెడ్డివర్మ గురించి తెలుసుకున్నారు కదా! ఇలా సమాజం కోసం పాటుపడినవారిలో ఎవరి గురించైనా 'అభినందన' వ్యాసం రాయండి.
జ: 

అభినందన అక్షర సుమాంజలి

   కులం పేరుతో తరతరాలుగా, అన్ని రకాలుగా అణిచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషిచేసిన మహనీయుడు - మహాత్మ జ్యోతిరావు ఫూలే.
సంవత్సరం వయసు రాకుండానే తల్లి తనువు చాలించినా చెదరని మనసు ఉన్నవాడు. కులవివక్షపై పోరాడిన యోధుడు. ఎంతోమంది జీవితాలను మెరుగుపరిచిన మహనీయుడు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించి మొదటగా తన భార్య (సావిత్రి)ను పాఠశాలకు పంపిన గొప్ప సంఘసంస్కర్త.

   బాల్యవివాహాలను జరగకుండా చూసిన భాగ్యవంతుడు. స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. తన ఇంటి వద్ద స్నానాల తొట్టి దగ్గర అంటరానివారికి స్నానాలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చాడు. రైతులు, కార్మికులను సంఘటితం చేసేందుకు కృషి చేశాడు.
   దుర్మార్గమైన కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలన కావాలని కోరుకున్న గొప్ప కార్యశీలి.
   మద్యమనే మహమ్మారిని తరిమేందుకు ఫూలే చేసిన ప్రయత్నం సర్వదా హర్షణీయం.
   సమాజం కోసం తన జీవితాన్ని అర్పించిన సమున్నత వ్యక్తిత్వం ఉన్న మహనీయుడు జ్యోతిరావు ఫూలే. ఆయన చేసిన ప్రయత్న ఫలాలు ఫలించిన ఈవేళ తను చేసిన కృషిని మనందరం ముందుకు తీసుకుపోదాం.


రచయిత: జి. అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌