• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భాగ్యోదయం

భాషాంశాలు

పదజాలం

1. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) అండ = ఆసరా, తోడు
ఆ) ఉన్నతి = వికాసం, అభివృద్ధి, ప్రగతి
ఇ) స్వేచ్ఛ = అడ్డంకి లేకుండటం, తేలికగా
ఈ) వికాసం = ఫుల్లం, ఏపు, అతిశయం

 

2. కింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి.
అ) ఏకతాటిపై    -    తెలంగాణ ప్రజలంతా ఏకతాటిపై నడిచి రాష్ట్రాన్ని సాధించారు.
ఆ) మచ్చుతునక   -     మా ఊరిలోని గడీ రాణి శంకరమ్మ పాలనకు మచ్చుతునక
ఇ) మహమ్మారి    -   అంటరానితనం అనే మహమ్మారిని అందరూ కలిసి తరిమివేయాలి.
ఈ) నిరంతరం     -  నిరంతరం సాధన చేస్తే సాధించలేనిది ఏదీలేదు.

 

3. కింది పదాలను/ పదబంధాలను వివరించి రాయండి.
అ) అంకితం కావడం = పని పూర్తి అయ్యేంత వరకు వదలకుండా దానినే అంటిపెట్టుకుని ఉండటం
ఆ) నైతిక మద్దతు = మాట పరంగా, ఒకరి పక్షంగా అండగా ఉండటం
ఇ) చిత్తశుద్ధి = మనసులో కల్మషం లేకుండా ప్రవర్తించడం
ఈ) సాంఘిక దురాచారాలు = సమాజం మెచ్చని చెడు ఆచారాలు
ఉ) సొంత కాళ్లపై నిలబడటం = ఎవరిపైనా ఆధారపడకుండా తానే సొంతంగా పనిచేసుకుని బతకడం

వ్యాకరణాంశాలు

కింది వాక్యాలను పరిశీలించండి.
I. ప్రత్యక్ష కథనం
   అ) ''అక్కా! ఆ చెరువు చూడు"
   ఆ) ''నేను రాన్రా తమ్ముడు"
   ఇ) ''పిల్లలూ రేపు బీర్‌పూరు జాతరకు వెళుతున్నాను"
   ఈ) ''మేమూ వస్తాం సర్"

పై వాక్యాలను పరిశీలిస్తే
   1) వాక్యాల్లో నేను, మేము మొదలైన వారు చెబుతున్నట్లుగా ఉన్నాయి
   2) ఉద్ధరణ చిహ్నాలు ('' ") ఉన్నాయి
   ఇలా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లు ఉంటాయి. కాబట్టి ఇవి ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు.

కింది ఉదాహరణలను పరిశీలించండి.
అ) ''మనుషులంతా పుట్టుకతో సమానం. ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు" అన్నాడు భాగ్యరెడ్డి వర్మ.
ఆ) రుద్రమదేవితో తల్లి నారాంబ ''నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు నువ్వు పట్టమహిషివి. నేను భావి చక్రవర్తిని. మనకు కండ్లు మట్టుకే ఉండాలి కాని కన్నీళ్లు ఉండకూడదు" అంది.
పైన ఉదాహరణలను పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచుకోవాలి.
1) మాటలు/ వాక్యాలను మాట్లాడేవాళ్లు చెప్పినట్లు రాయాలి.
2) మాటలకు/ వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి.
3) ప్రథమ పురుషలో ఉన్న పదాలు (అంటే తమను, తమ, తాను, తాము లాంటి పదాలు) ఉత్తమ పురుషలోకి అంటే నేను, మేముగా మారతాయి.

 

II. పరోక్ష కథనం
కింది వాక్యాలు చదవండి.
   అ) హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు
   ఆ) ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు.
   ఇ) తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు.
   పైన ఉన్న వాక్యాలు చదివారు కదా!
ఇవి సూటిగా వాళ్లే చెబుతున్నట్లు కాకుండా! మరొకరు చెబుతున్నట్లు ఉన్నాయి. ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనం లో ఉన్న వాక్యాలు అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించాల్సిన అవసరంలేదు.

కింది వాక్యాలను చదవండి.
అ) "నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను" అన్నాడు శ్రీనివాస్ (ప్రత్యక్ష కథనం)
ఆ) తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు (పరోక్ష కథనం)
   మొదటి వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఉద్ధరణ చిహ్నాలు పెట్టారు. రెండో వాక్యంలో శ్రీనివాస్ మాటలను మరొకరు చెప్పినట్లు రాశారు. ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసేసి అని అనే పదాన్ని చేర్చి వాక్యం రాశారు. అందుకే మొదటి వాక్యం ప్రత్యక్ష కథనం, రెండో వాక్యం పరోక్ష కథనం. పై ఉదాహరణల పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు కింది నియమాలు గుర్తుంచుకోవాలి.
i. పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలిగించి అని అనే పదాన్ని చేరుస్తారు.
ii. ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా లాంటివి ప్రథమ పురుష పదాలైన తాను, తాము, తన, తమ లుగా మారతాయి.

పాఠంలోని పరోక్ష కథన వాక్యాలను గుర్తించండి. వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి.
అ) తాను చదివిన చదువు వల్ల కులవ్యవస్థ అంటే ఏమిటో దాని నిజ స్వరూపం ఎలాంటిదో అవగతమైంది.
ఆ) ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శకుడిగా ఎన్నుకున్నారు.
ఇ) తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతేనన్న ఎరుకను తన అనుచరుల్లో కలిగేలా చేయగలిగాడు.

 

పై వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మారిస్తే...
అ) "నేను చదివిన చదువు వల్ల కులవ్యవస్థ అంటే ఏమిటి? దాని నిజ స్వరూపం ఎలాంటిది" అవగతమైంది.
ఆ) ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను 'మార్గదర్శకుడు' గా ఎన్నుకున్నారు.
ఇ) "మా దుస్థితికి కారణం మా అజ్ఞానం, ఉదాసీనత" అన్న ఎరుకను తన అనుచరుల్లో కలిగేలా చేయగలిగాడు.

 


రచయిత: జి. అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌