• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భాగ్యోదయం

ప్రాజెక్టు పని

* బడుగు వర్గాల కోసం కృషి చేసిన జ్యోతిబా ఫూలే, అంబేద్కర్, సావిత్రీబాయీ ఫూలే జీవితాల్లోని ఏదైనా ముఖ్యమైన ఘట్టాన్ని మీ మాటల్లో రాసి తరగతిలో చదివి వినిపించండి.
జ:
జ్యోతిబా ఫూలే
   జ్యోతిబా ఫూలే 1827, ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో జన్మించారు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్లారు. అయినా పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. లాంతరు వెలుగులో చదువుతున్న ఫూలేను గమనించిన ఒక ముస్లిం ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు.
   అమెరికా స్వాతంత్య్ర పోరాటం ఆయనను ప్రభావితం చేసింది. గులాంగిరి, పూణే సత్యశోధక సమాజ నివేదిక, తృతీయరత్న, ఛత్రపతి శివాజీ, రాజ్ భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్, బ్రాహ్మణ్ పంతోజి అనే పుస్తకాలు రాశారు. 13 ఏళ్ల వయసులోనే తొమ్మిదేళ్ల సావిత్రితో వివాహమైంది. పూల వ్యాపారం చేశారు. 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బీసీ మాలి కులానికి చెందిన వ్యక్తి అవడం వల్ల కులవివక్షకు గురయ్యారు. అ క్షణం నుంచి కులవివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నారు. 1869లో పౌరోహిత్యం యొక్క బండారం అనే పుస్తకం రాశారు. బ్రాహ్మణ అమానుష సూత్రాలను శూద్రులు - అతి శూద్రులపై వారి క్రూర వైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించారు.

అంబేద్కర్
   పూర్వం మహారాష్ట్రలో భాగంగా ఉండే (నేడు కర్ణాటకలో ఉండే కొంకణి ప్రాంతంలో) మహర్ కులానికి చెందిన భీమాబాయి, రాంజీమాలోజీ సక్యాల్‌లకు 1891, ఏప్రిల్ 14న అంబేద్కర్ జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు భీంరావ్. భీంరావ్ రెండేళ్ల బాలుడిగా ఉన్నప్పుడే తండ్రి ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకున్నాడు. సంసార భారంతో మహారాష్ట్రలోని సతారాకు వెళ్లారు. ఆరేళ్ల వయసులో తల్లి మరణించింది. తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు. భీంరావ్ ఇంటి పేరు అంబావాడర్. ఒకనాడు ఉపాధ్యాయుడు అంబేద్కర్ అని పేరు మార్చాడు. భీంరావ్ కూలి చేసి సంపాదిస్తూ 1907లో మెట్రిక్యులేషన్ పాసయ్యారు. 1912లో బి.ఎ. పూర్తిచేశారు. 1913లో తండ్రి మరణించాడు. బరోడా మహారాజు తన దగ్గర పది సంవత్సరాలు ఉద్యోగం చేయాలనే షరతుతో అంబేద్కర్‌ను 1913లో కొలంబియా విశ్వవిద్యాలయానికి పంపి ఎం.ఎ. చదివించాడు.
   ఉన్నత విద్యావేత్త, మహామేధావి, ఉత్తమ రాజ్యాంగాన్ని అందించిన రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, బౌద్ధ దార్శనికుడిగా అకళంక దేశ భక్తుడిగా అంబేద్కర్ పేరొందారు. సృయంకృషితో అత్యున్నత పదవులను అధిష్టించిన మహాపురుషుడు.

సావిత్రీబాయి ఫూలే
   మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలో నైగావ్‌లో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులో జ్యోతిబా ఫూలేతో వివాహమైంది. జ్యోతిబా ఫూలే ఒకసారి ఫర్రార్ అనే ఒక మహిళ నడిపే బడికి వెళ్లారు. ఆమె మాటలు విని ఇంటికి వచ్చి రొట్టెలు చేసే తన భార్య సావిత్రిబాయి ఫూలేను పిలిచి అచ్చులు, హల్లులు రాసి దిద్దమన్నారు.అప్పటి నుంచి ఆమె విసుగు పుట్టినా చదువును వదలలేదు. ఆడదానికి చదువు పనికిరాదు అని చెప్పిన తన మామ మాటలను బేఖాతరు చేసింది. జ్యోతిబా ఫూలే పెట్టిన ఆడపిల్లల బడిలో ఉపాధ్యాయురాలిగా చేరింది. ఆమె బడికి వెళుతుంటే కిటికీల వెనక నిలబడి జనం తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.
   ఒకరోజు తిని పడుకోగానే పెరటి గుమ్మంలో చప్పుడు విని లేచేసరికి ఇద్దరు మనుషులు గొడ్డళ్లతో వచ్చారు. సావిత్రి బాయి ఫూలే ఆ దుండగుల మధ్య నిలబడి వారికి హితబోధ చేసింది. వారు మనసు మార్చుకుని వెళ్లారు.

చదవండి - తెలుసుకోండి

తెలంగాణ గర్వించదగిన పరిశోధకుడు
శాసనాల శాస్త్రి - బి.ఎన్.శాస్త్రి
  కొందరు ఏ పని చేసినా దీంట్లో నాకేం లాభం? అని ఆలోచిస్తుంటారు. ఉన్నదంతా దాచుకోవాలనుకునేవారు కొందరైతే, దొరికినంత దోచుకోవాలనుకునేవారు మరికొందరు. కానీ నిస్వార్థంగా, నిజాయితీగా ఉన్న సంపదను, జ్ఞాన సంపదను సమాజాభివృద్ధికి సమర్పణ చేసే త్యాగధనులు కొందరే. అలాంటి వారిలో బి.ఎన్.శాస్త్రి ముందు వరుసలో నిలుస్తారు.
  బి.ఎన్.శాస్త్రి పూర్తిపేరు భిన్నూరి నరసింహ శాస్త్రి. పుట్టింది నల్గొండ జిల్లా, ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం). స్వస్థలం వలిగొండ. కవి, రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, చారిత్రక పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. ఎన్ని రంగాల్లో కృషి చేసినా వారి పేరు వినగానే చరిత్ర పరిశోధకుడే కళ్లముందు మెదులుతాడు.ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ల ఊరి గుడి దగ్గర చెండాట ఆడుతున్నారు. చెండు కోనేరులో పడింది. తేవడానికి వెళ్లారు. అక్కడ రాయిపై ఏవో అక్షరాలు కనిపించాయి. అవేమిటో తెలుసుకోవాలనుకున్నారు. ఆ కోరిక, పట్టుదలే అతడిని తర్వాతి కాలంలో పరిశోధకుడిగా నిలిపాయి.
  తొమ్మిదో తరగతిలోనే సంధ్యారాగం నవల రాశారు. తపోభంగం, పాపాయి శతకం (గేయ కావ్యాలు), రాధ జీవనం, తీరని కోరిక, వాకాటక మహాదేవి లాంటి నవలలు; నిర్భంద విద్య, అపోహ లాంటి నాటకాలు; పులిజాల వెంకట రంగారావు జీవిత చరిత్ర, కాశీఖండం - దాని ప్రాశస్త్యం (సాహిత్య విమర్శ) లాంటి రచనలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆంధ్ర దేశచరిత్ర - సంస్కృతి (3 భాగాలు), భారతదేశ చరిత్ర - సంస్కృతి (21 సంపుటాలు) మరొక ఎత్తు. వీటితోపాటు నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల సర్వస్వాలను, రెడ్డి రాజ్య, బ్రాహ్మణ రాజ్య సర్వస్వాలను ప్రకటించారు. 12 శాసన సంపుటాలను ప్రకటించారు. వేల గ్రామాలు తిరిగి వందలకొద్ది శాసనాలను వెలికి తీసి శాసనాల శాస్త్రిగా పేరుపొందారు. నిష్పక్షపాతంగా ప్రామాణిక చరిత్రను జాతికి అందించారు.
  పట్టుదలకు పర్యాయపదం బి.ఎన్.శాస్త్రి. ఎమ్మే చదివిన తర్వాత శాసనాలపై పరిశోధన చేయాలనుకున్నారు. కానీ, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు తెలుగు చదివినోడికి శాసనాలేందెలుస్తయి అని వెక్కిరించాడు. దీన్ని సవాలుగా తీసుకుని శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అనే విషయంపై పీహెచ్‌డీ చేశారు. దీనికోసం పాళి, ప్రాకృత భాషలు, వివిధ శాసన లిపులను నేర్చుకున్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఆదికవి నన్నయ కాదు నన్నెచోడుడు అని నిరూపించారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని విశ్వవిద్యాలయ ఆచార్యులు పరిశోధన గ్రంథంలో ఆ భాగాన్ని తీసేస్తేనే పీహెచ్‌డీ పట్టానిస్తామన్నారు.కానీ ఆత్మాభిమానియైన శాస్త్రి తాను సప్రమాణంగా నిరూపించిన దాన్ని తీసివేయడానికి అంగీకరించక పీహెచ్‌డీనే వదులుకున్నారు. ఇదీ ఆయన పరిశోధన నిబద్ధత. విష్ణుకుండినుల రాజధాని గుంటూరు ప్రాంతం కాదని నల్లగొండ ప్రాంతం అని తేల్చి చెప్పారు. నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా చరిత్ర రచన కోసం కృషి చేశారు. తన మూసీ పత్రిక ద్వారా ఎన్నో చారిత్రక, సాంస్కృతిక సాహిత్య పరిశోధనలకు తలుపులు తెరిచారు. ఎందరో కవి, రచయితలను ప్రోత్సహించారు. తన పుస్తకాల ద్వారా వచ్చే డబ్బులను బీద విద్యార్థుల సహాయానికి ఉపయోగించారు. పరిశోధనలో, పుస్తకాల ముద్రణలో తన ఆస్తిని పోగొట్టుకుని అప్పులపాలయ్యారు. కాని జాతికి తరగని చారిత్రక సంపదను పంచారు. కుల, మత, వయో భేదాలు పాటించని నిష్కపటి మన శాస్త్రి.
  నిజాం విమోచనోద్యమంలో పాల్గొన్న బి.ఎన్.శాస్త్రికి తెలంగాణ అంటే అమితమైన ప్రేమ. ఎన్నో సంస్థలు, విశ్వవిద్యాలయాలు చేయాల్సిన చారిత్రక పరిశోధనను ఒక్క చేతి మీదుగా చేశారు. అదీ ఎవరినీ యాచించకుండా. ఇతనే ఒక మహా సంస్థ. దేశంలో ఇలాంటి పరిశోధకులు చాలా అరుదు. అందుకే బి.ఎన్.శాస్త్రి తెలంగాణ గర్వించదగిన పరిశోధకుడు.


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌