• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భాగ్యోదయం

రచయిత పరిచయం
* భాగ్యోదయం పాఠ్యభాగ రచయిత కృష్ణస్వామి ముదిరాజ్.
* ఈయన 1893, 25 ఆగస్టున జన్మించారు.
* హైదరాబాదులో సామాజిక, రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి.
* స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, విద్యాసంస్థల స్థాపకుడు, విద్యావేత్త, హైదరాబాదు మేయర్, ఆంధ్రమహాసభ నిర్వాహకుడు, బహుజన సమాజ సంస్కర్త... ఇలా పలు విధాలుగా ప్రజలకు సేవలందించి వారి మన్ననలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
* కృష్ణస్వామి 1957లో హైదరాబాదు నగర మేయర్‌గా ఎన్నికయ్యారు.
* హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రాబోయే ముప్పై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ తయారుచేసిన దార్శనికుడు.
* దక్కన్‌స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించారు.
* సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను రచించారు.
* ఈయన రచనలు హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ప్రామాణిక ఆధారాలుగా ఉపయోగపడతాయి.
* నగరాన్ని ఛాయాచిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించారు.
* తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు.
* 1948లో ఉర్దూలో హైదరాబాద్ - కి తీస్ సాలా సియాసి జదు జిహిద్ పేరుతో హైదరాబాద్‌లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశారు.
* భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితులయ్యారు.
* ఈయన 1967, డిసెంబరు 15న మరణించారు.
 

పాఠం ఉద్దేశం
* స్వయంకృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు.
* అన్ని వర్గాల వారిలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం.
* ప్రస్తుత సమాజంలో స్వార్థం పెరిగిపోతుంది. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ల ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వ్యక్తిత్వం నుంచి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు
* భాగ్యోదయం అనే ఈ పాఠం జీవితచరిత్ర ప్రక్రియకు చెందింది.
* జీవితచరిత్ర అంటే - విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే చరిత్ర.
* భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతమ్ రచించిన భాగ్యరెడ్డివర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ భాగ్యోదయం అనే పాఠం.

ప్రవేశిక
* భాగ్యరెడ్డి వర్మ అనేక బహిరంగ సభలు నిర్వహించారు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి, తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగారు.
* ఆయన చేపట్టిన పనుల్లోకెల్లా మరుపురానివి దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకోవడం.
* ఆడ, మగ పిల్లలను దేవుడికి వదిలివేయడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు.
* తాగుడు మాన్పించి సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోసే మహోన్నత వ్యక్తి భాగ్యరెడ్డి.
* జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేసే వ్యక్తుల్లో ముందు వరసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా!

పాఠ్యభాగం

   1888లో భాగ్యరెడ్డి వర్మ జన్మించారు. చిన్నప్పటి నుంచే జాతి జనుల మంచి కోసం అంకితమయ్యారు. చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని సూచించింది. అంటరాని వర్గాలు అనుభవిస్తున్న అవస్థల నుంచి వారిని గట్టెక్కించడానికి ఆయన అంకితభావంతో పనిచేశారు. తాను చదివిన చదువు వల్ల కులవ్యవస్థ నిజస్వరూపం ఏమిటో ఆయనకు అర్థమైంది. ధర్మ శాస్త్రాలు, చరిత్రను బాగా చదివారు. వీటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకోవడానికి, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్లు అయ్యింది.
   అంటరానితనాన్ని రూపుమాపడానికి సొంతంగా ఆయన ఎంతో శ్రమించారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి కూడా అండ దొరికింది. అణగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది. వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకున్నారు. గొప్ప మనుషులు, సంస్కర్తల్లో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు మొదలుపెట్టారు.
   హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. అణగారిన వర్గాల వికాసానికి ఆయన సమస్తాన్ని అర్పించారు. తన తెలివితేటలను వారికోసమే ఉపయోగించారు. ఏమీ ఆశపడకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను ఆ అంటరాని వర్గాలు తిరుగులేని నాయకుడిగా అంగీకరించాయి. భాగ్యరెడ్డి వర్మలోని చిత్తశుద్ధి, నిజాయతీ, పట్టుదల వారిలో నమ్మకాన్ని కలిగించాయి. అజ్ఞానం, ఉదాసీనతలే తమ దుస్థితికి కారణమని తన అనుచరులకు తెలిసేలా చేయగలిగారు.
   మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ, తక్కువా కాదు అనే సత్యాన్ని ప్రజలందరూ తెలుసునేలా వర్మ చేశారు. లోలోపల జీర్ణించుకుపోయిన మూఢ నమ్మకాలు, అజ్ఞానాన్ని తొలగించడం అంత సులువు కాదు. ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది. ఫలితంగా కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయమయ్యాయి.
   భాగ్యరెడ్డి బహిరంగ సభలు నిర్వహించారు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తమ జాతి జనులను ఏకతాటిపై నడపగలిగారు. ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరపురానివి దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకోవడం. ఆడ, మగ పిల్లలను దేవుడికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించారు. తాగుడు వల్ల కుటుంబాలు ఎలా నష్టపోతాయో కులపెద్దలకు చెప్పి వారిని మాన్పించగలిగారు. నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వల్ల ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుంచి బయటపడేలా చేశారు.
   ప్రతి సంవత్సరం జరిగే మత, సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ.... లాంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరించేవారు. వర్మ దాదాపు 3,348 ఉపన్యాసాలు ఇచ్చారు. అణగారిన వర్గాల్లో చైతన్యం కోసం కృషి చేశారు.
   1925లో న్యాయమూర్తి రాయ్ బాలముకుంద్ అధ్యక్షతన జరిగిన సభలో హైదరాబాదు సంస్థానంలోని ఆది హిందువుల ప్రతినిధులు భాగ్యరెడ్డి వర్మను తమ మార్గదర్శిగా ఎన్నుకున్నారు. ఇది ఏ సామాజిక వర్గపు నాయకుడికైనా గర్వకారణమవుతుంది. ఆయన 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతీ యువకులు సవర్ణ యువతీ యువకులతో సమానంగా రాణిస్తారని నిరూపించారు.
   ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగొని వారిని ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది. ఆయన నిరంతర కార్యాచరణ సభల వల్ల ఆది హిందూ సమాజం జాగరూకమైంది. ఆది హిందువులు సొంత కాళ్ల మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం. ఆయన ఈ విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించేలా చేశారు.
   వర్మ కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా ఆయన ఎంతగానో శ్రమించి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించారు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలి. ఆ చర్యతో హిందూ సమాజాన్ని చీలికలు కాకుండా రక్షించగలిగారు.

విశేషాంశం

దేవదాసి: ఆలయాల్లో నృత్యం చేస్తూ ఆలయ సేవకే అంకితమైన వారిని దేవదాసీలుగా పిలిచేవారు. ఈ దేవదాసి వ్యవస్థ చాళుక్య కాలం నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. కాలక్రమంలో దేవదాసీలు చిన్నచూపునకు గురయ్యారు. అనేక ఉద్యమాలు, నిరసనల కారణంగా ఈ వ్యవస్థ లేకుండాపోయింది.

రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం