• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శతక మధురిమ 

కవుల పరిచయం: 
 

1. యథావాక్కుల అన్నమయ్య
ఇతడు 13వ శతాబ్దానికి చెందినవాడు.
'సర్వేశ్వర శతకం' రాశాడు.
ఇతడి శైలి ధారాళమైంది.
'సర్వేశ్వర శతకం' శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం పొందింది.
 

2. ధూర్జటి
ఈ కవి 16వ శతాబ్దానికి చెందినవాడు.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరు.
శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే గ్రంథం రాశాడు.
శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రచించాడు.
కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా ''రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయం" అని చెప్పిన ధీశాలి.
ఇతడు 1520 - 1560 మధ్య కాలానికి చెందినవాడు.
 

3. ఎలకూచి బాలసరస్వతి
17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి.
మహబూబ్‌నగర్ జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవ రాయల ఆస్థాన కవి.
తెలుగులో తొలిత్య్రర్థి కావ్యం రాఘవ యాదవ పాండవీయంను రాశాడు. మల్ల భూపాలీయం కూడా ఆయన రచనే.
భర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతి రాశాడు. దీన్ని తెలుగులో అనువదించిన తొలికవి ఎలకూచి.
ఈయన రచన పాండిత్య స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది.
 

4. కంచర్ల గోపన్న
ఇతడు 17వ శతాబ్దానికి చెందినవాడు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవాడు.
రామదాసుగా పేరు పొందాడు.
భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించాడు.
రాముడిపై 'దాశరథి శతకం', కీర్తనలు రాశాడు.
ఇతడి కవిత్వంలో అందమైన శబ్దాలంకారాలు జాలువారుతాయి.
 

5. కాకుత్థ్సం శేషప్ప కవి
18వ శతాబ్దానికి చెందిన కవి.
కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి.
నరసింహ శతకం, నృకేసరి శతకం రాశాడు.
ఇతడి రచనల్లో భక్తి తత్పరతతోపాటు తాత్త్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తుంది.
తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు.
 

6. గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహశర్మ
1934 - 2011 మధ్య జీవించిన కవి.
మెదక్ జిల్లా పోతారెడ్డి పేట గ్రామంలో జన్మించాడు.
కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరస్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానము అనే రచనలు చేశారు.
300 లకు పైగా అష్టావధానాలు చేసి అవధాన శశాంక, ఆశుకవితా కేసరి అనే బిరుదులు పొందాడు.
హిందోళరాగంలో ఇతడి పద్య పఠనా విన్యాసం ప్రత్యేకమైంది.
విశ్వనాథేశ్వర శతకం రాశాడు.
 

7. నంబి శ్రీధరరావు
1934 - 2000 మధ్య కాలానికి చెందిన కవి.
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ (వేముగల్లు) నివాసి.
శ్రీమన్నింబాల మహాత్మ్యము, శ్రీమన్నింబగిరి నరసింహ శతకం, శ్రీలొంకరామేశ్వర శతకం రాశాడు.
ఇతడి బిరుదు - కవిరాజు.
 

8. గడిగె భీమకవి
1920 జనవరి 14న రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, నాగరకుంట గ్రామంలో జన్మించాడు.
వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్య రచనలో నైపుణ్యం అబ్బడం విశేషం.
ఇతడు వేణుగోపాల శతకం రాశాడు.
వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళశైలిలో సుబోధకంగా ఉంటాయి.
 

పాఠం ఉద్దేశం
సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు.
సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవుల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి శతక కవులు కృషి చేశారు.
శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
 

పాఠ్యభాగ వివరాలు
శతక మధురిమ అనే ఈ పాఠం శతక ప్రక్రియ కు చెందింది.
శతకాల్లోని పద్యాలను ముక్తకాలు అంటారు.
ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.
శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది.
మకుటం లేని శతకాలు కూడా ఉంటాయి.
ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్ల భూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంకరామేశ్వర, వేణుగోపాల శతకాల పద్యాలు ఉన్నాయి.

ప్రవేశిక
  మానవుల ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? స్నేహితులు ఎలా ఉంటారు? భగవంతుడి గుణగణాలు భక్తులతో ఎలా ఉండాలి? కీర్తిమంతులు ఎవరు? మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి? అని తెలుపుతూ వివిధ శతక కర్తలు రాసిన పద్యాలను పాఠంలో ఇచ్చారు. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోవాలి. ఆచరించే ప్రయత్నం చేయాలి.

1వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
మ. భవదీయార్చన సేయుచోఁ బ్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం
   డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో
   త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో
   గవిధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా
ప్రతిపదార్థం

సర్వేశ్వరా (సర్వ + ఈశ్వరా) =     సర్వేశ్వరా
భవదీయార్చన (భవదీయ + అర్చన) =     నీ పూజ
చేయుచోన్ =    చేసేటప్పుడు
ప్రథమ పుష్పంబు =     మొదటి పువ్వుగా
ఎన్నన్ =     తీసుకోబడింది
సత్యంబు =     సత్యం
రెండో పుష్పంబు =     రెండో పువ్వు
దయాగుణంబు =     దయను కలిగి ఉండటం
అతివిశిష్టంబు =     మిక్కిలి విశిష్టమైన
ఏకనిష్ఠా =     ఏకాగ్రతతో
సమోత్సవ సంపత్తి =     కూడిన ఆనందం
తృతీయ పుష్పం =     మూడో పువ్వు
భాస్వత్ =     ప్రకాశించే
భక్తి సంయుక్తి   =     భక్తి కలిగిన
యోగ విధానంబు =     యోగ విధానం
అవి లేని పూజల =     అంతాయు లేని పూజలు
మదిం =     నీ మనసులో
కైకోవు =     అంగీకరించవు

  
భావం: సర్వేశ్వరా! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండో పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తి యోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నువ్వు అంగీకరించవు కదా!

2వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
శా. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో
   చీరానీకము వీధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
   పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ వోపవో
   చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం

శ్రీకాళహస్తీశ్వరా =     శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా 
రూరన్ =     ప్రతి ఊరిలోని
జనులెల్ల =     ప్రజలంతా
భిక్షమిడరో =     భిక్షం పెట్టరా?
ఉండం =     నివసించడానికి 
గుహల్ + కల్గవో =     గుహలు లేవా?
చీరానీకము =     వస్త్రాల సముదాయం
వీధులన్ =     వీధుల్లో
దొరకదో =    దొరకవా?
శీతామృత (శీత + అమృత) =     చల్లని అమృతం లాంటి
స్వచ్ఛ =     స్వచ్ఛమైన
వాఃపూరం =     జలప్రవాహం
ఏరులన్ =     ఏటిలో
పారదో =     పారడం లేదా?
తపసులన్ =     మునులను
బ్రోవంగన్ =     కాపాడటానికి
నీవు =     నీవు 
ఓపవో =     తట్టుకోవా
చేరన్ =     కలిసేందుకు
ఏల =     ఎందుకు
బోవుదురు =     వెళతారు
జనుల్ =     ప్రజలు
రాజుల =     రాజుల దగ్గరకు


భావం: ఓ శ్రీకాళహస్తీశ్వరా! తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగేందుకు నీరు నదుల్లో ఉంటుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు ఎందుకు రాజులను ఆశ్రయిస్తారో తెలియదు.

3వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
మ. సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
   గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్
   స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
   హర సౌజన్యం గల్గినన్ సురభిమల్లా! నీతి వాచస్పతీ!
ప్రతిపదార్థం

సురభిమల్లా =     సురభిమల్లుడా!
నీతివాచస్పతి =     నీతిలో బృహస్పతి అంతటివాడా!
ఔదలన్ =     తలవంచి
గురుపాదానతి (గురుపాద + ఆనతి) =     గురువుల పాదాలకు నమస్కరించడం
కేలన్ =     చేతులకు
ఈగి =     దానము ఇచ్చే గుణం
చెవులందు =     చెవుల్లో
విన్కి =     చెప్పే విషయాలు వినడం
వక్త్రంబునన్ =     నోటికి
స్థిర =     నిశ్చలమైన
సత్యోక్తి (సత్య + ఉక్తి) =     సత్యవాక్కు
భుజంబులన్ =     భుజబలంతో
విజయమున్ =     విజయాలను 
చిత్తంబునన్ =     మనసులో
సన్మనోహర =     చాలా ఇంపైన
సౌజన్యం =     మంచితనం
కల్గిన =     కలిగి ఉండటం
సిరి =    ధనం
లేకైన (లేక + ఐన) = లేకున్నా
బుధుండు = పండితుడు
విభూషితుండెయయి = శోభితుడై 
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు 


భావం: నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్లా! తల వంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నిండా మంచితనం ఉన్నవాడైన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

2వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
శా. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగుహల్గల్గవో
   చీరానీకము వీధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
   పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీ వోపవో
   చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం

శ్రీకాళహస్తీశ్వరా =     శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా
రూరన్ =     ప్రతి ఊరిలోని 
జనులెల్ల =     ప్రజలంతా 
భిక్షమిడరో =     భిక్షం పెట్టరా?
ఉండం =     నివసించడానికి
గుహల్ + కల్గవో =     గుహలు లేవా?
చీరానీకము =     వస్త్రాల సముదాయం
వీధులన్    =     వీధుల్లో
దొరకదో =     దొరకవా? 
శీతామృత (శీత + అమృత) =     చల్లని అమృతం లాంటి 
స్వచ్ఛ =     స్వచ్ఛమైన
వాఃపూరం =     జలప్రవాహం
ఏరులన్ =     ఏటిలో
పారదో =     పారడం లేదా? 
తపసులన్ =     మునులను
బ్రోవంగన్   =     కాపాడటానికి
నీవు =     నీవు
ఓపవో =     తట్టుకోవా
చేరన్ =     కలిసేందుకు
ఏల =     ఎందుకు
బోవుదురు =     వెళతారు
జనుల్ =     ప్రజలు
రాజుల =     రాజుల దగ్గరకు


భావం: ఓ శ్రీకాళహస్తీశ్వరా! తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగేందుకు నీరు నదుల్లో ఉంటుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు ఎందుకు రాజులను ఆశ్రయిస్తారో తెలియదు.

3వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
మ. సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
   గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్
   స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
   హర సౌజన్యం గల్గినన్ సురభిమల్లా! నీతి వాచస్పతీ!
ప్రతిపదార్థం

సురభిమల్లా =     సురభిమల్లుడా!
నీతివాచస్పతి =     నీతిలో బృహస్పతి అంతటివాడా! 
ఔదలన్ =     తలవంచి
గురుపాదానతి (గురుపాద + ఆనతి) =     గురువుల పాదాలకు నమస్కరించడం
కేలన్ =     చేతులకు
ఈగి =     దానము ఇచ్చే గుణం 
చెవులందు =     చెవుల్లో
విన్కి =     చెప్పే విషయాలు వినడం
వక్త్రంబునన్ =     నోటికి
స్థిర =     నిశ్చలమైన
సత్యోక్తి (సత్య + ఉక్తి) =     సత్యవాక్కు
భుజంబులన్ =     భుజబలంతో 
విజయమున్ =     విజయాలను
చిత్తంబునన్ =    మనసులో
సన్మనోహర =     చాలా ఇంపైన
సౌజన్యం =     మంచితనం
కల్గిన =     కలిగి ఉండటం
సిరి =     ధనం 
లేకైన (లేక + ఐన) =     లేకున్నా
బుధుండు =     పండితుడు
విభూషితుండెయయి =     శోభితుడై 
భాసిల్లున్ =     ప్రకాశిస్తాడు


భావం: నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్లా! తల వంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైనవాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నిండా మంచితనం ఉన్నవాడైన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.

4వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
ఉ. భండన భీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణ కో
   దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
   రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
   దాండ దడాండదాండ నినదంబులజాండము నిండ మత్తవే
   దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణా పయోనిధీ!!
ప్రతిపదార్థం

దాశరథీ =     దశరథుడి కుమారా ఓ శ్రీరామ
కరుణా పయోనిధీ =     దయను సముద్రమంతగా కలిగినవాడా
భండన =     యుద్ధరంగంలో
భీముడు =     శత్రు భయంకరుడు
ఆర్తజన =    దుఃఖం పొందేవారికి
బాంధవుడు =     బంధువు
ఉజ్జ్వల =     కాంతిమంతమైన 
బాణతూణ =     బాణాలు, అమ్ములపొది 
కోదండ కళా =     విలువిద్యలో
ప్రచండ =     ప్రచండమైన
భుజతాండవ =     భుజాల గొప్పదనంతో
రామమూర్తికిన్ =     రాముడికి 
రెండో సాటి దైవమిక =     సాటియైన దేవుడు ఇక
లేడనుచున్ =     లేడు అని చెబుతూ
గడగట్టి =     గట్టిగా 
భేరికాదాండ =     ఢంకాతో 
దడాండదాండ =     డాండాం అనే శబ్దాలు
నినదంబుల =     నినాదాలు
జాండమునిండ =     భూమండలమంతా
మత్తేవేదండము =     మదించిన ఏనుగు
ఎక్కి =     ఎక్కి
చాటెదను =     చెబుతాను


భావం: దశరథుడి కుమారా! దయాసముద్రుడివైన ఓ శ్రీరామా! నీవు యుద్ధరంగంలో శత్రు భయంకరుడివని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువని, కాంతిమంతమైన అమ్ములపొది, బాణాలు, కోదండాలను ఉపయోగించే నేర్పులో ప్రచండమైన భుజతాండవం చూపి, కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగునెక్కి ఢంకా మోగిస్తూ, భూమండలమంతా వినిపించేలా చాటుతాను.

5వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ
   సకల గ్రంథమ్ములు చదివినట్లు
   భిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ
   జేముట్టి దానంబు చేసినట్లు
   మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలు
   నింపుగా బహుమాన మిచ్చినట్లు
   దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలు
   గనకకంబపుగుళ్లు గట్టినట్లు
తేటగీతి: ఒకరి వర్షాశనము ముంచుకున్నఁ జాలు
      బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
      భూషణవికాస! శ్రీధర్మపురి నివాస!
      దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ప్రతిపదార్థం

శ్రీ ధర్మపురి నివాస =     ధర్మపురి క్షేత్రంలో నివసించేవాడా
భూషణవికాస =     అలంకారాలతో శోభిల్లేవాడా! 
దుష్ట సంహార =     దుష్టులను సంహరించేవాడా! 
దురితదూర =     పాపాలను పోగొట్టేవాడా!
నరసింహ =     ఓ నరసింహ స్వామీ! 
హరిదాసులను =     విష్ణు భక్తులను
నిందలాడకుండినన్ =     నిందించకుండా ఉంటే
చాలు =     చాలును
సకల గ్రంథమ్ములు =     అనేక గ్రంథాలు
చదివినట్లు =     చదివినట్లే
భిక్షమియ్యంగా =     భిక్షం ఇచ్చేటప్పుడు
దప్పింపకుండిన =     ఆపకుండా ఉంటే 
చాలు =    చాలును
చేముట్టి =     చేతి పిడికిలి
దానంబు =     దానం
చేసినట్లు =     చేసినట్లే
మించి =     అతియై
సజ్జనులన్ =     మంచివారిని
వంచింపకుండినన్ =     మోసం చేయకుండా ఉంటే
చాలు =     చాలును
ఇంపుగా =     హాయిగా
బహుమానం =     బహుమతి
ఇచ్చినట్లు =     ఇచ్చినట్లే
దేవాగ్రహారముల్ =     దేవతలకు ఉన్న భూములు (దేవాలయానికి ఉండే భూమి)
తీయకుండినన్ =     ఆక్రమించకుండా ఉంటే
చాలు =     చాలును
కనక కంబపుగుళ్లు =     బంగారు ధ్వజస్తంభంతో కూడిన దేవాలయాలు 
కట్టినట్లు =     కట్టినట్లే
ఒకరి =     ఇంకొకరికి
వర్షాశనం =     ఏడాదికి సరిపడే భోజనం
ముంచకున్నన్ =     రాకుండా అడ్డుకోవద్దు
చాలున్ =     చాలు
పేరు కీర్తిగన్ =     పేరుతో కీర్తిగా
సత్రముల్    =     సత్రాలను
పెట్టినట్లు =     కట్టించినట్లే 

  
భావం: అలంకారాలతో శోభిల్లేవాడా! ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను పోగొట్టేవాడా! ఓ నరసింహా! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చే వారిని ఆపకుంటే చాలు, అది దానం చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతిని ఇచ్చినట్లే. దేవతామాన్యాలను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే. ఇంకొకరి వర్షాశనం (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని) రాకుండా చేయకుంటే చాలు. తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

6వ పద్యం (కంఠస్థం చేయాల్సింది)
మ. ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా
   జన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ
   వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
   అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా! విశ్వనాథేశ్వరా!
ప్రతిపదార్థం

విశ్వనాథేశ్వరా =     ప్రపంచానికి ప్రభువైన ఓ ఈశ్వరా
వేడు =     ఎవరు 
త్యాగమయదీక్షంబు =     త్యాగంతో కూడిన దీక్షను
పూని =    పూనుకుని
సర్వంసహ =     భూమి మీద ఉన్న మొత్తం
జన =     జనులందరి
దైన్యస్థితి =     దీన పరిస్థితిని
పోనడంచి = రూపుమాపేలా
సకల = అందరి
ఆశ = దిక్కు
పేశల = సుకుమారమైన 
ఆనంద = ఆనందకర
జీవన సంరంభమున్ = జీవిత సుఖాన్ని 
పెంచి = పంచి 
దేశజననీ = దేశమాత
ప్రాశస్థ్యమున్ = గొప్పదనాన్ని
పంచునో = వివరిస్తారో 
అనిదంపూర్వం = ఇంతకుముందు లేనిదైన
యశస్వి = కీర్తిమంతులుగా
యాతడగునన్నా =     అవుతారు
అవ్వాడగు =     అలాంటివారు
ఘనుడు =     గొప్పవారు


భావం: విశ్వనాథేశ్వరా! త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి, అందరికీసుకుమారమైన ఆనందకర జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పదనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.

7వ పద్యం (కంఠస్థ పద్యం)
శా. పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోదించు మిత్రుండు, సం
   విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు స్వా
   యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు ప్రో
   చ్చితంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలొంకరామేశ్వరా!
ప్రతిపదార్థం

శ్రీలొంకరామేశ్వరా =     శ్రీలొంకలో వెలసిన రామేశ్వరా!
పొత్తంబై =     పుస్తకమై
కడునేర్పుతో =     మిక్కిలి నేర్పుతో
హితమున్ = మంచిని 
ఉద్బోధించున్ = బోధించువాడు
మిత్రుండు = మిత్రుడైనవాడు
సంవిత్తంబై = విలువైన ధనంలా
ఒక కార్యసాధనమునన్ = ఒక కార్య సఫలతతో
వెల్గొందు = వెలుగునిచ్చేవాడు
మిత్రుండు = మిత్రుడు
స్వాయత్తంబైన = తనకు సొంతమైన
కృపాణమై = కత్తిలా
అరులనాహారించు = శత్రునాశనం చేసే 
మిత్రుండు = మిత్రుడు 
ప్రోచ్చిత్తంబై = నిండు మనసు ఉన్నవాడై
తగన్ =     తగినట్లుగా
సుఖమిచ్చు =     సుఖాన్ని ఇచ్చేది
మిత్రుడు =     స్నేహితుడు

 
భావం: ఓ లొంక రామేశ్వరా! మిత్రుడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్యసఫలతలో విలువైన ధనంలా ఉపకరిస్తాడు. శత్రునాశనంలో స్వాధీనమైన కత్తిలా సహాయపడతాడు. నిండు మనసుతో సంతోషాన్ని ఇస్తాడు.

8వ పద్యం (కంఠస్థ పద్యం)
సీ. కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు
   మాయమాటల సొమ్ము దీయువాడు
   కులగర్వమున పేద కొంపలార్చెడివాడు
   లంచంబులకు వెల బెంచువాడు
   చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు
   వరుసవావికి నీళ్ళు వదులువాడు
   ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు
   కన్నవారల గెంటుచున్నవాడు
తే.గీ. పుడమిలో నరరూపుడై పుట్టియున్న
     రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర
     కృపనిధీ ధరనాగరకుంట పౌరి
     వేణుగోపాలకృష్ణ మద్వేల్పు శౌరి
ప్రతిపదార్థం

కృపానిధీ =     దయకు నిధిలాంటివాడా! 
ధరన్ =     ఈ భూమిలో
నాగరకుంట పౌరి =     నాగరకుంట పురంలో కొలువైనవాడా!
వేణుగోపాలకృష్ణ =     వేణుగోపాలకృష్ణా! 
మద్వేల్పు (మత్ + వేల్పు) =     మా ఇలవేల్పు అయిన నా దైవమా
శౌరి =     విష్ణువు
కలనైన =     కలలోనైనా 
సత్యంబు =     సత్యాన్నీ
బలుక =     మాట్లాడటానికి
ఒల్లనివాడు =     ఇష్టపడనివాడు
మాయమాటన్ =     మాయమాటలు చెప్పి
సొమ్ము =     ధనాన్ని
దీయువాడు =     అపహరించేవాడు
కులగర్వమునన్ =     కులగర్వంతో
పేదకొంపలన్ =     పేదల ఇళ్లను
అర్చెడివాడు =     నాశనం చేసేవాడు
లంచంబులకు =     లంచాలకు
వెలన్ =     విలువను
బెంచువాడు =     పెంచేవాడు
చెడుప్రవర్తనలందున్ =     చెడునడవడిలో
జెలగి =     అతిగా
తిరుగువాడు =     తిరిగేవాడు
వరుసవావికిన్ =     సంబంధాలు, బంధుత్వాలకు
నీళ్ళు వదులువాడు =     పాటించనివాడు
ముచ్చటాడుచు =     నవ్వుతూ మాట్లాడుతూ
కొంపముంచ జూచెడివాడు =     నాశనం చేయాలనుకునేవాడు
కన్నవారల =     కనిన అమ్మానాన్నలను
గెంటుచున్నవాడు  =    ఇంటినుంచి గెంటేసేవాడు
రామచంద్ర =     ఓ రామచంద్రా! 
పుడమిలోన్ =     ఈ భూమిపై
నరరూపుడై =     మానవ రూపం గలవాడిగా
పుట్టియున్న =     పుట్టిన
రాక్షసుడుగాక వేరౌన =     రాక్షసుడేకాని వేరే కాదు


భావం: దయకు నిధి లాంటివాడా! నాగరకుంట పురంలో కొలువైన వాడా! ఓ వేణుగోపాలకృష్ణా! నా దైవమా! శౌరీ! కలలో కూడా సత్యాన్ని పలుకనివాడు, మాయ మాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కులగర్వంతో పేదల ఇళ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరసలు పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్లగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడు కానీ వేరొకడు గాడు కదా!

రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం