• facebook
  • twitter
  • whatsapp
  • telegram

లక్ష్యసిద్ధి

ఆలోచించండి - చెప్పండి

ప్రశ్నలు - సమాధానాలు
1. ''సుదీర్ఘకాలం అణిచివేతకు గురైన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది." ఈ మాటలను ఎవరు, ఏ సందర్భంలో అన్నారు?
జ: సుదీర్ఘకాలం అణిచివేతకు గురైన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది అని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఈ మాటలను అన్నారు.
 

2. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి అపురూపమైన క్షణాల్లో మీరెలా స్పందించారు?
జ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014, జూన్ 2న ఏర్పడిన ఆ అపురూపమైన క్షణాలను మాటల్లో వర్ణించలేం. దశబ్దాల పోరాటంలో ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు, అమరులైన వీరులను... ఇలా మరెన్నో విషయాలను గుర్తు చేసుకున్నాం. అద్భుతమైన ఆ క్షణాలు ఉద్వేగభరితంగా నిలిచాయి. ఎంతోమందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాం. ఆ రోజు టీవీల ముందే కూర్చుని పరిణామాలను చూస్తూ పరవశించిపోయాం. తీరం చేరిన నావలా చెప్పలేని ఆనందానుభూతి పొందాం. ఎగిరి గంతులు వేశాం.
 

3. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఏయే ఘట్టాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి?
జ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో వేలమంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఆమరణ నిరాహారదీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో లాఠీదెబ్బలు, తూటాలు; సకల జనుల సమ్మె, తమ పనులను వదిలివేసి కుటుంబాలకు దూరంగా ఉండి పోరాడిన మహనీయుల త్యాగాలు, చందాలు వేసుకుని నిర్వహించిన ధూంధాంలు, ఇలాంటివి మరెన్నో ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.
    చదువు మానేసి భవిష్యత్ కోసం ఆరాటం లేకుండా పోరాటంలో పాల్గొన్న విద్యార్థుల అసామాన్య త్యాగం ఆర్ద్రంగా మార్చింది.

 

4. జై తెలంగాణ నినాదం బలపడటానికి దారితీసిన సంఘటనలేవి? వాటి పర్యవసానాలేవి?
జ: జై తెలంగాణ నినాదం బలపడటానికి అన్యాయానికి గురైన ప్రజల జీవన విధానాలే కారణమయ్యాయి. 1969లో తొలిదశ పోరాటం జరిగింది. అన్ని వనరులున్నా అందని పరిస్థితి తెలంగాణా వాసులకు ఎదురైంది. దాంతో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితిగా పోరాడారు. కానీ, అనుకున్నంత ఫలితం రాలేదు.
     2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పాటైంది. టీఆర్ఎస్ అనేక వ్యూహాలను పన్ని సమర్థంగా నెగ్గుకు వచ్చింది. ఎన్నికల్లో ఎన్నోసార్లు గెలిచి రాజీనామాలు చేసి మళ్లీ గెలిచి తెలంగాణా వాదాన్ని కేంద్రానికి గట్టిగా వినిపించారు. అటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతును ఇచ్చింది. మధ్యలో వెనక్కి తగ్గిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల నిరసనలు, ఆత్మహత్యలు, సమ్మెలు ఉద్యమాన్ని నడిపాయి. వీటి పర్యవసానంగా 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

 

5. ఉద్యమ కాలంలో హైదరాబాద్ వీధులు, మైదానాల ప్రత్యేకతలు ఏమిటి?
జ: ఉద్యమ కాలంలో హైదరాబాద్ కేంద్ర బిందువు. అందరూ ఏ సమావేశాలైనా వెంటనే స్పందించేవారు. వీధుల్లో ఉండి జేఏసీలుగా ఏర్పడి వివిధ కార్యక్రమాలు చేసేవారు. వీధుల్లో జెండాలు ఎగిరేవి. వంటా వార్పులు జరిగేవి. జై తెలంగాణ అనే నినాదాలు మార్మోగేవి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వీధుల్లో తాము అనుకున్న పనులు చేసేవారు. అన్ని మైదానాలు జై తెలంగాణ నినాదంతో మారుమోగేవి. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా మైదానాలు నిలిచాయి. ఉద్బోధలు చేసే ధైర్యశాలులుగా మైదానాలు మారాయి. అందరూ కలిసి బృహత్కర ప్రణాళికలు వేసుకునేందుకు వేదికలయ్యాయి. హైదరాబాద్ వీధులు, మైదానాలు రాష్ట్ర ఏర్పాటులో కీలక నిలయాలు అయ్యాయి.
 

6. ''గన్‌పార్క్ అమరవీరుల స్తూపంతో ముడివడిన సంఘటనలెన్నో"... ఆ సంఘటనలను గురించి చర్చించండి.
జ: తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారు. చాలామంది అమరులయ్యారు. వారందరి గుర్తుగా అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారు. ఎలాంటి సమావేశం జరగబోయినా, ఏ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, జరగరాని సంఘటన జరిగినా గన్‌పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ఒక్కసారి కలిసి చర్చించుకునేవారు. నివాళులు అర్పించి ముందుకు సాగేవారు. బలాన్ని ఇచ్చే ఔషధంలా, నిత్య చైతన్యం నింపే స్ఫూర్తిలా అమరవీరుల స్తూపం నిలిచింది.
 

7. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎలాంటి చర్యలు వెంటనే చేపట్టాలని సంపాదకులు భావిస్తున్నారు? దీన్ని మీరు సమర్థిస్తారా?
జ: తెలంగాణ పునర్నిర్మాణంలో మూడు తరాల అణిచివేతలో మగ్గిన సమాజం కోసం పలు సంక్షేమ పథకాలు
(
ఉదా: రెండు పడక గదుల ఇల్లు), రుణాల మాఫీలు లాంటి చర్యలు చేపట్టాలని సంపాదకులు భావించారు. దాన్ని నేను గట్టిగా సమర్థిస్తాను.
 

8. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి?
జ: నవ తెలంగాణ నిర్మాణంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వడం, రైతు రుణాలు మాఫీ చేయడం, పేదలకు రెండు పడక గదుల ఇల్లు, నీటి పారుదల సౌకర్యం కల్పించడం, పరిపాలనలో సంస్కరణలు ప్రభుత్వ వ్యూహాలుగా ఉన్నాయి. గౌరవమైన బతుకును ప్రజలకు లభించేలా చూస్తూ బుగులు లేని జీవితాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యం.
 

9. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరెలాంటి పాత్ర పోషిస్తారు?
జ: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వం చేపట్టే చెరువుల పునరుద్ధరణ, హరిత హారం లాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ప్రజలను చైతన్య పరుస్తాను. హరితహారంలో భాగంగా మొక్కలను నాటుతాను. చెట్లను ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తాను. శ్రమదానం లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాను. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేలా తోడ్పడతాను.
 

ఇవి చేయండి


I. అవగాహన - ప్రతిస్పందన
1.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా అన్ని వార్తా పత్రికలు సంపాదకీయాలు రాశాయి. వార్తలను ప్రచురించాయి కదా! ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావానికి కృషిచేసిన వారిని అభినందించడానికి మీ పాఠశాలలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలి. మీరైతే కింది అంశాల్లో దేని గురించి మాట్లాడతారు?
అ) రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల పాత్ర
       తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులు తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. 1969లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి వారు తమ రచనల ద్వారా అన్ని విషయాలు ప్రజలందరికీ తెలియజేశారు. కాళోజీ నారాయణరావు తన కవితల ద్వారా ప్రబోధించారు.
       కళాకారులు గోరేటి వెంకన్న, గద్దర్, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, కిశోర్, విమలక్క, దరువు అంజన్న లాంటి కళాకారులు ధూంధాంలతో, ఆట-పాటలతో వేదికలపై ప్రజలను ఉత్తేజపరిచారు. గజ్జె కట్టి ఆడించారు. పాటలు రాసి చైతన్యంగా పాడారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి ప్రజలను చైతన్యపరిచారు. కవులు, కళాకారులు ఉద్యమానికి ఊపిరిపోశారు. తెలంగాణ సాధనలో అమోఘమైన పాత్రను పోషించారు. రాష్ట్ర సాధన కోసమే కవులుగా మారినవారు ఉన్నారు. కళాకారులుగా ఆటపాటలను నేర్చినవారూ ఉన్నారు. వారంతా సమూహాలుగా ఏర్పడి పల్లెపల్లెలో తెలంగాణ నినాదాన్ని వినిపించారు.

 

ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర
      తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమానికి వెన్నెముకగా మారారు. సకల జనుల సమ్మె, చాక్‌డౌన్, పెన్‌డౌన్‌లను చేశారు. సదస్సులను ఏర్పాటు చేశారు. తమ ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజపరిచారు. వంటా వార్పులు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండా జేఏసీలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో పాల్గొని మానవ హారాలు చేపట్టారు. నినాదాలు చేస్తూ సామాన్యులను చైతన్యపరిచారు. విశ్వవిద్యాయాలల్లోని విద్యార్థులు జేఏసీలుగా ఏర్పడి సచివాలయ ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.
బాష్పవాయువులను ఎదుర్కొని, తూటాలకు భయపడక ఎదురు నిలిచారు. బంద్‌లను నిర్వహించారు. బస్సు యాత్రలను ఏర్పాటు చేశారు. నిరాహారదీక్షలు చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. పరీక్షలను వదులుకున్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కరపత్రాల ద్వారా నిజాలను ప్రజలకు తెలియజేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం చేపట్టారు. జీతాలను తీసుకోక అప్పులు చేసి కుటుంబాలను ఆ సమ్మెకాలంలో నడిపారు.

 

ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం 1969 నుంచి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమవంతు కృషిచేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో తెలంగాణ వాదాన్ని వినిపించారు. 2001లో కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. అవసరమైనప్పుడు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పదవులు శాశ్వతం కాదని మంత్రి పదవులను సైతం వదిలిపెట్టారు. ప్రజాప్రతినిధులుగా సర్పంచ్‌ల నుంచి ఎంపీల వరకు అందరూ తమ పదవులను త్యాగం చేశారు.
 

ఈ) సకల జనుల పాత్ర
తెలంగాణా రాష్ట్రం కోసం పది జిల్లాల్లోని ప్రతి ఒక్కరూ (చిన్నపిల్లలు మొదలు వృద్దులు వరకూ) ఉద్యమంలో పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఏర్పడి ఏకమయ్యారు. వివిధ కులసంఘాలవారు, వృత్తులవారు, వ్యవసాయదారులు, వ్యాపారులు స్వచ్ఛందంగా ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నారు. బంద్‌లలో పాల్గొని తమ పనులు, లాభాలను వదులుకున్నారు. తెలంగాణా వాదాన్ని ఇంటింటికి వినిపించారు. వంటావార్పూల్లో తగిన సహాయ సహకారాలు అందించారు. గ్రామాల్లోని కళాకారులు స్వచ్ఛందంగా తమ కళను తెలంగాణ కోసం వినియోగించారు. మహిళలు బతుకమ్మలు ఆడి నిరసనలు తెలిపారు.
 

2. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
     1926, మే 19న గోలకొండ పత్రిక ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న సదుపాయాలు నాడు పత్రికా నిర్వహణకు ఏమాత్రం లేకుండె. సంపాదకుడే అన్ని పనులు నిర్వహించుకునేవాడు. విలేఖరి పని, వ్యాసరచయితల పని, గుమాస్తా పని, ప్రూఫ్‌రీడర్ పని... ఇట్లా దాదాపు అన్ని పనులను ఒక్కరే చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో గోలకొండ పత్రిక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. బంధుమిత్రుల సహకారంతో సురవరం ప్రతాపరెడ్డి పట్టుదలతో పత్రిక నిర్వహించారు. 1939, ఆగస్టు 3వ తేదీ నుంచి గోలకొండ పత్రికకు సంపాదకుడిగా ప్రతాపరెడ్డి నియమితులయ్యారు. గోలకొండ పత్రిక ప్రతాపరెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతపరిచింది. ఆయన రాసిన వ్యాసాలు, విమర్శలు, సంపాదకీయాలు వేయికి పైగా ఉంటాయి. పత్రికలో చర్చావేదికను నిర్వహించి సత్యాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించేవారు. వ్యక్తి స్వాతంత్య్రం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు, పత్రికా స్వాతంత్య్రానికి గడ్డురోజులున్నప్పటికీ నిజాం ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొంటూ గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చింది.
అ) గోలకొండ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది? దీని ప్రధాన సంపాదకుడెవరు?
జ: గోలకొండ పత్రిక 1926, మే 19న ప్రారంభమైంది. దీని ప్రధాన సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి.
ఆ) నాటి పత్రికా సంపాదకులు ఏయే పనులు చేసేవారు?
జ: విలేఖరి పని, వ్యాసరచయితల పని, గుమాస్తా పని, ప్రూఫ్‌రీడర్ పని... ఇలా అన్నిరకాల పనులను నాటి పత్రికా సంపాదకుడు ఒక్కడే చేసేవాడు.
ఇ) ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక ద్వారా ఏం చేశారు?
జ: ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక ద్వారా వ్యాసాలు, విమర్శలు, సంపాదకీయాలు, చర్చావేదికలను నిర్వహించారు.
ఈ) గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో ఎలాంటి చైతన్యం కలిగించింది?
జ: గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని కలిగించింది.
ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జ: తెలంగాణ చైతన్యదీపిక - గోలకొండ పత్రిక
 

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే దశాబ్దాల కాలంపాటు పోరాడిన పోరాటాలకు, అమరుల త్యాగాలకు అందిన ప్రతిఫలం. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు. తెలంగాణ సమాజం చేసిన సమష్టి ప్రకటన ఇది. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణమిది. గాయాల్లో దాగిన జ్ఞాపకాలు, అనుభూతులు గర్వంగా ఉప్పొంగిన మధుర క్షణాలు. తీవ్రమైన నష్టానికి తరగని ఫలితం అందడంతో జాతి అంతా గర్వపడుతోంది. స్వయం సమృద్ధి, ఉపాధి కల్పనలు, కనీస అవసరాలు తీరే సమయం రావడంతో రాష్ట్ర ఏర్పాటును అద్భుతమైన ఘట్టంగా అన్నారు.
 

ఆ) సంపాదకీయాల్లోని భాష, శైలి ఎలా ఉంటుంది?
జ: జరిగిన సంఘటనల ఆధారంగా పూర్వాపరాలను పరామర్శించుకుంటూ సాగే రచన సంపాదకీయం. సంపాదకీయాలు వచ్చేతరాలకు మేలుకొలుపు లాంటివి. వాటిలో ఉండే భాష అందరికీ అర్థమయ్యేలా, సూటిగా, వివరణలతో సాగుతుంది. సంపాదకీయం అనేది ముందుగా విషయాన్ని పరిచయం చేస్తూ, గతంలో జరిగిన విషయాలను తెలియజేస్తూ, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సులభశైలిలో సాగుతుంది. పత్రికకు వన్నె తెచ్చేది సంపాదకీయం కాబట్టి విశ్లేషణాత్మకంగా సాగుతుంది. భాష సరళంగా, స్పష్టంగా ఉంటుంది. వ్యవహారశైలిలో భాష తన ప్రత్యేకతను చాటుతుంది. సృజనాత్మకంగా ఉండేది సంపాదకీయ వ్యాసం కాబట్టి అక్షరాల పొందిక అణుకువతో తొణికిసలాడుతుంది.
 

ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు?
జ: పత్రికకు ప్రాణవాయువు సంపాదకీయం. జరిగిన సంఘటనలను పత్రికలో యథావిధిగా పాఠకులు నేరుగా తెలుసుకుంటారు. కానీ, దాని పూర్వాపరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలను సంపాదకీయాలు తెలియజేస్తాయి. అలాగే జరిగిన విషయాలపై మార్గాలను చూపుతాయి. సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయి. అందరికీ విషయ అవగాహన అయ్యేందుకు సంపాదకీయాలు రాస్తారు. తీసుకున్న అంశంలోని అన్ని విషయాలను పాఠకులకు సూటిగా అర్థమయ్యేలా రాస్తారు. సమాజంలో మార్పు కోసం పత్రికల్లోని సంపాదకీయాలు తోడ్పడతాయి.
 

ఈ) పత్రికల్లోని సంపాదకీయాలకు, సాధారణ వార్తాంశాలకు మధ్య ఉన్న భేదాలేవి?
జ: పత్రికల్లోని సంపాదకీయాలు సూటిగా, స్పష్టంగా, ఆలోచనలను పెంచేవిగా ఉంటాయి. సాధారణ వార్తాంశాలు జరిగిన సంఘటనను మాత్రమే తెలియజేస్తాయి. అవసరమైతే ఆ వార్తాంశంపై వివిధ రకాల అనుమానపు ధోరణులను తెలియజేస్తాయి. అదే సంపాదకీయం అయితే జరిగిన సంఘటనలోని పూర్వాపరాలను, ముందస్తు హెచ్చరికలను, పరిష్కార మార్గాలను తెలియజేస్తుంది. సంపాదకీయంలో సమాజ చైతన్యం కనిపిస్తుంది.
      సాధారణ వార్తల్లో బలమైన ఆధారాలు బలహీనంగా ఉండొచ్చు. కాని సంపాదకీయంలో అలా ఉండదు. ఆధారాలు చూపుతూ సాగుతుంది. అనవసరమైన మాటలు అప్పుడప్పుడూ సాధారణ వార్తల్లో రావచ్చు. సంపాదకీయంలో అలా ఉండదు. ఇందులో ప్రతీది పనికివచ్చే సందేశమై ఉంటుంది.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణులను, దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. దీనిపట్ల మీ అభిప్రాయాన్ని సోదాహరణంగా వివరించండి.
జ: ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణులు, దృక్పథం అర్థం చేసుకోవచ్చు. ఇది వాస్తవమైన విషయం. ప్రజా సమస్యలపై, దేశ పురోగమనంపై అద్భుత సంపాదకీయాలను మన దినపత్రికల్లో చూడవచ్చు. వాటిని చదివితే వాటి ఆలోచనా ధోరణి అర్థమవుతుంది. ఇటీవల ఒక తెలుగు దినపత్రిక (ఈనాడు)లో వచ్చిన 'మానసిక వైద్యానికి మందులేవి' అనే అంశంపై వచ్చిన సంపాదకీయం అందరినీ ఆలోచింపజేసింది.
మానసిక జబ్బుల బారినపడిన వారికి సరైన మార్గం చూపే కౌన్సిలర్లు, మందుల లేమిపై సవివరమైన సంపాదకీయం చూస్తే ఆ పత్రికకున్న ధోరణి అర్థమవుతుంది. దాని ఆధారంగా ప్రభుత్వాల్లో కదలికవచ్చి పరిష్కార మార్గాలు అన్వేషించవచ్చు. ఇటీవల మరో పత్రిక (నమస్తే తెలంగాణ)లో 'ఉద్యమవీణపై పద్యతంత్రులు' శీర్షికతో వచ్చిన సంపాదకీయం తెలంగాణ ఉద్యమంలో పద్యాలు ఎలాంటి ఉత్తేజాన్ని నింపాయో తెలియజేస్తుంది. ఉద్యమానికి అండగా నిలిచిన ఆ పత్రిక అచంచల భావజాలంతో మెదిలిందన్న విషయం అర్థమవుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం 'లక్ష్యసిద్ధి' కూడా అలాంటిదే. ఉద్యమ పక్షపాతిగా ఉండి పోరాడిన జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, వచ్చే కాలంలో తెలంగాణ సమాజం ఏం కోరుతుందో తెలియజేసింది. తెలంగాణ ఆశయ సాధనను తేటతెల్లం చేస్తూ సాగింది. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పాటుపడే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రసంగాన్ని వివరించింది.

 

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.
అ) ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజికాంశం/సంఘటనల ఆధారంగా సంపాదకీయ వ్యాసం రాయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జ: ర్యాగింగ్ భూతం
      ర్యాగింగ్ భూతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను హడలెత్తిస్తుంది. కోటి ఆశలతో కళాశాలల్లో అడుగుపెట్టే కొత్త విద్యార్థులు ఈ ర్యాగింగ్ భూతానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాప్రాంగణాల్లో మరణ మృదంగాలు మోగుతున్నాయి. ర్యాగింగ్ భూతాన్ని నిర్మూలించే దిశగా విద్యార్థులకు హితబోధ చేసేందుకు ప్రతి కళాశాలలో ఓ మానసిక వైద్యనిపుణుడిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
      రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి శిక్షలను సైతం ఖరారు చేసింది. వేధిస్తూ, అవమానిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 వరకు జరిమానా; చంపడం లేదా ఆత్మహత్యకు ప్రేరేపిస్తే పదేళ్ల జైలు శిక్ష లేదా రూ.50,000 జరిమానా; కొట్టడం లేదా బలవంతం చేయడం లేదా హెచ్చరించడం చేస్తే ఏడాదిపాటు జైలుశిక్ష లేదా రూ.2000 వరకు జరిమానా. అక్రమ నిర్బంధం, అడ్డుకోవడం చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా రూ.5000 వరకు జరిమానా. ఇన్ని శిక్షలు ఉన్నప్పటికీ ర్యాగింగ్‌ను మాత్రం నిరోధించలేకపోతున్నారు. ఇటీవల ర్యాగింగ్ వల్ల చనిపోయిన రిషితేశ్వరి వరకు ఎన్నో సంఘటనలు సమాజం చూస్తూనే ఉంది. విద్యార్థుల్లో బిడియాన్ని పోగొట్టి, మైత్రి బంధాన్ని పెనవేసుకునేలా విశ్వవిద్యాలయాలు చూడాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఇప్పటివరకు కాగితాలపైనే ఉన్న ర్యాగింగ్ నిరోధక చర్యలను అమలు చేయడంపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి. ఆయా విద్యాసంస్థలు జూనియర్లకు భరోసాను ఇవ్వాలి. ర్యాగింగ్‌ను మొగ్గలోనే తుంచే ప్రయత్నాలు చేయాలి. సోదరభావాన్ని పెంపొందించాలి. ర్యాగింగ్ భూతాన్ని తరిమివేయాలి.

 


రచయిత: జి.అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం