• facebook
  • twitter
  • whatsapp
  • telegram

లక్ష్యసిద్ధి

III. భాషాంశాలు

పదజాలం
1. కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) ముసురుకొను
జ: ఆకాశంలో మేఘాలు ముసురుకొని ఉన్నాయి.
ఆ) ప్రాణం పోయు
జ: సాహితీ సంస్కృతుల వికాసం కోసం కళాకారులు ప్రాణం పోస్తారు.
ఇ) గొంతు వినిపించు
జ:
రాష్ట్ర సమస్యలపై మన పార్లమెంట్ సభ్యులు కేంద్రానికి తమ గొంతు వినిపించారు.
ఈ) యజ్ఞం
జ: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని యజ్ఞంలా నడిపించారు.
 

2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా: తారలు = చుక్కలు, నక్షత్రాలు
ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

అ) జ్ఞాపకం = గుర్తు, యాది
ఉదా: మా తెలుగు మాష్టారు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని యాది చేసుకున్నారు.
ఆ) పోరాటం = యుద్ధం, సంగ్రామం
ఉదా: దేశాల మధ్య స్నేహభావం ఉండాలి కాని యుద్ధం ఉండరాదు.
ఇ) విషాదం = బాధ, దు:ఖం
ఉదా: మహాత్మాగాంధీ చనిపోయినప్పుడు దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ) సంస్కరణ = బాగుచేయడం, చెడును రూపుమాపడం
ఉదా: సొంత ఊరును బాగుచేయడం అందరి బాధ్యత.
 

3. దినపత్రికలకు సంబంధించిన పదజాలం ఆధారంగా భావనా చిత్రాన్ని గీయండి.
భావనాచిత్రం: ఒక అంశానికి చెందిన ప్రధాన విషయాలను వర్గీకరించుకుని దానికి సంబంధించిన ఉపభావనలను/కీలకమైన వాటిని పొందుపరుస్తూ గీసే చిత్రాన్ని 'భావనాచిత్రం' అంటారు.


 

వ్యాకరణాంశాలు


1. కింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.
అ) ''జనానికి తక్షణం కావాల్సింది కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర" అని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించాయి.
జ: జనానికి తక్షణం కావాల్సింది కడుపునిండా తిండి, కంటి నిండా నిద్రయని ఎన్నికల ప్రణాళికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించాయి.
ఆ) ''సుదీర్ఘకాలం అణిచివేతకు గురైన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది" అని జవహర్ లాల్‌నెహ్రూ అన్నారు.
జ: సుదీర్ఘకాలం అణిచివేతకు గురైన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు.
 

2. కింది పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
అ) పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించారు.
జ: ప్రత్యక్ష కథనం: ''పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం" అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
3. సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు.
జ: ''సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి" అని మేధావులు నిర్ణయించారు.
ఇ) తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టీవీ ఛానెల్లో ప్రసారం చేశారు.
జ: ''తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి" అని టీవీ ఛానెల్లో ప్రసారం చేశారు.
 

II. 1. కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలను రాయండి.
అ) ప్రపంచమంతా: ప్రపంచము + అంతా  ప్రపంచమంతా (ఉత్వసంధి)
సంధి సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం.
ఆ) అత్యద్భుతం: అతి + అద్భుతం  అత్యద్భుతం (యణాదేశ సంధి)
సూత్రం: ఇ, ఉ, ఋలకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఇ) సచివాలయం: సచివ + ఆలయం  సచివాలయం (సవర్ణదీర్ఘ సంధి)
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

2. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
అ) బృహత్కార్యం
విగ్రహవాక్యం : బృహత్తు అయిన కార్యం
సమాసం : విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 

ఆ) శక్తియుక్తులు
విగ్రహ వాక్యం : శక్తియును, యుక్తియును
సమాసం : ద్వంద్వ సమాసం
 

ఇ) సంక్షేమ పథకాలు
విగ్రహ వాక్యం : సంక్షేమం కొరకు పథకాలు
సమాసం : చతుర్థీ తత్పురుష సమాసం
 

అతిశయోక్తి అలంకారం
ఉదా: హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
      హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కానీ, అవి నిజంగా ఆకాశాన్ని తాకవు. వాటిని ఎక్కువ చేసి చెప్పడం వల్ల ''ఆకాశాన్ని తాకుతున్నాయి" అని అంటున్నాం.

అతిశయోక్తి అలంకారం
ఏదైనా ఒక వస్తువును/విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం.
కింది లక్ష్యాలను పరిశీలిచండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీతాదేవి, అశోకవనంలో హనుమంతుడి విరాడ్రూపదర్శన సందర్భంలోనిది)
అ) కం. చుక్కలు తలపూవులుగా
     అక్కజముగ మేను పెంచి యంబరవీధిన్
     వెక్కసమై చూపట్టిన
     అక్కోమలి మదము నొందె ఆత్మస్థితిలోన్ (మొల్ల రామాయణం)

* పై పద్యంలో హనుమంతుడు తన శరీరాన్ని ఆకాశ వీధి అంతా పెంచేసరికి ఆకాశంలోని చుక్కలు తలపూవులుగా కనిపించాయి. హనుమంతుడు అంత ఎత్తుకు పెరిగాడు అని చెప్పడానికి చుక్కలే తలపూవులుగా మారాయనే విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పారు. కాబట్టిపై పద్యంలో అతిశయోక్తి అలంకారం ఉంది.

ఆ) మా ఊర్లో సముద్రమంత చెరువు ఉంది.
జ: పై వాక్యాన్ని పరిశీలిస్తే ఊరిలో ఉన్న చెరువును సముద్రమంతగా ఉంది అని ఎక్కువ చేసి చెప్పారు కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం.
ఇ) అభిరామ్ తాటిచెట్టంత పొడవు ఉన్నాడు.
జ: పై వాక్యంలో అభిరామ్ చాలా పొడవు ఉన్నాడు అని చెప్పడానికి బదులు ఎక్కువ చేసి 'తాటిచెట్టంత పొడవు'గా ఉన్నాడని చెప్పారు. కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం.
 

స్వభావోక్తి అలంకారం
      శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘన హుంకారంతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ ''గౌరవించదగిన, పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా" అని సోన్‌దేవుని మందలించాడు.
      పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హూంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడటం కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమే. దీన్ని స్వభావోక్తి అలంకారం అంటారు.

స్వభావోక్తి అలంకారం: విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం అంటారు.
    ''జింకలు బిత్తరచూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి"
     పై వాక్యాన్ని చూస్తే జింకలు ఉండే విధానాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పారు. బిత్తరచూపులు చూడటం, చెవులు నిగిడ్చటం, గెంతడం అనేవి జింకల స్వభావం. అందువల్ల ఈ వాక్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.

 


రచయిత: జి.అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం