• facebook
  • twitter
  • whatsapp
  • telegram

లక్ష్యసిద్ధి

* ఈ పాఠం పత్రికలో వచ్చిన సంపాదకీయం.
* 2014, జూన్ 2న తెలంగాణలోని వివిధ దినపత్రికల్లో వచ్చిన సంపాదకీయాల శీర్షికలు కింది విధంగా ఉన్నాయి.
   ఈనాడు - ఎన్నేళ్లో వేచిన ఉదయం
   ఆంధ్రజ్యోతి - పొద్దుపొడుపు
   విశాలాంధ్ర - తెలంగాణకు నవ వసంతం
   ప్రజాశక్తి - స్వాగతాంజలి
   నమస్తే తెలంగాణ - లక్ష్యసిద్ధి
   సాక్షి - నవ తెలంగాణ
 

పాఠం ఉద్దేశం

   దినపత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ, ఆసక్తిని పెంపొందింపజేయాలి. సాధారణ వార్తలు, సంపాదకీయాలకు మధ్య ఉండే తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించిందే ఈ పాఠం.

పాఠ్యభాగ వివరాలు
* ఈ పాఠం సంపాదకీయం ప్రక్రియకు చెందింది.
* సంపాదకీయ వ్యాసం అంటే సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన.
సంపాదకీయ లక్షణం: తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింపజేయగలగడం.
* సంపాదకీయ వ్యాసాలు తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కో సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింపజేసుకోవచ్చు.
* తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2014, జూన్ 2న ఒక తెలుగు దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది.

ప్రవేశిక
* సంపాదకీయం సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను లేదా దాని పరిణామాలను లేదా దాని అద్భుత విశేషాలను వివరిస్తుంది.
* జాతిపిత మహాత్మాగాంధీ మృతి చెందినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియజేస్తూ గాంధీ గొప్పదనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి.
* మన భారతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీయాలు వెలువరించాయి.
* 1969 నుంచి 2014, జూన్ 2 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
* 'తెలంగాణ' అవతరణ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించి ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అలాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం.
* ఈ వ్యాసం తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మైలురాళ్లను మనకు పరిచయం చేస్తుంది.

పాఠ్య భాగం
   ''అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు, భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది. ఓ క్షణం చరిత్రలో అరుదుగా వస్తుంది. అప్పుడు మనం పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగుపెడతాం. ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘకాలం అణిచివేతకు గురైన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది." దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణాకు అక్షరాలా సరిపోతాయి. జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్య్ర ప్రకటన చేసింది. అది తెలంగాణ సమాజం చేసిన సమష్టి ప్రకటన. అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచ వన్నెల సూర్యులు పలకరించినట్లు... ఇంద్రధనస్సు విరగబూసినట్లు, తారలు దిగివచ్చి తెలంగాణ సంబురాల్లో తారాడినట్లు తెలంగాణ అంతా ఉద్వేగభరితం. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణమది. జాతి చరిత్రలో అరుదైన క్షణం... అత్యద్భుతమైన క్షణం!
   తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలాయి. 1969 ఉద్యమం మలిదశ పోరాటం, పతాకస్థాయి ఘట్టాలు... లాఠీలు, తూటాలు... గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, అనుభూతులు వారివి. ఆనందోత్సాహాలతోపాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకుని హృదయాలను ఆర్ధ్రంగా మార్చాయి.
తెలంగాణలోని ప్రతి అడుగడుగూ ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్రమైన పవిత్ర స్థలమేనాయె! సచివాలయంలో నల్లపోచమ్మను మాయం చేసి 'బెజవాడ దుర్గ'ను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. దీంతో మళ్లా నల్లపోచమ్మ వెలిసింది. ఇప్పుడా గుడిలోనే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూజలు చేశారు. ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు. ఇప్పుడా మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు.
   హైద్రాబాద్ వీధుల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి. ఇప్పుడా వీధుల్లోనే 'జై తెలంగాణ' నినాదాలతో ఉద్యమకారులు రాచఠీవితో తిరుగాడుతున్నారు. ఉస్మానియా క్యాంపస్‌లో ఎన్ని ఉద్రిక్త ఘట్టాలని! క్యాంపస్‌లో విద్యార్థులను లాఠీలతో కొడుతుంటే చూడలేక, దేశ విదేశాల్లోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో! ఉద్యమం ప్రతి మలుపులో తెలంగాణ బిడ్డలు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకుని చర్చించుకునేటోళ్లు. వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీదెబ్బలకు జడువక ముళ్ల తీగలను చేధించుకుని అమరవీరుల స్తూపం దగ్గరకు ఉరకడం చాలా మందికి అనుభవమే! జూన్ 2 ప్రవేశ ఘడియల్లో అనేక మంది అక్కడ చేరి చెమ్మగిల్లిన కనులతో అమరవీరులకు నివాళులు అర్పించారు.
   స్వీయరాష్ట్రం సిద్ధించింది కాబట్టి, ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటు పడాల్సి ఉంది. వలస పాలనలో అణిచివేతకు గురైన తెలంగాణ భాష, సంస్కృతులకు ప్రాణం పోయాలె. ఉత్రృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలె. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. ఇదొక సమష్టి యజ్ఞం. పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను, సంక్షోభాన్ని అనుభవించింది.
సామాజిక జీవనం ఛిద్రమైంది. సామాజిక సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది. ఈ పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు. శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయటపడగలం. జనానికి తక్షణం కావల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. రేపటి గురించి బుగులు లేని జీవితం. ఇవేమీ చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు. కనీస అవసరాలు తీరడం, గౌరవమైన బతుకు ప్రజల ప్రాథమిక హక్కు. కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక, అధికారం చేపట్టగానే ఇచ్చిన తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండటం హర్షణీయం! స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవి. పరాయి పాలనలో నిధుల మళ్లింపు పాలనాపరమైన వివక్ష వల్ల తెలంగాణకు అందలేదు. అందువల్ల మూడు తరాల అణిచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్లా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి. రుణాల మాఫీ, రెండు పడక గదుల ఇల్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైన హామీలు. తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బృహత్కార్యం. కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లు పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే. తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్తకాదు. అపారమైన వనరులున్నాయి. ప్రజలు కష్టించే తత్వంగలవారు, బుద్ధిబలానికి కొదవలేదు. ఇందుకు తోడు మూడు తరాలపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది. అందువల్ల తెలంగాణ భవిష్యత్‌పై సందేహానికి తావులేదు. స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.
(తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2014, జూన్ 2న 'నమస్తే తెలంగాణ' దినపత్రికలో ప్రచురించిన సంపాదకీయ వ్యాసం)

రచయిత: జి.అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం