• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవ‌న భాష్యం

ఆలోచించండి - చెప్పండి

ప్రశ్నలు - సమాధానాలు

1. 'మనసుకు మబ్బు ముసరడం' అనడంలో ఆంతర్యమేమిటి?
జ: మనసుకు మబ్బు ముసరడం అనడంలో కవి ఆంతర్యం ఏమిటంటే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనేవి అందమైన ఆకాశంలోనికి మబ్బులు వచ్చి చేరినట్లుగా మనసులోకి వచ్చి చేరతాయి. అలాంటి సమయంలో నిరుత్సాహ పడకుండా ఓపికతో ఉంటే అవి తొలగిపోతాయి. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. మనసుకు మబ్బు ముసిరితే ఆ మబ్బు తాత్కాలికమైనదేనని గుర్తుంచుకోవాలి.

 

2. 'జంకని అడుగులు కదిలితే' అది దారవుతుంది అనడాన్ని మీరెలా సమర్ధిస్తారు?
జ: మనిషికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వాటికి అదిరిపోక ముందుకు అడుగులు వేస్తూ వెళితే విజయం లభిస్తుంది. భయపడి పారిపోతే గుర్తింపురాదు. కష్టాలు, అడ్డంకులను ఎదుర్కొని విజయాన్ని సాధిస్తే ఆ దారిలో అందరూ పయనమవుతారు. అందరికీ స్ఫూర్తిగా నిలవవచ్చు. అందరూ మన మార్గాన్ని అనుసరిస్తారు. లక్ష్యాన్ని సాధించేవరకు మన అడుగులు జంకక అదరక బెదరక వేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అది అందరికీ దారి అవుతుంది. అందుకే జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. అనేదాన్ని సమర్థిస్తాను.

 

3. మనిషీ మృగం ఒకటేనా? కాదా? చర్చించండి.
జ: మనిషీ మృగం ఒకటి కాదు. ఎందుకంటే మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. మృగానికి అలాంటి గుణం ఉండదు. మనిషి ఇతర మనుషులతో పరస్పర సహకారంతో సాంఘిక జీవనం చేస్తాడు. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటాడు. మృగం లాంటి ప్రతికూల గుణాలు మనిషిలో ఉండవు. తన చుట్టూ ఉన్న మనషులను ఆత్మీయతో అనుసరిస్తాడు. కలిసిమెలిసి జీవిస్తాడు. కానీ కొన్నిసార్లు మృగాల తీరుగా ప్రవర్తిస్తాడు.

 

4. హిమగిరి శిరసు మాడటం అంటే మీకేం అర్థమైంది?
జ: హిమాలయ పర్వతాలు మంచుతో నిండి ఉంటాయి. ఆ మంచు శిఖరాలు ఎండ వేడికి కరిగి నదిగా ప్రవహిస్తాయి. అలాగే ఎంత గొప్ప మనిషైనా, ఎంతటి స్థితి గలవాడైనా అతడిలోని గర్వం ఎప్పుడో ఒకసారి హిమగిరి శిఖరంలోని మంచులా కరిగిపోవాల్సిందే. గర్వం మంచిది కాదు. హిమగిరి శిరసులా తలెత్తే స్థాయిలో గర్వం ఆపాదమస్తకం నిండి ఉంటుంది. హిమగిరి శిరసుకు ఎండవేడి ఎక్కువైతే కరిగిపోతుంది. గర్వంతో కూడిన వ్యక్తికి కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదురైతే అతడిలోని గర్వం మంచులోని నీరులా నీరుగారిపోతుంది.

 

5. 'చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది' అనడాన్ని మీరు సమర్థిస్తారా? ఎలా?
జ: చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అనడాన్ని నేను సమర్థిస్తాను. అదెలా అంటే మనిషి ప్రపంచానికి తెలిసేలా ఖ్యాతి పొందినా; ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందినా నిజమైన విలువ, గుర్తింపు రాదు. మానవాళికి పనికివచ్చే గొప్ప పనులు చేయాలి. అలా చేసినప్పుడు అభిమానాలు పెరుగుతాయి. ప్రతి పనిలో త్యాగ భావన ఉండాలి. త్యాగం వల్ల కీర్తి వస్తుంది. చెదిరిపోని ఆ త్యాగం మిగిలితే గొప్ప పేరు వస్తుంది. ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. చెరిగిపోని త్యాగాన్ని నిలబెట్టుకునేలా ప్రయత్నించాలి.

 

ఇవి చేయండి

I. అవగాహన - ప్రతిస్పందన
1. కింది అంశాన్ని గురించి చర్చించండి.
అ) 'జీవన భాష్యం' అనే శీర్షిక ఈ గజల్‌కు ఏమేరకు సరిపోయింది? ఎందుకో చెప్పండి?
జ: జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజల్‌కు సరిపోయింది. జీవనానికి సంబంధించిన పలుకులు అనే అర్థంలో ఈ గజల్ కొనసాగింది. ఎలాంటి జీవనం మనిషికి ఉండాలి. ఎలాంటి స్ఫూర్తి ఉండాలి అనే భావనలు మనలో నింపేలా ఈ గజల్ ఉంది. జీవన భాష్యంగా ఎలాంటి బతుకుకు విలువ వస్తుందో, ఎలాంటి గుణాలు ఉండాలో తెలిసింది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని.... వాటికి భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడవాలని సినారె తెలియజేశారు. స్ఫూర్తిని కలిగి ఉండాలని, మనుషులు సానుకూలంగా ఆనందంతో జీవించాలని, అలాంటి మనుషులు కలిస్తే ఒక ఊరు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎంతమనిషికైనా గర్వం నీరు కారిపోవాల్సిందేనని, చెరగని త్యాగం చేస్తే ఆ మనిషి పేరు చరిత్రలో నిలుస్తుందని ఇలా గొప్ప విషయాలు జీవితానికి సంబంధించిన మాటలను చెప్పారు కాబట్టి జీవన భాష్యం అనే పేరు సరిపోయింది.

 

2. పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. అందులోని కీలక అంశాలు రాయండి.


 

3. కింది అపరిచిత గేయ పాదాలను చదవండి.
    భీతిలేక మనిషి ఎచట మనిషి శిరములెత్తి నిలుచునో
    తనివి తీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరుకునో
    అడ్డుగోడ లేని సమసమాజమెచట నుండునో
    హృదయాంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో
    ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము
    లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా!
గేయం చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

 

అ) మనిషి ఎప్పుడు తలెత్తి నిలబడతాడు?
జ: భీతి లేనప్పుడు మనిషి తలెత్తి నిలబడతాడు.
ఆ) జ్ఞానసుధలు ఎలా ఉండాలని గేయంలో ఉంది?
జ: తనివి తీరేలా జ్ఞానసుధలు ఉండాలని గేయంలో ఉంది.
ఇ) సమ సమాజం ఎలా ఉంటుంది?
జ: అడ్డుగోడలు లేనివిధంగా సమసమాజం ఉండాలి.
ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి?
జ: హృదయాల్లో సత్యం ఎల్లవేళలా ఉండటం
ఉ) 'స్వర్గసీమ' అనడంలో అంతరార్థం ఏమిటి?
జ: మంచి గుణాలున్న మనుషులు, అడ్డుగోడలేని సమాజం, సత్యమైన జీవనం...ఇవన్నీ సమాజంలో తులతూగినట్లయితే 'స్వర్గసీమ' తయారవుతోంది అనేది దీనిలోని అంతరార్థం.

 

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గురించి తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర్లు తెలపండి. వాటి గురించి రాయండి.
జ: నాకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియలు.
     * పురాణ ప్రక్రియ
     * వ్యాస ప్రక్రియ
     * కథానిక ప్రక్రియ
     * మినీ కవిత ప్రక్రియ
పురాణ ప్రక్రియ: పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనేవి పురాణ లక్షణాలు. పురాణాలు 18. వీటిలో అనేక విషయాలు అవగతమవుతాయి.
వ్యాస ప్రక్రియ: ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేలా వివరించేది వ్యాసం. సూటిగా స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యేలా ఉండటం వ్యాసం లక్షణం. పానుగంటి లక్ష్మీనరసింహారావు వ్యాసాలు, సామల సదాశివ 'యాది' అనే వ్యాసాలను ఉదాహరణలుగా చెప్పొచ్చు.
కథానిక ప్రక్రియ: కథ కంటే పరిమాణంలో చిన్నగా ఉంటుంది. రెండు సంఘటనల మధ్య సంబంధాలను కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. ఇది వచన ప్రక్రియ. పాకాల యశోదారెడ్డి కథానికలు సుప్రసిద్ధం.
మినీకవిత ప్రక్రియ: ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. ఇది ఆలోచింపజేస్తుంది. భావంలో కుదింపు కనిపిస్తుంది. ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. అలిశెట్టి ప్రభాకర్ 'సిటీలైఫ్' అనే మినీకవితలు ప్రఖ్యాతి పొందాయి.

 

ఆ) 'ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు' అనే వాక్యం ద్వారా విద్యార్థులకు సినారె ఇచ్చే సందేశం ఏమై ఉండొచ్చు?
జ: ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అనే వాక్యం అర్థమేమిటంటే 'ఎడారిలోని ఇసుక కుప్పలను దున్నితే లాభం లేదనుకోవద్దు' అని తెలుస్తుంది. అందరూ అనుకున్నట్లు ఎడారిలోని ఇసుకలో ఏమీచేయలేమని, దాని ద్వారా లాభం పొందలేమని భావిస్తారు. కానీ అలాంటి దిబ్బలోనే ఫలాన్ని పొందవచ్చు అన్న ధైర్యాన్ని కవి ఇచ్చారు. ఆ వాక్యం ద్వారా విద్యార్థులు అర్థం చేసుకునే భావజాలాన్ని కవి అందించారు.
       బీడుపడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని ఏ ప్రయత్నాలు చేయకుండా నిరాశపడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచిపంటలు పండుతాయి.
      విద్యార్థులందరూ తీవ్ర ప్రయత్నాలు చేసి విజయం సాధించక నిరాశ చెందవద్దు. ఘోరమైన కష్టాలకు ఎదురీదాలి. ఎంతటి కష్టాన్నైనా భరించి ఎదుర్కోవాలి. ప్రయత్నంచేస్తే ఫలితం వచ్చి చేరుతుందన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి. అది జరుగుతుందా? నావల్ల కాదు? అనే భావనలను తీసేయాలి. దేనినైనా సాధించవచ్చు అనే దృక్పథం ఉండాలనేది విద్యార్థులకు 'సినారె' ఇచ్చిన సందేశమై ఉంటుంది.

 

ఇ) మంచి పంటలు పండటానికి రైతుచేసే శ్రమ ఎలాంటిదో వివరించండి?
జ: మంచి పంటలు పండటానికి రైతు తన వ్యవసాయ భూమిని దుక్కి దున్ని నీరు పారిస్తాడు. నాణ్యమైన విత్తనాలను విత్తుతాడు. అలా రైతు విత్తనాలు అలికింది మొదలుగా కంటికి రెప్పలా నారును పెంచుతాడు. అనుక్షణం నీరు ఉండేలా చూస్తాడు. పశువుల పెండను పెంటలా పేర్చి కాపాడి దాన్ని పొలంలో ఎరువులా చల్లుతాడు. అవసరమైతే రసాయనిక ఎరువులను తగిన విధంగా వాడతాడు. పురుగులు పంటను తినకుండా తగిన రక్షణ చర్యలు చేపడతాడు. తాను పెట్టిన పంటలో పిచ్చిమొక్కలు నిండకుండా కలుపుతీస్తాడు. పంట చేతికొచ్చే సమయంలో నీరు ఎంతవరకు అవసరమో చూసుకుంటాడు. ఎలాంటి జంతువులు పాడుచేయకుండా రక్షణ చర్యలు చేపడతాడు. పనివాళ్లను ఇంటింటికి తిరిగి కూడగడతాడు. అవసరమైతే ఉపవాసంతోనైనా ఉంటాడు. అతడికి నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. రాత్రివేళలో కాపలాదారుగా వెళతాడు. పంటను నూర్చి పెడతాడు. ధాన్యంగా చేసి తన శ్రమైక సౌందర్యానికి ఆనందపడతాడు. రైతు శ్రమ చెప్పనలవికానిది.

 

ఈ) చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అంటే త్యాగం చేసేవారి, మంచి పనులు చేసేవారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎలాంటి మంచి పనులు చేయాలి?
జ: చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అంటే త్యాగం చేసేవారి, మంచి పనులు చేసేవారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అలా చరిత్రలో పేరు నిలవాలంటే కింది మంచి పనులు చేయాలి.
* ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి.
* కష్టాల్లో ఉన్నవారికి ధనసహాయం చేయాలి.
* అందరి ప్రయోజనార్థం భూదానం చేయాలి.
* అనాథలకు, వృద్ధులకు ఆశ్రమాలు కట్టించాలి.
* కూడు, గూడు, గుడ్డ లేనివారికి ఆపన్న హస్తం అందించాలి.
* చదువుకోవాలనుకునే వారందరికీ ఉన్నత విద్యలు అభ్యసించేలా సహాయం చేయాలి.
* పాఠశాలలను ఏర్పాటుచేసి ఉచిత విద్యను అందించాలి.
* దేవాలయాలు కట్టించాలి.
* పెళ్లిళ్లకు ధన సహాయం అందించాలి.
* నీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేయాలి.
* అందరికి పనిని కల్పించేలా చూడాలి

 

ఉ) 'మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది' అని సినారె ఎందుకు అని ఉంటారు?
జ: మనుషులందరూ కలిసి పరస్పర సహకారంతో జీవించడమే సాంఘిక జీవనం అవుతుంది. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. మనుషులు అంతా కలిసి ఎలాంటి భేషజాలు లేకుండా, కులమత భావనలు రానీయక, ప్రతికూల ఆలోచనలను పరిహరించి ముందుకు కదలాలి. ఏదైనా పదుగురు మనుషులు అనుకుని పనిచేస్తే సత్ఫలితాలు అందుతాయి. కలిసి పనిచేయకపోతే ఎవరికివారే యమునా తీరేగా ఉంటే ఫలితాలు అందవు. సంతోషాలు దరిచేరవు. అందరూ పనిచేసి ఊరును అభివృద్ధి పరచవచ్చు. పనిచేయకుండా అభివృద్ధి కోసం అడుగులు వేయకుండా ఉంటే అది ఊరు కాదు 'కలిసి ఉంటే కలదు సుఖం' అనే ఆలోచన మనుషుల్లో రావాలి. అలా వచ్చినప్పుడు ఒక మంచి ఊరు అవుతుంది. 'సినారె' అని ఉంటారు.
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు. గ్రామంలోని చైతన్యం ఎల్లవేళలా కొనసాగితే దేశం సౌభాగ్యవంతమవుతుందనే భావనతో మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది' అని సినారె అని ఉంటారు.

 

2. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.
ప్ర. జీవన భాష్యం గజల్‌లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జ: గుండె మంచుకు గుబులు పుడితే నీరవుతుంది
      శ్రమకోడ్చి ఫలితమందితే నీ విజయం దారవుతుంది
      కంటిరెప్పలా విత్తును కాపాడితే పైరవుతుంది
      ఆప్యాయతల అనురాగాల పల్లకియే ఊరవుతుంది
      నీటి చుక్కలు ఒదిగి వస్తే ఏరవుతుంది
      గొప్ప పనులతో నిలిస్తే పేరవుతుంది

 

3. ఆచార్య సి.నారాయణరెడ్డి ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు రాయండి.
జ: ఆచార్య సి.నారాయణరెడ్డి ఒకవేళ మా పాఠశాలకు వస్తే వారి నుంచి విషయాలు తెలుసుకునేందుకు కింది ప్రశ్నలు అడుగుతాను.
* గురువుగారికి నమస్కారం, మీకు రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
* మిమ్మల్ని అతిగా ప్రభావితం చేసిన రచయిత ఎవరు?
* మీరు రాసిన రచనల్లో మీకు బాగా నచ్చిన రచన?
* గజల్స్ రాయడానికి ప్రేరణ ఇచ్చినదెవరు?
* మీకు దక్కిన అవార్డులు ఏమిటి?
* మీరు రాసిన సినిమా పాటల్లో బాగా నచ్చిన పాట ఏది?
* జ్ఞానపీఠ్ వచ్చిన సందర్భంలో మీరు పొందిన అనుభూతి చెప్పండి.
* తెలుగు భాషాభివృద్ధికి ఇంకా ఏవిధమైన కృషి జరగాలి?
* భారతీయ భాషల్లో తెలుగు భాషకున్న స్థానం ఎలాంటిది?
* నేటి యువకవులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
* మాండలికాలపై మీ అభిప్రాయం తెలపండి.
* మీకు నచ్చిన కవిత ఏది?
* మేమూ రచయితలం కావాలంటే ఏం చేయాలి?

 


రచయిత: జి. అంజాగౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం