• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవన భాష్యం

ప్రాజెక్టు పని

* డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ఏవైనా రెండు గేయాలు / గజల్‌లను సేకరించి వాటి గురించి మీ అభిప్రాయాన్ని రాయండి.
జ: సి. నారాయణరెడ్డి రాసిన గేయాలు
 

గేయం - 1
      తేట తెలుగు వెలుగులు
      సంధ్య వేళ చల చల్లని గాలి
      వయ్యారాల పైరగాలితో కలిసి మెలిసి
      అల్లన చల్లన మెల్లన వీచీ వీచింది
      అది మేనుకు హాయిని గొలిపింది
      అదేనోయీ! తేట తెలుగు హాయి         ||సంధ్య||


     తియ్యతియ్యని మామిడి తోటలోన
      చల్లచల్లని వెన్నెల జల్లుగ కురిసింది
      ఆకు మాటున పిందె అందె ఊసులో
      ఆమని భళ్లున వెలిగి వెలిసింది
      అది తేట తెలుగు వెలుగు సొగసు       ||సంధ్య||


      ఎచ్చటి నుండి వచ్చి వాలిందో సరిగమ
      పదనిసల పిట్ట అది
      చెట్టుకొమ్మ ఊయల్లో మొదలెట్టె
      కుహూ, కుహూ రాగాల పలుకు
      అది తేట తెలుగు వెలుగుపాట       ||సంధ్య||


      తీరాంధ్రం పొడుగునా - తెలంగాణం
      నిలువునా - రాయలసీమ అడుగడుగునా
      ఒకే మాట ఒకే పాట ఒకే మాట భావమై
      తేనె వాగు పొంగి పొరలింది
      అది తియ్యతియ్యని తెలుగు మాట      ||సంధ్య||


గేయం - 2
       ఈ నల్లని రాళ్లలో
       ఏ కన్నులు దాగెనో
       ఈ బండల మాటున
       ఏ గుండెలు మోగెనో      ||ఈ నల్లని||


       పాపాలకు తాపాలకు
       బహు దూరములో నున్నవి
       మానులవోలె కారడవుల
       మూలలందు పడియున్నవి      ||ఈ నల్లని||


     కదలలేవు మెదలలేవు
       పెదవి విప్పి పలుకలేవు
       ఉలియలికిడి విన్నంతనె
       గలగలమని పొంగిపొరలు      ||ఈ నల్లని||


గజల్స్
   * కాలమేమో బరువు బరువు కంటికేమో నిదుర కరువు
      ఎంత చేదును మింగెనో ఇంత తీయని కోరిక
      ఏరు దాటితె ఎవరు వారే ఏమి లోకం ఓ సినారె!
      ఎంత నటన భరించెనో ఇంత పల్చని జీవిక

* కొడిగట్టని చైతన్యానికే జేకొడుతుందోయ్ లోకం
     బితుకు బితుకుమని వెలుగుతుంటె అది ద్యుతి కాదంటాను
     అడుగు కదల్చక మాటిమాటికీ పిడికిలెత్తితే వ్యర్థమోయ్
     శక్తి విజృంభణలో ఒదిగున్నది రక్తం చేసిన సంతకం
     ఉరిమే వ్యక్తిత్వమే 'సినారే' తిరగబడుతుందిలే
     చేతులు నలుపుతు ఉంటే విప్లవ గీతం పుడుతుందా

 

* శాంతంగా పడి వుంటే శవమనుకుంటారోయ్
     ఆర్తి రెక్క విప్పుతుంది ఆందోళనలోనే
     అనుకుంటే జాగృతి, పడుకుని వుంటే నిద్రాస్థితి
     పోటు నడకతో సోమరి పొద్దుకు చురకలు పెడతా
     కటిక నిజం పలికే హృదయం లొంగదు 'సినారె' ఏ ఒత్తిడికీ
     కవితేం చేస్తుందనుకోకు అది కత్తులనే నరికేస్తుంది.

 

నా అభిప్రాయం:
        సి.నారాయణరెడ్డి గేయాల్లో తేట తెలుగు వెలుగులు కనిపించాయి. తియ్యని భావాలను బయటికి తీశాయి. భాషా ప్రవాహం నాట్యం చేసింది. కనువిప్పు కలిగే పదాలు ఉన్నాయి. గజల్ రచనలో చైతన్య ప్రబోధం ఉంది. సినారే కవిత్వంలో స్వచ్ఛమైన మానవత్వం ఉంది, భావ చమత్కారం కనిపిస్తుంది. చమత్కృతి, ధ్వని ఆ పదాల్లో ఉంటుంది. ప్రాస పదాలు తన గేయాల్లో 'సినారె' ఉపయోగించి పద కనువిందు నింపారు.
 


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం