• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవన భాష్యం

రచయిత పరిచయం
* జీవన భాష్యం పాఠ్యభాగ రచయిత ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి.
* సి.నారాయణ రెడ్డి (సినారె) 1931, జులై 29న కరీంనగర్ జిల్లా, హనుమాజీపేట గ్రామంలో జన్మించారు.
* సినారె గొప్ప కవి, వక్త, సాహితీ పరిశోధకులు, బహుభాషావేత్త, ప్రయోగశీలి.
* శబ్దశక్తి, అర్ధయుక్తి సినారె కలానికి, గళానికి ఉన్న ప్రత్యేకత.
 

రచనలు:
   ‣ నాగార్జునసాగరం
   ‣ కర్పూర వసంతరాయలు
   ‣ మధ్యతరగతి మందహాసం
   ‣ ద్విపదులు
   ‣ ప్రపంచపదులు
* 70కి పైగా కావ్యాలు రాశారు.
* సినిమా పాటలకు సాహితీ గుబాళింపులను అద్దిన రసహృదయుడు.
* ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు - ప్రయోగములు వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం. ఎందరో సాహితీ పరిశోధకులకు మార్గదర్శకులు.
 

సినారే చేపట్టిన పదవులు
* ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులుగా
* అధికార భాషా సంఘం అధ్యక్షులుగా
* అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సెలర్)గా
* రాజ్యసభ సభ్యులుగా
* ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా

అందుకున్న పురస్కారాలు
* భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారంతో గౌరవించింది.
* విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్అవార్డును అందుకున్నారు.

పాఠ్యభాగ వివరాలు
* జీవన భాష్యం గజల్ ప్రక్రియకు చెందింది.
* గజల్‌లో పల్లవిని మత్లా అంటారు. చివరి చరణాన్ని మక్తా అంటారు.
* కవి నామముద్రను తఖల్లస్ అంటారు.
* గజల్ చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.
* సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ - గజల్ జీవగుణాలు
* 'జీవన భాష్యం' అనే ప్రస్తుత ఈ పాఠం డాక్టర్ సి.నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం ఆరో సంపుటిలోని తెలుగు గజళ్ళు లోనిది.ప్రవేశిక
* ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు.
* అనేకరకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితోపాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అలాంటి అనేక జీవన ప్రమాణాలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం.

పాఠ్యభాగం
* మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
  మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది
భావం: నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అవి నీటి రూపంలో దర్శనమిస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు, దిగులుతో కూడిన మబ్బులు కమ్మితే కన్నీళ్లుగా బయటకు వస్తాయి.
* వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం
  జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది
భావం: ఓ నేస్తమా ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు వంకల డొంకల లాంటి ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు జంకక, నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు వేస్తే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తి నలుగురు నడిచే దారిగా మారుతుంది.
* ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
  ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
భావం: ఎడారిలా బీడుపడి పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలూ పండవని, దున్నితే లాభం ఏమీ లేదనక, నిరాశపడక ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పైరు అవుతుంది.
* మనిషీ మృగమూ ఒకటనీ అనుకుంటే వ్యర్థం
  మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది.
భావం: మనుషులూ, మృగాలు ఒకటే అని అనుకోవడం వృథా. నలుగురు మనుషులు పరస్పరం కలిసి పరస్పర సహకారంతో జీవించాలి. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అలాంటి మనుషులు కలిస్తే ఒక ఊరు ఏర్పడుతుంది.
* ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
  హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది
భావం: ఎంత గొప్పగా ఎదిగినా, ఎంత సామర్థ్యం ఉన్నా; అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించాల్సిందే. అది ఏరుగా మారాల్సిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరులా కారిపోవాల్సిందే.
* బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి ''సినారే
  చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.
భావం: ప్రపంచానికి పేరు తెలిసేలా ఖ్యాతి పొందామని, ప్రతిష్ఠాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపులేదు. ఎన్నటికి చెరిగిపోని త్యాగం చేస్తే గొప్ప పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం