• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోలకొండ పట్టణము

 ఆలోచించండి - చెప్పండి


ప్రశ్నలు - జవాబులు
1. ఆజంఖాన్ ఎవరు? ఆయన గొప్పతనం ఏమిటి?
జ: ఆజంఖాన్ ఇంజినీర్. ఆయన గోలకొండ పట్టణ నిర్మాణ పథకానికి కర్త. గోలకొండ పట్టణం రూపురేఖలు తీర్చిదిద్దాడు. పట్టణాన్ని అనేక భాగాలుగా విభజించాడు. ఆ భాగాలను మొహల్లాలు అంటారు.

 

2. గోలకొండ పట్టణ ప్రత్యేకత ఏమిటి?
జ: గోలకొండ పట్టణం దక్షిణా పథానికి ప్రసిద్ధి. ఈ పట్టణాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇందులో భాగంగా మూడు కోటలు ఒకదాన్ని చుట్టుకుని మరొకటి ఉండేలా కట్టారు. మొదటి, రెండు కోటల ప్రాకారాల మధ్యలో గోలకొండ పట్టణ ముఖ్య భాగం వెలిసింది. దుర్గానికి సుమారు ఏడు మైళ్ల కైవారం, ఎనభై ఏడు బురుజులు, ఎనిమిది దర్వాజాలుగా నాలుగు మైళ్ల వైశాల్యంతో ఉంటుంది. గోలకొండ పట్టణ నిర్మాణం కోసం పథకం వేసి మరీ అభివృద్ధి పరిచారు.
   ఆకర్షణీయమైన మందిర రాజములు, మిద్దెలమీది తోటలు మనోహరంగా ఉండేవి. ఉద్యానవన నిర్మాణం విలక్షణమైందిగా ఉండేది.

 

3. పట్టణం అలంకార భూయిష్టంగా ఉండటం అంటే ఏమిటి?
జ: పట్టణంలోని అన్ని రకాల నిర్మాణాలను రమణీయంగా నిర్మించేందుకు ప్రణాళికలు వేసి అందంగా, లోపభూయిష్టంగా లేకుండా చేయడాన్ని పట్టణం అలంకార భూయిష్టంగా ఉండటం అంటారు.
   గోలకొండ పట్టణం నిర్మాణంలో అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. కచ్చేరి భవనాలు, ఉద్యోగస్థుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహాలు, రమ్యోద్యానాలు, పాఠశాలలు, స్నానమందిరాలు నిర్మించారు.

4. గోలకొండ కోట ఎందుకు అచ్చెరువు గొలుపుతుంది?
జ: గోలకొండ కోటలో ఉద్యానవన నిర్మాణం విలక్షణమైంది. మిద్దెలమీది తోటలు భవనాల పైభాగానికి ఎంతో నైపుణ్యం ఉంది. నీటిని సరఫరా చేసే విధానం.. అందులో నీటి కాలువలు, జలాశయాలు, కేళాకూళులు, జలపాతం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

 

5.  గోలకొండ వదిలి సామాన్యజనం హైదరాబాదుకు ఎందుకు వెళ్లి ఉంటారు?
జ: గోలకొండ వదిలి సామాన్య జనం హైదరాబాదుకు తరలివెళ్లడానికి కారణాలు:
* గోలకొండ పట్టణంలో జనాభా అధికం
* నీటి వసతి సరిగ్గా లేకపోవడం
* పాదుషాలు, ధనికులు, వర్తకులు హైదరాబాద్‌లో నివసించడం
* గోలకొండ నుంచి రాజధానిని హైదరాబాద్‌కు మార్చడం
* ద్వార రక్షకులు పెట్టే ఇబ్బందులు

 

6. గోలకొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఎలా సాగాయి?
జ: గోలకొండ పట్టణంలో గొప్ప వ్యాపారులు విదేశాలతో వర్తకం చేసేవారు. పట్టణంలో దొరకని వస్తువు లేదు. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లు. భారతభూమి నలుమూలల నుంచి వర్తకం సాగేది. విదేశాల నుంచి వచ్చే సరుకులు మచిలీపట్టణం నుంచి నేరుగా గోలకొండకు వచ్చేవి. విదేశీ వ్యాపారం చేసేవారిలో డచ్చివారు ముఖ్యులు. గోలకొండ పట్టణం కేంద్రంగా తెలంగాణ అంతా వ్యాపారం జరిగేది. తెలంగాణ ఈజిప్టు మాదిరి ప్రపంచపు అంగడిగా ఉండేది. తుర్కిస్థాన్, అరేబియా, పారశీకం లాంటి దేశాల నుంచి వర్తకులు వచ్చేవారు. పట్టణంలోకి సరుకంతా బంజారా దర్వాజా ద్వారానే వచ్చేది.

 

7. గోలకొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు?
జ:  గోలకొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కొత్తవాళ్లు వస్తే వారికి ప్రవేశం చాలా కష్టంగా ఉండేది. వారికి దారోగా అనుమతి పత్రం ఉండాలి లేకపోతే రాజుగారి దగ్గరి ఉద్యోగుల్లో ఎవరితోనైనా పరిచయం ఉండాలి. కొత్తవారు రాగానే వారి వద్ద ఉప్పు లేదా పొగాకు ఉన్నదేమోనని ఒళ్లంతా వెతికేవారు. ఎందుకంటే ఉప్పు, పొగాకులతో ఎక్కువగా రెవెన్యూ వసూలు అయ్యేది. కొన్ని సందర్భాల్లో అనుమతినిచ్చే దారోగా లేడని, మరేవో సాకులు చెప్పి వచ్చిన వారి నుంచి ద్వార రక్షకులు లాభం పొందేందుకు ప్రయత్నించేవారు.

 

8. నాటి ధరలతో పోలిస్తే నేటి ధరలు ఎలా ఉన్నాయి?
జ:  నాటి ధరలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. గోధుమలు పుట్టి ఒకటికి నాలుగు హోనులుగా ఉండేది. ఇప్పుడు వాటి ధర అప్పటి ధరలతో పోలిస్తే ఎన్నోరెట్లు అధికం. నేటి ధరలు తినలేని పరిస్థితిని తెచ్చి పెడుతున్నాయి.

 

9. గోలకొండ పాదుషాలు సాహితీప్రియులని మీరు ఎలా చెప్పగలరు?
జ: గోలకొండ పాదుషాలు సాహితీప్రియులు. ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానంలో కవులు, పండితులు ఉండేవారు. విద్యాగోష్ఠి ఎప్పుడూ సాగుతుండేది. ఆంధ్రభాషపై ప్రేమతో సత్కారాలు చేస్తుండేవారు. అద్దంకి గంగాధరకవి తపతీ సంవరణోపాఖ్యాన కావ్యాన్ని రచించారు. ఇబ్రహీం పాదుషా మహబూబ్‌నగర్ జిల్లాలో నివసిస్తున్న ఆసూరి మరింగంటి సింగరాచార్య కవికి మత్తగంధే భసితఛత్ర ముత్తమాశ్వహాటకాంబర చతురంతయాన అగ్రహారాలను ఇచ్చి సత్కరించాడు. పొన్నగంటి తెలగనార్యుడు రాసిన యయాతిచరిత్రను అంకితం తీసుకున్న అమీర్‌ఖాన్ తెలగనార్యుడిని సత్కరించాడు. ఏడో పాదుషా అయిన అబ్దుల్లా విజ్ఞాన శాస్త్రాలు, లలితకళలు, వాజ్మయాలను వృద్ధి చేయడానికి ప్రయత్నించాడు.

 

10. గోలకొండ పాదుషాలు జీవకారుణ్యం గలవారని, ప్రకృతి ప్రేమికులని మీరు ఎలా చెప్పగలరు?
జ:  గోలకొండ పాదుషా కోటలోపల ఉత్తర భాగంలో జింకల వనంలోని జింకల గుంపును ఎవరూ కొట్టకూడదు, బాధపెట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. ద్రాక్ష తోటలను అభివృద్ధిపరిచాడు.

 

11. పట్టణాల్లో జనాభా ఎందుకు పెరుగుతుంది?
జ: పట్టణాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండటం వల్ల జనాభా పెరుగుతుంది. పై చదువుల నిమిత్తం పట్టణాలను ఆశ్రయిస్తారు. అనారోగ్యానికి గురైనప్పుడు మంచి వైద్యం కోసం పట్టణాలను చేరుకుంటున్నారు. దీర్ఘకాల వ్యాధిగా ముదిరేసరికి అక్కడే ఉండాల్సి వస్తుంది. వ్యాపారం చేసేందుకు పట్టణాలను చేరడంతో జనాభా పెరిగిపోతుంది. ఉద్యోగ నిమిత్తం మరికొంత మంది పట్టణాలకు వెళుతున్నారు.

 

ఇవి చేయండి


I. అవగాహన - ప్రతిస్పందన

1. గోలకొండ పట్టణం పాఠం ఆధారంగా నాటి చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలు ఎలా ఉండేవని భావిస్తున్నారు? చర్చించండి.
జ:  గోలకొండ పట్టణం పాఠం ఆధారంగా నాటి చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలు:
   గోలకొండ పట్టణం దక్షిణా పథానికి ప్రసిద్ధి. మూడుకోటల ప్రాంతం. పట్టణ నిర్మాణ పథక కర్త ఆజంఖాన్. గోలకొండ పట్టణానికి పెంపు, సొంపును కులీకుతుబ్‌షా, నాలుగో ఇబ్రహీం, అయిదో మహ్మద్ కులీ కుతుబ్‌షా, ఏడో అబ్దుల్లా కుతుబ్‌షాలు కృషి చేశారు.
   ఇబ్రహీం కుతుబ్‌షా సర్దార్‌లను, భాగ్యవంతులను కోటలోపల మేడలు కట్టాల్సిందిగా ఆజ్ఞాపించాడు. కచ్చేరి భవనాలు, ఉద్యోగస్థుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహాలు, రమ్యోద్యానాలు, పాఠశాలలు, స్నానమందిరాలు మొదలైనవి నిర్మించారు. ఇబ్రహీం కుతుబ్‌షా పన్నెండు భిక్షాగృహాలు నిర్మించాడు. నగీనాబాగ్ ఉద్యానవనం ఉండేది. దిల్‌కుషా భవనం, రాజమందిరాలు ఉండేవి. గోలకొండ పట్టణంలో ఉద్యానవన నిర్మాణం విలక్షణమైందిగా ఉండేది. ఆకర్షణీయమైన మిద్దెలమీది తోటలు మనోహరంగా నిర్మించారు. నీటికాలువలు, జలాశయాలు, జలపాతాలు ఆశ్చర్యంగా కనిపించేవి. కటోరా హవుజు(ట్యాంకు) అనే జలాశయం ఉండేది. ఇది విహార భూమిగా ఉండేది. రాజుగారి హార్మ్యం చేరాలంటే పన్నెండు ద్వారాలు దాటాలి. పట్టణంలోని బజారుల్లో చిల్లర వస్తువులు, తినుబండారాలు, విలాస వస్తువులు, నగలు, నాణేలు అమ్మేవారు. బియ్యం, జొన్నలు, గోధుమలు, చందనం, సీసం, తగరం, కస్తూరీ, కర్పూరం, గాజు సామాన్లు దిగుమతి అయ్యేవి. హోను, పణం అనే నాణేలు ఉండేవి.
సంస్కృతుల పరంగా పాదుషాలు పండితులను సన్మానించేవారు. ఆంధ్రభాషపై ప్రేమ ఉన్నవారు కాబట్టి ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి మత్తగంధేభసితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారాలను ఇచ్చి ఇబ్రహీం పాదుషా సత్కరించాడు. పొన్నగంటి తెలగనార్యుడు యయాతిచరిత్రను అమీర్‌ఖాన్‌కు అంకితమిచ్చాడు. అబ్దుల్లా పాదుషా బ్రాహ్మణుల సలహా ప్రకారం నడుచుకునేవాడు. ఇతడు విజ్మాన శాస్త్రాలు, లలితకళలు, వాజ్ఞ్మయం వృద్ధి చేయడానికి ప్రయత్నించేవాడు. 280 సంవత్సరాలు సకల సంపదలు, వైభవాలతో గోలకొండ విరాజిల్లింది. నుంచి ఇవి

2. కింద ఇచ్చిన పదాలు ఏయే పేరాల్లో ఉన్నాయో గుర్తించి, పట్టికలో వివరించి రాయండి.


 

3. కింది పేరా చదవండి. పట్టిక రాయండి.
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన కోటల్లో దేవరకొండ కోట ఒకటి. రేచర్ల నాయక రాజుల పరిపాలనలో ఈ కోట ఎంతో గొప్పగా విరాజిల్లింది. రెండో మాదా నాయకుడు ఈ కోటను నిర్మించాడు. ఎత్తయిన ఏడు కొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించాడు. అయిదువందల ఎకరాలపైగా విస్తీర్ణం ఉన్న ఈ కోటలో పంట భూములు, కాలువలు, ధాన్యాగారాలు, సెలయేళ్లు, సైనిక శిబిరాలు, గుర్రపుశాలలు, ఆలయాలు ఉన్నాయి. ఈ కోటకు 360 బురుజులు ఉన్నాయి. 9 ప్రధాన ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కోనేర్లు ఉన్నాయి. అత్యంత కళాకృతమైన సింహద్వారాలు ఉన్నాయి. మన పాఠ్యపుస్తకాల మొదటి పేజీలో కనిపించే 'పూర్ణకుంభ' చిహ్నం ఇక్కడే లభించింది. ఈ కోట విశేషం ఏమిటంటే ఏ శత్రురాజు దీన్ని ఆక్రమించుకోలేకపోయాడు. నాయకరాజుల కాలంలో ఇది స్వయం ప్రతిపత్తి ఉన్న దుర్గంగా వెలిగింది. దీనికి దగ్గరలో ఉన్న రాచకొండ సమీపంలోని నాగసముద్రం చెరువులను ఈ రాజులే తవ్వించారు.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత


1) కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ''గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు" అనడానికి ఉదాహరణలు తెలపండి.
జ: గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు అనడానికి ఉదాహరణలు
* గోలకొండ పాదుషాల్లో ఇబ్రహీం కుతుబ్‌షా విద్యాప్రియుడు. ఇతడి ఆస్థానంలో కవులు, పండితులు ఉండేవారు.
* విద్యాగోష్ఠులు జరిగేవి.
* పండితులకు సన్మానాలు జరిగేవి.
* ఇబ్రహీం కుతుబ్‌షాకు అద్దంకి గంగాధర కవి తపతీ సంవరణోపాఖ్యాన కావ్యాన్ని అంకితమిచ్చాడు.
* ఇబ్రహీం పాదుషా ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి మత్తగంధే భసితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారములను ఇచ్చి సత్కరించాడు.
* ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్‌ఖాన్ తనకు అంకితమిచ్చిన యయాతి చరిత్రను రాసిన పొన్నగంటి తెలగనార్యుడిని సత్కరించాడు.
* ఏడో పాదుషా అబ్దుల్లా విజ్ఞాన శాస్త్రాలు, లలితకళలు, వాజ్ఞ్మయాల అభివృద్ధి కోసం ప్రయత్నించాడు.
* అబ్దుల్లా పాదుషా దగ్గరకు దేశవిదేశాల్లోని విద్వాంసులు వచ్చేవారు.

ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్ఛస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు?
జ: నాటి తెలంగాణలో మహ్మదీయ రాజులు పాలించినప్పటికీ తెలుగు భాష గొప్పస్థితిలోకి వెళ్లింది. ఇబ్రహీం కుతుబ్‌షా చాలాకాలం విజయనగరం రాజాదరణంలో పెరిగినవాడు అవడంతో ఆంధ్రభాషా మాధుర్యాన్ని ఆస్వాదించాడు. ఆంధ్ర భాషపై అభిమానంతో ఆంధ్రకవులను సత్కరించేవాడు. అద్దంకి గంగాధరకవి తపతీ సంవరణోపాఖ్యాన కావ్యాన్ని రాసి ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితం ఇచ్చాడు. ఆసూరి మరింగంటి సింగరాచార్య రచనలకు మెచ్చి ఇబ్రహీం కుతుబ్‌షా మత్తగంధే భసిత ఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన అగ్రహారాలను ఇచ్చి సత్కరించాడు. ఇబ్రహీం కుతుబ్‌షా సేనాని అమీర్‌ఖాన్ అచ్చతెలుగు కావ్యమైన యయాతి చరిత్ర ను రాసిన తెలగనార్యుడిని సత్కరించాడు. ఏడో పాదుషా అబ్దుల్లా బ్రాహ్మణులపై భక్తి ఉన్నవాడు. ఇతడు విజ్ఞాన శాస్త్రాలు, లలితకళలు, వాజ్ఞ్మయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాడు. దీన్నిబట్టి తెలుగు భాష ఉచ్ఛస్థితిలో ఉండేదని చెప్పవచ్చు.

 

ఇ) ''తెలంగాణ ఈజిప్టులా ప్రపంచపు అంగడి" అనడానికి కారణాలు రాయండి.
జ: తెలంగాణ అంతటికి గోలకొండ పట్టణం కేంద్రంగా ఉండేది. గోలకొండ పట్టణంలో వణిక్పంగవులు అనే వ్యాపారులు విదేశాలతో వర్తకం చేసేవారు. పట్టణంలో దొరకని వస్తువు అంటూ లేకుండేది. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లు. భారత భూమికి నలుమూలల నుంచి వర్తకం సాగుతుండేది. విదేశాల నుంచి వచ్చే సరుకులు మచిలీపట్టణం నుంచి నేరుగా గోలకొండకు వచ్చేవి.
   విదేశీ వ్యాపారం చేసేవారిలో డచ్చివారు ముఖ్యులుగా ఉండేవారు. ఈ వర్తకానికి గోలకొండ పట్టణం కేంద్రంగా తెలంగాణ అంతా విస్తరించేది.
   ఇబ్రహీం కులీకుతుబ్‌షా కాలంలో తెలంగాణ ఈజిప్టు మాదిరి ప్రపంచపు అంగడిగా ఉండేది. తుర్కిస్థాన్, అరేబియా, పారశీకం లాంటి దేశాల నుంచి వర్తకులు వచ్చేవారు. వజ్రాల వ్యాపారం జరిగేది. ఓడల వ్యాపారం చేసేవారు. గొప్ప అధికారులు కూడా వర్తకం చేసేవారు.

 

ఈ) నేడు పట్టణాల్లో జనాభా అధికమవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి?
జ: పట్టణాల్లో జనాభా అధికమవడం వల్ల కలిగే ఇబ్బందులు
* ఉండేందుకు స్థలాలు సరిపోవడం లేదు
* తాగేందుకు నీటికి అవస్థ ఏర్పడుతుంది
* జనాభా అధికమవడం వల్ల వాహనాల సంఖ్య పెరిగి కాలుష్యం ఏర్పడుతుంది.
* మురికివాడలు పెరిగే అవకాశం ఉంటుంది.
* అన్ని రకాల సదుపాయాలు కల్పించడం ప్రభుత్వానికి కష్టం.
* ఖర్చులు పెరిగి పోతాయి.
* అనారోగ్యాలపై జీవితం గడుస్తుంది. ఆయువు పోతుంది.
* నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతాయి.
* విద్యావ్యాపారం జోరుగా సాగుతుంది.
* విశాలమైన ఇండ్లు నిర్మించుకోవడం ఇబ్బంది. 
* సరిపోయేంతగా రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరగదు.

2) కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) గోలకొండ పట్టణం అందచందాలు, వైభవం, విశిష్టత గురించి విశ్లేషించండి.
జ: గోలకొండ పట్టణం దక్షిణాన ఉన్న ప్రసిద్ధ పట్టణం. ఈ పట్టణం మూడు కోటలతో వెలసింది. ఏడుమైళ్ల కైవారంతో, 87 బురుజులతో, 8 దర్వాజాలతో నాలుగుమైళ్ల వైశాల్యంలో ఉండేది. కచ్చేరి భవనాలు, ఉద్యోగస్థుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహాలు, రమ్యోద్యానాలు, పాఠశాలలు, స్నానమందిరాలు ఉండేవి. నగీనా బాగ్ అనే రమ్యమైన ఉద్యానవనం ఉండేది. రాజమందిరాలు, దిల్‌కుషా భవనం ఉండేవి. గోలకొండ పట్టణంలో ఉద్యానవన నిర్మాణంలో విలక్షణమైన మిద్దెలమీది తోటలు ఉండేవి. ఈ ఉద్యానవనానికి నీటిని పంపే విధానం అందులో నీటి కాలువలు, జలాశయాలు, కేళాకూళులు, జలపాతాలు ఆశ్చర్యంగా ఉండేవి. మజ్నూ బురుజుకు వాయవ్య దిశలో దొడ్డబాల్బోవా అనే వృక్షం ఉండేది.
   రాజుగారి మందిరం చేరాలంటే పన్నెండు ద్వారాలు దాటాలి. పట్టణంలో దొరకని వస్తువులేదు. వజ్రాలకు పుట్టినిల్లు గోలకొండ. తెలంగాణ అంతకు గోలకొండ పట్టణం కేంద్రంగా వర్తకం జరుగుతుండేది.
   గోలకొండ పట్టణం పాదుషాలు కవులకు, కళాకారులకు ఆతిథ్యమిచ్చి సత్కరించేవారు. పట్టణంలో ద్రాక్షతోటలు అలరారుతుండేవి. వైభవాన్ని చాటే చార్మినార్ నిర్మాణం ఇక్కడే జరిగింది.
   గోలకొండ పట్టణంలోని పురుషులు, స్త్రీలకు మనోజ్ఞమైన ముఖవిలాసం ఉండేది. సుందరాకారంతో ఆకర్షణీయంగా ఉండేవారు. రాజు మొదలుకొని బీదవారి వరకు ఆటపాటలతో, వినోదంతో, భోగలాలసులై ఉండేవారు.

 

ఆ) గోలకొండ పట్టణం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.
జ: గోలకొండ పట్టణం దక్షిణాన ప్రసిద్ధమైంది. గోలకొండ మూడుకోటల సమ్మేళనం. ఇది 7 మైళ్ల కైవారంతో, 87 బురుజులతో, 8 దర్వాజాలతో, 4 మైళ్ల వైశాల్యంతో ఉండేది.
   గోలకొండ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ఆజంఖాన్. ఇతడు పట్టణ రూపురేఖలు దిద్దాడు. పట్టణంలోని భాగాలను మొహల్లాలు అంటారు. గోలకొండ పట్టణానికి పెంపు, సొంపును కుతుబ్‌షాలు కలిగించారు.
   నగీనా బాగ్ అనే ఉద్యానవనం, దిల్‌కుషా రాజమందిరం, మిద్దెలమీది తోటలు మనోహరంగా నిర్మించారు. నీటికాలువలు, జలాశయాలు, కేళాకూళులు, జలపాతాలు ఉండేవి. కటోరా హవుజు(ట్యాంకు) అనే జలాశయం విహారభూమిగా ఉండేది.
   మహ్మద్ కులీ కుతుబ్‌షా ప్రజల సౌకర్యార్థం 78 లక్షల హోనులు ఖర్చు చేశాడు. రాజుగారి మందిరం చేరాలంటే పన్నెండు ద్వారాలను దాటాలి. పట్టణంలోని బజార్లలో అన్ని వస్తువులు విరివిగా దొరికేవి. వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లు. గోలకొండ కేంద్రంగా తెలంగాణ అంతా వర్తకం జరుగుతుండేది.
   బియ్యం, జొన్నలు, గోధుమలు, చందనం, సీసం, తగరం, కస్తూరీ, చైనాపట్టు దుస్తులు, గాజు సామానులు దిగుమతి అయ్యేవి.
   కుతుబ్‌షాలు కవులను సత్కరించేవారు. ద్రాక్ష తోటలు అనేకం ఉండేవి. చార్మినార్‌ను మహ్మద్ కులీకుతుబ్‌షా నిర్మించాడు. దోషులను శిక్షించేవారు. గోలకొండ పట్టణంలో జనాభా పెరిగి నీటి వసతి కొరత ఏర్పడింది. అందరూ హైద్రాబాద్‌లో నివసించేవారు. కాని కార్యాలయాలు గోలకొండ పట్టణంలోనే ఉండేవి.
   గోలకొండ పట్టణంలోని వారు మనోజ్ఞమైన ముఖవిలాసంతో, ఆకర్షణీయంగా ఉండేవారు. రాజు నుంచి పేదవారి వరకు అందరూ ఆటపాటలతో వినోదిస్తూ, భోగలాలసులై ఉండేవారు.
   గోలకొండ పట్టణం 280 సంవత్సరాలు సకల సంపదల వైభవంతో విరాజిల్లింది. దీన్ని 1687లో ఔరంగజేబు సర్వనాశనం చేశాడు.. అంతటితో గోలకొండ పట్టణ అందచందాలు, వైభవం క్రమేపీ నశించిపోయాయి.

 

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.
అ) ఏదైనా ఒక పట్టణం లేదా ఊరు చారిత్రక/సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి.
జ: తెలంగాణ రాష్ట్రంలో వరి ఎక్కువగా పండించి, పసిడి రాసులను కురిపిస్తున్న ప్రాంతం మెదక్. ఈ మెదక్ పట్టణానికి కుతుబ్‌షాహీలు గుల్షానాబాద్ అనిపేరు పెట్టారు. నిజాం దాన్ని మెదక్‌గా మార్చాడు. మెదక్‌ను పూర్వం మెతుకు దుర్గం అనేవారు.
   మెదక్ పట్టణంలో ఖిల్లా ఉంది. ఇది ప్రశాంతతకు నెలవుగా ఉంటుంది. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. అంతేకాదు ఆసియాఖండంలో రెండో అతిపెద్ద చర్చి మెదక్ పట్టణంలోనే ఉంది. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో ఇది రూపుదిద్దుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి అనేకమంది సందర్శకులు వస్తుంటారు. చార్లెస్ వాకర్ పాస్నెట్ ఆలోచనతో 1914లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 1924 వరకు దాదాపు పది సంవత్సరాలపాటు కట్టారు.
   మెదక్ పట్టణ సమీపంలో ఉండే మంజీర పరవళ్లు పరవశింపజేస్తాయి. మెదక్ పట్టణంలోని 'సంత' విశిష్టమైంది. అన్ని రకాల పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు; వ్యవసాయ అసవరాలకు సరిపోయే వస్తువులు ఇక్కడ దొరకుతాయి. స్వాతంత్య్ర సమరయోధులుగా చాలామంది పట్టణీయులు నిలిచారు. కవులు, కళాకారులు, వివిధ వృత్తుల వారికి నిలయంగా మారి మెదక్ పట్టణం అలరారుతుంది.
   చుట్టూ పచ్చని పంటలతో, విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది. మెదక్ పట్టణంలోని గోల్‌బంగ్లా, వెస్లీ మైదానం లాంటి ప్రదేశాలు ప్రజాసేవ చేసే సంస్థలు. ప్రభుత్వ కార్యాలయాలతో మెదక్ పట్టణం పరిఢవిల్లుతుంది.

 


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం