• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోలకొండ పట్టణము

* గోలకొండ పట్టణము - పాఠ్యాంశ రచయిత ఆదిరాజు వీరభద్రరావు.
* ఆదిరాజు వీరభద్రరావు 16-11-1890లో ఖమ్మం జిల్లా మధిర తాలుకాలో జన్మించారు. ఈయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
* చరిత్ర, సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతి పొందారు. ఆదిరాజు రచనలు చరిత్ర, రచనాకళలో ప్రామాణిక స్థాయిని కలిగి ఉన్నాయి.
 

రచనలు:
* ప్రాచీనాంధ్రనగరములు
* లలిత కథావళి
* రత్నప్రభ
* జీవిత చరితావళి
* జీవిత చరిత్రలు
* నవ్వుల పువ్వులు
*  మిఠాయి చెట్టు
*  షితాబ్ ఖాన్
*  ఆదిరాజు వీరభద్రరావు సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో 50 వ్యాసాలు రాశారు.
*  గ్రీకు పురాణకథలు, ఇంకా మరెన్నో వ్యాసాలు రాశారు. ఇవన్నీ అముద్రితంగా ఉన్నాయి.
*  హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేశారు.
*  చాదర్‌ఘాట్ హైస్కూల్ (హైదరాబాద్)లో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశారు.
*  లక్ష్మణరాయ పరిశోధకమండలికి కార్యదర్శిగా వ్యవహరించారు.
*  ఆదిరాజు తన పాండిత్యంతో, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడు గా పేరొందారు.
 

పాఠం ఉద్దేశం
తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదువ లేదు. చారిత్రక కట్టడాల్లో గోలకొండ ఘనమైంది. ఈ పట్టణం ప్రాశస్త్యం... ఆనాటి కోటల నిర్మాణం... మంచినీటి వసతుల కల్పన... గొప్ప సాంకేతిక నిర్మాణాలు ఉన్నాయి. పట్టణంలో జరిగిన ప్రపంచస్థాయి వర్తక, వ్యాపారాలు... ఆహారపు అలవాట్లు...., కోటలో జరిగిన కార్యకలాపాలు, స్థాపించిన పరిశ్రమలు...గోలకొండ పట్టణ ప్రాముఖ్యంతోపాటు 1940 నాటి తెలంగాణా వచన రచనా శైలిని తెలపడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు
* గోలకొండ పట్టణము అనే ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది.
* వ్యాసం అంటే వివరించి చెప్పేది.
* చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు.
* తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసం ఈ పాఠం.
* ఈ పాఠం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది.
 

ప్రవేశిక:
* ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మరచిపోవడం దురదృష్టం.
* తెలంగాణలోనే విశిష్టతను సంతరించుకుంది గోలకొండ వైభవం.
* ఆనాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు సరిపోవు.
* గోలకొండ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు.
* గోలకొండ కోట వైభవాన్ని కళ్లతో చూడాల్సిందే కాని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు.
* గోలకొండ వైభవాన్ని మాటల్లో చెప్నే ప్రయత్నం చేశారు ఆదిరాజు వీరభద్రరావు.
* ఆదిరాజు వీరభద్రరావు మాటల్లో గోలకొండ పట్టణ విశేషాలు, ఆనాటి పరిస్థితులను తెలుసుకుందాం.. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందుదాం...

పాఠ్యభాగం
  దక్షిణా పథాన పట్టణం అంటే గోలకొండ పట్టణం ప్రసిద్ధిగా ఉండేది. గోలకొండ దుర్గం అంటే ఒక్క కోట కాదు. మూడు కోటల ప్రాంతం. ఈ మూడు కోటలను ఒకదాన్ని మరొకటి చుట్టుకుని ఉండేలా కట్టారు. మొదటి, రెండు కోటల ప్రాకారాల మధ్యన గోలకొండ పట్టణం ముఖ్య భాగం వెలసింది. ఆ దుర్గానికి సుమారు ఏడుమైళ్ల కైవరం, ఎనభై ఏడు బురుజులు, ఎనిమిది దర్వాజాలు (తలుపులు) ఉన్నాయి.. సుమారు నాలుగు మైళ్ల వైశాల్యం ఉంది.
  గోలకొండ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ఆజంఖాన్ అనే ఇంజినీరు. ఇతడు పట్టణం రూపు రేఖలు దిద్దాడు. పట్టణాన్ని అనేక భాగాలుగా విభజించాడు. ఆ భాగాలను మొహల్లాలు అంటారు. ఈ పేర్లు తెలిపే రికార్డులు లేవు. వివరాలు తెలియదు. అయినా హక్షీకమాన్, దికాబ్‌బాగ్, కటోరాహవుజ, మీరుజుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అనే పేర్లు దొరికాయి. మీరుజుమ్లా, మాదన్న నివసించే మందిరాలు ఉండటం వల్ల ఆ ప్రాంతాలకు వారి పేర్లే ఉంచారు.
  గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు, అధిక సంఖ్యలో ఉండి పట్టణంలో సందడిగా తిరుగుతుండేవి. కాబట్టి వీధులు విశాలంగా ఉన్నాయని గ్రహించాలి. రాజ భవనాలు పడమటి దిక్కున ఉండేవి. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో ప్రజలు నివసించేవారు. ఉత్తర ప్రాంతంలో మాత్రం అధిక జనాభా ఉండేది.
 

గోలకొండ పట్టణాన్ని పెంచడంలో, సొంపులు కలిగించడంలో మొదటివాడైన కులీకుత్‌బ్‌షా, నాలుగోవాడైన ఇబ్రహీం కుతుబ్‌షా (1550-1580), అయిదోవాడైన మహ్మద్ కులీ కుతబ్‌షా, ఏడోవాడైన అబ్దుల్లా కుతుబ్‌షా చాలా శ్రద్ధ వహించారు.

  ఇబ్రహీం కుతుబ్‌షా సర్దార్‌లను, భాగ్యవంతులను కోటలోపల మేడలు కట్టాలని ఆజ్ఞాపిస్తే, అలంకార భూయిష్టంగా ఉండటానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. కచేరీ భవనాలు, ఉద్యోగస్థుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, ధర్మశాలలు, భిక్షా గృహాలు, రమ్యోద్యానాలు, పాఠశాలలు, స్నానమందిరాలు లాంటి వాటిని నిర్మించారు. ఇబ్రహీం కుతుబ్‌షా పన్నెండు భిక్షా గృహాలను నిర్మించాడు. ఈ పన్నెండు గృహాలను పన్నెండుమంది ఇమాములకు అంకితం చేశాడు. నగీనాబాగ్ ఒక అందాల కుప్పయగు రమ్యోద్యానమణి. షాహిమహలులు అనే రాజమందిరాలు ఆనాటి ఇంజినీర్ల ప్రతిభకు ప్రకాశమంతమైన ఉదాహరణలు. దిల్‌కుషా భవనం మనోహరమైన మందిరం. ఈ మందిరం పారశీక దేశ రాయబారికి, అతడి అనుచర వర్గానికి బస ఏర్పాటు చేసిన స్థలం. యుద్ధభటులకు ప్రత్యేకంగా రెండు బారకాసులు ఉండేవి. రెండు ప్రాకారాల మధ్య ఒకటి, పర్వత శిఖరాన మరొకటి ఉండేది. గోలకొండ పట్టణంలో ఉద్యానవన నిర్మాణంలో విలక్షణమైన, ఆకర్షణీయమైన మిద్దెలమీది తోటలను భవనాల పైభాగాన ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దారు. రమ్యోద్యానాలను మనోహరంగా నిర్మించారు. ఈ ఉద్యానవనానికి నీటిని సరఫరా చేసే విధానం, అందులోని నీటి కాలువలు, జలాశయాలు, కేళాకూళులు, జలపాతాలు ఆశ్చర్యం గొల్పేలా ఉండేవి.
  ఈ అంతరాళ నందనవనం బాబిలోనియాలో అత్యంత ప్రాచీనకాలంలో ఉంది. భారత భూమిలో ఏకైక దృశ్యంగా గోలకొండ పట్టణంలోనే ఉంది. మజ్నూ బురుజుకు వాయవ్య దిశలో దొడ్డ బాల్బోవా (Balaboa) వృక్షం ఒకటి ఉండేది. దీని స్కంధపు చుట్టూరా 80 అడుగులు ఉండేది. ఆ చెట్టు పాదం తొర్రలో ఒక గుండ్రనిబల్ల, దాని చుట్టు నాలుగు కుర్చీలు వేసుకుని నలుగురు కూర్చుండి అల్పాహారం తీసుకునేంత విశాల ప్రదేశం ఉండేది. ఆ తొర్ర గదిలోకి గాలి, వెలుతురు కూడా చక్కగా వస్తుండేవి. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా ఆఫ్రికా నుంచి తెప్పించాడు. కటోరా హవుజు అనేది ఒక జలాశయం. ఈ ప్రాంతం వేసవి కాలంలో గొప్పవారికి విహారభూమిగా ఉండేది.
  హైదరాబాద్ నగరం నిర్మాణమై క్రమాభివృద్ధి చెందడంతో గోలకొండ ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయింది. దాంతో వర్తకులు, సర్దారులు, సామాన్య జనం గోలకొండను వదిలి హైదరాబాదులో నివసించడం మొదలుపెట్టారు. హైదరాబాదులో దొరికిన ఆధారాలను బట్టి ఒక చరిత్రకారుడు ఊహించి గోలకొండ పట్టణంలో రమారమి నలభైవేల ఇండ్లు ఉన్నాయని, రెండు లక్షల మంది ప్రజలు నివసించేవారని లెక్కతేల్చాడు. ఈ ప్రజల సౌకర్యార్థం మహమ్మదు కులీ కుతుబ్‌షా 78 లక్షల హోనులు వెచ్చించాడు. పట్టణంలోని జనానికి తాగేనీటి సదుపాయాన్ని కల్పించారు. దుర్గానికి కొంత దూరంలో ఎత్తు ప్రదేశాన దుర్గతటాకాన్ని నిర్మించారు. ఆ దుర్గ తటాకం, భూమిలో నుంచి మట్టి గొట్టాల ద్వారా నీటిని ప్రహింపజేసి కటోరా హవుజు (ట్యాంకు)ను నింపేవారు. కటోరా హవుజు నుంచి నీరు మట్టి గొట్టాల ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలకు సరఫరా అయ్యేది. నీటిని నిల్వ చేయడానికి మరిన్ని ఎక్కువ హవుజులు నిర్మించారు. కొన్ని హవుజులు జనానా వారికి నియమితములయి ఉండేవి.
  రాజుగారి మేడ చేరాలంటే పన్నెండు ద్వారాలు దాటాల్సి ఉండేది. ఉమ్రావుల, పెద్ద అధికారుల మందిరాలు చాలావరకు లోపలి కోటలో ఉండేవి. గొప్పవారికి గోలకొండలోని భాగా నగరంలో మందిరాలు ఉండేవి. పట్టణంలోని బజార్లలో చిల్లర వస్తువులు, తినుబండారాలు, విలాసవస్తువులు, నగలు, నాణేలు విరివిగా అమ్మేవారు. గోలకొండ పట్టణంలో వణిక్పంగవులు (శ్రేష్ఠమైన వ్యాపారులు) విదేశాలతో వర్తకం చేస్తూ కుబేరులయ్యారు. అప్పుడు ఈ పట్టణంలో దొరకని వస్తువు లేదు. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లు. భారతభూమి నలుమూలల నుంచి వర్తకం సాగింది. విదేశాల నుంచి వచ్చే సరుకులు మచిలీపట్టణం (బందరు) నుంచి నేరుగా గోలకొండకు వచ్చేవి. విదేశీ వ్యాపారం చేసేవారిలో డచ్చివారిని ప్రధానమైనవారిగా చెప్పవచ్చు. ఈ వర్తకానికి గోలకొండ పట్టణం కేంద్రంగా ఉండి తెలంగాణ అంతా పాకింది. ఇబ్రహీం కులీకుతుబ్‌షా కాలంలో తెలంగాణ ఈజిప్టు మాదిరి ప్రపంచపు అంగడిగా ఉండేది. తుర్కిస్థాన్, అరేబియా, పారశీకం మొదలైన దేశాల నుంచి వర్తకులు వచ్చేవారు. నైపుణ్యం ఉన్న శిల్పులు, చిత్రకారులు ఉండేవారు.
  పట్టణంలోకి సరుకులన్నీ బంజారా దర్వాజా ద్వారానే వస్తుండేవి. బంజారాలు అనే లంబాడీలు ధాన్యం, ఉప్పు లాంటివి తెస్తుండటంతో ప్రవేశ ద్వారానికి బంజారా దర్వాజా అనేపేరు వచ్చింది.
  బియ్యం, జొన్నలు, గోధుమలు, చందనం, సీసం, తగరం, కస్తూరీ, చైనాపట్టు దుస్తులు, కర్పూరం, గాజుసామానులు, సువాసన ద్రవ్యాలు దిగుమతి అయ్యేవి. కొన్ని వస్తువుల ధరలు వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

300 సంవత్సరాల కిందట ధరలు పైవిధంగా ఉండేవి.
 

వివరణలు:
హోను: ఒక బంగారు నాణెం. దీన్ని పెగోడా అంటారు. ఇది 4 రూపాయల విలువ ఉంటుంది.
   పణం = హోనులో పదహారో భాగం.
   పెగోడాలలో అర్ధ, పావు పెగోడాలు కూడా ఉండేవి. ఇవికాకుండా పైసలు, గవ్వల క్రయ విక్రయాలు ప్రచారంలో ఉండేవి. పైఠన్ వస్త్రాలు, బందరు కలంకారీ చీరలు ఎక్కువగా అమ్ముడయ్యేవి. రంగుల కర్మాగారాన్ని డచ్చివారు నడిపేవారు. ఉన్ని, ఇనుము పరిశ్రమలు కూడా ఉండేవి. ఈ ఇనుము కర్మాగారంలోనే ఆయుధాలు, ఫిరంగులు తయారుచేసేవారు. కూరగాయలు, మాంసం అమ్మే దుకాణాలు ఉండేవి. కానీ అవి అంత పెద్దవి కావు. కోట వెలుపల పెద్ద మార్కెట్లు ఉండేవి.
  గోలకొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో చాలా జాగ్రత్త వహించేవారు. కొత్త వ్యక్తులకు ప్రవేశం చాలా దుర్లభం. వారికి దారోగా యొద్ది నుంచి అనుమతి పత్రం ఉండాలి లేదా రాజోద్యోగుల్లో ఎవ్వరి పరిచయమైనా ఉండాలి. కొత్త వ్యక్తి రాగానే అతడి వద్ద ఉప్పు, పొగాకు ఉన్నాయేమోనని ఒళ్లంతా బాగా తడిమి చూసేవారు. ఈ రెండు వస్తువుల వల్ల రాజుగారికి ఎక్కువ రెవెన్యూ వసూలు అయ్యేది. ఆ వ్యక్తికి ఒక్కోసారి రెండు మూడురోజుల వరకు ప్రవేశం లభించకపోయేది. అనుమతిని ఇచ్చే దారోగా లేడని, మరేవో సాకులు కల్పించి, ద్వారపాలకులు అతడి నుంచి లాభం పొందడానికి ప్రయత్నించేవారు.

   గోలకొండ పట్టణంలో గొప్ప అధికారులు కూడా వర్తకం చేసేవారు. మీరుజుమ్లా అనే మంత్రి కొన్ని వజ్రపుగనులకు సొంతదారుడై వజ్రాల వ్యాపారంలో మిగులు ధనం గడించేవాడు. అతడి వద్ద ఇరవై మణుగుల తూకం ఉన్న వజ్రాలు ఉండేవి. అక్కన్న సేనాని కొన్ని ఓడలకు సొంతదారుడై ఓడల వ్యాపారం చేసేవాడు.
  గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్‌షా విద్యాప్రియుడు. ఈయన ఆస్థానంలో కవులు, పండితులుగా హిందువులు, మహ్మదీయులు ఉండేవారు. విద్యాగోష్ఠి ఎప్పుడూ సాగుతూ ఉండేది. పాదుషా పండితులను బాగా సన్మానించేవారు. ఇబ్రహీం కుతుబ్‌షా చాలాకాలం విజయనగరం రాజాదరణలో పెరగడం వల్ల ఆంధ్ర భాషా మాధుర్యాన్ని ఆస్వాదించేవాడు. ఆంధ్రభాషపై అభిమానం ఉన్న ఆంధ్రకవులను సత్కరించేవాడు. అద్దంకి గంగాధరకవి తపతీ సంవరణోపాఖ్యాన కావ్యాన్ని రచించి ఈ పాదుషాకు అంకితమిచ్చాడు. ఇబ్రహీం పాదుషా మహబూబ్‌నగర్ జిల్లాలో నివసించే ఆసూరి సింగరాచార్య మహాకవికి మత్త గంధేభసిత ఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన అగ్రహారములను ఇచ్చి సత్కరించాడు. సుల్తాన్ ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్‌ఖాన్ మొదటి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రాసిన పొన్నగంటి తెలగనార్యుని సత్కరించాడు. ఏడో పాదుషా అయిన అబ్దుల్లా పాదుషా బ్రాహ్మణభక్తి ఉన్నవాడు. ఇతడి చుట్టూ ఎల్లప్పుడూ బ్రాహ్మణులు ఉండేవారు. వీరి సలహాలను రాజు పాటించేవాడు. ఇతడు విజ్ఞాన శాస్త్రాలు, లలిత కళలు, వాఞ్మయం వృద్ధిచేయడానికి ప్రయత్నించాడు. అందుకే దేశదేశాల్లోని విద్వాంసులు ఇతడి ఆస్థానానికి వచ్చేవారు. లోపలికోట ఉత్తరభాగంలో జింకల వనం ఉండేది. ఈ జింకల గుంపును ఎవరూ కూడా కొట్టకూడదు. బాధించకూడదు అని రాజాజ్ఞ ఉండేది.
  పట్టణంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండేవి. ఈ పండ్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్ నెలల్లో పక్వానికి వచ్చేవి. ఈ ద్రాక్ష పండ్ల నుంచి ద్రాక్షరసం తయారు చేసి తాగేవారు. అందరికీ తాటికల్లు ఇష్టమైన పానీయంగా ఉండేది.
      గోలకొండ పట్టణంలో 1589లో మశూచీ ప్రబలింది. లెక్కలేనంతమంది మరణించారు. చివరకు కొందరు సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకుని భజనలతో ఊరేగేవారు. ఫలితం ఆ మశూచి పీడ పోయింది. ఆ జ్ఞాపకంగా, కృతజ్ఞతా సూచకంగా మహ్మద్ కులీకుతుబ్‌షా 1591లో హైద్రాబాద్‌లో చార్మినార్‌ను నిర్మించాడు.
  ఉమ్రావులు (ఉన్నత వంశానికి చెందిన కళాపోషకులు) బజారుల్లో వెళ్లేటప్పుడు ముందు ఒకటి లేదా రెండు ఏనుగులు వెళ్లేవి. వీటి మీద ధ్వజాలు పట్టుకుని ముగ్గురు భటులు కూర్చుండేవారు. తర్వాత అస్త్రశస్త్రాదులను ధరించిన 50-60 మంది భటులు గుర్రాలపై వెళ్లేవారు. వీరి వెనుక గుర్రాల మీద కూర్చుని బాకాలు (వాద్యవిశేషం) ఊదుతూ, సన్నాయిలు పాడుతూ కొందరు బయలుదేరేవారు. వీరి వెనుక ఉమ్రావు గుర్రం మీద వచ్చేవాడు. ఇతడి అంగరక్షకులుగా 30-40 మంది పదాతి వర్గం ఉండేది. కొందరు ఉమ్రావులకు సురటీలు విసురుతుండేవారు. ఒకరు గొడుగు పట్టేవారు. ఇంకొకరు హుక్కా (గంజాయి పీల్చేది) పట్టుకుని వచ్చేవారు. ఒకరు కావడిలో జలపూర్ణ కుంభాలను పట్టుకుని వచ్చేవారు. తర్వాత ఒక పల్లకిని నలుగురు మోసుకుని వచ్చేవారు. భుజాలు మార్చుకోవడానికి ఇద్దరు బోయీలు విడిగా ఉండేవారు. వీరందరి చివర ఒకటో రెండో ఒంటెలు బయలుదేరేవి. ఒంటెల మీద కూర్చుని భటులు తప్పెటలు వాయించేవారు. నవాబుకు ఇష్టమైనప్పుడు గుర్రం దిగి పల్లకిలో పడుకునేవారు. పల్లకీకి వెండిపూత ఉండేది. పల్లకి దండెలకు వెండిపొన్నులు ఉండేవి. పల్లకిలో పడుకున్నప్పుడు ఉమ్రావు చేతిలో పుష్పగుచ్ఛం పట్టుకుని ఉండేవారు. తాంబూలం నములుతూ లేదా హుక్కా పీలుస్తూ కనిపించేవారు. గోలకొండ పట్టణంలో నేరస్థులను శిక్షించే విధానం కఠినంగా ఉండేది. వారిని జైలులో పెట్టే పద్ధతి లేదు. వెంటనే విచారణ చేయడం, దోషి అయితే శిక్షించేవారు, నిర్దోషి అయితే విడిచిపెట్టేవారు.
  గోలకొండ పట్టణంలో జనాభా ఎక్కువగా ఉండేది. నీటివసతి సరిగా ఉండేది కాదు. దాంతో పాదుషాలు, ధనికులు, కొందరు వర్తకులు హైదరాబాద్‌లో నివసించేవారు. అయినా ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, ధనాగారం, సేనా సిబ్బంది గోలకొండ పట్టణంలోనే ఉండేవి. యుద్ధభీతి కలిగినప్పుడు రాజులు, రాణులు... గోలకొండ దుర్గంలో తలదాచుకునేవారు. గోలకొండ నుంచి హైద్రాబాద్ రాజధానిగా ఎప్పుడు మార్చారో సరిగా తెలియదు. కానీ పదహారో శతాబ్దం చివర ఇది జరిగి ఉండవచ్చని చరిత్రకారులు ఊహిస్తున్నారు.
  గోలకొండ పట్టణంలోని పురుషులు, స్త్రీలు మనోజ్ఞమైన ముఖ విలాసాలతో ఉండేవారు. ఉమ్రావులు, సేనానులు గంభీర సుందరమైన ఆకారంతో ఆకర్షణీయంగా ఉండేవారు. ఉమ్రావులు మితిలేని భాగ్యవంతులు. రాజు మొదలుకుని బీద వరకు ఆటపాటలతో వినోదంతో, భోగలాలసులై ఉండేవారు.
  గోలకొండ పట్టణం రెండువందల యాభై సంవత్సరాలు సకల సంపద, వైభవంతో విరాజిల్లి, ప్రపంచాన్ని మిరుమిట్లు గొలిపేలా చేసింది. ఈ పట్టణాన్ని 1687లో ఔరంగజేబు చక్రవర్తి మోసంగా జయించి, సర్వనాశనం చేశాడు. ఫలితంగా గోలకొండ పట్టణపు అందచందాలు, వైభవాలు, ఠీవి పరిసమాప్తి చెందాయి.

రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం