• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భిక్ష

ఆలోచించండి - చెప్పండి 

1. 'అతిథిదేవోభవ' అంటే ఏమిటి?

జ: అతిథిని దేవుడిగా అనుకుని పూజించాలి. సేవించాలి. తగిన విధంగా గౌరవించాలి. అతిథి దేవుడికి ప్రతిరూపం. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా ఇంటికి వచ్చేవాడు అతిథి. అతిథి అనే పదానికి అర్థం తిథి, వార, నక్షత్రాలు చూసుకోకుండా ఇంటికి వచ్చేవాడు అని.
 

2. ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా భావించేవారు. ఎందుకు?

జ: ప్రాచీనకాలంలో 'భిక్ష' స్వీకరించడం పవిత్రకార్యంగా భావించేవారు. మహర్షులు వేద పరిజ్ఞానం కలిగి శాస్త్రాభ్యాసనం చాలా మందికి చేయించేవారు. మునులు తమ ఇంటికి 'భిక్ష'కు రావడం ప్రజలు పవిత్రంగా భావించేవారు. అలా వచ్చినవారిని దైవంతో సమానమని భావించేవారు. భిక్షకులు నిస్వార్థంతో ఉండేవారు. వారు 'భిక్ష' స్వీకరించిన దాంతో మాత్రమే జీవించేవారు. 'భిక్ష' పెట్టడంద్వారా పుణ్యం వస్తుందని అందరూ దాన్ని ఆచరించేవారు. ధర్మశాస్త్రాలు తెలియజేసిన విధంగా జీవించేవారు. అందుకే ప్రాచీనకాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా భావించేవారు.
 

3. భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న తేడాలేమిటి?

జ: నాటి కాలంలో భిక్ష కోసం వచ్చిన వారిని సాక్షాత్తు దేవుడిగా భావించి, వారి కాళ్లకు చేతులకు నీళ్లిచ్చి; పూలు, గంధంతో అర్చించి, అన్నంపెట్టి నెయ్యి వేసి, పండ్లు, పరమాన్నం, పిండివంటలు చేర్చి భక్తి విశ్వాసాలతో భిక్షనుసమర్పించేవారు.

   నేట కాలంలో 'భిక్ష' అనే పదం అంతరార్థాన్ని సగం మర్చిపోయారు. మహర్షులు, సన్యాసులు, 'భిక్ష' అడగడం కనిపించడం లేదు. బిచ్చగాళ్లకు అనాసక్తితో అయిష్టంగా మిగిలిన పదార్థాలను పెడుతున్నారు. నేటి కాలానికి భిక్ష ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరం ఉంది. దానం చేయాలన్న సుగుణం ఇంటిలో నుంచి పెట్టే భిక్ష నుంచి అలవడుతుంది.
 

4. భిక్ష దొరకని వ్యాసుడు కోపించాడు కదా! దీనిపై మీ అభిప్రాయమేమిటి?

జ: వ్యాసుడు వేద విభజన చేసి, భారతాన్ని రచించి, పురాణాలను అందించిన బ్రహ్మజ్ఞాని. అలాంటి వ్యక్తి తనకు భిక్ష దొరకలేదని కోపం ప్రదర్శించడం ఆయన ఆకలికి, అగౌరవానికి ప్రతీక అన్నది నా అభిప్రాయం.

* చాలామంది మునులు పిడికెడు వరి గింజలు, శాకాహారం, దుంపలు; రోళ్ల దగ్గర చెదిరిపడిన బియ్యం ఏరుకుని జీవనం సాగించిన తీరును వ్యాసుడు ఏమాత్రం గుర్తుంచుకోలేదు.

* 'భిక్ష'ను ఇచ్చే ప్రాంతాన్ని ప్రతినిత్యం కన్నతల్లిలా భావించకపోవడం అత్యంత దయనీయంగా భావిస్తాను. వ్యాసుడు కోపగించుకోకుండా ఓపికతో ఉంటే బాగుండేది.
 

5. 'కోపం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది'. దీని గురించి రాయండి.

జ: 'తన కోపమే తనకు శత్రువు' అన్న సుమతి శతకకర్త మాటలు వాస్తవం. కోపం వస్తే మనిషికి ఏది మంచి, ఏది చెడో తెలుసుకుని ప్రవర్తించే తీరు అతడిలో కనిపించదు. కోపం కారణంగా ఉన్న వారందరిని దూరం చేసుకుని బతుకుతున్న వారిని గమనించవచ్చు.

* కోపాన్ని విడనాడిన జీవితం - పూలవనంలా వికసిస్తుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.

* కోపం వల్ల విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాం. జ్ఞానాభివృద్ధికి కోపం ఒక ఆటంకం అని తెలుసుకోవాలి.
 

6. ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని ఎందుకు అంటారు?

జ: ఉన్న ఊరు కన్నతల్లితో సమానం. ఎందుకంటే కన్నతల్లి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది. అలాగే ఉన్న ఊరు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఊరడిస్తుంది. కన్నతల్లి తన పిల్లలకు కావాల్సిన వాటిని, ప్రేమను, ఆత్మీయతను ఎలా అందిస్తుందో ఊరు కూడా ప్రేమను, ఆత్మీయతను అందిస్తుంది. అందుకే ఊరికి ఉపకారం చేయాలే తప్ప అపకారం చేయకూడదు. అలా చేస్తే కన్నతల్లిని మోసం చేసినట్లు అవుతుంది.

* పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన కన్నతల్లిని, ఆత్మీయతానురాగాలు పంచి మంచి వాతావరణాన్ని అందించిన ఊరిని మరవకూడదు. మనకు అమ్మ ఎంత గొప్పో! ఉన్న ఊరు కూడా అంతే. అందుకే ఉన్న ఊరును కన్నతల్లితో సమానమని అంటారు
 

7. భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేం అర్థమైంది?

జ: భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి అతడు శిష్యులతో కలిసి భోజనం చేయాలన్న వ్రతం కలిగినవాడని అర్థమైంది. అవసరమైతే ఉపవాసమైనా ఉండేవాడని తెలుస్తుంది. వ్యాసుడికి స్వార్థం లేదు. అతడిని గృహిణి తినమనగానే తినకుండా ఉన్నాడు. దీన్నిబట్టి తన వెంట ఉన్న శిష్యుల పట్ల ఆదరాభిమానాలు ఉన్నవాడని తెలుస్తుంది.
 

8. ఈ పాఠం, ఆధారంగా నాటి కాలంలో గురు శిష్యసంబంధం గురించి వివరించండి.

జ: ఈ పాఠం ఆధారంగా నాటి కాలంలో గురుశిష్య సంబంధం గొప్పగా ఉండేదని తెలుస్తుంది. అందరూ కలిసి భిక్షాటనం చేసేందుకు వెళ్లేవారని అర్థమవుతుంది. గురు శిష్యులు అన్యోన్యంగా కలిసి గడిపేవారు. ఒకే మాటపై ఉండేవారు. గురువు తన శిష్యులతో కలిసి మాత్రమే భోజనం చేసేవాడు. గురువు శిష్యులతో కలిసి స్నాన, ఆచమనాదులు పూర్తిచేసేవాడు భిక్ష దొరకని వేళలో ఉపవాసం చేసేవారు. సూర్యుడు అస్తమించే లోగా భోజనం చేసేవారు. గురువు మాటలను శిష్యులు తప్పకుండా ఆచరించేవారు. గురువుతో కలిసి రాత్రి మఠంలోనే గడిపేవారు.

ఇవి చేయండి 

I. అవగాహన - ప్రతిస్పందన 

1. కింది పద్యం చదవండి. శ్రీనాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో తెలపండి.

సీ. వచియింతు వేములవాడ భీమన భంగి

     నుద్దండ లీల నొక్కొక్కమాటు

     భాషింతు నన్నయభట్టు మార్గంబున

     నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు

     వాక్పత్తు తిక్కయజ్వ ప్రకారము రసా

     భ్యుచిత బంధమున నొక్కొక్కమాటు

     పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని దేవ

     సూక్తివైచిత్ర నొక్కొక్కమాటు

తే.గీ. నైషధాది మహాప్రబంధములు పెక్కు

        చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ

        ఇపుడు చెప్పదొడంగిన యీ ప్రబంధ

        మంకితము సేయు వీరభద్రయ్యపేర (కాశీ 1 - 18)

జ: పై పద్యంలో శ్రీనాథుడు తన గురించి తాను చెప్పుకున్నాడు.

శ్రీనాథుడు తన గురించి చెప్పిన విషయాలు

* వేములవాడ భీమనలా ఉద్దండలీలలా కవ్వితం చెబుతాను.

* నన్నయ మార్గం 'ఉభయవాక్ప్రౌఢి'లా ఒక్కోసారి భాషిస్తాను.

* తిక్కన 'రసాభ్యుచిత బంధం'గా రాస్తాను.

* ఎఱ్ఱనలా 'సూక్తివైచిత్రి'ని కనబరుస్తాను.

* నైషధం లాంటి మహాప్రబంధాలు చెప్పినాడను.
 

2. 'అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న' అనే అంశంపై తరగతిలో చర్చించండి.

జ: మనకు ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. ఏ దానం చేసినా ఇంకా కావాలనే ఆశ ఎదుటివారిలో మిగిలే ఉంటుంది. కానీ అన్నదానం చేస్తే ఆ దానం పొందినవారి నుంచి 'చాలు' అనే మాట తప్పకుండా వస్తుంది. అంటే ఎదుటివారిలో 'తృప్తి'ని మనం చూడవచ్చు. ప్రపంచంలో ఎందరో తిండిలేక చనిపోతున్నారు. అన్నార్థులకు అన్నం పెడితే వారు తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. అన్నదానం ఎంతచేస్తే అంత శుభం కలుగుతుంది. అందుకే ఏ క్షేత్రాన్ని దర్శించినా అన్నదాన సత్రాలు అనేకం కనిపిస్తాయి. వాటికి విరివిగా సహయం చేసేవారు కూడా ఉంటారు. అందుకే అన్నదానం అన్ని దానాల్లో గొప్పది.

3. శ్రీనాథ కవి గురించి వివరించండి.

జ: శ్రీనాథుడు 1380 - 1470 మధ్యకాలానికి చెందినవాడు. మారయ, భీమాంబలకు జన్మించాడు. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు. విజయనగర రాజు ప్రౌఢదేవరాయల ఆస్థానంలో 'గౌడడిండిమభట్టు'ను ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. శ్రీనాథుడు మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగారనైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్రలు రచించాడు.

*  శ్రీనాథుడి చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి.

*  ఉద్ధండలీల, ఉభయ వాక్ప్రాఢి, రసాభ్యుచితబంధం, సూక్తివైచిత్రి...ఆయన కవితా లక్షణాలు.

*  శ్రీనాథుడు సీస పద్యాలకు ప్రసిద్ధి. శ్రీనాథుడి జీవిత చరిత్రనే 15వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారు.
 

4. 'ఆ కంఠంబుగ.... శిలోంఛప్రక్రముల్ తాపసుల్! పద్యానికి ప్రతి పదార్థం రాయండి.

జ: పద్యం:

శా. ఆకంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా

      లేకున్నం గడు నంగలార్చెదవు మేలే? లెస్స! శాంతుండవే!

      నీ కంటెన్ మతిహీనులే కటకటా! నీవార ముష్టింపచుల్

      శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్!

ప్రతిపదార్థం

ఆకంఠంబుగ =        గొంతుదాకా
నిప్డు =         ఇప్పుడు
మాధుకర భిక్షాన్నంబు =         ఇల్లిల్లూ తిరిగి అన్నం సేకరించుకోవడం
భక్షింపగా =        తినేందుకు
లేకున్నన్ =        లేకపోయేసరికి
కడున్  =        ఎక్కువ
అంగలార్చెదవు =       దుఃఖించెదవు
మేలే  =       నీకు మంచిదా?
లెస్స  =       బాగుంది
శాంతుండవే =       నీవు శాంత స్వభావుడవా?
నీ కంటెన్ =       నీ కన్నా
మతిహీనులే =      బుద్దిలేనివారా?
కటకటా =      అయ్యయ్యో
వారముష్టింపచుల్ =      సహజంగా పండే వడ్లను పిడికెడు తీసుకుని ఆకలి తీర్చుకునే వాళ్లు. 
శాకాహారులు =      కూరగాయలు మాత్రమే తినేవారు.
గందభోజులు =       దుంపలు తినేవారు
శిల =     శిలప్రకములు (పొలాల్లో రాలిన గింజలను ఏరుకుని బతికేవారు) 
ఉంచప్రక్రముల్ =     రోళ్ల దగ్గర చెదిరిపడిన బియ్యం గింజలు ఏరుకుని జీవనం సాగించేవారు.
తాపసులు =     తపస్సు చేసుకునేవారు (మునులు)

         

భావం: ''గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా! ఇది నీకు మంచిదా? బాగుంది. నిజంగా నువ్వు శాంత స్వభావుడవా? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్లబుచ్చేవారు; శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకునేవాళ్లు; రోళ్ల వద్ద చెదిరి పడిన బియ్యం ఏరుకుని జీవనం సాగించే మునులు నీ కంటే తెలివితక్కువ వాళ్లా?" అని ఆ ఇల్లాలు వ్యాసుడిని ప్రశ్నించింది.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత 
 

1. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
 

అ) పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.

జ: వ్యాసుడు కాశీనగరంలో బ్రాహ్మణవీధిలో పట్టపగలు శిష్యులతో భిక్ష కోసం ఇల్లిల్లూ తిరిగాడు. కానీ అందరూ ఏదో ఒక కారణం చెప్పి భోజనం పెట్టలేదు. పుణ్యస్త్రీలైన కాశీనగర బ్రాహ్మణ స్త్రీలు భిక్ష సమర్పించలేదని అతడుఆశ్చర్యపడ్డాడు. ఆ రోజు ఉపవాసమే చేద్దామనుకున్నాడు.  వ్యాసుడు శిష్యులతో ఆరాత్రి గడిపి, మరునాడు బిక్షాటనం చేశాడు. కానీ మొదటి రోజులాగానే ఎవరు కూడా భిక్ష పెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను నడివీధిలో విసిరికొట్టి ''కాశీ పట్టణంలో నివసించే మనుషులకు మూడుతరాల దాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక" అని శాపం పెట్టబోయాడు. ఆ సమయంలో పార్వతిదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చి వ్యాసుడికి కొన్ని మేలుకొలుపు మాటలు చెప్పి అతడిని భోజనానికి పిలిచింది.

   అప్పుడు వ్యాసుడు 'నా శిష్యులు లేనిదే నేను మీ ఇంట భోజనం చేయలేను. ఈ రోజు కూడా ఉపవాసం తప్పదు' అన్ని అన్నాడు. ఆ మాటలు విని ఆ ఇల్లాలు 'మునీంద్రా! విశ్వనాథుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువులా కోరిన పదార్థాలన్నీ పెట్టగలను. నువ్వు శిష్యులను తీసుకుని రా' అని అంది. శిష్యులను తీసుకుని వ్యాసుడు గంగానదికి వెళ్లి స్నాన, ఆచమనాదులు పూర్తి చేసుకుని వచ్చాడు. చంద్రముఖి అయిన ఆ ఇల్లాలు వారికి ఎదురువెళ్లి ఆహ్వానించింది. అందరికి వడ్డన చేసింది.

ఆ) కోపం కారణంగా వ్యాసుడు కాశీనగరాన్నే శపించాలనుకున్నాడు కదా! 'కోపం మనిషి విచక్షణను నశింపజేస్తుంది' అనే అంశం గురించి రాయండి.

జ: 'కోపం - అన్ని రకాల నాశనానికి మూలం' ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనిషి హద్దుదాటి ప్రవర్తిస్తాడు. మంచి చెడులను లెక్కగట్టడు. ఎదురుదాడికి ప్రయత్నిస్తాడు. ఎవరిని పరిగణనలోకి తీసుకోడు. విచక్షణ కోల్పోయిన మనిషి విలువలు గుర్తించడు.

   కోపం అంతా చల్లారాక నిజం తెలుసుకుని దుఃఖించే సందర్భాలు గమనించవచ్చు. అంటే కోపం మనిషిని పాతాళానికి తీసుకెళుతుంది. అందుకే కోపాన్ని తగ్గించుకోవాలి. జీవితంలో అనేక సమస్యలు, సంఘటనలు ఎదురవుతుంటాయి. వాటిని పరిశీలించి సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి. కోపం మనవారందరిని మనకు దూరం చేస్తుంది. సహనం మనల్ని ఉన్నతులను చేస్తుంది. చరిత్రను గమనిస్తే కోపం కారణంగా రాజ్యాలు కోల్పోయిన వారెందరో ఉన్నారు. దగ్గరి వారందరనికి కోల్పోయి అవసాన దశలో ఆత్మీయుల అండ లేకుండా కాలం వెలిబుచ్చినవారు ఉన్నారు.

2. కింది ప్రశ్నలకు అయిదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
 

అ) వ్యాసుడి పాత్ర స్వభావాన్ని వివరించండి.

జ: * కాశీలో విద్యాగురుడైన మహర్షి వ్యాసుడు.

* కాశీ నగరంలో శిష్యులతో కలిసి భిక్ష కోసం ఇల్లిల్లూ తిరిగేవాడు.

* పుణ్య స్త్రీలు ఉన్న కాశీలో భిక్ష దొరకని సమయలో ''ఏ పాపిష్టి వాడి ముఖం చూశానో" అని అనుకున్న వ్యక్తి వ్యాసుడు.

* వ్యాసుడు కొంచెం కోపిష్టి.

* భిక్ష దొరకని సమయంలో భిక్ష పాత్రను వీధిలో విసిరి కొట్టి కాశీ నగరాన్ని శపించబోయిన వ్యక్తి.

* 'శిష్యులతో కలిసి భుజించడం' అనే వ్రతం విడిచి పెట్టనివాడు.

* శిష్యులతో కలసి గంగానదికి వెళ్లి స్నాన, ఆచమనాదులను చేసే గురువు.

* తన కోపాన్ని దిగమింగి తన తప్పును తెలుసుకున్న మంచి వ్యక్తి.
 

ఆ) 'నేడు నిన్నటికి మఱునాడు నిక్కువంబు' ఈ మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటి?

జ: 'నేడు నిన్నటికి మఱునాడు నిక్కువంబు' అనే ఈ మాటలు వ్యాసుడు సామాన్య స్త్రీ వేషంలో వచ్చిన పార్వతీదేవితో అన్నాడు.

     భిక్ష దొరకడం లేదని కాశీనగరాన్ని శపించబోయిన వ్యాసుడిని సామాన్య స్త్రీ వేషంలో వచ్చిన పార్వతీదేవి 'మా ఇంటికి భోజనానికి రా! ఆ తర్వాత నీతో మాట్లాడతాను' అన్న సందర్భంలో వ్యాసుడు పై మాటలు అన్నాడు.
     దానిలోని అంతరార్థం ఏమిటంటే నిన్నటిలాగానే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదు అనే తీరుగా అన్నాడు. పై మాటలకు అర్థం 'ఈరోజు నిన్నటికి మరుసటిరోజే కదా' అని పైభావం వచ్చేలా అన్నాడు వ్యాసుడు.
 

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.

అ) 'కోపం తగ్గించుకోవడం మంచిది!' అనే అంశాన్ని బోధిస్తూ మిత్రుడికి లేఖ రాయండి.
 

లేఖ 

హైదరాబాద్  
తేదీ: 20-04-2015

ప్రియమైన స్నేహితుడు విఠలేశ్వర్‌కు రాయునది.

   నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. నువ్వక్కడ క్షేమమని అనుకుంటా. మొన్ననే మా తెలుగు మాస్టారు 'భిక్ష' అనే తెలుగు పాఠ్యాంశం చెప్పారు. ఆ పాఠంలో 'మనిషికి కోపం మంచిది కాదు' అనే సందేశం ఉంది. అప్పుడువెంటనే నువ్వు గుర్తుకు వచ్చావు. మనిద్దరం గత ఏడాది కలిసి చదువుకునే సమయంలో నీ కోపం కారణంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. కోపం అన్ని రకాల నాశనానికి మూలం. అది మనలోని విచక్షణను చంపుతుంది. కాబట్టి మనం శాంత స్వభావాన్ని పెంపొందించుకోవాలి. అది మనల్ని గౌరవింపజేస్తుంది. ఈ జీవితం చాలా చిన్నది. అందరితో కలిసి ఉండాలి. మంచిగా కాలం గడపాలి. వీటిని గుర్తుంచుకో.
   తెలుగులోని 'భిక్ష' పాఠ్యాంశాన్ని శ్రద్ధగా విను. విన్న తర్వాతనైనా నువ్వు మంచివాడిగా మారతావని ఆశిస్తున్నాను. మీ గురువుగారితో కోపం వల్ల జరిగే నష్టాలు మరింతగా అడిగి తెలుసుకో. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నీ అనుభూతిని తెలియజేయగలవు.

నీ ప్రియమిత్రుడు

నిదానం సత్యనారాయణ,

పదో తరగతి

జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,

నారాయణగూడ

హైదరాబాద్

     చిరునామా 

      ఫిరంగి విఠలేశ్వర్ 

      పదోతరగతి 

      జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, 

      కనిగిరి, ప్రకాశం జిల్లా
 

ఆ) భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష .... లాంటి పదాలతో ఒక చక్కటి భావాన్నీ ప్రకటించే కవిత రాయండి.

జ: కవిత

     దేవుడు పెడుతుంటాడు మనందరికీ పరీక్ష

     నీవు గమనించి చేసుకోవాలి సమీక్ష

     లేకుంటే గురవుతావు వివక్ష

     పొందుతావు నీవు ఆయన శిక్ష

     అందుకే నీవు కోరుకోవాలి ఆయన రక్ష

     కోరితే పెడతాడు నీకు భిక్ష

Posted Date : 23-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం