• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భిక్ష

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని 


* శ్రీనాథుడు సీస పద్య రచనకు ప్రసిద్ధి. ఆయన రచించిన ఏవైనా 5 పద్యాలు వేర్వేరు గ్రంథాల నుంచి సేకరించండి. వాటిని రాయండి. తరగతిలో చదివి వినిపించండి. గోడపత్రికలో ప్రదర్శించండి.
జ: శ్రీనాథుడి సీసపద్యాలు

 

1. 'శృంగార నైషధము'
సీ. తల్లి మదేక పుత్రక, పెద్ద కన్నులు
     గానదిప్పుడు; మూడుకాళ్ళముసలి
     యిల్లాలు గడు సాధ్వియేమియు నెఱుఁగదు
     పరమ పాతివ్రత్య భవ్యచరిత
     వెనుక ముందరలేరు నెనరైన చుట్టాలు
     లేవడి యెంతేని జీవనంబు
     గానక కన్న సంతానంబు శిశువులు
     జీవన స్థితికేన తావలంబు

తే. కృపదలంపగదయ్య యో నృపవరేణ్య!
     యభయమీవయ్య! యోతుహినాంశువంశ!
     కావగదవయ్య యర్థార్థి కల్పశాఖి,
     నిగ్రహింపకుమయ్య యోనిషధరాజ!

 

2. భీమేశ్వర పురాణం
సీ. ఒకచోటగోటి ఫల్ల్యుడు రాజకోటీర
     విభ్రాజితోత్సంగ వృద్ధగంగ
     యొకచోట బీదాంబికోన్నత స్తన భరు
     స్ఫాల జరిత కల్లోల యేల
     యొకచోట జటుల నక్రకుళీర పాఠీన
     తోయ గర్భాభోగ తుల్యభాగ
     యొకచోట నప్సరో నికర సంసేవి తాం
     తరము శ్రీ సప్త గోదావరంబు

తే. నమరు నాగర ఖండ సిద్ధాంత జాతి
     నాగవల్లీ సమాక్రాంత పూగ ఖండ
     మండితో ద్యాన వాటికా ఖండ విభవ
     పాత్రమగు భీమ మండలీ క్షేత్రమునకు

 

3. కాశీఖండం
సీ. ధర్మంబు కాశి కాస్థాన మధ్యంబున
     నాల్గు పాదంబుల నడచియాడు
     నర్థంబు కాశీ పురాంగణంబున యందు
     నానా ప్రకారమైనటున మిగులు
     గామంబుకాశి కాకటక ఘంటా వీధి
     గర్వించు రాజలోకంబు ఠేవ
     మోక్ష సంపదలు కాశీ క్షేత్రమున యందు
     ద్రవ్వి తండంబులై నివ్వటిల్లు

తీ. కాశికళ్యాణముల కాది కారణంబు
     కాశి యణి మాది సిద్ధుల కాట పట్టు 
     కాశి జనలోక సంకల్ప కల్పకంబు
     కలుష పిశితంబు మెసవు రాకాసికాశి

 

4. హరవిలాసం
సీ. అనువు దప్పిరి నొచ్చిరలసి రాపద నొంది
     రాదవదలైరి చీకాకుపడిరి
     యంగలార్చిరి విచ్చి రాఱడి బొందిరి
     బ్రమసిరి పాఱిరి పల్ల టివిరి
     బెగ్గడివిరి పికాపికలైరి సొలసిరి 
     కులకుల కూసిరి కుతిల పడిరి
     గగ్గులకాఱైరి కలగి రోటాఱిరి
     వెలవెల్లనైరి నివ్వెఱగు పడిరి

తే. యసపు సవులైరి గుజగుజయైరిడస్సి
     రొల్లబోయిరి వెగ్గిరి తల్లడిలిరి
     సిగ్గువడి రొచ్చవడిరి యిస్సిస్సియైరి
     తారకుని చేత మునులు బృందారకులును

 

5. శివరాత్రి మహాత్మ్యం
సీ. స్ఫటిక రత్న గృహంబు సర్వం సహాకాంత
     కభిదాంతరంబు దుగ్ధాంబు నిధికి
     మణి దర్పణము నభోమణి మార్గలక్ష్మికి
     జంద్రా తపమునకు జన్మభూమి
     యర్ధేందు మకుటాట్టహాసంబునకు జోడు
     పౌలస్త్యగిరికి సబ్రహ్మచారి
     ప్రతిబింబమభ్రము ప్రభువారణమునకు
     ననుగు జుట్టము శారదాభ్రములకు

తే. గమఠ తిమినక్ర విక్రమక్రమ విహార
     చటులతర వీచికా ఘటా సమధి రూఢ
     హంసకుల సన్నినాద సంవ్యాప్త దిగ్వి
     భాగమీక్షించె నతడు తడాగ మెదురు

 


రచయిత: అంజా గౌడ్

 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం