• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భూమిక

ఆలోచించండి - చెప్పండి


ప్రశ్నలు - సమాధానాలు
1. కథలకు, కవిత్వానికి భేదం ఏమిటి? మీకు ఏవంటే ఇష్టం? ఎందుకు?
జ: జరిగిన సంఘటనల ఆధారంగా కొంత కల్పితాలను కలగజేసి ఏకబిగిగా చదివేలా ఉండేవి కథలు. చారిత్రక, సామాజిక పరిణామాలను, మానసిక సంఘర్షణలను తెలియజేస్తాయి. సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ఇక కవిత్వం ప్రాసబద్దంగా పలుకులను వాడుతూ అనురక్తి కలిగిస్తుంది. కవిత్వం వివరణలతో, చెప్పే విషయం సూటిదనంతో కొనసాగుతుంది. కవిత్వం అన్ని వర్గాల ప్రజలకు అవగాహనకు రాదు. నాకు కవిత్వం, కథలు రెండూ ఇష్టమే. ఎందుకంటే కథల ద్వారా నీతులను తెలుసుకుని జీవితానికి అన్వయం చేసుకోవచ్చు. అవి ఆలోచింపజేస్తాయి. కవిత్వాలు ప్రాసబద్దతతో సాగిపోతాయి. విషయం సూటిగా ఉంటుంది. తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని ఇస్తాయి.
 

2. నాటి హైదరాబాద్ రాజ్యంలో హక్కులు, స్వాతంత్య్రం కోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?
జ: నాటి హైదరాబాద్ రాజ్యాన్ని నవాబులు పరిపాలించేవారు. వారు ప్రజలను వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టేవారు. బానిసలుగా చూసేవారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేయించేవారు. రజాకార్లు విజృంభించి నానా ఇబ్బందులు పెట్టేవారు. వారు చేసిన అఘాయిత్యాలు ప్రజలను ఉద్యుక్తులను చేశాయి. ఏ పని చేయాలన్నా వారి కనుసన్నలల్లోనే కొనసాగేది. స్వాతంత్య్రం లేకుండా నిరంకుశలుగా పాలించారు. దాంతో సామాజిక సంక్షోభం మొదలైంది. ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రజలు ఉద్యమించి ఉంటారు.
 

3. హైదరాబాద్ నగరం జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చిత్రించడం అంటే మీకేం అర్థమైంది?
జ: హైదరాబాద్ నగరంలో జీవించిన ప్రజల జీవన విధానాలను, వారి ఆచార సంప్రదాయాలను అనేకమంది వివిధ భాషల్లో తెలియజేశారు. కానీ, తెలుగుభాషలో అలాంటి ప్రయత్నం జరగలేదు. నెల్లూరి కేశవస్వామి హైదరాబాద్ నగరంలో నివసిస్తూ అక్కడ నివసిస్తున్న ప్రజల తీరును, సామాజిక, చారిత్రక పరిణామాలను సంక్షుభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణలను తెలుగుభాషలో రాశారు.
         నెల్లూరి కేశవస్వామి అందరికీ అర్థమయ్యేలా ఆనాటి హైదరాబాద్ నగర జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చాలా చక్కగా తెలియజేసినట్లు నాకు అర్థమైంది.

 

4. జీవభాష అంటే ఏమిటి? జీవభాషను కథల్లో చిత్రించడం అంటే ఏమిటి?
జ: ఒక ప్రాంతంలోని వారు అనునిత్యం భావ ప్రకటనకు ఉపయోగించే భాషను జీవభాష అంటారు. బతికి ఉన్న, వాడుకలో ఉన్న భాషను జీవభాష అంటారు. అందరూ జనవ్యవహారంగా ఉన్న భాషను మాట్లాడతారు. అందరూ మాట్లాడే ఆ భాషలోనే అందరికీ అర్థమయ్యేలా కథలు రాయడం జరిగితే అది జీవభాషను కథల్లో చిత్రించడం అంటాం. అలా రాస్తే అందరికీ అప్పటి పరిస్థితులు, సామాజిక చైతన్యాలు, మానసిక సంఘర్షణలు అర్థమవుతాయి. జీవభాష అందరికీ ఆమోదయోగ్యమైంది. ఆ భాష వ్యక్తుల హృదయాల్లోకి చొచ్చుకుపోతుంది. భావజాల వ్యాప్తి జీవభాష ద్వారా సాధ్యం. ఉద్యమం నింపాలన్నా, చైతన్యం రగిల్చాలన్నా, జీవభాష ఆయుధంగా పనిచేస్తుంది. ఆ భాషను హైదరాబాద్‌లో నివసిస్తూ ప్రజల జీవనాన్ని గమనించిన నెల్లూరి కేశవస్వామి వాడారు.
 

5. 'చార్‌మినార్' కథలను ఎందుకు చదవాలి?
జ: చార్‌మినార్ కథల్లో హైదరాబాద్ రాజ్యం చరిత్ర, సంస్కృతి, మానవ సంబంధాలు, ముస్లిం జీవితాలను వివరించారు. ఇందులో విముక్తి, రూహి ఆపా, షరీఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, ఆఖరి కానుక, భరోసా అనే శీర్షికలతో రాసిన 11 కథలు ఉంటాయి.
     రెండు మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవితంలో వైవిధ్యాలను, కలగలిపే తత్వాలను తెలియజేశాయి. కొన్ని అసాంఘిక శక్తులు హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో హిందూ, ముస్లిం సంఘర్షణల పేరిట అపార్థాలు సృష్టించి మారణకాండకు దారితీశాయి. హిందూ, ముస్లింల మధ్య అసలు నేరస్థులు, వారి రాజకీయ లక్ష్యాలు తెలియక అనుమాన బీజాలు పెరిగాయి. ఆ సందర్భంలో వారి సఖ్యత కోసం వెలువడిన కథలు చార్‌మినార్ కథలు. అందుకే వాటిని చదవాలి.

 

6. రెండు మతాల మధ్య ఆలోచనలు, సంస్కృతిలో ఆదాన ప్రదానాలు జరగడం అంటే ఏమిటి?
జ: రెండు మతాల మధ్య వారి జీవన విధానం, సంస్కృతి ఇరువర్గాలను ప్రభావితం చేస్తాయి. అంటే ఒక మతంలోని వారి జీవన విధానం, ఆచార వ్యవహారాలు మరో మతం వారిని అనుసరింపజేయవచ్చు. అదేవిధంగా మరో మతంలోని సంస్కృతీ సంప్రదాయాలు వీరిని ప్రభావితం చేయవచ్చు. సంస్కృతి సమన్వయం జరుగుతుంది. ఇచ్చిపుచ్చుకోవడంలా రెండు మతాల మధ్య ఆలోచనలు, సంస్కృతులు విస్తరించడాన్ని ఆదాన ప్రదానాలు జరగడం అంటారు.
      అలా జరిగితే జీవన విధానంలో పెను మార్పులు వస్తాయి. మానవ సంబంధాలు బలపడతాయి.

 

7. నెల్లూరు కేశవస్వామి హృదయం చార్‌మినార్ కథల్లో ప్రతిబింబిస్తుందని మీరెలా చెప్పగలరు?
జ: హిందూముస్లిం సఖ్యత కోసం నెల్లూరు కేశవస్వామి రచయితగా చలించిపోయారు. అశాంతిగా నిద్రలేని రాత్రులు గడిపారు. రాజకీయాల కోసం మానవ సంబంధాలు, మమతలు, మతాలు, కులాతీత, మతాతీత స్నేహాలు, ఆత్మీయతలు బలికావద్దని ఓల్డ్‌సిటీ జీవితాన్ని చార్‌మినార్ కథలుగా రాశారు. ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూ కేశవస్వామి ఈ కథలు రాశారు. ఇవి కేవలం కథలు మాత్రమే కావు. వాస్తవ జీవితాలు, సామాజిక పరిణామాలు, సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాత్మక కథలు. ఈ కథలో నెల్లూరి కేశవస్వామి హృదయం ప్రతిబింబిస్తుంది.
 

8. హృదయ సంస్కారం అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జ: మనసు మంచి నడవడిని కలిగి ఉండటాన్ని హృదయ సంస్కారం అంటారు. చెడు ఆలోచనలు చేయకుండా మంచి ఆలోచనలను చేసి అందరిని మెప్పించడం హృదయ సంస్కారం అవుతుంది. కోపం లేకపోవడం, సామరస్యంతో ఉండటం, త్యాగ భావన ఉండటం, అతి ప్రవర్తన లేకుండటం, ఎవరి మనసు నొప్పించకుండా ఉండటం, మానవ సంబంధాలను దెబ్బతీయకపోవడం, ప్రతీకారం లేకుండటం..... ఇలాంటివి హృదయ సంస్కారానికి ప్రతీకలు. హృదయ సంస్కారం వల్ల సున్నితత్వం అలవడుతుంది. ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది.
 

9. ''స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది'' - సమర్థించండి.
జ: స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది. ఎందుకంటే ఒకరినొకరు వారివారి సంప్రదాయాలను గౌరవిస్తూ, కలిసిమెలిసి జీవిస్తారు. ఆ సమయంలో పంతాలు, పట్టింపులకు వెళ్లకుండా అనేక భావాలను స్వీకరిస్తారు, ఆచరిస్తారు. ఆ స్నేహం ముందు మతం జాడలు కనిపించవు. చరిత్రను గమనిస్తే ఎంతోమంది రాజులు, వారి స్నేహాలను ఎలా నిలబెట్టుకున్నారో తెలుస్తుంది.
 

10. పేదల కష్టాలు ఎట్లా ఉంటాయి? పేదల జీవితాల్లో మార్పులు రావడానికి ఏం చేస్తే బాగుంటుంది?
జ: పేదల కష్టాలు కూడు, గుడ్డ, వసతి లేకుండా కడు హీనంగా, జీవితమే పెనుభారంగా ఉంటుంది. కష్టం చేసి కష్టాలు తీర్చుకోలేని దీన స్థితిలో ఉంటారు. నిరక్షరాస్యులుగా నిరుపేద జీవితాలను అనుభవిస్తారు. పని దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పేదల జీవితాల్లో మార్పు రావాలంటే వారికి ప్రభుత్వం పనిని కల్పించాలి. ఉండేందుకు ఇళ్లను నిర్మించాలి. చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరకులను అందించాలి. ముఖ్యంగా ఉచిత విద్య అందించాలి. విద్య ద్వారా గొప్ప వ్యక్తులుగా తయారుకాగలరు. అలాగే ఉచిత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలి.
         పేదలకు ఉపాధి లభించే పథకాలు ప్రవేశపెట్టాలి. వారికి జీవితం పట్ల అనురక్తి కలిగేలా చైతన్య కార్యక్రమాలు చేపడితే వారు అభివృద్ధిపరంగా ఆలోచిస్తారు.

 

11. ఈ పాఠం ద్వారా నెల్లూరి కేశవస్వామి కథల గురించి తెలుసుకున్నారు కదా! దీని ఆధారంగా కథలు ఎట్లా ఉండాలో తెలపండి.
జ: నెల్లూరి కేశవస్వామి కథల గురించి తెలుసుకున్న తర్వాత కథలు సంస్కృతిని, మానవ సంబంధాలను, జీవితాలను, సామాజిక పరిణామాలను చిత్రించేలా ఉండాలి. కథలు అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలి. ఆలోచనా పరిధిని విస్తృతపరిచేలా ఉండాలి. కులమతాలకు అతీతంగా ఉండాలి. సంస్కారాన్ని పెంచేవిగా, మతాల సరిహద్దులను చెరిపివేసే 'స్నేహం'గా ఉండాలి. సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, ప్రాంతీయ పలుకుబడులతో మళ్లీమళ్లీ చదవాలనిపించేలా కథలు ఉండాలి.
 

 ఇవి చేయండి


 I. అవగాహన - ప్రతిస్పందన
1. కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఏమేం చేస్తారో చెప్పండి.
జ: కవులు, రచయితలు రాసిన పుస్తకాలను అందరికీ పరిచయం చేయడానికి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అతిథులను, ఇతర కవులను, రచయితలను, సాహిత్యాభిమానులను ఆహ్వానిస్తారు. ఎవరి చేతులమీదుగా ఆవిష్కరణ ఉంటుందో వారిని ముఖ్య అతిథిగా పిలుస్తారు. అందరినీ ముందుగా వేదికపైకి స్వాగతం పలికి, బ్యాడ్జీల అలంకరణ చేస్తారు. వందేమాతర గీతాలాపనతో మొదలై జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అధ్యక్షులుగా వ్యవహరించినవారు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహిస్తారు. గ్రంథాన్ని గురించి తెలిపి ముఖ్య అతిథితో వేదికపైనున్న అందరు వీక్షిస్తూండగా పుస్తకావిష్కరణ చేయిస్తారు. ఆ పుస్తకాన్ని ఆ ముఖ్య అతిథి అందరికీ అందిస్తారు.
ఒక్కొక్కరుగా ఆ పుస్తకం గురించి, ఆ రచయిత గురించి మాట్లాడతారు. ఆ పుస్తకంలోని అనేక విషయాలను ప్రస్తుతిస్తూ చదవాలనే కుతూహలాన్ని పాఠకుల్లో కలిగేలా చేస్తారు. ఆ తర్వాత ఆ పుస్తక రచయిత తాను ఆ పుస్తకాన్ని రాయడానికి గల నేపథ్యాన్ని తెలియజేస్తారు. సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతారు. వందన సమర్పణ అనంతరం జనగణమన గేయంతో సమావేశం ముగుస్తుంది.

 

2. నేటి సమాజానికి ఎలాంటి రచయితల అవసరం ఉందో చెప్పండి.
జ: నేటి సమాజంలోని అన్ని రకాల సమస్యలను అంతమొందించడానికి రచయితల అవసరం ఎంతైనా ఉంది. మానవ సంబంధాలను, సంస్కృతి సంప్రదాయాలను, విలువలను తెలియజేసే రచయితలు అవసరం. మనిషిలో పేరుకుపోయిన అసూయ, అధర్మం, అన్యాయం, పగ, ద్వేషం, స్వార్థం లాంటివి పోయి 'అందరికోసం ఈ జీవితం సేవలతోనే తరిద్దాం' అనే ఆలోచనను పెంచే రచయితలు కావాలి. సామాజిక చైతన్యం, వాస్తవ జీవితాల ఆవేదనలను తెలిపేవారు రావాలి. సంస్కారం నేర్పే రచయితలు ప్రస్తుతం మనకు అవసరం. సోమరితనం పోగొట్టేవారు, ధైర్యం నింపేవారు, స్నేహ విలువను చాటేవారు, అనుబంధాలను పెంచేవారు, వాడక భాషలో రాసే రచయితల అవసరం కూడా ఉంది.
     దేశం పట్ల అభిమానం, సమాజ సేవ కోసం ఆరాటపడే రచయితలు అవసరం. అడుగంటుతున్న విలువలను కాపాడే రచయితలు నేటి సమాజానికి అవసరం.

 

3. పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి    

ll. వ్యక్తీకరణ - సృజనాత్మకత

అ) 'ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు' దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జ: ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే కవులు, రచయితలు ఆనాటి పరిస్థితుల ఆధారంగానే రచనలు చేస్తారు. ఆనాటి కాలంలో జన వ్యవహారంలో ఉన్న భాషను తమ రచనలో వినియోగించేవారు. ఒక తరంలోని విషయాలు మరో తరానికి తెలియాలంటే సాహిత్యమే మూలంగా ఉంటుంది. ఆ సాహిత్య విషయాలు ముందు తరాలకు వారధులుగా నిలుస్తాయి.
  ఆనాటి కాలంలో హైదరాబాద్ రాజ్య స్థితిగతులు తెలుపుతూ వెలువడిన 'చార్‌మినార్' కథలు ఆనాటి పరిస్థితులను విశదపరుస్తాయి.
  ఒకనాటి పరిస్థితులు తెలియాలంటే ఆనాటి రచనలు చదవాలి. అవి ఆనాటి సంస్కృతులను, మానవ సంబంధాలను, ఆచార వ్యవహారాలను తెలియజేస్తాయి.

 

ఆ) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి.
జ: పలుకుబడి అంటే ఉచ్ఛారణలో ఉండే విలక్షణత. దీన్నే యాస అంటారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలంతా మాట్లాడే యాసను తెలంగాణ పలుకుబడులు అంటారు. ఆ పలుకుబడులు ప్రజల సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాల నుంచి వచ్చాయి.
తెలంగాణ పలుకుబడులకు ఉదాహరణలు:
1) నాకు యాదికుంది
2) పొద్దుగల్ల పోయిరా
3) గాయల్ల వస్తే ఏమన్నవో తెల్సా?
4) మాయన్న మస్కున పోయిండు
5) కూసున్న జాగల ఉండి కుంపటి పెట్టిండు

 

ఇ) ''తెలంగాణ కథ పుట్టుక నుంచి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది'' అనే వాక్యం ద్వారా మీకేం అర్థమైందో వివరించండి.
జ: తెలంగాణ కథ పుట్టుక నుంచి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది అనే వాక్యం ద్వారా నాకేం అర్థమైందంటే తెలంగాణ కథలు సామాజిక చైతన్యం ఆధారంగా నిర్మితమయ్యాయని, ఆనాటి సమాజంలోని విషయాలతో ముడిపడినట్లు తెలుస్తుంది. సామాజిక పరిణామాల క్రమంతో తెలంగాణ కథలు పుట్టినట్లు తెలుస్తుంది.
 తెలంగాణ కథలో సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛా వాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉర్దూ మాధ్యమం పోయి తెలుగు మాధ్యమం రావడం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు చిత్రించబడ్డాయి.

 

ఈ) 'నెల్లూరి కేశవస్వామి ఒక ప్రజాస్వామిక వాది. చైతన్యశీలి'. దీన్ని సమర్థించడానికి కొన్ని ఉదాహరణలు రాయండి.
జ: నెల్లూరి కేశవస్వామి హైదరాబాద్ రాజ్యంలోని పరిపాలనా విధానాలను, జీవన విధానాన్ని, సంస్కృతిని తన రచనల ద్వారా తెలియజేశారు. అసాంఘిక శక్తులు హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో హిందూ, ముస్లిం సంఘర్షణల పేరిట అపార్థాలు సృష్టించి మారణకాండను జరిపించాయి. హిందూ, ముస్లింల మధ్య అసలు నేరస్తులు, వారి రాజకీయ లక్ష్యాలు తెలియక అనుమాన బీజాలు పెరిగిన నేపథ్యంలో హిందూ, ముస్లింల మధ్య సఖ్యతకు కేశవస్వామి తన రచనల ద్వారా కృషి చేశారు.
  హిందూ, ముస్లిం మధ్య ఘర్షణలను చూసి చలించిపోయిన కేశవస్వామి అశాంతిగా గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. రాజకీయాల కోసం మానవ సంబంధాలు, మమతలు, మతాలు, స్నేహాలు, ఆత్మీయతలు బలికావద్దని తాను జీవించిన, తాను అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు, ఓల్డ్‌సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా రాశారు. అందుకే నెల్లూరి కేశవస్వామి ఒక స్వామికవాది, చైతన్యశీలి.

 

(అ) ''అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు అట్లే పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చు''. ఎట్లాగో రాయండి.
జ: పుస్తక పరిచయ వ్యాసాన్ని చదివితే పుస్తకంలోని విషయం, అది ఏ ఉద్దేశంతో రాశారు? అనే విషయాలు అవగాహనకు వస్తాయి. ఆ పుస్తకం ఏ స్ఫూర్తితో రాశారో, అందులోని లక్ష్యం ఏమిటో అవగతం అవుతుంది. రచయిత తన రచనకు ఉపయోగించిన భాష తెలుస్తుంది.
  పుస్తక సమీక్ష ద్వారా ఆ పుస్తకం రాసిన విధానంతోపాటు, తీసుకున్న జాగ్రత్తలు తెలుస్తాయి. రచయిత ఎంచుకున్న పుస్తకంలోని ముఖ్య అంశాలు తెలుస్తాయి. ఆ పుస్తకం ఏవిధంగా ఉపయోగకరమో తెలుస్తుంది. సమీక్షలో తెలిపిన ముఖ్య అంశాల ద్వారా పుస్తకంలో విషయాన్ని అంచనా వేయవచ్చు. పుస్తకం ముఖ చిత్రం, పుస్తకంలో ప్రస్తుతించిన పదాల పొందిక, తీరు అర్థమవుతుంది. ఇంకా ఆ పుస్తకం ఏవిధంగా ఉంటే బాగుండేది అనే సూచనలు అవగతం అవుతాయి. అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అలాగే పుస్తక పరిచయ వ్యాసంతో లేదా సమీక్షతో ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రం అర్థం చేసుకోవచ్చు అన్నది వాస్తవం.

 

ఆ) కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి.
జ: నెల్లూరి కేశవస్వామి కథా రచయిత. ఆయన రాసిన కథలు కొన్ని అచ్చు కాకుండా మిగిలిపోయాయి. 1969, 1981లలో కథలను సంపుటాలుగా వెలువరించారు. ఆయన తొలి కథల సంపుటి పసిడి బొమ్మ ఆగస్టు 1969లో వెలువడింది. రెండో కథా సంకలనం చార్‌మినార్ కథలు. దీనిలో విముక్తి, రూహి ఆపా, షరిఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, ఆఖరి కానుక, భరోసా అనే శీర్షికలతో రాసిన 11 కథలు ఉన్నాయి. ఈ కథలు అంతర్జాతీయ సంస్కృతి, జీవన విధానం హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా ఉండేదో తెలుపుతాయి.
యుగాంతం కథ ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్ప కథ. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఈ కథ ఒక చారిత్రాత్మక డాక్యుమెంటులా మన ముందు ఉంచుతుంది. వాస్తవ జీవితాలు, సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాక కథలు చార్‌మినార్ కథలు. ముఖ్యంగా నిజాం రాజ్యయుగాంత పరిణామాలను చిత్రించిన కథలు. ఈ కథల్లో నెల్లూరి కేశవ స్వామి హృదయం ఉంది. కేవశస్వామి రాసిన రుహీ ఆపా కథ మానవీయ విలువల సంబంధాలను, మనిషిలోని సున్నితమైన హృదయాన్ని కులమతాలకు అతీతంగా స్పందించే మనిషిని చిత్రించిన కథ.
  విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధ ప్రేమచంద్, కిషన్ చందర్‌లతో పోల్చదగినవారు. నెల్లూరి కేశవస్వామి రచనలు గోల్కొండ గనుల్లో లభించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబ్ వజ్రాల లాంటివి.

 

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ) మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకుని చదవండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.
జ: మా పాఠశాల గ్రంథాలయంలో నేను చదివిన కథల పుస్తకం వివిధ దేశాల జానపద కథలు.
పీఠిక (పుస్తక పరిచయం)
  వివిధ దేశాల జాపద కథలు అనే పుస్తకాన్ని రవళి రాశారు. ఇందులో 'విజయశంఖం-1' అనే పేరుతో కథలను రాశారు. 6 భాగాలుగా ఈ కథలు ఉన్నాయి. ఇందులో విజయదూత్ సాహసాలు తెలియజేశారు రచయిత. మాయా సందర్భాలను తెలియజేస్తూ కథ ముందుకు సాగుతుంది. కోడెనాగు, కరుణపాలుడు, జక్కన్న, శక్తివంత్, మదన్‌సింగ్ వత్సలాకుమారి, దుష్టసేన్, ప్రతాప్, దత్తాత్రేయుడు, సమిష్టుడు లాంటి పాత్రలతో కథ నడుస్తుంది. పాత్రల మధ్య సంబంధాలు, విచిత్రమైన సంఘటనలతో కథ నవరస ప్రధానంగా సాగింది. ఏకబిగిగా సాగే ఈ కథ ఆలోచనలను పెంపొందిస్తుంది. మాయాజాలంతో జరిగే మార్పులు ఆకట్టుకున్నాయి. ఈ పుస్తకం వెల తక్కువగా ఉంది. అయినా విషయం చాలా గొప్పగా ఉంది. లక్ష్మీ శ్రీనివాసా గ్రాఫిక్స్ ఈ పుస్తకాన్ని రంగుల అట్టలతో సుందరంగా తీర్చిదిద్దింది.


రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌