• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భూమిక

ప్రాజెక్టు పని


వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్‌లలో వచ్చిన పుస్తక పరిచయాలను/ సమీక్షా వ్యాసాలను సేకరించండి. వాటిని తరగతిలో ప్రదర్శించండి.
జ:
వార్తా పత్రికలో వచ్చిన పుస్తక పరిచయాలు
1. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు: తెలుగు భాష తీవ్ర ఉపేక్షకు గురైన దశలో భాషను పరివ్యాప్తం చేసి, సముద్దీపంగావించిన అగ్రేసర వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. భాష, సాహిత్యం, పరిశోధన, విమర్శ, చరిత్ర, విద్య, సంఘసేవ, స్వాతంత్య్ర సమరం, పత్రికారంగం, గ్రంథాలయోద్యమం, సంస్థా నిర్వహణ లాంటి అనేక రంగాల్లో విశేష కృషి చేసిన మేధా సంపన్నుడాయన. గోలకొండ పత్రిక సంపాదకులుగానే కాకుండా ఇతర పత్రికల్లో, ప్రచురణల్లో ఆయన 150కి పైగా వ్యాసాలు వస్తు వైవిధ్యంతో వచ్చాయి. ఆ వ్యాసాల సంకలనమే ఇది.
ప్రధాన సంపాదకులు: డా.సి.నారాయణరెడ్డి
సంపాదకులు: డాక్టర్ జె.చెన్నయ్య
వెల: రూ.240
ప్రతులకు: ఆంధ్ర సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, హైదరాబాద్.

 

2. యాభై సంవత్సరాల జ్ఞాపకాలు (1929 - 1979 వరకు): ఒక జాతి చరిత్రలో యాభై సంవత్సరాల కాలం ఏమంత ఎక్కువ కాకపోయినప్పటికీ అంత తక్కువ కాలం కూడా కాదు. భారతదేశంలో ఈ యాభైఏళ్లలో వచ్చిన మార్పులు మరే యాభై సంవత్సరాల్లోనూ రాలేదని చెబితే అతిశయోక్తి కాదు. రాజరికాలు, సంస్థానాలు అంతరించాయి. ప్రజలకు సార్వభౌమాధికారం సిద్ధాంత రీత్యా సంక్రమించింది. ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని భారతదేశం చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో సామాజికంగా, రాజకీయంగా జరిగిన పరిణామాలు, వాటి అంతస్సారం ఈ పుస్తకంలో రచయిత వివరించారు.
రచన: డాక్టర్ దేవులపల్లి రామానుజరావు
వెల: రూ.100
ప్రతులకు: ఆంధ్ర సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, ఆబిడ్స్, హైదరాబాద్-1

 

3. మానవ సంబంధాలు మాయ బంధాలు: ఈ పుస్తకం అనంతమైన ఇతివృత్తాలున్న మానవ సంబంధాలను బహుముఖంగా పరిశీలించి, పరిశోధించి, కర్మను కలుపుతూ, పాఠకుల బుద్ధికి పదును పెడుతూ, వారిని వారి గతంలోకి తీసుకెళుతూ జనులందరూ సంతోషంగా జీవించడానికి రూపొందించిన పుస్తకం ఇది. దానికి అవసరమైన ప్రశ్నలు రూపొందించి సమాధానాల రూపంలో రచయిత తన అనుభవసారంతో రాసిన పుస్తకం అందరికీ ఉపయుక్తం.
రచన: చండిక సాంబశివరావు

వెల: రూ.165
ప్రతులకు: నియా అండ్ నిహాల్ పబ్లికేషన్స్, గుంటూరు.

 

మ్యాగజైన్‌లోని పుస్తక సమీక్ష వ్యాసం


1. కొత్తసాలు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో వచ్చిన తొలి ఉగాది పండగ వేళ మన కవులు తమ కలాల నాగళ్లతో చేసిన కవితా సాగు రైతన్నల కొత్త పంటల సంబురాన్నే తలపించింది. ఈ చారిత్రాత్మక ప్రక్రియకు అద్దం పట్టిన పుస్తకమే 'కొత్తసాలు'. దీర్ఘకాలిక ఉద్యమం ఫలించగా, సకల జనులంతా ఆనందోత్సాహాలతో తేలియాడుతున్న తరుణంలోనే మన కవుల హృదయాకాశ దృశ్యాల్ని ఇలా కవిత్వరూపంలో అక్షరబద్దం చేయాలనుకోవడం ఒక విలక్షణ ప్రయత్నం. మన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సంపాదకులుగా ప్రముఖ కవులు డాక్టర్ నందిని సిదారెడ్డి, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్ మసన చెన్నప్ప, డాక్టర్ నాళేశ్వరం శంకరం, అయినంపూడి శ్రీలక్ష్మి, యాకుబ్, జూపాక సుభద్ర.. సలహామండలి సభ్యులుగా వెలువడిన ఈ పుస్తకంలో మొత్తం 60 మంది కవుల కవిత్వాన్ని పొందుపరిచారు.
     తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవంలో భాగంగానే ఈ పుస్తకం వచ్చింది. చాలావరకు కవితలు తెలంగాణ ఉద్యమ సారాన్ని, సాఫల్యతను విడమరిచి చెప్పాయి. మనవారి తత్వాన్ని, తెలంగాణ సామాజిక కోణాలను, జీవన విధానాలను ఒకింత గట్టిగానే ఆవిష్కరించాయి. కవిత్వంలో గాఢత కంటే వస్తు చిత్రణకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. సందర్భం ఎంత అపురూపమో పుస్తకాన్ని అంతే కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇది ప్రశంసనీయం.
'వాక్యం పచ్చపచ్చని వ్యవసాయం/ కవిత్వమొక కిరణజన్య సంయోగక్రియ (అన్నవరం దేవేందర్ కవిత్వం: పే-13), నిద్రలేచిన విత్తనం/ సుప్రభాతంతో మమేకమైనట్టు' (డాక్టర్ ఎస్.చెల్లప్ప 'దక్షిణాయనం పే-29), కూలిపోతున్న చెలిమెలో/కూరిమి తోడాలె/ రాత్రిని వెలిగించేది/ సాహసం ఒక్కటే (నందిని సిదారెడ్డి 'తలంపు' పే-107) లాంటి ప్రయోగాలు రైతన్నల 'కొత్తసాలు'తో పాటు యావత్ తెలంగాణ బిడ్డల భవిష్యత్ బాధ్యతలనూ గుర్తు చేస్తాయి.
    'అగరొత్తుల పొగలా/ ఆనందించడం అలవాటైంది/ సంబురం కూడా నటనైంది. కప్పి పుచ్చుకుంటే మాత్రం/ జీవితం ఆగుతదా (డాక్టర్ పులిపాటి గురుస్వామి 'తొక్కుడు బిల్ల' (పే-128) 'పరిపాలన పచ్చడి లా కనిపిస్తున్నది/ అధికారం బెల్లంలా అగుపిస్తున్నది (డాక్టర్ తిరుమల ''కవనపవన తరంగాలు: పే-147) 'కలుపు మొక్కలు చేలల్లోకి అడుగు పెట్టకుండా/ కనిపెట్టాల్సిన సమయం (వఝుల కాలచైతన్య స్వరం - పే-160) అంటూ మానవీయ విలువలను, నైతిక ప్రవర్తనను ప్రబోధించేవి. మన వైభవాన్ని ఆవిష్కరించేవి అయిన కవితా పాదాలు సామాన్యులను సైతం విధిగా ఆకట్టుకుంటాయి.
      చేర్యాలకు చెందిన సుప్రసిద్ధ నఖాషీ చిత్రకారుడు వైకుంఠం గీసిన ముఖ చిత్రం ఒక్కచూపులోనే పాఠకులను కట్టి పడేస్తుంది. పుస్తకానికి ఇదొక అదనపు ఆకర్షణ. కవుల ఫొటోలతోపాటు కవిత్వాలకు బొమ్మలు కూడా ముద్రిస్తే మరింత నిండుదనం వచ్చేది. అయితే, ఇలాంటి ప్రోత్సాహం కోసం ఎదురుచూసే మరెందరో మన కవుల కవిత్వాన్ని కూడా రాబోయే సాళ్లలో మన ప్రభుత్వం ఇలాగే పుస్తకాల్లోకి ఎక్కిస్తే ఇంకెంతో మంచిగుంటది.

 


రచయిత: జి.అంజాగౌడ్ 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం