• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భూమిక

రచయిత పరిచయం
* భూమిక పాఠ్యభాగ రచయిత గూడూరి సీతారాం.
* గూడూరి సీతారాం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గరలో ఉన్న హనుమాజీపేట అనే గ్రామంలో 1936, జులై 18న జన్మించారు.
* 1953 - 1965 వరకు సుమారు 80 కథలు రాశారు.
* తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షర బద్ధం చేసిన రచయిత గూడూరి.
* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి తరం కథలకు ఆయనే దిక్సూచి.
* 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు.
* అనేక గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించారు
 

గూడురి సీతారాం రాసిన ప్రసిద్ధ కథలు:
1) మారాజు
2) లచ్చి
3) పిచ్చోడు
4) రాజమ్మ రాజీరికం
* తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికి ఉన్న ప్రత్యేకత.

పాఠం ఉద్దేశం
* ముందుమాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆత్రుత ఎట్లా ఏర్పడుతుందో తెలియజేయడం.
* ముందుమాట స్వరూప స్వభావాలను పరిచయం చేయడం.

పాఠ్యభాగ వివరాలు
* భూమిక అనే ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందింది.
* ముందుమాట ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్త్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేస్తుంది.
* ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత లేదా మరొకరు లేదా విమర్శకుడు రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను 'పీఠిక' అంటారు.
* పీఠికను ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.
* నేషనల్ బుక్‌ట్రస్టు ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు అనే పుస్తకానికి గూడూరి సీతారాం రాసిన పీఠిక లోనిది ఈ భూమిక అనే పాఠం.

ప్రవేశిక
  కథలు ఒకప్పుడు మానసిక ఆనందాన్ని, నైతిక విలువలను చెప్పడానికే పరిమితమై ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీ రంగంలోకి ప్రవేశించడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకుంది.
  కథ.. మానవ మనస్తత్వాన్ని, సంఘర్షణను, భిన్న సంస్కృతులను తన జీవలక్షణాలుగా చేసుకుంది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకుని నిలబడింది. అలాంటి గొప్ప కథానికా రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు.
  విశిష్టమైన వస్తు, శిల్పనైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్‌చంద్, కిషన్‌చందర్‌లతో పోల్చదగినవారు. ఆయన ఉత్తమ కథల గురించి కొంచెమైనా తెలుసుకోవడం మనకు చాలా అవసరం.

పాఠ్యభాగం

  గూడూరి సీతారాం, నెల్లూరి కేశవస్వామిల స్నేహం 1950 నాటిది. సీతారాం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో డిగ్రీ చదువుకున్న కాలంలో పల్లా దుర్గయ్య, మహాకవి దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, బిరుదురాజు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, డి.రామలింగం, నెల్లూరి కేశవస్వామి, జి.సురమౌళి లాంటి మరికొందరు నారాయణగూడలో కలుసుకునేవారు. సాహిత్య చర్చలు సాగించేవారు. సీతారాం విరివిగా కథలు రాయడం ప్రారంభించారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగుదేశం, సుజాత, పల్లెటూరు, ప్రజామాత వారపత్రిక, స్రవంతి మాసపత్రికల్లో ఆ కథలు అచ్చు అయ్యేవి. సీతారాం, నెల్లూరి కేశవస్వామి, డి.రామలింగం, జి.సురమౌళి, దాశరథి రంగాచార్యులు కథలు రాస్తుంటే మిగిలినవాళ్లు కవిత్వం రాసేవాళ్లు. వాళ్లంతా అప్పటి కథల అచ్చుప్రతులను కాపాడలేకపోయారు. అప్పుడు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు.
  గూడూరి సీతారాం కథలు, నెల్లూరి కేశవస్వామి కథలు దొరకకుండా ఎన్నో పోయాయి. నెల్లూరి కేశవస్వామి 1969, 1981లలో కథల సంపుటాలను వెలువరించారు.
  1902 నుంచి ప్రారంభమై తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. బండారు అచ్చమాంబ తొలి కథకురాలని చరిత్ర స్పష్టం చేసింది. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుంచి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉర్దూ మాధ్యమం పోయి తెలుగు మాధ్యమం రావడం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథల్లో పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించిన, దేశంలోనే మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇందుకు భూమికను అందించింది.
  హైదరాబాద్ రాజ్యం స్వాతంత్య్రానికి పూర్వం ఒక ప్రత్యేక దేశంగా, రాజ్యంగా సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగి ఉండిన, ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశం. హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ ఇండియాలోని అతిపెద్ద రాజ్యం. అంత పెద్దరాజ్యం ఇండియాలో మరొకటి లేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో హైదరాబాద్ రాజ్యం కొనసాగింది.
  హైదరాబాద్ రాజ్యంలో నిజామాంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్ ప్రజాస్వామిక హక్కులు, స్వాతంత్య్రం కోసం ఉద్యమించారు. 1946-1951 మధ్య తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. ఈ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది చనిపోయారు. మరోవైపు రజాకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు.
  రజాకార్లకు కాశీంరజ్వి నాయకత్వం వహించాడు. 1944-51 మధ్య హైదరాబాద్ రాజ్యంలోని అంతర్యుద్ధం, సామాజిక సంక్షోభం వల్ల ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంపై దండెత్తి రజాకార్లను, ఉద్యమకారులను, కమ్యూనిస్టులను అణిచివేశాయి. 1948, సెప్టెంబరు 13న హైదరాబాద్ రాజ్యంలోకి ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి.
  1948, సెప్టెంబరు 17న నిజాం రాజు లొంగిపోయినట్టు ప్రకటించడం, హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనమైనట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యం నుంచి కొందరు ముస్లింలు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని భావించారు. మరికొందరు వెళ్లిపోయారు. ఈ చారిత్రక, సామాజిక పరిణామాలను సంక్షుభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణను కథల రూపంలో నిక్షిప్తం చేసిన కథకుడు నెల్లూరి కేశవస్వామి.
  నెల్లూరి కేశవస్వామి హైదరాబాద్‌లో పుట్టారు. నిజాం కాలేజీలో 'ప్రిడిగ్రీ' చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరుగా పట్టా పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ నీటిపారుదల శాఖలో ఇంజినీర్‌గా పనిచేసి రిటైరయ్యారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానాలను, సంస్కృతిని తెలుగులో చిత్రించారు.
  ఇండియన్ యూనియన్‌లోని జాతీయోద్యమ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతూ వచ్చిందో నెల్లూరి కేశవస్వామి కథల ద్వారా మనకు కొంతైనా తెలుస్తుంది. హైదరాబాద్ రాజ్యం గురించి తమిళం, మరాఠీ భాషల్లో వచ్చినంత సాహిత్యం తెలుగులో రాలేదు. ఆ భాషల్లో హైదరాబాద్ రాజ్యం గురించి వచ్చిన కథలు, నవలలు కేంద్ర సాహిత్య అకాడెమీ ద్వారా పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. అలా తెలుగులోకి వచ్చాయి. కేశవస్వామి కథలు తెలుగు కథలు. తెలుగు సాహిత్యంలో వీటికి విశిష్ట స్థానం ఉంది.
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అనే ప్రాంతీయ విభాగాలు ఉన్నాయి. నెల్లూరి కేశవస్వామి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు రచయిత. హైదరాబాద్‌లో నివసించి, హైదరాబాద్‌లోని జీవభాషను కథల్లో చిత్రించిన రచయిత. ఆయన చాలా కథలు రాశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. వీరి తొలి కథల సంపుటి ''పసిడిబొమ్మ''. ఇది 1969 ఆగస్టులో వెలువడింది. దీన్ని భాస్కరభట్ల కృష్ణారావుకి అంకితం ఇచ్చారు. ఈ సంపుటిలోని కథలు రచయిత ప్రారంభ దశను తెలపడంతోపాటు క్రమంగా చక్కటి రచయితగా ఎదిగిన క్రమాన్ని కూడా స్పష్టం చేస్తాయి.
  కేశవస్వామి రెండో కథా సంకలనం చార్‌మినార్ కథలు. ఇవి కేవలం ఊహాజనిత కథలు కావు. సామాజిక పరిణామాలకు సాహిత్యరూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన అని చెప్పవచ్చు. చార్‌మినార్ కథలు హైదరాబాద్ రాజ్యం చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. ఇందులో విముక్తి, రూహి ఆపా, షరీఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, ఆఖరి కానుక, భరోసా అనే శీర్షికలతో రాసిన 11 కథలు ఉన్నాయి.
  చార్‌మినార్ కథల్లోని నవాబులు, దేవిడీలు, మహబూబ్‌కి మెహిందీ, కోఠీలు, దివాన్‌ఖాన్‌లు, జనానాఖానాలు, బేగం సాహెబాలు, దుల్హన్ పాషాలు, పాన్‌దాన్, పరాటాకీమా, దాల్చా, నమాజులు, పరదాల వెనుక జీవితంలోని సంస్కృతి, సంఘటనలు... లక్నో, అవధ్, ఢిల్లీలోని ముస్లిం రాజుల, రాజ్యాల, ప్రజల జీవితాలను, అవిభక్త ఇండియాలోని పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల సంస్కృతిని; మధ్య ఆసియా ముస్లిం దేశాల సంస్కృతిని గుర్తుకు తెస్తాయి. ఈ కథలు అంతర్జాతీయ సంస్కృతి, జీవన విధానం హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా ఉండేదో తెలుపుతాయి. 11వ శతాబ్దం నుంచి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవన విధానం, సంస్కృతి, భారతీయ సంస్కృతి, జీవన విధానాలపై చెరగని ముద్ర వేశాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమయ్యాయి. అవి హిందూ ప్రజల జీవితాల్లోకి కూడా ప్రవేశించి, రెండు మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతులు, జీవితాల్లో ఆదాన, ప్రధానాలు జరిగాయి. అలా ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించింది. అలా విస్తరించడంలో భాగంగా హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాన్ని, ఆ జీవితాలను కేశవస్వామి తన కథల్లో చిత్రించారు.
  యుగాంతం కథ ప్రత్యేకంగా చెప్పాల్సిన కథ. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి పాకిస్థాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని తమస్ నవలలో చిత్రించారు. అది దూరదర్శన్‌లో టీవీ సీరియల్‌గా ప్రసారమైనప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-50ల మధ్య ఎలా కొనసాగాయో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో మూలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు యుగాంతం అనే పేరు సార్థకతను చేకూర్చింది.

  యుగాంతం నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్ప కథ. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఈ కథ ఒక చారిత్రక డాక్యుమెంటులా మనముందుంచుతుంది. ఈ ఒక్క కథ రాసి మరేమీ రాయకపోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకరిగా కీర్తి గడించేవారు.
  'చార్‌మినార్ కథల సంపుటి' వెలువడిన నేపథ్యం నెల్లూరి కేశవస్వామిని రచయితగా హిమాలయాల ఉన్నత శిఖరాలపై నిలుపుతుంది. కొన్ని అసాంఘిక శక్తులు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హిందూ, ముస్లిం సంఘర్షణల పేరిట అపార్థాలు సృష్టించి మారణకాండను జరిపాయి. హిందూ, ముస్లింల మధ్య అసలు నేరస్తులు, వారి రాజకీయ లక్ష్యాలు తెలియక అనుమాన బీజాలు పెరిగాయి.
  ఆ సంక్షుభిత వాతావరణంలో హిందూ, ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామిక వాదులు నడుం బిగించారు. రచయితగా, లోహియా సోషలిస్టుగా నెల్లూరు కేశవస్వామి ఈ సంఘటన పట్ల చలించిపోయి అశాంతిగా గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో... ఆయన సమాజంలో తిరిగి హిందూ, ముస్లిం సఖ్యత కోసం ఏమి చేయలేనా? రాజకీయాల కోసం మానవ సంబంధాలు, మమతలు, మతాలు, కులాతీత, మతాతీత స్నేహాలు, ఆత్మీయతలు బలికావల్సిందేనా అని.... అలా కావడానికి వీల్లేదని, తాను జీవించిన, తాను అనుభవించిన స్నేహం, ఆత్మీయత కులాతీత, మాతాతీత మమతలు, ఓల్డ్‌సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా వెలువరించారు. ఇలా ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా తనవంతు కర్తవ్యాన్ని కేశవస్వామి నెరవేరుస్తూ రాసిన కథలు ఇవి. చార్‌మినార్ కథలు కేవలం కథలు కావు. వాస్తవ జీవితాల సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్మక కథలు. ముఖ్యంగా నిజాం రాజ్య యుగాంత పరిణామాలను చిత్రించిన కథలు. ఈ కథల్లో నెల్లూరి కేశవస్వామి హృదయం ఉంది.
  కేశవస్వామి రాసిన రూహి ఆపా కథ మహోన్నతమైన మానవీయ సంబంధాలను, మనిషిలోని సున్నితమైన హృదయాన్ని, కులమతాలకు అతీతంగా స్పందించే మనిషిని చిత్రించిన కథ. ముజ్రాల జీవితాల్లో ఆనందించే సన్నివేశాలు, జీవితం అంతా హృదయంలో దాచుకునే సంతోష సన్నివేశాలు 'రూహి ఆపా' లో కేశవస్వామి చిత్రించారు. రెండు కథల పాత్రలకు అవే పేర్లు ఉంచడంలో రచయిత ఒక స్పష్టమైన దృష్టితోనే రాశాడని చెప్పకనే తెలుస్తుంది.
  ఒకరోజు రమణిపాట వినడానికి నవాబు వస్తున్నారని వాళ్ల అమ్మ రమణిని తయారుకమ్మని చెపుతుంది. ఏదో అనుమానం ఉందంటే అలాంటిదేమీ లేదని తల్లి హామీ ఇస్తుంది. నవాబు ముందు రమణి ఒక గజల్ పాడుతుంది. అది విన్నంతసేపు నవాబు కళ్లు మూసుకునే ఉన్నారు. నవాబు నెలకు వెయ్యి రూపాయలు భరణం ఇస్తారని వారానికోసారి, నెలకోసారో వారి భవంతికి (దేవిడి) మధ్యాహ్నం పూట వెళ్లి గంటో, రెండు గంటలపాటు పాటలు వినిపించి రావాలని, ముజ్రాలు పూర్తిగా మానివేయాలని, కావాలంటే రేడియోలో ప్రోగ్రాం ఇవ్వవచ్చని చెప్పినట్టు తల్లి చెబుతుంది. ఆరోజు నుంచి రమణి రోజువారి కార్యక్రమం మారిపోయింది. ఒకరోజు నవాబు 'నీకు ఈ పేరు బాగాలేదు రూహి అని పేరుతో పిలుస్తా' అని కోరతాడు.
  రెండు సంవత్సరాల తర్వాత అతడి కొడుకు రూహి (రమణి)కి ఎదురవుతాడు. నవాబు ఊరికి వెళ్లిన సమయంలో చిన్న నవాబు సలీం రూహిని ఆహ్వానిస్తాడు. రూహి పరిపరి విధాలుగా భయపడుతుంది. సలీం ఆమెను తమ రహస్య గదిలోకి తీసుకెళతాడు. అక్కడ ఒక పరదా వేసి ఉన్న ఫొటోను చూపిస్తాడు. ఆ ఫొటో అచ్చం రూహి (రమణి)లాగే ఉంటుంది. రూహి ఆ ఫొటో చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె మా అక్క అని సలీం చెపుతాడు. నిన్ను అక్క అని పిలవాలని ఉంది అని రూహి ఆపా అని పిలుస్తాడు. రూహి ఆపాను నవాబు ఎందుకంత ఇష్టపడి వాత్సల్యం చూపాడో మనకు తెలుస్తుంది. ఆమె నవాబు కూతురా? అని పాఠకులకు సందేహం కలుగుతుంది. సొంత కూతురులా నవాబు, నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసిపట్టారు. ఇందులోని షరీఫా, ప్రతీకారం, అదృష్టం, వంశాంకురం, కేవలం మనుషులం, భరోసా, ఆఖరి కానుక లాంటి కథలు విశిష్టమైనవి. దేనికవే ప్రత్యేకమైనవి.
  వంశాంకురం కథలో ముస్లిం పెళ్లి సంబంధాలెలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతాయో హృదయ విదారకంగా చిత్రించింది.
  కేవలం మనుషులం కథలో హుస్సెన్‌మిర్జా, మహబూబ్ రాయ్ సక్సీనా దశాబ్దాల స్నేహితులు. వారి కుటుంబాలు స్నేహంగా కలిసి ఉంటాయి. మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించిన చక్కటి కథ.
  నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో, భరోసాను ఎలా భగ్నం చేస్తారో తెలిపే యథార్థ కథే భరోసా. ఆఖరి కానుక కథ రోజు రోజుకు పేదరికంలోనికి వెళ్లిపోతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్‌లకు తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియజేస్తుంది.
  ఇలా నెల్లూరి కేశవస్వామి విశిష్టమైన వస్తు, శిల్పనైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాశారు. భారతీయ సాహిత్యంలో పోల్చాల్సి వస్తే ఉర్దూ, హిందీల్లో రాసిన సుప్రసిద్ధ రచయితలు ప్రేమ్‌చంద్, కిషన్‌చందర్‌ల కోవకు చెందిన రచయిత.
  నాటి హైదరాబాద్ రాజ్యంలోని గోల్కొండ గనుల్లో లభించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబ్ వజ్రాల లాంటివే నెల్లూరి కేశవస్వామి కథలు.

రచయిత: జి.అంజాగౌడ్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌