• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం

1. ఒక పుటాకార దర్పణం నాభ్యంతరం f ని కనుక్కోవడానికి చేసే ప్రయోగానికి కావాల్సిన పరికరాల జాబితాను రాసి, దాని నాభ్యంతరాన్ని కనుక్కోవడానికి చేసే ప్రయోగ విధానాన్ని వర్ణించండి.

జ: కావాల్సిన పరికరాలు: పుటాకార దర్పణం, ఒక కాగితం ముక్క, మీటర్ స్కేలు.

విధానం:

* ఒక పుటాకార దర్పణాన్ని తీసుకుని, దానిపై సూర్యకాంతి పడేవిధంగా పట్టుకోవాలి.

* దర్పణానికి ఎదురుగా ఒక చిన్న కాగితం ముక్కను ఉంచి, మెల్లగా వెనక్కి జరుపుతూ ఏ స్థానంలో చిన్నదైన, అధిక తీవ్రత ఉండే సూర్యుడి ప్రతిబింబం ఏర్పడుతుందో గుర్తించాలి.

* సూర్యుడి నుంచి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతాయి. ఈ బిందువును దర్పణ నాభి లేదా నాభీయ బిందువు (F) అంటారు.

* నాభి నుంచి దర్పణ ధ్రువం 'P' కి ఉండే దూరాన్ని కొలవాలి.

* ఈ దూరం దర్పణ నాభ్యంతరం f అవుతుంది.

జాగ్రత్తలు: కాగితం పరిమాణం దర్పణంపై పడే కాంతి కిరణాలకు అడ్డుగా ఉండకుండా సాధ్యమైనంత చిన్నదిగా ఉండేలా జాగ్రత్త పడాలి.

2. వస్తు, ప్రతిబింబ దూరాలను పుటాకార దర్పణం ద్వారా కొలవడానికి చేసే ప్రయోగానికి కావాల్సిన పరికరాల జాబితాను రాయండి. ప్రయోగ విధానాన్ని పట సహాయంతో వివరించండి. ప్రయోగ పరిశీలనలను వివరించండి. (AS 3) 4 మార్కులు

జ: ఉద్దేశం: వివిధ రకాల ప్రతిబింబాలను పరిశీలించడం - వస్తు దూరం, ప్రతిబింబ దూరాలను కొలవడం.

కావాల్సిన పరికరాలు: కొవ్వొత్తి, తెల్లకాగితం లేదా డ్రాయింగ్ షీట్, నాభ్యంతరం తెలిసిన పుటాకార దర్పణం,

V - స్టాండు, కొలత టేపు లేదా మీటరు స్కేలు.

విధానం:

* పుటాకార దర్పణాన్ని V - స్టాండుపై ఉంచాలి. దానికి ఎదురుగా పటంలో చూపినట్లు వెలుగుతున్న కొవ్వొత్తిని, మీటరు స్కేలును ఉంచాలి.

* దర్పణం నుంచి వివిధ దూరాల్లో (10 నుంచి 80 సెం.మీ. వరకు) ప్రధాన అక్షం వెంబడి కొవ్వొత్తిని ఉంచుతూ కాగితాన్ని (తెరను) ముందుకూ, వెనక్కి కదుపుతూ ప్రతిసారి ఏ స్థానంలో స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుందో గుర్తించాలి.

* కొవ్వొత్తి మంట దర్పణం ప్రధానాక్షానికి పైన ఉండేలా, కాగితం ప్రధానాక్షానికి కింద ఉండేలా జాగ్రత్త వహించాలి. పరిశీలనలను పట్టికలో నమోదు చేయాలి.


* పరిశీలనల్లో పెద్ద ప్రతిబింబం ఏర్పడిన సందర్భాలు, చిన్న ప్రతిబింబం ఏర్పడిన సందర్భాలను వేర్వేరుగా రాయాలి. కొన్ని సందర్భాల్లో ప్రతిబింబం ఏర్పడకపోవచ్చు. అలాంటి సందర్భాలను కూడా గుర్తించి నమోదు చేయాలి.
* దర్పణ నాభ్యంతరం, వక్రతా వ్యాసార్ధాలు మనకు తెలుసు. కాబట్టి పై పరిశీలనలను కింది పట్టికలో చూపిన విధంగా వర్గీకరించవచ్చు.

జాగ్రత్తలు: కొవ్వొత్తి మంట దర్పణం ప్రధానాక్షానికి పైన ఉండేలా, కాగితం ప్రధానాక్షానికి కింద ఉండేలా జాగ్రత్త వహించాలి.

3. ఇచ్చిన పట సమాచారం ఆధారంగా పట్టికను పూర్తిచేయండి.                   (AS 4) 4 మార్కులు

జ:

4. కుంభాకార, పుటాకార దర్పణాలను నిత్యజీవితంలో ఏయే సందర్భాల్లో ఉపయోగిస్తారో వివరించండి.   (AS 6) 4 మార్కులు
జ: కుంభాకార దర్పణాల ఉపయోగాలు:
* వాహనాల్లో వెనుక నుంచి వచ్చే వాటిని గమనించేందుకు వాడే సైడ్ మిర్రర్‌గా ఉపయోగిస్తారు.
* దుకాణాల్లో సెక్యూరిటీ దర్పణంలో ఉపయోగిస్తారు.
పుటాకార దర్పణాల ఉపయోగాలు:
* ఈఎన్‌టీ వైద్యులు తలకు ఉపయోగించే దర్పణం.
* పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరిచే షేవింగ్ దర్పణాల్లో ఉపయోగిస్తారు.
* వాహనాల హెడ్‌లైట్లకు పరావర్తన దర్పణంలా, పరావలయ ఆకారంలో ఉపయోగిస్తారు.
* ఖగోళదర్శిని, సెర్చిలైట్లు, సోలార్ కొలిమిలో ఉపయోగిస్తారు.

 

5. ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు కుంభాకార, పుటాకార దర్పణాలను ఇచ్చి వాటి మధ్య భేదాలను గుర్తించమన్నాడు. వాటిని ఊహించి రాయండి.
                                                       (లేదా)
కుంభాకార, పుటకార దర్పణాలను పోల్చండి.  (AS1) 4 మార్కులు
జ: 

కుంభాకార దర్పణం పుటాకార దర్పణం
ఇది గోళాకార దర్పణంలోని బాహ్యతలం పరావర్తన తలంగా ఉన్న దర్పణం ఇది గోళాకార దర్పణంలోని అంతర తలం పరావర్తన తలంగా ఉన్న దర్పణం
దీనిలో పరావర్తనం చెందిన తర్వాత కాంతి కిరణాలు వికేంద్రీకృతమవుతాయి దీనిలో పరావర్తనం చెందిన తర్వాత కాంతి కిరణాలు కేంద్రీకృతమవుతాయి.
ఇవి ఎక్కువగా మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. ఇవి ఎక్కువగా నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. కానీ వస్తువు దర్పణం, నాభి మధ్య ఉన్న సందర్భాల్లో మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తాయి.
ఇవి ఎల్లప్పుడూ వస్తువు పరిమాణం కంటే చిన్న ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. ఇవి వస్తువు పరిమాణం కంటే చిన్న లేదా పెద్ద ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి.
ఇవి ఎల్లప్పుడూ నిటారు ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. ఇవి నిటారు లేదా తలకిందుల ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి.

6. నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబాల మధ్య పోలికలు, తేడాలను రాయండి.  (AS1) 4 మార్కులు
జ: 

నిజ ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం
ఇది పరావర్తన కిరణాలు ఖండించుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది పరావర్తన కిరణాలను వెనక్కి పొడిగించడం వల్ల ఏర్పడుతుంది.
ప్రతిబింబ స్థానం వద్ద కాంతి కిరణాలు కేంద్రీకృతమవుతాయి. ప్రతిబింబ స్థానం నుంచి కాంతి కిరణాలు వికేంద్రీకరణ చెందినట్లు కనిపిస్తాయి.
ఇది తలకిందులుగా ఏర్పడుతుంది. ఇది నిటారుగా ఏర్పడుతుంది.
దీన్ని తెరపై పట్టవచ్చు. దీన్ని తెరపై పట్టలేం.
దర్పణం లేకుండానే నిజ ప్రతిబింబాన్ని తెరపై మనం నేరుగా చూడవచ్చు. దర్పణంలో మాత్రమే మిథ్యా ప్రతిబింబాన్ని మనం చూడగలం.

7. గోళాకార దర్పణాల్లో కాంతి పరావర్తనానికి సంబంధించి పాటించాల్సిన సంజ్ఞా సంప్రదాయంలోని అంశాలను వివరించండి.
                                                              (లేదా)
దర్పణ సూత్రంలో వివిధ అంశాలకు పాటించాల్సిన సంజ్ఞా సంప్రదాయాలను తెలపండి.   (AS 1) 4 మార్కులు
జ: * అన్ని దూరాలను దర్పణ ధ్రువం P నుంచి కొలవాలి.
* కాంతి ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి.
* కాంతి ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగా తీసుకోవాలి.
* వస్తువు ఎత్తు (ho), ప్రతిబింబ ఎత్తు (hi)లను ప్రధానాక్షానికి పైవైపు ఉన్నప్పుడు ధనాత్మకంగా, ప్రధానాక్షానికి కింది వైపు ఉన్నప్పుడు రుణాత్మకంగా తీసుకోవాలి.


8. i) కారు హెడ్‌లైట్లలో వాడే దర్పణం ఏమిటి? కారు హెడ్‌లైట్‌లో బల్బును దర్పణపరంగా ఎక్కడ ఉంచుతారు?
ii) కారు హెడ్‌లైటులో బల్బు నుంచి వెలువడిన కాంతి దర్పణంపై పడి పరావర్తనం చెందుతుంది. దీన్ని తెలిపే ఒక కిరణ చిత్రాన్ని గీయండి.  (AS1) 4 మార్కులు
జ: i) పుటాకార దర్పణాలను కారు హెడ్‌లైట్లలో పరావర్తకాలుగా ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ బల్బును పుటాకార దర్పణ నాభి (F) వద్ద ఉంచితే సమాంతర కాంతి కిరణ పుంజం వెలువడి చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.
ii)
 


               
9. పుటాకార దర్పణం ప్రధానాక్షంపై కింది సందర్భాల్లో వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని చూపే పటాలను గీసి ప్రతిబింబ లక్షణాలను రాయండి.
i) వక్రతా కేంద్రానికి అవతల వస్తువు ఉన్నప్పుడు
ii) వక్రతా కేంద్రానికి, ప్రధాన నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు   (AS 5) 4 మార్కులు
జ: i) వక్రతా కేంద్రానికి అవతల వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం F, C మధ్య ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం తలకిందులుగా ఉండి వస్తు పరిమాణం కంటే చిన్నదిగా ఉంటుంది.
                       

ii) వక్రతా కేంద్రానికి, ప్రధాన నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం వక్రతా కేంద్రానికి అవతల ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం తలకిందులుగా ఉండి వస్తు పరిమాణం కంటే పెద్దదిగా ఉంటుంది.
                   


10. కుంభాకార దర్పణానికి కిరణ చిత్రాలను గీయడానికి దోహదపడే నియమాలను తెలపండి. (AS 1) 4 మార్కులు
జ: నియమం 1: ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పతనమైన కిరణం పరావర్తనం చెందిన తర్వాత నాభి F నుంచి బయలుదేరి వస్తున్నట్లు కనిపిస్తుంది.
                        
నియమం 2: నాభి దిశలో ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా వెళుతుంది.
                                 
నిమయం 3: వక్రతా కేంద్రం వైపు ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెందాక తిరిగి అదే దిశలో వెనక్కి ప్రయాణిస్తూ, వక్రతా కేంద్రం నుంచి బయలుదేరి వస్తున్నట్లు కనిపిస్తుంది.
                                

11. పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ స్థానాన్ని నిర్ధారించడానికి కిరణ చిత్రాలను గీసేటప్పుడు దోహదపడే నియమాలను తెలపండి.  (AS 1) 4 మార్కులు
జ: నియమం 1: ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పతనమైన కిరణం పరావర్తనం చెందాక నాభి F నుంచి బయలుదేరి వస్తున్నట్లు కనిపిస్తుంది.
                                         
నియమం 2: నాభి దిశలో ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా వెళుతుంది.
                                           
నియమం 3: వక్రతా కేంద్రం వైపు ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెందాక తిరిగి అదే దిశలో వెనక్కి ప్రయాణిస్తూ వక్రతా కేంద్రం నుంచి బయలుదేరి వస్తున్నట్లు కనిపిస్తుంది.
                                   


12. గోళాకార దర్పణాల ముందు వస్తువును వాటి ప్రధానాక్షాలపై వేర్వేరు స్థానాల వద్ద ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ స్థానాలను, వాటి లక్షణాలను సూచించే కిరణ చిత్రాలను గీయడానికి R1, R2, R3 లనే కాంతి కిరణాలను ఎన్నుకోవడానికి కారణాలు చెప్పండి. (AS 1) 4 మార్కులు
జ: కిరణ చిత్రాలను మరింత సులభంగా గీయడానికి వస్తువు పైకొన నుంచి బయలుదేరే కిరణాలనే తీసుకుందాం. ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కిరణాలు పరావర్తనం చెందాక నాభి ద్వారా ప్రయాణిస్తాయని మనకు తెలుసు. కాబట్టి ఏ కిరణ చిత్రాన్ని గీయాలన్నా వస్తువు నుంచి బయలుదేరి దర్పణ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించి దర్పణాన్ని చేరే కిరణమే మనం గీయాల్సిన మొదటి కిరణం. అప్పుడు దర్పణంపై ఉండే పతన బిందువు నుంచి నాభి ద్వారా గీసిన రేఖ పరావర్తన కిరణం అవుతుంది. దీన్ని పటంలో సూచించినట్లు R1 తో గుర్తిస్తాం.
                                          
దర్పణం నాభి ద్వారా ప్రయాణిస్తూ దర్పణంపై పతనం చెందిన కిరణం పరావర్తనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించిన కిరణమే మనం గీయాల్సిన రెండో కిరణం. దీన్ని కింది పటంలో సూచించినట్లు R2తో గుర్తిస్తాం.
                                        
    వస్తువు పైకొన భాగం నుంచి బయలుదేరి వక్రతా కేంద్రం ద్వారా ప్రయాణిస్తూ దర్పణాన్ని చేరే కిరణాన్ని గీస్తే అది పరావర్తనం చెందాక తిరిగి అదే మార్గం ద్వారా వెనక్కి వెళుతుంది. అంటే లంబం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం పరావర్తనం చెందాక కూడా లంబం వెంబడే ప్రయాణిస్తుంది. ఈ కిరణం R3ను కింది పటంలో సూచించినట్లు గుర్తిస్తాం.
                                              


13. పుటాకార దర్పణం ముందు ప్రధానాక్షంపై వివిధ స్థానాల్లో (బిందువుల వద్ద) వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను కిరణ చిత్రాల సాయంతో వివరించండి. (AS 1) 4 మార్కులు
జ: i) వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు: వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబం దర్పణ వక్రతా కేంద్రం F వద్ద ఏర్పడుతుంది. ఏర్పడే ప్రతిబింబం నిజ ప్రతిబింబం. బిందు రూపంలో ఉంటుంది.
                                
ii) వస్తువు అనంత దూరానికి, వక్రతా కేంద్రానికి మధ్యలో ఉన్నప్పుడు: వస్తువు అనంత దూరానికి, వక్రతా కేంద్రానికి మధ్యలో ఉన్నప్పుడు దర్పణ నాభి (F), వక్రతా కేంద్రం (C) మధ్య ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది తలకిందుల ప్రతిబింబం. వస్తువు కంటే చిన్నది, నిజ ప్రతిబింబం.
                                        

iii) వస్తువు వక్రతాకేంద్రం వద్ద ఉన్నప్పుడు: వస్తువు వక్రతా కేంద్రం (C) వద్ద ఉన్నప్పుడు ప్రతిబింబం కూడా దర్పణ వక్రతా కేంద్రం వద్దే ఏర్పడుతుంది. ఇది తలకిందుల ప్రతిబింబం. వస్తు పరిమాణానికి సమానంగా ఉంటుంది, నిజ ప్రతిబింబం.
                                        
iv) వస్తువు వక్రతా కేంద్రం, నాభి మధ్యలో ఉన్నప్పుడు: వస్తువు వక్రతా కేంద్రం, నాభి మధ్యలో ఉన్నప్పుడు దర్పణ వక్రతా కేంద్రం (C) అవతల ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది తలకిందుల ప్రతిబింబం. వస్తువు కంటే పెద్దది, నిజ ప్రతిబింబం.
                                          
v) వస్తువు దర్పణ నాభి వద్ద ఉన్నప్పుడు: వస్తువు దర్పణ నాభి వద్ద ఉన్నప్పుడు అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది.
                            
vi) వస్తువు దర్పణ ధ్రువం, నాభి మధ్యలో ఉన్నప్పుడు: వస్తువు దర్పణ ధ్రువం, నాభి మధ్యలో ఉన్నప్పుడు దర్పణం వెనుక వైపు ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది నిటారు ప్రతిబింబం. వస్తువు కంటే పెద్దది, మిథ్యా ప్రతిబింబం.
                                     


14. ఒకవేళ గోళాకార దర్పణాలను ఆవిష్కరించకపోతే మానవుడి జీవన సరళి ఎలా ఉండేదో ఊహించి రాయండి.  (AS 2) 2 మార్కులు
జ: * వాహనాలను నడపడంలో ప్రత్యేకించి రాత్రివేళలో నడపడం సురక్షితం కాదు.
* వాహనాల హెడ్‌లైట్లు, టార్చిలైట్లు, సెర్చిలైట్లు ఎక్కువ దూరం కాంతిని ఇవ్వవు.
* దంతవైద్యులు దంత సమస్యలను సరిగా నిర్ధారించలేరు.
* పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేసే టెలిస్కోపులను నిర్మించడం సాధ్యమయ్యేది కాదు.


15. దర్పణాలకు సంబంధించిన వివిధ బిందువుల గురించి రాయండి.  (AS 1) 2 మార్కులు
జ: దర్పణాలకు సంబంధించిన బిందువులు:
i) దర్పణ ధ్రువం (P): దర్పణ మధ్య బిందువు (జ్యామితీయ కేంద్రం)ను దర్పణ ధ్రువం (P) అంటారు.
ii) నాభి (F): దర్పణాలపై సమాంతరంగా పతనమైన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ప్రధానాక్షాన్ని ఖండించే బిందువును నాభి (F) అంటారు.
iii) వక్రతా కేంద్రం (C): గోళీయ దర్పణాన్ని ఏర్పరచిన గోళ కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటారు. దీన్ని 'C'తో సూచిస్తారు.


16. దర్పణాలకు సంబంధించి వివిధ దూరాల గురించి రాయండి. (AS 1) 2 మార్కులు
జ: దర్పణాలకు సంబంధించి వివిధ దూరాలు:
i) నాభ్యంతరం (F): నాభికి, ధ్రువానికి మధ్య ఉండే దూరాన్ని నాభ్యంతరం అంటారు. నాభి, వక్రతా కేంద్రం మధ్య ఉండే దూరం కూడా నాభ్యంతరమే.
ii) వక్రతా వ్యాసార్ధం (R): దర్పణ వక్రతా కేంద్రానికి, ధ్రువానికి మధ్య ఉండే దూరాన్ని ఆ దర్పణ వక్రతా వ్యాసార్ధం (R) అంటారు.


17. కింది పటంలో దర్పణ ధ్రువం, నాభి, వక్రతా కేంద్రం, ప్రతిబింబ స్థానాలను గుర్తించండి.   (AS 5) 2 మార్కులు
                          
జ: 
                       
      P - దర్పణ ధ్రువం
      F - నాభి
      C - వక్రతా కేంద్రం
      F, C మధ్య ప్రతిబింబ స్థానం ఉంటుంది.

 

18. పుటాకార దర్పణంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఎక్కడ ఉంచాలో చూపే కిరణ చిత్రం గీయండి.  (AS 5) 2 మార్కులు
జ: 
                        


19. ఏ ధర్మం ఆధారంగా దంతవైద్యులు పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు?  (AS 1) 2 మార్కులు
జ: పుటాకార దర్పణానికి దగ్గరలో (నాభ్యంతరం కంటే తక్కువ దూరంలో) వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అలాగే నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి దంత, ఈఎన్‌టీ వైద్యులు పుటాకార దర్పణాలను గొంతు, ముక్కు లోపల ఉండే చిన్న భాగాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు.

 

20.  అనే దర్పణ సూత్రాన్ని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తావు?  (AS 3) 2 మార్కులు
జ: కావాల్సిన పరికరాలు: కొవ్వొత్తి, తెల్ల కాగితం/ డ్రాయింగ్ షీట్, పుటాకార దర్పణం, V - స్టాండ్, కొలత టేపు లేదా మీటరు స్కేలు.
విధానం: i) పుటాకార దర్పణాన్ని V - స్టాండుపై ఉంచాలి. పటంలో చూపినట్లు వెలుగుతున్న కొవ్వొత్తి, మీటరు స్కేలును ఉంచాలి.
               

ii) దర్పణం నుంచి వివిధ దూరాల్లో ప్రధానాక్షం వెంబడి కొవ్వొత్తిని ఉంచుతూ కాగితాన్ని (తెరను) ముందుకూ, వెనుకకూ కదుపుతూ ప్రతిసారి ఏ స్థానంలో స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుందో గుర్తించాలి.
iii) దర్పణం నుంచి కొవ్వొత్తికి ఉండే దూరం (వస్తుదూరం) uను, దర్పణం నుంచి ప్రతిబింబానికి (తెరకు) ఉండే దూరం vను కొలిచి ఇచ్చిన పట్టికలో నమోదు చేయాలి.

iv) పై పట్టికలోని పరిశీలనల ఆధారంగా

 అని నిర్ధారించవచ్చు.


21. సోలార్ కుక్కర్‌లో వేడిచేయాల్సిన పాత్రను ఎక్కడ ఉంచుతారో సూచించే పటం గీయండి. (AS 5) 2 మార్కులు
జ: 
                    
22. ఏ దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు? (AS 1) ఒక మార్కు
జ: వక్రంగా, పరావర్తన తలాలు ఉండే దర్పణాలను; అంతర భాగాలు గుల్లగా ఉండే దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు.


23. దర్పణ సూత్రాన్ని రాయండి.   (AS 1) ఒక మార్కు
జ: దర్పణ సూత్రం 
ఇక్కడ f - నాభ్యంతరం
          u - వస్తుదూరం
          v - ప్రతిబింబ దూరం


24. దర్పణ నాభ్యంతరం, వక్రతా వ్యాసార్ధానికి మధ్య సంబంధం ఏమిటి?   (AS 1) ఒక మార్కు
జ: దర్పణ వక్రతా వ్యాసార్ధం, దాని నాభ్యంతరానికి రెండు రెట్లుంటుంది.
వక్రతా వ్యాసార్ధం = 2 × నాభ్యంతరం
     R = 2 × f
     లేదా
     


25. కుంభాకార దర్పణంతో కాగితాన్ని మండించగలమా? ఎందుకు?  (AS 2) ఒక మార్కు
జ: కుంభాకార దర్పణ ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత వికేంద్రీకరణం చెందుతాయి. అందువల్ల కాగితాన్ని మండించలేం.


26. ఎక్కువ పరిధిలో దృశ్యాన్ని అందించగల దర్పణమేది?   (AS 6) ఒక మార్కు
జ: కుంభాకార దర్పణాలు ఎక్కువ పరిధిలో దృశ్యానుభూతిని అందించగలవు.


27. వాహనాల రియర్ వ్యూ మిర్రర్స్‌గా కుంభాకార దర్పణాలను వాడతారు. ఎందుకు? (AS1) (AS6) ఒక మార్కు
జ: కుంభాకార దర్పణాలు ఎల్లప్పుడూ నిటారుగా వస్తువు కంటే చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. దర్పణంలో ఎక్కువ ప్రాంతాన్ని చూపిస్తాయి. కుంభాకార దర్పణాలను వాహనాల్లో డ్రైవరుకు ఎదురుగా అమర్చుతారు. అప్పుడు డ్రైవరు వెనక్కి తిరిగి చూడనవసరం లేకుండా వెనుక ఉండే రోడ్దు దృశ్యాన్ని చూడగలుగుతాడు. కాబట్టి కుంభాకార దర్పణాన్ని రియర్ వ్యూ మిర్రర్స్‌గా వాడతారు.


28. సోలార్ కుక్కర్‌లో పాత్రను ఎక్కడ ఉంచుతారు?  (AS1) (AS6) ఒక మార్కు
జ: నాభి బిందువు వద్ద ఉంచుతారు.


29. కింది పటం దేన్ని సూచిస్తుంది?  (AS 4) (AS 5) ఒక మార్కు
                                
జ: ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి కుంభాకార దర్పణంపై పతనమైన కాంతి కిరణం పరావర్తనం చెందాక నాభి (F) నుంచి బయలుదేరి వస్తున్నట్లు కనిపిస్తుంది.

 

30. కింది పటంలో పరావర్తనం తర్వాత కాంతి కిరణ మార్గాన్ని గీయండి. (AS 5) ఒక మార్కు
                                          
జ:
                                     

సమస్యలు - సాధనలు

1. ఒక పుటాకార దర్పణం నాభ్యంతరం 15 సెం.మీ. అయితే దాని వక్రతా వ్యాసార్ధం ఎంత?   (AS 1) ఒక మార్కు
సాధన: నాభ్యంతరం (f) = 15 సెం.మీ.
           వక్రతా వ్యాసార్ధం (R) = ?
                    R = 2f

          R = 2 × 15 = 30 సెం.మీ.


2. ఒక కుంభాకార దర్పణ నాభ్యంతరం 10 సెం.మీ. అయితే దాని వక్రతా వ్యాసార్ధం ఎంత?   (AS 1) ఒక మార్కు
సాధన: నాభ్యంతరం (f) = 10 సెం.మీ.
          వక్రతా వ్యాసార్ధం (R) = ?
            R = 2f
          R = 2 × 10 = 20 సెం.మీ.


3. ఒక గోళాకార దర్పణ వక్రతా వ్యాసార్ధం 16 సెం.మీ. అయితే దాని నాభ్యంతరం ఎంత?   (AS 1) ఒక మార్కు
సాధన: వక్రతా వ్యాసార్ధం (R) = 16 సెం.మీ.
            నాభ్యంతరం (f) = ?
         


4. ఒక దర్పణ ధ్రువం, వక్రతా కేంద్రం మధ్య దూరం 20 సెం.మీ. అయితే ఆ దర్పణం నాభ్యంతరం ఎంత?   (AS 1) ఒక మార్కు
సాధన: వక్రతా వ్యాసార్ధం (R) = 20 సెం.మీ.
           నాభ్యంతరం (f) = ?
    


5. 30 సెం.మీ. నాభ్యంతరం ఉన్న ఒక కుంభాకార దర్పణం ఎదుట 20 సెం.మీ. దూరంలో వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబ దూరం, స్వభావం ఏమవుతాయి?   (AS 1) 4 మార్కులు
సాధన: వస్తు దూరం (u) = - 20 సెం.మీ.
          నాభ్యంతరం (f) = 30 సెం.మీ.

                 
ప్రతిబింబం చిన్నది, నిటారుగా ఏర్పడుతుంది.

6. పుటాకార దర్పణానికి ముందు 20 సెం.మీ. దూరంలో వస్తువును ఉంచామనుకుందాం. దాని నాభ్యంతరం 30 సెం.మీ. అయితే
   a) ప్రతిబింబ దూరం ఎంత?
   b) దర్పణానికి ఈ సందర్భంలో ఆవర్ధనం ఎంత?  (AS 1) 4 మార్కులు
సాధన: a) పుటాకార దర్పణం విషయంలో
వస్తువు దూరం (u) = - 20 సెం.మీ.
ప్రతిబింబ దూరం (v) = ?
నాభ్యంతరం (f) = - 30 సెం.మీ.


మిథ్యా, నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది.


7. కుంభాకార దర్పణానికి ముందు 5 సెం.మీ. దూరంలో వస్తువు ఉంది. దాని నాభ్యంతరం 10 సెం.మీ. అయితే
    a) ప్రతిబింబ దూరం ఎంత?
    b) దాని ఆవర్ధనం ఎంత?    (AS 1) 4 మార్కులు
సాధన: a) కుంభాకార దర్పణం విషయంలో
           వస్తు దూరం (u) = - 5 సెం.మీ.
           నాభ్యంతరం (f) = +10 సెం.మీ.
           ప్రతిబింబ దూరం (v) = ?

8. ఒక పుటాకార దర్పణ వక్రతా వ్యాసార్ధం 10 సెం.మీ. ఒక వస్తువును 15 సెం.మీ. దూరంలో ఆ దర్పణం ప్రధానాక్షంపై ముందువైపు ఉంచితే ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది?    (AS 1) 4 మార్కులు
సాధన: వక్రతా వ్యాసార్ధం (R) = 10 సెం.మీ.
           వస్తు దూరం (u) = 15 సెం.మీ.
           ప్రతిబింబ దూరం (v) = ?

9. ఒక పుటాకార దర్పణం ముందువైపు 10 సెం.మీ. దూరంలో వస్తువును ఉంచితే దాని ప్రతిబింబం వస్తువుకు 4 రెట్లు పెద్దదైన నిజ ప్రతిబింబం ఏర్పరిచింది. ఆ ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? (AS 1) 2 మార్కులు
సాధన: నిజ ప్రతిబింబానికి ఆవర్ధనం (m) రుణాత్మకం కాబట్టి
         ఆవర్ధనం (m) = -4
     వస్తు దూరం (u) = -10 cm
ప్రతిబింబ దూరం (v) = ?

      
 

10. 15 సెం.మీ. నాభ్యంతరం ఉన్న పుటాకార దర్పణం ముందు 25 సెం.మీ. దూరంలో, 2 సెం.మీ. ఎత్తు ఉండే వస్తువును ఉంచారు. దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది? ప్రతిబింబ లక్షణాలను తెలపండి.  (AS 1) 4 మార్కులు
సాధన: సంజ్ఞా సంప్రదాయం ప్రకారం
      దర్పణ నాభ్యంతరం (f) = - 15 సెం.మీ.
      వస్తు దూరం (u) = - 25 సెం.మీ.
      వస్తువు ఎత్తు (ho) = +2 సెం.మీ.
      ప్రతిబింబ దూరం (v) = ?
      ప్రతిబింబం ఎత్తు (hi) = ?

దర్పణానికి ముందు 37.5 సెం.మీ. దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది నిజ ప్రతిబింబం.


కాబట్టి ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది. వస్తువు కంటే పెద్దగా ఉంటుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. కాంతి కిరణాలు గోళాకార దర్పణంపై పడినప్పుడు విచలనం చెందకుండా వెళ్లే రెండు సందర్భాలను పేర్కొనండి. (AS1) ఒక మార్కు
జ: లంబం వెంబడి లేదా వక్రతా కేంద్రం (C) ద్వారా, ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కిరణాలు విచలనం చెందవు.


2. పుటాకార దర్పణాలు కనుక్కోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించండి. (AS2) ఒక మార్కు
జ: సోలార్ కుక్కర్‌లు రూపొందించడం; వాహనాల హెడ్‌లైట్లు, టార్చిలైట్లు, సెర్చ్‌లైట్లు కాంతిని ఎక్కువ దూరం ప్రసరింపజేయడం సాధ్యపడేది కాదు.


3. కుంభాకార దర్పణాలు కనుక్కోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించండి. (AS2) ఒక మార్కు
జ: వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్స్ ఉండకపోయేవి.


4. దర్పణం కిందపడి పగిలింది. ఆ దర్పణ నాభ్యంతరంలో మార్పు జరుగుతుందా? (AS2) ఒక మార్కు
జ: మారదు.


5. రియర్ వ్యూ మిర్రర్‌గా పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? (AS2)ఒక మార్కు
జ: ప్రతిబింబాన్ని సరిగ్గా గుర్తించలేం. కొన్ని సందర్భాల్లో ప్రతిబింబాలు తలకిందులుగా ఏర్పడతాయి.


6. పుటాకార దర్పణాల్లో పరావర్తనం చెందే కాంతి కిరణాలను ఒక బిందువు వద్ద కేంద్రీకరించకపోతే ఏం జరుగుతుందో ఊహించండి.   (AS2) ఒక మార్కు
జ:
నిజప్రతిబింబాలు ఏర్పడవు.

 

7. పుటాకార దర్పణం నాభ్యంతరం కనుక్కోవడానికి కావాల్సిన పరికరాల జాబితాను రాయండి. (AS3) ఒక మార్కు
జ: పుటాకార దర్పణం, చిన్న కాగితం ముక్క, స్కేలు.


8. పుటాకార దర్పణం నాభ్యంతరం కనుక్కోవడానికి చేసే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాయండి.  (AS3) ఒక మార్కు
జ: కాగితం పరిమాణం దర్పణంపై పడే కాంతి కిరణాలకు అడ్డుగా ఉండకుండా సాధ్యమైనంత చిన్నదిగా ఉండాలి.


9. నిజజీవితంలో గోళాకార దర్పణాల ఉపయోగాలను రాయండి. (AS6) 2 మార్కులు
జ: * పుటాకార దర్పణాలను షేవింగ్ అద్దాలు, దంత వైద్యులు ఉపయోగించే అద్దాలు, సోలార్ కుక్కర్‌ల తయారీకి, వాహనాల హెడ్‌లైట్లు, టార్చిలైట్లలో పరావర్తకాలుగా ఉపయోగిస్తారు.
* కుంభాకార దర్పణాలను వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్స్‌గా ఉపయోగిస్తారు.


10. ఒక కుంభాకార దర్పణంపై వేర్వేరు పతన బిందువుల వద్ద గీసిన లంబాలు ఎక్కడ ఖండించుకుంటాయి?    (AS1) ఒక మార్కు 
జ: వ‌క్ర‌తాకేంద్రం వ‌ద్ద‌


11. కుంభాకార, పుటాకార దర్పణాల్లో ఏ కిరణం ఒకే విధంగా పరావర్తనం చెందుతుంది? (AS1) ఒక మార్కు
జ: ప్రధానాక్షం నుంచి ప్రయాణించే కాంతికిరణం.


12. ఒక వాచ్‌గ్లాస్‌ను కుంభాకార దర్పణంగా మార్చేందుకు దానికి ఏ వైపున కుళాయి పూత పూయాలి?  (AS1) ఒక మార్కు 
జ: పుటాకార తలంపై


13. పుటాకార దర్పణంతో ఏ సందర్భంలో వస్తు పరిమాణం కంటే పెద్దదైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది?  (AS1) ఒక మార్కు 
జ: ప్రధానాక్షంపై C, Fల మధ్య వస్తువు ఉన్నప్పుడు


14. పుటాకార దర్పణంలో ఏ సందర్భంలో వస్తు పరిమాణం కంటే పెద్దదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది?  (AS1) ఒక మార్కు
జ: ప్రధానాక్షంపై F, Pల మధ్య వస్తువు ఉన్నప్పుడు


15. గోళాకార దర్పణంలో సంబంధిత దూరాలన్నింటినీ ఎక్కడ నుంచి కొలుస్తారు? (AS1) ఒక మార్కు
జ: దర్పణ ధృవం


16. పుటాకార దర్పణంలో నిజవస్తువుకు, నిజ ప్రతిబింబానికి మధ్య కనిష్ఠ దూరం ఎంత? (AS1) ఒక మార్కు
జ: సున్నా


17. సంజ్ఞా సంప్రదాయం ప్రకారం వస్తువు ఎత్తు (ho), ప్రతిబింబం ఎత్తు (hi) ప్రధానాక్షానికి కింద వైపు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా పరిగణిస్తారు? (AS1)ఒక మార్కు
జ: రుణాత్మకంగా పరిగణించాలి.


18. సంజ్ఞా సంప్రదాయం ప్రకారం కాంతి ప్రయాణించిన దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను ఏ విధంగా పరిగణిస్తారు? (AS1)ఒక మార్కు
జ: రుణాత్మకంగా పరిగణించాలి.

 

19. దంత వైద్యుడు కుంభాకార దర్పణాన్ని ఉపయోగించవచ్చా? కారణాలు ఊహించండి. (AS2) ఒక మార్కు
జ: ప్రతిబింబం చిన్నదిగా ఏర్పడుతుంది. కాబట్టి ఉపయోగించలేం.


20. -10 సెం.మీ. నాభ్యంతరం ఉన్న దర్పణం ఏ రకమైంది? (AS1) ఒక మార్కు
జ: పుటాకార దర్పణం.


21. +12 సెం.మీ. నాభ్యంతరం ఉన్న దర్పణం ఏ రకమైంది? (AS1) ఒక మార్కు
జ: కుంభాకార దర్పణం.


22. పుటాకార దర్పణం నాభి వద్ద వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?  (AS1) ఒక మార్కు 
జ: అనంత దూరంలో


23. పుటాకార దర్పణం ముందు అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?  (AS1) ఒక మార్కు 
జ: నాభి వద్ద


24. వస్తువు కంటే చిన్నదైన, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే గోళాకార దర్పణం పేరును తెలపండి. (AS1) ఒక మార్కు 
జ: కుంభాకార దర్పణం


25. దర్పణాలు ఉపయోగించి శత్రువుల ఓడలు తగులబెట్టిన శాస్త్రవేత్త ఎవరు? (AS6) ఒక మార్కు
జ: ఆర్కిమెడిస్


26. ఎక్కువ పరిధిలో దృశ్యాన్ని అందించే దర్పణం ఏది? (AS6) ఒక మార్కు
జ: కుంభాకార దర్పణం

Posted Date : 20-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం