• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆమ్లాలు - క్షారాలు - లవణాలు  

ప్రశ్నలు - జవాబులు

1. కింది నమూనా ద్రావణాలను ఇచ్చిన సూచికల్లో వాటి రంగు మార్పును రాసి ఆమ్లాలు, క్షారాలు, లవణాలుగా వర్గీకరించండి.  (AS - 1) 4 మార్కులు
     

జ:  పై ఫలితాలను ఆధారంగా చేసుకుని ఇచ్చిన పదార్థాలను కింది విధంగా వర్గీకరించవచ్చు.
ఆమ్లాలు: HCl, H2SO4, HNO3, CH3COOH
క్షారాలు: NaOH, KOH, Mg(OH)2, Ca(OH)2
లవణాలు: NaCl

 

2. ఆమ్లాలు, క్షారాలకు మధ్య ఉన్న భేదాలేమిటి?  (AS - 1) 4 మార్కులు 

జ:

3. ఒక ఆమ్లం, లోహంతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుందని చూపడానికి కావాల్సిన పరికరాల జాబితాను రాసి, ఆ ప్రయోగ విధానాన్ని వివరించండి. (AS - 3) 4 మార్కులు
జ:   కావాల్సిన పరికరాలు: పరీక్ష నాళిక, వాయువాహక నాళం, డెలివరీ గొట్టం, గాజుతొట్టె, కొవ్వొత్తి, సబ్బునీరు, సజల HCl, జింకు ముక్కలు, రబ్బరు బిరడా, స్టాండ్.
ప్రయోగ విధానం:   *  పరికరాలను పటంలో చూపిన విధంగా అమర్చాలి.


* ఒక పరీక్ష నాళికలో 10 మి.లీ. సజల HCl ను తీసుకోవాలి. దానికి కొన్ని జింకు ముక్కలను కలపాలి.  
* జింకు ముక్కల ఉపరితలం నుంచి వాయువు వెలువడటాన్ని గమనించవచ్చు.
* పరీక్ష నాళికలో వెలువడిన వాయువును సబ్బునీటి ద్వారా పంపాలి.
* సబ్బు నీటిలో బుడగలు ఏర్పడటాన్ని గమనిస్తాం.
* సబ్బునీటి ద్వారా వచ్చే వాయు బుడగల దగ్గరకు వెలుగుతున్న కొవ్వొత్తిని తీసుకురావాలి.
* వెలువడిన వాయువును మండించినప్పుడు 'టప్‌'మనే శబ్దం రావడాన్ని గమనిస్తాం.
* దీన్ని బట్టి వెలువడిన వాయువు హైడ్రోజన్ (H2) వాయువని చెప్పవచ్చు.
    2 HCl    +     Zn          ZnCl2     +     H2 
     ఆమ్లం    +   లోహం       లవణం     +    హైడ్రోజన్
¤* పై ప్రయోగాన్ని తిరిగి H2SO4, HNO3 ఆమ్లాలతో నిర్వహించాలి.
¤* పై ప్రయోగాన్ని బట్టి ఆమ్లాలు, లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయని నిర్ధారణ అయ్యింది.

 

4. కార్బొనేట్లు, లోహ కార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి కార్బన్‌డైఆక్సైడ్, లోహ లవణాలు, నీటిని ఏర్పరిచే ప్రయోగానికి కావాల్సిన పరికరాల జాబితాను, ప్రయోగ విధానాన్ని రాయండి.  (AS - 3) 4 మార్కులు
జ: కావాల్సిన పరికరాలు:  రెండు పరీక్ష నాళికలు, వాయువాహక నాళం, థిసిల్ గరాటు, బిరడా, స్టాండ్, సజల HCl, సోడియం కార్బొనేట్,  సోడియం బైకార్బొనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం

ప్రయోగ విధానం:   


* రెండు పరీక్ష నాళికలను తీసుకుని వాటిపై A, B అక్షరాలను రాసిన కాగితాలు అతికించాలి.
* A పరీక్ష నాళికలో 0.5 గ్రా. సోడియం కార్బొనేట్‌ను, B పరీక్ష నాళికలో 0.5 గ్రా. సోడియం బైకార్బొనేట్‌ను తీసుకోవాలి.
* రెండు పరీక్ష నాళికల్లో 2 మి.లీ. చొప్పున సజల HCl ద్రావణాన్ని కలపాలి.
* రెండు పరీక్ష నాళికల్లో నుంచి వెలువడిన వాయువులను వేర్వేరుగా సున్నపు తేట (కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం) ద్వారా పంపించాలి. తెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది. కాబట్టి పంపిన వాయువు CO2 అవుతుంది.
* పై సందర్భాల్లో జరిగిన చర్యలను కింది విధంగా రాయవచ్చు.
    Na2CO3  +  2 HCl   2 NaCl  +  H2O  + CO2
    (ఘ.)        (జ.ద్రా.)      (జ.ద్రా.)    (ద్ర)     (వా)

    NaHCO3  +  HCl  

 NaCl  +  H2O  +  CO2
    (ఘ)        (జ.ద్రా.)    (జ.ద్రా.)     (ద్ర)     (వా)

* వాయువును సున్నపుతేట ద్వారా పంపినప్పుడు
    Ca(OH)2  +  CO2     CaCO3   +  H2O
      (జ.ద్రా.)              (వా)             (తెల్లటి అవక్షేపం)       

నిర్ధారణ: పై ప్రయోగం నుంచి అన్ని లోహ కార్బొనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి ఆయా లోహాల లవణాలతోపాటు కార్బన్ డై ఆక్సైడ్ వాయువు, నీటిని ఏర్పరుస్తాయి అని తెలుస్తుంది.               
                లోహ కార్బొనేట్ + ఆమ్లం  లవణం + కార్బన్‌డైఆక్సైడ్ + నీరు
                లోహ హైడ్రోజన్ కార్బొనేట్ + ఆమ్లం  లవణం + కార్బన్‌డైఆక్సైడ్ + నీరు

 

5. హైడ్రోజన్ ఉన్న ప్రతి సంయోగ పదార్థం ఆమ్లం కాదని చూపడానికి నిర్వహించిన ప్రయోగ విధానాన్ని పటం సహాయంతో వివరించండి.  (AS - 3) 4 మార్కులు

జ: 
 
                                     
* గ్లూకోజ్, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం లాంటి సమ్మేళనాల ద్రావణాలను తయారుచేయాలి.
* రెండు వేర్వేరు రంగులున్న విద్యుత్ తీగలకు గ్రాఫైట్ కడ్డీలను కలపాలి. వీటిని 100 మి.లీ.ల గాజు బీకరులో పటంలో చూపిన విధంగా ఉంచాలి.
* ఈ తీగల స్వేచ్ఛ కొనలను 230 వోల్ట్‌ల ప్లగ్‌కు కలిపి పటంలో చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని పూర్తిచేయాలి. వలయంలో ఒక తీగకు బల్బును అమర్చాలి.
* బీకరులో సజల HCl ద్రావణం పోసిన తర్వాత, వలయంలో విద్యుత్‌ను ప్రవహింపజేయాలి.
* ఆమ్ల ద్రావణంలో బల్బు వెలగడాన్ని గమనిస్తాం.
* సజల సల్ఫ్యూరికామ్లం, గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాలతో పై ప్రయోగాన్ని తిరిగి నిర్వహించాలి.
* సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్రావణంలో మాత్రమే బల్బు వెలుగుతుంది కానీ గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలగకపోవడాన్ని గమనిస్తాం.
* బల్బు వెలుగుతుందంటే ఆ ద్రావణం ద్వారా విద్యుత్ ప్రసరిస్తోందని తెలుస్తుంది.
* ఆమ్ల ద్రావణాల్లో అయాన్లు ఉంటాయి. ఈ అయాన్ల చలనం వల్లే ఆ ద్రావణాల్లో విద్యుత్ ప్రసారం జరుగుతుంది.
* HCl ద్రావణాల్లో ధన అయాన్లు (H+) ఉంటాయి. కాబట్టి, ఆమ్ల ధర్మాలకు కారణమైన హైడ్రోజన్ అయాన్లను (H+) ఇస్తాయి. ఆమ్ల ద్రావణాల్లో విడుదలైన H+ అయాన్లు ఆమ్లాల స్వభావాన్ని నిర్ధారిస్తాయి.
* గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలుగదు కాబట్టి ఈ ద్రావణాల్లో H+ అయాన్లు ఉండవని అర్థమవుతుంది. కానీ ఇవి హైడ్రోజన్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాలను ఆమ్లాలుగా పరిగణించరు.

6. ఆమ్లాలు జల ద్రావణంలో మాత్రమే అయాన్లను ఏర్పరుస్తాయని ప్రయోగపూర్వకంగా ఎలా నిర్ధారిస్తారు? (AS - 3) 4 మార్కులు

జ:

    

* శుభ్రపరిచిన, పొడి పరీక్ష నాళికలో 1 గ్రా. ఘన NaCl ను తీసుకోవాలి.
* కొద్దిగా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పరీక్ష నాళికలోని NaClకు కలపాలి. అప్పుడు ఒక వాయువు వెలువడుతుంది.
* పై చర్యకు సమీకరణం 2 NaCl + H2SO4  2 HCl + Na2SO4

* వెలువడిన వాయువును ముందుగా పొడి నీలి లిట్మస్ కాగితంతో, తర్వాత తడి నీలి లిట్మస్ కాగితంతో పరీక్షించాలి.
* పొడి లిట్మస్ కాగితం రంగులో ఎలాంటి మార్పు రాదు కాబట్టి, పొడి HCl వాయువు ఆమ్లం కాదని నిర్ధారణ అవుతుంది.
* తడిగా ఉండే నీలి లిట్మస్ కాగితం ఎరుపురంగులోకి మారుతుంది. కాబట్టి సజల HCl ద్రావణం ఒక ఆమ్లం అవుతుంది.
* ఈ ప్రయోగాన్ని బట్టి నీటి సమక్షంలో HCl వియోగం చెంది హైడ్రోజన్ అయాన్‌ను ఏర్పరుస్తుంది. కాని నీరు లేనప్పుడు వియోగం చెందదు అని మనకు తెలుస్తుంది.
* నీటిలో HCl వియోగం కింది విధంగా జరుగుతుంది.
    HCl + H2 H3O+ + Cl-(జ.ద్రా.)
*¤ హైడ్రోజన్ అయాన్‌లు స్వేచ్ఛ అయాన్‌లుగా ఉండలేవు. అవి నీటి అణువులతో కలిసి హైడ్రోనియం అయాన్‌లుగా (H3O+) ఏర్పడతాయి.

7. ఆమ్లాలు, క్షారాల్లో బలమైన, బలహీన ఆమ్ల, క్షారాలను ఏ విధంగా ప్రయోగపూర్వకంగా గుర్తిస్తారు? వివరించండి. (AS - 3) 4 మార్కులు

జ: 

     
* A, B అనే రెండు బీకరులను తీసుకోవాలి.
* బీకరు Aలో సజల CH3COOHను, బీకరు Bలో సజల HClను తీసుకోవాలి.
* A, B బీకర్లలో వేర్వేరుగా పటంలో చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని అమర్చాలి.
* రెండు ద్రావణాల ద్వారా ఒకేసారి విద్యుత్‌ను పంపి పరిశీలించాలి.
* HCద్రావణాన్ని ఉపయోగించినప్పుడు బల్బు ఎక్కువ ప్రకాశమంతంగా, CH3COOH ద్రావణాన్ని ఉపయోగించినప్పుడు తక్కువ ప్రకాశమంతంగా వెలుగుతుంది. దీన్నిబట్టి HCl ద్రావణంలో ఎక్కువ అయాన్‌లు ఉంటాయని, CH3COOH (ఎసిటిక్ ఆమ్లం) ద్రావణంలో తక్కువ అయాన్లు ఉంటాయని తెలుస్తుంది.
* HCl ద్రావణంలో ఎక్కువ అయాన్‌లు (H3O+) ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి, ఇది బలమైన ఆమ్లం. అదే విధంగా ఎసిటిక్ ఆమ్లంలో తక్కువ అయాన్‌లు (H3O+) ఉన్నాయి కాబట్టి ఇదొక బలహీన ఆమ్లం.
* పై ప్రయోగాన్ని ఆమ్లాలకు బదులు సజల సోడియం హైడ్రాక్సైడ్, సజల అమ్మోనియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారాలతో తిరిగి నిర్వహించాలి. పరిశీలనల నుంచి NaOH బలమైన క్షారం అని NH4OH బలహీన క్షారం అని చెప్పవచ్చు.

 

8. X, Y, Z అనే ద్రావణాల pH విలువలు వరుసగా 13, 6, 2 అయితే
a) ఏ ద్రావణం బలమైన ఆమ్లం?ఎందుకు?
b) ఏ ద్రావణంలో ద్రావిత అణువులతోపాటు అయాన్లు కూడా ఉంటాయి.
c) ఏ ద్రావణం బలమైన క్షారం? ఎందుకు?
d) ఒక ద్రావణానికి క్షారాన్ని కలిపినప్పుడు దాని pH విలువ పెరుగుతుందా, తగ్గుతుందా? ఎందుకు?  (AS - 1) 4 మార్కులు 

జ: a) Z కు అతి తక్కువ pH విలువ (2) ఉంది. కాబట్టి అది బలమైన ఆమ్లం.
b) X కు అధిక pH విలువ (13) ఉంది. కాబట్టి X ద్రావణంలో ద్రావిత అణువులతోపాటు అయాన్లు కూడా ఉంటాయి.
c) X కు అధిక pHవిలువ (13) ఉంది. కాబట్టి అది బలమైన క్షారం.
d) ఏదైనా ఒక ద్రావణానికి క్షారాన్ని కలిపితే ఆ ద్రావణంలోకి OH- అయాన్ల గాఢత క్రమంగా పెరిగి pH విలువ కూడా పెరుగుతుంది.

 

9. కింది పట్టికలో ఆమ్లాలు, క్షారాలు కలిసినప్పుడు ఏర్పడిన లవణాలు, వాటి pH విలువలను ఇచ్చారు. పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.  (AS - 4) 4 మార్కులు

a) ఆమ్ల స్వభావం ఉన్న లవణం ఏది?
b) Na2CO3 లవణ స్వభావం ఏమిటి?
c) NaCl లవణం ఏ ఆమ్ల క్షారాల తటస్థీకరణం వల్ల ఏర్పడుతుంది?
d) తటస్థ లవణాలు ఏవి?

జ: a) ఆమ్ల స్వభావం ఉన్న లవణం NH4Cl.
b) Na2CO3 లవణం క్షార స్వభావం కలిగి ఉంటుంది.
c) HCl, NaOH ల తటస్థీకరణం వల్ల NaCl లవణం ఏర్పడుతుంది.
d) NaCl, KNO3 లు తటస్థ లవణాలు.

 

10. నిత్యజీవితంలో pH ప్రాముఖ్యాన్ని తెలిపే కొన్ని ఉదాహరణలను క్లుప్తంగా చర్చించండి.  (AS - 6) 2 మార్కులు
జ: * జీవ సంబంధ ప్రాణులన్నీ pH విలువల్లోని అతిస్వల్ప మార్పులకు లోబడి మాత్రమే జీవించగలవు.
* pH లోని మార్పు దంతక్షయానికి కారణమవుతుంది.
* జీర్ణవ్యవస్థలో జీర్ణక్రియ జరగడానికి విడుదలయ్యే ఆమ్లంలో pH ముఖ్యపాత్ర వహిస్తుంది.
* మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి నిర్దిష్ట పరిమితిలో pH ఉన్న మట్టి అవసరం.
* స్వీయ రక్షణ కోసం మొక్కలు, కీటకాలు, జంతువులు కొంత pH ఉండే రసాయనాలను ఉపయోగించుకుంటాయి.

11. నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు దంతక్షయం ఎందుకు ప్రారంభమవుతుంది? దీన్ని ఎలా నివారించవచ్చు?  (AS - 6) 2 మార్కులు
జ: నీటిలో pH విలువ 5.5 కంటే తక్కువ అయితే దంతక్షయం ప్రారంభమవుతుంది. దంతాలపై పింగాణి పొర ఉంటుంది. ఇది మానవ శరీరంలో అత్యంత ధృడమైంది. ఇది కాల్షియం ఫాస్ఫేట్‌తో తయారవుతుంది. నీటిలో కరగదు. నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు దంతాలు క్షయానికి గురవుతాయి. నోటిలో ఉన్న బ్యాక్టీరియమ్ దంతాల మధ్య చిక్కుకుని ఉన్న చక్కెర లాంటి ఆహార కణాలను వియోగం చెందించి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి pH విలువ తగ్గుతుంది. ఆహారం తిన్న తర్వాత నోటిని క్షార స్వభావం ఉన్న టూత్‌పేస్ట్ ఉపయోగించి శుభ్రపరచడం వల్ల ఉత్పత్తి అయిన ఆమ్లాలను తటస్థీకరించడం ద్వారా దంతక్షయాన్ని నివారించవచ్చు.

12. ఆమ్ల వర్షపు నీటి ప్రవాహం చెరువులు/నదుల్లోకి వచ్చి చేరినప్పుడు జలచరాల ఉనికికి ప్రమాదం. ఎందుకు? (AS - 6) 2 మార్కులు 
జ:  ప్రాణులన్నీ pH విలువల్లోని అతిస్వల్ప మార్పులకు లోబడి మాత్రమే జీవించగలవు. వర్షపు నీటి pH విలువ 5.6 కంటే తక్కువైతే దాన్ని ఆమ్లవర్షం అంటారు. ఈ ఆమ్ల వర్షపు నీరు నదీ జలాలతో కలిసినప్పుడు నదీజలాల pH విలువలు తగ్గుతాయి. అలాంటి తక్కువ pH విలువలున్న నది జలాల్లో ఉండే జలచరాల జీవనం సంకటంలో పడుతుంది.

 

13. మన జీర్ణవ్యవస్థలో pH పాత్రను వివరించండి.   (AS - 6) 2 మార్కులు
జ:  మన జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణాశయానికి నష్టం కలగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వల్ల కడుపులో మంట, అసహనం కలుగుతాయి. ఈ దుష్ప్రభావం నుంచి విముక్తి పొందడానికి మనం యంటాసిడ్‌లుగా పిలిచే క్షారాలను తీసుకుంటాం. ఈ యంటాసిడ్‌లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి.

 

14. తేనెటీగ కుట్టినప్పుడు నొప్పి, దురద ఎందుకు కలుగుతాయి? దానికి పరిష్కారం ఏమిటి?  (AS - 6) 2 మార్కులు                                                     
జ: తేనెటీగ కుట్టినప్పుడు దాని కొండి ద్వారా మిథనోయిక్ ఆమ్లం మన శరీరంలోకి చేరుతుంది. దాంతో మనకు తీవ్రమైన నొప్పి, దురద కలుగుతాయి. బేకింగ్ సోడా లాంటి బలహీనమైన క్షారాన్ని తేనెటీగ కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గుతుంది.

 

15. బేకింగ్ పౌడర్ కేక్ తయారీలో దాన్ని మృదువుగా, మెత్తగా ఉండేలా చేస్తుంది. ఎందుకు?   (AS - 1) 2 మార్కులు
జ: ¤ బేకింగ్ పౌడర్‌లో ప్రధాన అనుఘటకం NaHCO3. దీంతోపాటు ఆమ్ల కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్ Ca(H2PO4)2, పిండి పదార్థాలు బేకింగ్ పౌడర్‌లో ఉంటాయి. సోడియం బై కార్బోనేట్ (NaHCO3) బేకింగ్‌లో, బ్రెడ్, కేక్ తయారీలో పిండి పొంగడానికి, మృదువుగా మారడానికి CO2ను విడుదల చేయడం ద్వారా ఉపయోగపడుతుంది.


16. 'X' అనే పదార్థం నీలి లిట్మస్‌ను ఎర్రగా మారుస్తుంది. 'Y' అనే పదార్థం ఎర్రలిట్మస్‌ను నీలిగా మారుస్తుంది. X, Y ల మధ్య రసాయన చర్య జరిగితే ఏర్పడే పదార్థాలను ఊహించండి. కారణం రాయండి.  (AS - 2) 2 మార్కులు
జ: 'X' అనే పదార్థం నీలిలిట్మస్‌ను ఎర్రగా మారుస్తుంది. కాబట్టి అది ఆమ్లం. అదేవిధంగా 'Y' అనే పదార్థం ఎర్రలిట్మస్‌ను నీలిగా మారుస్తుంది. కాబట్టి అది క్షారం. 'X', 'Y' ల మధ్య రసాయన చర్య అంటే ఆమ్లం, క్షారాల మధ్య చర్య జరిగి లవణం, నీరు ఏర్పడతాయి. కాబట్టి ఇదొక తటస్థీకరణ చర్య.  ఆమ్లం + క్షారం  లవణం + నీరు

 

17. సజల సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు ఆనోడ్ వద్ద వెలువడిన 'X' అనే వాయువు తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్‌తో జరిపిన చర్య వల్ల 'Y' అనే సమ్మేళనం ఏర్పడుతుంది. దీన్ని తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహరిణిగా ఉపయోగిస్తారు. అయితే X, Y ల పేర్లేమిటి? వాటి మధ్య జరిగే చర్యను సూచించే రసాయన సమీకరణాన్ని రాయండి. (AS - 2) 2 మార్కులు
జ:  'X' అనేది క్లోరిన్, 'Y' అనేది బ్లీచింగ్ పౌడర్.
     రసాయన సమీకరణం
     Ca(OH)2    +     Cl2          CaOCl2     +     H2O
    తేమలేని     క్లోరిన్  వాయువు         బ్లీచింగ్  పౌడర్       నీరు
    కాల్షియం హైడ్రాక్సైడ్                   

 

18. బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలను రాయండి.  (AS - 6) 2 మార్కులు
జ: * వస్త్ర పరిశ్రమల్లో కాటన్, నారలను; కాగితం పరిశ్రమలో కలప గుజ్జును; దుస్తులను విరంజనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
* రసాయన పరిశ్రమల్లో దీన్ని ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.
* తాగేనీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహరిణిగా వాడతారు.
* క్లోరోఫాం తయారీలో కారకంగా ఉపయోగిస్తారు.

 

19. వాషింగ్ సోడా ఉపయోగాలను తెలపండి.  (AS - 6) 2 మార్కులు
జ: * గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమల్లో సోడియం కార్బొనేట్‌ను ఉపయోగిస్తారు.
* బోరాక్స్ లాంటి సోడియం సమ్మేళనాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు.
* గృహావసరాల్లో సోడియం కార్బొనేట్‌ను వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
* నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి వాడతారు.

 

20. సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఉపయోగాలను తెలపండి. (AS - 6) 2 మార్కులు
జ:  * ఆహారాన్ని త్వరగా ఉడికించడానికి వంట సోడాగా ఉపయోగిస్తారు.
* బేకింగ్ పౌడర్ తయారీకి దీన్ని ఉపయోగిస్తారు.
* సోడియం హైడ్రోజన్ కార్బొనేట్‌ను యాంటాసిడ్‌లలో ఒక ముఖ్య అనుఘటకంగా వాడతారు.
* అగ్నిమాపక యంత్రాల్లో దీన్ని సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు.
* బలహీనమైన యాంటీసెప్టిక్ (గాయాన్ని కుళ్లిపోకుండా చేసేది)గా కూడా ఇది ఉపయోగపడుతుంది.

 

21. ఏ పదార్థాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌గా వ్యవహరిస్తారు. దాన్ని ఎలా తయారు చేస్తారు? దాని ముఖ్య ఉపయోగాలను తెలపండి.  (AS - 1) 4 మార్కులు
జ: * కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్‌ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. దీని ఫార్ములా CaSO4.  H2O
* జిప్పంను 373 K ఉష్ణోగ్రతకు వేడి చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది.


ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగాలు:
* శరీరంలో విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్టులో వైద్యులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను ఉపయోగిస్తారు.
* ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను బొమ్మల తయారీలో, అలంకరణకు ఉపయోగించే పదార్థాల తయారీకి, గోడలు, ఇతర కట్టడాల ఉపరితలాలను నునుపు చేయడానికి ఉపయోగిస్తారు. 

22. pH స్కేలును గురించి వివరించండి.
                 (లేదా)
   pH స్కేలు పై లఘువ్యాఖ్య రాయండి.  (AS - 1) 4 మార్కులు
జ:¤* ఒక ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ల గాఢతను లెక్కించడానికి వాడే స్కేలును pH స్కేలు అంటారు.
* ఒక ద్రావణం ఆమ్లమా, క్షారమా అని నిర్ణయించే ఒక సంఖ్యాత్మక విలువే pH.
* pH విలువ 0 నుంచి 14 వరకు ఉంటుంది.
* ఆమ్ల ద్రావణాలకు pH విలువ 0 నుంచి 7 వరకు ఉంటుంది. ఆమ్ల ద్రావణాలకు
pH < 7
* క్షార ద్రావణాలకు pH విలువ 7 నుంచి 14 వరకు ఉంటుంది. క్షార ద్రావణాలకు pH > 7
* తటస్థ ద్రావణాల pH విలువ 7కు సమానం.
    తటస్థ ద్రావణాలకు pH = 7
* pH విలువ 7 నుంచి 14కు పెరుగుతూ ఉంటే ఆ ద్రావణంలో H3O+ అయాన్ల గాఢత తగ్గి, OH- అయాన్ల గాఢత పెరుగుతూ ఉన్నదని అర్థం. ఆమ్లం

23. మీకు ఇచ్చిన pH స్కేలుపై ఉండే ద్రవాల స్థానాలను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. (AS - 4) 4 మార్కులు

i) వెనిగర్ pH విలువ ఎంత?
ii) గ్యాస్ట్రిక్ ద్రవం అనేది బలమైన ఆమ్లమా లేదా బలహీన ఆమ్లమా?
iii) మన శరీరంలోని ఏ ద్రవం క్షార స్వభావాన్ని కలిగి ఉంది?
iv) పైన సూచించిన ద్రవాల్లో ఏది బలమైన క్షార స్వభావాన్ని కలిగి ఉంది?
జ: పైన సూచించిన pH స్కేలు ఆధారంగా
i) వెనిగర్ pH విలువ 3
ii) గ్యాస్ట్రిక్ ద్రవం pH విలువ 1 కాబట్టి ఇది బలమైన ఆమ్లం.
iii) క్షార స్వభావం ఉన్న శరీర ద్రవం రక్తం
(pH > 7)
iv) NaOH ద్రవం బలమైన క్షార స్వభావాన్ని కలిగి ఉంది ఎందుకంటే దాని pH విలువ ఎక్కువగా ఉంది.


24. నీటిలో కరిగే క్షారాలను ఏమని పిలుస్తారు? (AS - 1) ఒక మార్కు
జ: ఆల్కలీలు (క్షారయుత ద్రావణాలు).


25. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగాలు తెలపండి.  (AS - 6) ఒక మార్కు
జ: స్టీలు వస్తువులు, గచ్చు, టాయిలెట్లను శుభ్రపరిచే ద్రవాల్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం వాడతారు. అంతేకాకుండా మందులు, సౌందర్య సాధనాల తయారీలో కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగిస్తారు.


26. నీటితో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చర్యను తెలపండి. (AS - 1) ఒక మార్కు
జ: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒక తెల్లటి పొడి, దీన్ని నీటితో కలిపినప్పుడు జిప్సం ఏర్పడటం వల్ల అది ఒక దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది.
     
     (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్)                 (జిప్సం)

27. సాధారణ లవణం (ఉప్పు) నుంచి లభించే ఇతర లవణాలు ఏవి? (AS - 1) ఒక మార్కు
జ: సాధారణ లవణం నుంచి సోడియం హైడ్రాక్సైడ్ (NaOH), వంటసోడా (NaHCO3), బట్టల సోడా (Na2CO3), బ్లీచింగ్ పౌడర్
(CaOCl2) లాంటి లవణాలు ఏర్పడతాయి.


28. ఆమ్ల సమక్షంలో లిట్మస్ కాగితం ఏ విధంగా మారుతుంది?(AS - 3) ఒక మార్కు
జ: ఆమ్ల సమక్షంలో నీలి లిట్మస్ ఎర్రగా మారుతుంది. కానీ, ఎర్రలిట్మస్ రంగు మారదు.


29. క్షార సమక్షంలో లిట్మస్ కాగితం ఏ విధంగా మారుతుంది? (AS - 3) ఒక మార్కు
జ: క్షార సమక్షంలో ఎర్ర లిట్మస్ నీలిగా మారుతుంది. కానీ నీలి లిట్మస్ రంగు మారదు.


30. ఆమ్ల, క్షార బలాలను ఎలా నిర్ణయిస్తారు? (AS - 1) ఒక మార్కు
జ: ఒక ద్రావణంలోని
H3O+అయాన్ల సంఖ్య లేదా OH- అయాన్ల సంఖ్య ఆధారంగా ఆమ్ల, క్షారాల బలాలను నిర్ణయిస్తారు.

 

మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు

1. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సమక్షంలో ఫినాప్తలీన్ ద్రావణం ఇచ్చే రంగు ఏది? (AS 3) ఒక మార్కు
జ: ఎలాంటి రంగును ఇవ్వదు.


2. KOH ద్రావణం సమక్షంలో ఫినాప్తలీన్ ద్రావణం ఇచ్చే రంగు ఏది? (AS 3) ఒక మార్కు
జ: గులాబీ రంగు


3. అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణం సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ద్రావణం సూచించే రంగు ఏది? (AS 3) ఒక మార్కు
జ: లేత పసుపు రంగు


4. H2SO4 సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ద్రావణం సూచించే రంగు ఏది? (AS 3) ఒక మార్కు
జ: ఎరుపు రంగు


5. సువాసన సూచికలకు రెండు ఉదాహరణలను ఇవ్వండి. (AS 1) ఒక మార్కు
జ: లవంగనూనె, వెనీలా ఎసెన్స్


6. ఆమ్లాలు, లోహాలతో చర్య జరిపినప్పుడు వెలువడే హైడ్రోజన్ వాయువును ప్రయోగశాలలో ఎలా గుర్తిస్తారు? (AS 3) ఒక మార్కు
జ: మండుతున్న అగ్గిపుల్ల సమక్షంలో హైడ్రోజన్ వాయువు దహనం చెంది 'టప్' అనే శబ్దాన్ని ఇస్తుంది.


7. Zn లోహం NaOH తో జరిపే చర్యను సూచించే తుల్యరసాయన సమీకరణాన్ని రాయండి. (AS 1) ఒక మార్కు
జ: 2 NaOH + Zn  Na2ZnO2 + H2


8. కార్బోనేట్లు, ఆమ్లాలతో జరిపే చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? (AS 1) ఒక మార్కు
జ: లవణం, నీరు, కార్బన్ డై ఆక్సైడ్


9. NaHCO3, HClల మధ్య జరిగే చర్యను సూచించే రసాయన సమీకరణాన్ని రాయండి. (AS 1) ఒక మార్కు
జ: NaHCO3 + HCl  NaCl + H2O + CO2


10. CO2 వాయువును సున్నపుతేట ద్వారా పంపినప్పుడు ఏర్పడే అవక్షేపం ఏది? (AS 1) ఒక మార్కు
జ: కాల్షియం కార్బోనేట్


11. అధిక CO2 వాయువును సున్నపుతేట ద్వారా పంపినప్పుడు ఏర్పడే అంత్య ఉత్పన్నం ఏది? (AS 1) ఒక మార్కు
జ: కాల్షియం హైడ్రోకార్బోనేట్ [Ca(HCO3)2]


12. NaOH, HCl ల మధ్య జరిగే చర్యను ఏమంటారు? (AS 1) ఒక మార్కు
జ: తటస్థీకరణ చర్య


13. కాపర్ ఆక్సైడ్‌ను సజల HCl తో చర్య జరిపినప్పుడు ఏర్పడే నీలి - ఆకుపచ్చ రంగు పదార్థం ఏది?(AS 1) ఒక మార్కు
జ: కాపర్ క్లోరైడ్
(CuCl2)


14. అలోహ ఆక్సైడ్‌లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? (AS 1) ఒక మార్కు
జ: ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.


15. నీటితో కలిసిన ఆమ్ల ద్రావణం విద్యుత్ వాహకతను కలిగిస్తుందని నిరూపించే ప్రయోగానికి కావాల్సిన ఉపకరణాలు, రసాయనాల జాబితాను తెలపండి. (AS 3) ఒక మార్కు
జ: 230 వోల్ట్‌ల AC ప్లగ్, బల్బు, వాహకపు తీగ, గ్రాఫైట్ కడ్డీలు, బీకర్లు, సజల HCl లేదా సజల H2SO4


16. H అయాన్లను కలిగి ఉన్న పదార్థాలు ఏ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి? (AS 1) ఒక మార్కు
జ: ఆమ్ల ధర్మాన్ని


17. OH అయాన్లను కలిగి ఉన్న పదార్థాలు ఏ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి? (AS 1) ఒక మార్కు
జ: క్షార ధర్మాన్ని


18. పొడి HCl వాయువును ప్రయోగశాలలో పొందేందుకు ఏ రకమైన వాయువాహక నాళాన్ని ఉపయోగిస్తారు?(AS 3) ఒక మార్కు
జ: నిర్జలీకరణ గొట్టం
(Gaurd tube)


19. నిర్జలీకరణ గొట్టంలో పొడి HCl ను పొందేందుకు ఉపయోగించే పదార్థం ఏది? (AS 1) ఒక మార్కు
జ: కాల్షియం క్లోరైడ్
(CaCl2)


20. నీటిలో కరిగే క్షారాలను ఏ పేరుతో పిలుస్తారు? (AS 1) ఒక మార్కు
జ: ఆల్కలీలు (క్షారయుత)


21. గాఢ‌ ఆమ్లాన్ని నీటికి కలిపినప్పుడు ఏం జరుగుతుంది? (AS 3) ఒక మార్కు
జ: ఉష్ణం వెలువడుతుంది.


22. pH దేన్ని సూచిస్తుంది? (AS 1) ఒక మార్కు
జ: ద్రావణంలోని H+ అయాన్‌ల గాఢతను తెలియజేస్తుంది.


23. గాఢ ఆమ్లాల pH విలువ ఎంత ఉంటుంది? (AS 1) ఒక మార్కు
జ: 0 నుంచి 2 వరకు


24. ద్రావణంలోని H+ అయాన్ల గాఢత 10-6 అయితే దాని pH విలువ ఎంత ఉంటుంది? (AS 1) ఒక మార్కు
జ: 6


25. ద్రావణంలోని OH- అయాన్ల గాఢత 10-12 అయితే దానిలోని H+ అయాన్ల గాఢత ఎంత ఉంటుంది? (AS 1) ఒక మార్కు
జ: 10-2


26. ద్రావణంలోని H+ అయాన్ల గాఢత 10-7 అయితే ఆ ద్రావణ స్వభావం ఏమిటి? (AS 1) ఒక మార్కు
జ: తటస్థ ద్రావణం


27. ఒక ద్రావణం pH విలువ 13 అయితే దాని స్వభావం ఏమిటి? (AS 1) ఒక మార్కు
జ: బలమైన క్షార స్వభావం


28. ఆమ్ల వర్షం pH పరిధి ఎంత? (AS 6) ఒక మార్కు
జ: 5.6 కంటే తక్కువ pH విలువ


29. ఏ pH విలువ వద్ద దంతక్షయం ప్రారంభమవుతుంది? (AS 6) ఒక మార్కు
జ: pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు


30. టూత్‌పేస్ట్ స్వభావం ఏమిటి? (AS 1) ఒక మార్కు
జ: క్షార స్వభావం


31. నోటిలో మిగిలిన ఆహార పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా వియోగం చెంది ఏర్పరిచే పదార్థం ఏది? (AS 1) ఒక మార్కు
జ: ఆమ్లం


32. యాంటాసిడ్‌ల తయారీలో ఉపయోగించే బలహీన క్షారం ఏది? (AS 6) ఒక మార్కు
జ: మిల్క్ ఆఫ్ మెగ్నీషియం
[Mg(OH)2]


33. తేనెటీగ మన శరీరాన్ని కుట్టినప్పుడు ఏ పదార్థాన్ని శరీరంలోకి పంపుతుంది? (AS 6) ఒక మార్కు
జ: మిథనోయిక్ ఆమ్లం లేదా ఫార్మిక్ ఆమ్లం (HCOOH)


34. తేనెటీగలు మనల్ని కుట్టినప్పుడు కలిగే బాధ నుంచి ఉపశమనాన్ని ఎలా కలిగిస్తారు? (AS 6) ఒక మార్కు
జ: బేకింగ్ సోడాను తేనెటీగ కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గుతుంది.


35. కింది లవణాల సంకేతాలను రాయండి. (AS 1) 2 మార్కులు
ఎ) పొటాషియం సల్ఫేట్   బి) కాల్షియం సల్ఫేట్   సి) అల్యూమినియం సల్ఫేట్
జ: ఎ) K2SO4       బి) CaSO4      సి) Al2(SO4)3


36. ఒకే విధమైన ధన లేదా రుణావేశ రాడికల్స్‌ను కలిగి ఉన్న ఒకే కుటుంబానికి చెందిన లవణాలను గుర్తించండి.
NaCl, NaSO4, KCl, K2SO4 (AS 1) 2 మార్కులు
జ: NaCl, KCl లు క్లోరైడ్ లవణాల కుటుంబానికి చెందినవి.
  NaCl, Na2SO4 లు సోడియం లవణాల కుటుంబానికి చెందినవి.
  Na2SO4, K2SO4 లు సల్ఫేట్ లవణాల కుటుంబానికి చెందినవి.


37. ఆమ్ల, క్షార, తటస్థ లవణాలకు ఉదాహరణలివ్వండి? (AS 1) 2 మార్కులు
జ: NaCl తటస్థ లవణం
   CH3COONa  క్షార లవణం
   NH4Cl  ఆమ్ల లవణం


38. KCl జల ద్రావణం pH విలువ ఎంత? దాని స్వభావం ఏమిటి? (AS 1) 2 మార్కులు
జ: KCl బలమైన ఆమ్ల, క్షారాలకు చెందిన లవణం కాబట్టి దాని pH విలువ 7, అది తటస్థ ధర్మాన్ని సూచిస్తుంది.


39. NaHCO3 జల ద్రావణం pH విలువ ఎంత? దాని స్వభావం ఏమిటి? (AS 1) 2 మార్కులు
జ:  NaHCO3 బలమైన క్షారం, బలహీన ఆమ్లానికి చెందిన లవణం కాబట్టి దాని pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటుంది. అది బలహీనమైన క్షార స్వభావాన్ని సూచిస్తుంది.


40. మలినాలతో కూడిన అతి పెద్ద NaCl స్ఫటికాలను ఏమంటారు? (AS 1) ఒక మార్కు
జ:  రాతి ఉప్పు


41. NaCl జలద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేస్తే విడుదలయ్యే ఉత్పన్నాలు ఏవి? సంబంధిత చర్యను రాయండి (AS 1) 2 మార్కులు
జ: NaCl జలద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు
NaOH, H2, Cl2వాయువులు ఏర్పడతాయి.
      2 NaCl + 2 H2O 2 NaOH + Cl2 + H2


42. బ్లీచింగ్ పౌడర్‌ను ఎలా తయారు చేస్తారు? దాని రసాయన సమీకరణం రాయండి. (AS 1) 2 మార్కులు
జ: తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్‌పై క్లోరిన్ వాయువు చర్య వల్ల బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది.
     Ca(OH)2 + Cl2 CaOCl2 + H2O


43. బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలను తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: i) వస్త్ర పరిశ్రమల్లో కాటన్, నారలను విరంజనం చేసేందుకు; కాగిత పరిశ్రమలో కలప గుజ్జును విరంజనం చేసేందుకు ఉపయోగిస్తారు.
ii) రసాయన పరిశ్రమల్లో దీన్ని ఆక్సీకారిణిగా ఉపయోగిస్తారు.
iii) తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమిసంహారిణిగా ఉపయోగిస్తారు.
iv) క్లోరోఫాం తయారీలో కారకంగా ఉపయోగిస్తారు.


44. బేకింగ్ సోడా తయారీని సూచించే సమీకరణాన్ని రాయండి. (AS 1) ఒక మార్కు
జ: NaCl + H2O + CO2 + NH3 NH4 + Cl + NaHCO3


45. బేకింగ్ సోడా ఉపయోగాలను రాయండి. (AS 6) ఒక మార్కు
జ: i) ఆహార పదార్థాలను త్వరగా ఉడికించడానికి ఉపయోగిస్తారు.
  ii) దీన్నియాంటాసిడ్‌గాఉపయోగిస్తారు.
  iii) బలహీనమైన యాంటీసెప్టిక్‌గా ఉపయోగిస్తారు.


46. వాషింగ్ సోడా అణు ఫార్ములాను రాయండి. (AS 1) ఒక మార్కు
జ: Na2CO3.10 H2O


47. సోడియం కార్బోనేట్ తయారు చేసే విధానాన్ని, రసాయన సమీకరణాన్ని రాయండి. (AS 1) ఒక మార్కు
జ: సోడియం బైకార్బోనేట్‌ను వేడి చేస్తే సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది.
            ఉష్ణం       
2 NaHCO3 Na2CO3 + H2O + CO2


48. వాషింగ్ సోడా ఉపయోగాలు తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: i) కాగితం, గాజు, సబ్బు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
   ii) గృహావసరాల్లో వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
   iii) నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించేందుకు ఉపయోగిస్తారు.


49. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను వేడి చేసినప్పుడు నీలిరంగును ఎందుకు కోల్పోతాయి? (AS 1) ఒక మార్కు
జ: కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను వేడి చేసినప్పుడు దానిలోని స్ఫటిక జలాన్ని కోల్పోవడం వల్ల నీలి రంగు వివర్ణం అవుతుంది.


50. రంగులేని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు తిరిగి రంగును ఏ విధంగా పొందుతాయి? (AS 1) ఒక మార్కు
జ: రంగులేని స్ఫటికానికి కొన్ని చుక్కల నీటిని చేరిస్తే తిరిగి అది నీలిరంగును పొంది CuSO4.5 H2O గా మారుతుంది.


51. జిప్సం లవణం ఫార్ములాను రాయండి. (AS 1) ఒక మార్కు
జ: CaSO4.2 H2O


52. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్‌ను ఏమని పిలుస్తారు? (AS 1) ఒక మార్కు
జ: ప్లాస్టర్ ఆఫ్ పారిస్


53. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఎలా తయారు చేస్తారు, దాని తయారీని సూచించే సమీకరణాన్ని రాయండి. (AS 2) రెండు మార్కులు
జ: జిప్సం లవణాన్ని 373 K ఉష్ణోగ్రతలో నెమ్మదిగా, అతి జాగ్రత్తగా వేడిచేయడం వల్ల స్ఫటిక జల అణువులను
పాక్షికంగా కోల్పోయి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏర్పడుతుంది.
CasO4. 2 H2O

 CaSO4.  H2O + 1 H2O
   జిప్సం                  ప్లాస్టర్ ఆఫ్ పారిస్

54. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ ఏ విధంగా గట్టిప‌డుతుంది? (AS 1) 2 మార్కులు
జ: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ చూర్ణానికి నీటిని చేరిస్తే గట్టి పదార్థంగా మారి జిప్సంను ఏర్పరుస్తుంది.
  CaSO4.  H2O + 1 H2O  CaSO4. 2 H2
   ప్లాస్టర్ ఆఫ్ పారిస్                    జిప్సం


55. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో సగం నీటి అణువు ఉండటాన్ని ఎలా సమర్థిస్తారు? (AS 1) ఒక మార్కు
జ: రెండు ఫార్ములా యూనిట్ల CaSO4 లు ఒక నీటి అణువును పంచుకోవడం వల్ల దాని ఫార్ములాను CaSO4.  H2Oగా సూచిస్తారు.


56. బ్రైన్ ద్రావణం విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో కాథోడ్, ఆనోడ్‌ల దగ్గర విడుదలయ్యే వాయువులు ఏవి? (AS 1) ఒక మార్కు
జ: కాథోడ్ వద్ద H2 వాయువు, ఆనోడ్ వద్ద Cl2 వాయువులు విడుదల అవుతాయి.


57. క్లోరో - ఆల్కలీ ప్రక్రియలో కాథోడ్ వద్ద ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? (AS 1) ఒక మార్కు
జ: H2, NaOH లు ఏర్పడతాయి.


58. క్లోరిన్ వాయువు ఉపయోగాలను తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: పీవీసీ, సీఎఫ్‌సీ, బ్లీచింగ్ పౌడర్, పెస్టిసైడ్స్ తయారీలో క్లోరిన్ వాయువును ఉపయోగిస్తారు.


59. HCl ఉపయోగాలను తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: i) ఉక్కును  శుభ్ర‌ప‌ర‌చ‌డానికి ఉపయోగిస్తారు.
   ii) అమ్మోనియం క్లోరైడ్, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు.


60. NaOH ఉపయోగాలను తెలపండి. (AS 6) ఒక మార్కు
జ: i) లోహాలపై ఉన్న గ్రీజ్‌ను తొలగించేందుకు.
   ii) సబ్బులు, డిటర్జెంట్లు, పేపరు, కృత్రిమ దారాల తయారీలో ఉపయోగిస్తారు.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం